కథ: కొడుకు.. నిజంగా ఇలాంటి ‘కొడుకు’ ఉంటాడా?

13 Jun, 2022 16:40 IST|Sakshi

∙సుజాత వేల్పూరి 

‘వంకాయలు ఇందాకే వచ్చేయండీ మేడం గారో, ఒక అరకేజీ తుయ్యమంటారా?’ పచ్చి మిరపకాయలు సంచీలో పోస్తూ అడిగాడు జోగిబాబు. నాతో పాటు మరో నలుగురికి కూరలు తూస్తున్నాడు, పైగా అందరితోనూ ఎవరి కబుర్లు వాళ్ళకి చెప్తూ! ఇవాళొద్దు’ అన్నాను అల్లం ఏరుతూ.

‘యాండే, ఇది జోగిబాబు కొట్టు. ఇక్కడ మీకు ఏదీ ఎంచే అవసరం రాదండే’ పెంకులెగిరిపోయేలా నవ్వుతాడు. ‘ఇదిగో మేడం గారండో, వంకాయలు ఎప్పుడు కనపడ్డా కొనేయాల్తెలుసా? నిన్న అల్లం పచ్చి మిర్చి పెట్టి ఒండారనుకోండి.. ఇయాల జీడిపప్పేసి వొండండి చెప్తాను, సారు గారూ పిల్లలూ ఎగబడి తినక పోతే నన్నడగండి’ నన్నడక్కండానే లేతగా పొడుగ్గా మెరుస్తున్న వంకాయలని సంచీలో పోశాడు. 

జోగిబాబు కొట్టుకెళ్తే మన ఇష్టాలుండవు. అన్నీ తను చెప్పినట్టే తీసేసుకోవాలి. ‘కాబేజీ చూశారా, తెల్లగా చందమామలాగ ఎలా ఉందో? పెసరపప్పూ కొబ్బరీ వేసి చేశారనుకోండి.. అసలు కూరంతా ఒక్క వాయలో అయిపోద్ది ఆనక మీ ఇష్టం!’

‘ పునాస మామిడి వొచ్చింది తీసేస్కోండి.. చూడండి ఎంత గట్టిగా ఉందో. పప్పులో వేశారనుకోండి. ఇంకో కూర సెయ్యక్కర్లేదు మరి. లేదంటే కాసిన్ని ముక్కల కింద తరిగి మెంతికాయ పడేయండి. ఎందుకు వూరదో సూద్దాం!’

‘యాండేయ్, పండు మిరపకాయలొచ్చాయి పొద్దున్నే. గుంటూరు నించి తెప్పించా. అదిగో, ఇందాకే ఎర్ర గోంగూర కట్టలొచ్చినయ్యి. రెండూ కలేసి పచ్చడి చేస్తే ఉంటదీ.. కాస్త తెల్లన్నం ఉంటే చాలసలకి’

జోగిబాబు మాటలకే సగం కూరలు చెల్లి పోతాయి. బాగా పెద్ద కొట్టేమో, కన్నుల పండగగా కనపడుతుంది. కొట్టు వెనక ఒక పాక లాంటిది వేశాడు. మధ్యాన్నం భోజనాలకీ, కూరల బస్తాలు తిరగబోసి, చచ్చులూ పుచ్చులూ తీసేసి బుట్టల్లో సర్దటానికీ, అయిదేళ్ల పిల్ల నిద్ర పోవడానికి ఏర్పాట్లన్నీ అక్కడే.

తండ్రి ఇచ్చిన డాబా మీద మరో అంతస్తేసి.. షోగ్గా పై అంతస్తుకి నల్లటి అద్దాల కిటికీలవీ పెట్టించేసి ‘జోగిబాబు బిల్డింగ్‌’ అని పేరు పెట్టాడు. చిన్నప్పటి నుంచీ ఇక్కడే ఉండి పోవడంతో అందరూ తెలిసినోళ్ళే, అందరూ చుట్టాలే. వంద కబుర్లు చెప్పేసి, రెండు సంచీల కూరలు సర్దేస్తాడు.

‘ఇదిగో ఆ కాయ బాలేదు’ అని ఎవరైనా అంటే ‘యాండే, ఇది జోగిబాబు షాపండే, పుచ్చులకెంత దవిర్నం ఈ షాపులో అడుగెట్టేడానికి?’ అనేస్తాడు తప్ప ఆ పుచ్చు కాయ తియ్యడు.

ధనలక్ష్మి మొగుడితో పాటు అంత పనీ చేస్తూంది. మెడలో రెండు పేటల బరువైన పుస్తెలతాడేసుకుని, పాదాలకు మాత్రం నాజూకు వెండి పట్టీలు పెట్టుకుని, బేరాల్లేని ఏ మధ్యాహ్నం పూటో గోళ్ళకి రంగేసుకుంటూ, రిమూవర్‌లో దూది ముంచి మరకల్లేకుండా తుడుస్తూ కనపడుతుంది. ఇల్లయినా కొట్టు వెనక పాకయినా అద్దంలా తళ తళలాడుతూ ఉండాల్సిందే ఎప్పుడూ!

సాయంత్రం బ్యాంక్‌ నుంచి త్వరగా బయటపడి జోగిబాబు కొట్టు దగ్గర బైక్‌ ఆపాను. కొట్లో ఎవరూ లేరు. ధనలక్ష్మిని కేకేస్తే పాక లోంచి వచ్చింది. మొహం ఎర్రబడి, కాస్త వాచి ఉంది. మొహం చిటపటలాడించుకుంటూ, ‘ఏమీమంటారండే’ అంది

బుట్ట తీసుకుని కావలసినవి ఏరుతూ ‘జోగిబాబేడీ’ అన్నాను మామూలుగా. ‘యావో, యాడ చచ్చాడో’ విసుగ్గా అని ‘ఆ ముండ కాడికే పోయి సచ్చుంటాడు. పొష్టు తారీకు వొచ్చిందిగా, సొమ్ములు సమర్పించుకోవాల పొయ్యి. పేరంటాలమ్మ తల్లిగ్గూడా ఇట్టా నెలకోపాలి మొక్కులు సెల్లించం’ పెద్దగానే గొణుగుతూ ఆకు కూరల మీద నీళ్ళు చల్లింది

‘గూగుల్‌ పే చేయనా? చిల్లర లేదు ధనలక్ష్మీ..’ ‘అదేదో నాకు తెలవదండే, సిల్లర లేపోతే రేపియ్యండి పర్లేదు’ పచ్చి మామిడి కాయలు ఒకదాని మీద ఒకటి సర్దింది. మర్నాడు లంచ్‌ టైములో డబ్బులిద్దామని కొట్టు దగ్గర ఆగినపుడు, కొట్టు వెనక పాకలోంచి పెద్దగా అరుపులు, తిట్లూ వినపడుతున్నాయి.. ‘నువ్వు దాని కాడికి పొయ్యావంటే నేను సచ్చినంత ఒట్టే. మా రెక్కల కస్టవంతా ఆ ముండకి దోచి పెడతన్నావు. నేనూ నా పిల్ల,  మట్టిగొట్టుకు పోవాలనా?’ తిడుతోంది మొగుడిని.

‘నోర్ముయ్యెహె. నువ్వు అరిచి గీ పెట్టినా, ఆవదం చెట్టుకు ఉరేసుకు సచ్చినా సరే, నేను ఆడికిపోకుండా ఉండనూ, డబ్బులియ్యకుండా ఉండనూ. ఏ సేత్తావో సెయ్యి’ తెగేశాడు.

‘ఇట్టనే మాట్టాడు. ఏదో ఒక రోజు నిజంగానే ఉరి పోసుకు సత్తాను’ బెదిరింపు. ‘ఓయబ్బో, శానా సూశాం లే, ఇట్ట కబుర్లు సెప్పే వోళ్ళెవురూ సావరు. పక్కనోళ్ళని సంపే టైపు తల్లా నువ్వు. నువ్వెట్ట సత్తావ్‌?’

పాకలోంచి బయటికొస్తూ నన్ను చూసి ‘యాండే, మజ్జానాలొచ్చారు? నేతి బీరకాయలొచ్చాయి చూశారా? అట్టా నూన్లో ఎయ్యగానే ఇట్టా మగ్గిపోతై. లేత నవ్వలనుకోండి. పచ్చి మిరపకాయలూ, నువ్వులూ వేయించి నేతి బీర పచ్చడి చేస్తే సావిరంగా, కుండెడు బువ్వ  వూడ్చేయమూ?’

డబ్బులిచ్చేసి వస్తుంటే ‘యాండే మేడం గారో, మీ ఆఫీసులో సబ్‌స్టాఫ్‌ వసంతని కాస్త మాయిటేల  ఇంటికో, కొట్టుకాడికో రమ్మని సెప్పండి బాబా, మా బాబయ్య కూతురే లెండి, ఫోన్‌ పగిలి పోయిందంట, మా బావ నా కొడుకు ఉన్నయి వూడ్చేరకవే గానీ కొనిచ్చే రకం గాదు. నేనన్నా ఇయ్యక పోతే ఎట్టలే గానీ, పోనీ మెయిన్‌ రోడ్లో సింత సెట్టు పక్కనే ఉన్న షాపు కాడికి ఏడింటికి రమ్మని చెప్పండి’

తలూపి గబగబా బండి తీశాను. ‘మేడం గారో...’ మళ్ళీ కేకలు వెనక్కి చూశా. పరిగెత్తుకొచ్చాడు గొంతు తగ్గించి ‘మా యమ్మ ఉండే ఇల్లు తెలుసు గదండీ ఇందిరాగాందీ నగర్‌లో? మరీ రెండే గదులై పోయినై. పక్కన ఇంకో గది కట్టి, పైన గూడా ఇంగో రెండు గదులెయ్యాలండి. పెద్దదై పోయింది గాదండే, పక్కనెవురన్నా మడుసులుంటే మంచి సెబ్బరా సూస్తారు. కాస్త అద్దె తక్కువైనా మంచి మడుసుల్ని సూసి అద్దెకిచ్చుకుంటే..’

‘ఏం చేద్దామంటావు?’  ‘కాస్త లోను కావాలండే. కాయితాలేవైనా కావాలంటే పెడతా తెచ్చి. పొలం కాయితాలు పెట్టుకొని ఇస్తారేటండే?’ జోగిబాబు తల్లి బంగారమ్మ ఇల్లు తెలుసు. అటువైపుగా వెళ్తుంటే పచ్చటి వాకిట్లో చిన్న గేటు లోపలి నుంచి పన్లు చేస్తూ కనిపిస్తుంది. ఆ వీధిలో అడుగడుగూ పచ్చని చెట్లతో పొదరిల్లులా ఉండే బంగారమ్మ ఇల్లు ఎవరినైనా కట్టి పడేస్తుంది.

ఇంటి పక్కనే ఉన్న కొద్ది ఖాళీ స్థలంలో, ఇంటి ముందు, డాబా మీదా, గేటు ముందు అన్నీ పూలే, పచ్చగా మెరిసే చెట్లే. ఒక్కతే ఇంత వండుకు తిని, చేతనైన పని చేస్తూ హాయిగా బతుకుతున్న బంగారమ్మకి మనుషులు తోడుండాలని కొడుకుగా జోగిబాబు కోరుకుంటున్నాడు గానీ, ఎప్పుడూ ఎవరితోనూ కబుర్లు చెప్తూ కనపడనే లేదా మనిషి. తన తోటేమో, తనేమో అన్నట్టుంటుంది.

‘అమ్మా, ఇయిగోండి పెట్టుకోండి’ అంటూ ఎప్పుడైనా రెండు మూరల జాజిపూలో, విరజాజులో ఇస్తుంది సాయంత్రాలు అటుగా ఇంటికి వెళ్తుంటే. ‘లోను కావాలంటే .. చూడాలి మరి ఎంతొస్తుందో, ఆ తోటంతా  తీసెయ్యడానికి ఒప్పుకుంటుందా మీ అమ్మా? నువ్వు వూళ్ళోనే, అదీ దగ్గర్లోనే ఉన్నావు గదా, తోడంటావు?’ అన్నాను ఆ తోటని తల్చుకుంటూ.

‘అట్ట కాదులెండే..’ నసిగాడు ‘నేను డబ్బులియ్యటం కాదండే, ఆవె డబ్బులు ఆమెకుండాల. నా దగ్గరైనా సరే, సెయ్యి సాప కూడదండీ. పక్కనో రెండూ, పైనో రెండూ రూములేస్తే, ఆ ఏరియా తెలుసు గదండీ, అద్దెలు పేలిపోతాయండీ బాబా..! నెల తిరిగే సరికల్లా అమ్మ సేతిలో డబ్బులు పడాలండీ. మాకు కర్సులు పెరిగి నేనో పాలి డబ్బులియ్యక పోయినా, అమ్మ ఇబ్బంది పడకూడదండే..’

ఒక పక్క ధనలక్ష్మి ఎవరి దగ్గరకో వెళ్తే ఊరుకోనని గొడవ పడుతోంది, ఎవరో ఉన్నారన్నమాట.‘ రెండేసి ఇళ్ళు ఉంటే ఖర్చులు పెరగవా?’ మనసులో కోపగించుకున్నాను ధనలక్ష్మి మీద ఆపేక్షతో. కానీ అది జోగిబాబు పర్సనల్‌ కాబట్టి అడగలేక పోయాను. బ్యాంక్‌కి వెళుతూనే వసంత కనపడింది నా డెస్క్‌ మీద ప్రింటర్‌ తుడుస్తూ. జోగిబాబు చెల్లెలని పోలికలు చూసి కాదు, ఆ వాగుడు చూసి కనిపెట్టెయ్యొచ్చు.

జోగిబాబు చెల్లెలని తెలిశాక పోలిక తెలుస్తోంది. ‘జోగిబాబు చెల్లెలివట కదా వసంతా నువ్వు? నిన్న చెప్పాడు’ ‘ఆయ్, అవునండే, అన్నాయ్‌ కొట్లోనే కొంటారాండీ కూరలు తవరూ?’ విశాలంగా నవ్వింది. బిగించి వేసిన జడ, స్టిక్కర్‌ బొట్టు కిందగా కుంకుమ, రెండు చేతులకీ డజనేసి మట్టి గాజులు, బలమైన మనిషి.

‘అవును. ఇదిగో ఈ ఫైల్స్‌ తీసుకెళ్ళి లోపల పెట్టెయ్‌. నీకు ఫోన్‌ కొంటాడట, సాయంత్రం ఏడింటికి చింత చెట్టుకింద ఫోన్ల షాపు దగ్గరికి రమ్మన్నాడు’ మొహం చాటంత చేసుకుని నవ్వింది. ‘ఆయ్, అట్నే ఎల్తా లెండి’

లంచ్‌ టైమ్‌లో వచ్చి మాట కలిపింది ‘మేడమ్‌ గారో, ఇల్లు కట్టడానికి లోన్‌ ఇప్పిస్తారా, వాళ్ళమ్మకి  ఇల్లు కట్టియ్యాలని తెగ తపన పడతన్నాడండి మా అన్నియ్యా..’ ‘నాకు చెప్పాడులే పొద్దున్న, మేనేజర్‌ గారితో మాట్లాడాలి’

‘వాళ్లమ్మ చాలా కష్టపడిందండీ మేడం గారూ, ఇప్పటికైనా కాస్త సల్లగా కూసోని ఒక ముద్ద తిని టీవీ సూసుకుంటా ఆయిగా బతికేయాలని మా యన్నకుందండీ’ ‘వాళ్ళమ్మ వాళ్ళమ్మ ఏంటి వసంతా? నీకు పెద్దమ్మ కాదూ?’

వసంత ఒక్క క్షణం ఆగి ‘ఆయ్, ఆవి.. జోగిబాబు సొంతమ్మ కాదండే, మా పెదనాన తెచ్చి పెట్టుకున్న మడిసి...’ ఒక్క క్షణం అర్థం కాలేదు. ‘ఏంటీ?’ అనబోయాను గానీ మెదడులో పడిన చిక్కు ముళ్ళు విడిపోతున్నట్టు అయి ఆగిపోయాను.

వసంత అటూ ఇటూ చూసి ఎవరూ లేరని నిర్ధారించుకుని కంఠం తగ్గించి ‘అవునండీ మేడం గారూ, బంగారమ్మని మా పెదనాన తెచ్చి పెట్టుకున్నాడు ఉండ్రాజవరం నించీ. ముగ్గురు పిల్లల్ని వొదిలేసి లేచొచ్చేసింది’ వసంత గొంతులో ధ్వనించింది జాలా, చులకనా, ఆశ్చర్యమా అర్థం చేసుకోలేక పోయాను.

‘అవునా?’ ‘అవునండే, ఆవి మొగుడు ఇసక టాక్టర్‌ డైవరంట. ఈవిడేమో కూరగాయల వోల్సేల్‌ మార్కెట్లో షాపు నడిపేదంట. మా పెదనానతో  వొచ్చేసింది. వొచ్చిన కాణ్ణించి, మా పెదనాన తప్ప లోకవే తెలీకుండా బతికిందమ్మా మా తల్లి..’ దణ్ణం పెట్టుకుంది పైకి చూసి, దేవుడికో, బంగారమ్మకో గానీ.

‘మేవు సిన్న పిల్లలం గదండీ, మాకు తెలవదు ఆమె యాణ్ణించి వొచ్చిందో, ఎవరోనూ. సుట్టవనుకునే వోళ్ళం. ఏరే ఇల్లు తీసుకోని అక్కడ పెట్టాడావెని. మా పెద్దమ్మ చాలా గొడవలు పడింది గానీ ఆయన ఇడిసి పెట్లా. డబ్బులన్నీ ఆవెకి పెడతన్నాడని బాగా తగాదలయ్యేవి కొంపలో. ఆవె ఈడ కూడా పెద్ద మార్కెట్లో షాపు పెట్టి రెండు సేతులా సంపాదించేది. ఆవే పెదనానోళ్ళకి పెట్టేది కానీ ఆయనేవీ కర్సు పెట్టలా ఆవిడికి.

కాపరాన్ని ఇడిసి పెట్టి వొచ్చిందనీ అందరూ చాలా సులకన సేసి మాట్టాడేవోళ్ళు. అందరూ సరే, మా పెదనాన కూడా తాగొచ్చి కొట్టేవాడు. ‘పిల్లల్నే వొదిలి వొచ్చినావంటే నన్ను వొదిలి పోటానికెంత టైమ్‌ పడతదే నీకూ’ అనే వాడు. కానీ మా జోగిబాబన్నియ్య ఎంత మంచోడోనండే! అప్పుడు పదో క్లాసనుకుంటా సదువుతా ఉండేవోడు. వాళ్ళ నాన మీద తెగ తిరబడేవోడమ్మా.. బంగారమ్మని ఏవీ అననిచ్చేవోడు కాదండే.

‘పెద్దమ్మా, నువ్వు వొస్తే వొచ్చావు గానీ ఇట్టాంటోడితోనా వొచ్చేది. నువ్వంటే ఈడికసలు లెక్కుందా? ఇష్టముందా?’ అనేవోడు కోపంగా. ‘అట్టనమాక జోగిబాబూ, ఆయనకి నేనంటే ఎంతో అక్కర. ఎంత ప్రేవో సెప్పలేను’ అనేది బంగారమ్మ. ‘ఏం ప్రేవమ్మా తల్లా? ఆయన కోసం నువ్వు అందరినీ వొదిలేసి వొచ్చావా? మరి ఈయన అంత ప్రేవున్నోడైతే నీ కోసం అందరినీ వొదిలేసి రావాలగా? వొచ్చాడా? నువ్వు గమనించుకో మరి.

ఆయన ఫామిలీ ఆయనకుంది. నీకే లేదు, అసలు నిన్ను ఎన్నేసి మాటలు అంటన్నాడో ఇంటన్నావా? పట్టిచ్చుకోవా?’ ఈ మాట అన్నియ్య అనేసరికి పాపం ఆవి మొహంలో నెత్తురు సుక్క ఉండేది కాదండే. ‘ఇదిగో బంగారమ్మో, మొగోడెప్పుడూ అంతే! ఆడి ఫామిలీని డబ్బుల్లేకో, ఇష్టం లేకో వొదులుకుంటాడు గానీ, ఏరే ఆడదాని కోసం మాత్రం వొదులుకోడు.

ఆడోళ్ళు ఇట్టాటి నా కొడుకులు సూపిచ్చేది ప్రేమా దోవా అనుకోని అన్నిటినీ వొదులుకోని రాటం... థూ నీకసలు బుద్ది లేదు’ ఇట్టా పోట్టాడేవోడు బంగారమ్మ  అంటే ఇష్టంతోనే. ఆమెని మా పెదనాన కొట్టినపుడల్లా ఈడు గొడవ సేసి, ఇదిగో ఆమెకి ఇట్టా బుద్ధి సెప్పి తిట్టేవోడు. మా పెదనానా పెద్దమ్మా పోయి పదేళ్ళు పైనే అయింది. ఆయన పోయినప్పుడు బంగారమ్మని శవం కాడికి కూడా రానీక పోతే జోగిబాబే అడ్డం పడి ఆవిణ్ణి  తీసకొచ్చాడు ‘ఆవె కూడా మాయమ్మే’ అని.

ఆ తర్వాత ఆవెని కనిపెట్టుకుని ఉన్నాడండీ మా అన్నియ్య. మా ఒదిని కూడా తెగ తిడతాదండి బాబూ. ప్రతి నెలా డబ్బులు ఇస్తాడని గొడవ పడతాది. కానీ మా జోగి బాబు ఇంటేనా? ఆడదాని కష్టం తెలిసిన మడిసండి ఆడు. మా ఆయన గోరు పేకాటనీ, కోడి పందాలని ఊళ్ళు పట్టుకు తిరుగుతారండీ.

ఏమంటాం సెప్పండి మేడం గారూ.. మొగాడు కదా! పోట్లాడి పోట్లాడి ఇసుగేసి పోయిందండి బాబా! మా అన్నియ్య నెలకోసారి సుబ్బారాయుడు కొట్లో నెలవారీ సరుకులు పంపిత్తాడండి. మూడ్రోజులకోపాలి కూరలు గూడా..’ వసంత కళ్ళు గర్వంతోటో సంతోషంతోటో మెరుస్తున్నాయి, కొంచెం తడిగా.
∙∙ 
కళ్ళాపి చల్లిన పచ్చని వాకిట్లో తెల్లని పద్మాల ముగ్గు. దాని మీద మూడు గొబ్బెమ్మలు, గుమ్మడి పూలు తురుముకుని! గొబ్బెమ్మల చుట్టూ బియ్యం, సజ్జలు చల్లి ఉన్నాయి. మూడు పిచ్చుకలు వాలి వాటిని ఏరుకు తింటున్నాయి. మందార చెట్టు నుంచి వాడిపోయిన ఆకులు తీసేస్తోంది బంగారమ్మ. వృద్ధాప్యంతో వడలి పోయిన చేతులకు రంగు వెలిసిన ఆర్టిఫీషియల్‌ గాజులు.

లోపలి నుంచి రెండు టీ గ్లాసులతో వచ్చాడు జోగి బాబు .. ‘ఆ ఆనపకాయలు కోసెయ్యక పోయావా? బాగా లావుగానే  దిగాయిగా. ముదిరితే ఎవరూ కొనరు. కొనే  వోళ్ళంతా మహా ముదుర్లు. గిల్లి చూసి గోరు దిగకపోతే ముదురంటారు. మన కొట్లో సొరకాయల నిండా ఆళ్ళ గోరు గిచ్చుళ్ళే’

‘నాకు తెల్సులేరా బాబా. అయి ఇంకా ఊరతాయి. అయ్యి ఐబ్రీడ్‌ కాయలు కాదు. కోపుగా లేవు సూసినావా? గుండ్రాటిగా ఉన్నాయి. ఇంకా గింజ కూడా పట్టలేదు. మొన్నొక రోజు కూరల్లేక ఒక కాయి కోసినాను పులుసెడదావని..’

‘కూరల్లేక పోతే ఒక కేకెయ్యవా? నువ్విప్పుడు ఇంట్లో పంట పండించి గానీ తిన్నని పంతం పట్టినావా ఏంటి?’ గయ్యిన లేచాడు. ‘ఓ అని అరిసేయకు మరి. మంచి నేల. నాలుగు కూరగాయలు కాస్తే మనసుకు బాగుంటాది. ఆ పక్క సూడు, ఆ దొండకాయలు నేను కొయ్యలేక ఇసుగు పుట్టి కుమారిని కేకేసినాను, కోసుకు పొమ్మని.

నీ కొట్లో నించి తెచ్చుకోడానికి నాకేవన్నా బెరుకా? ఇంట్లో కూరలు పండుతుంటే కొట్లో  తెచ్చుకోమంటాడమ్మా పిల్లడు..’ ఒక కాలు కింద పెట్టి బండాపి ఆ తల్లీ కొడుకులిద్దరినీ చూస్తున్నాను..

సడన్‌గా నన్ను చూసిన జోగిబాబు ‘మేడం గారో, ఇదిగో మీరైనా సెప్పండి, మాయమ్మకి, ఆనపకాయలు కొనాలంటే గిచ్చి సూస్తారా సూడరా?’ బంగారమ్మ లోపలి  నుంచి ఒక పెద్ద కవర్లో  బంతి పూలు తెచ్చి ఇచ్చింది నవ్వు మొహంతో.

‘ఇంటికి లోను కావాలన్నావు కదా, మధ్యాహ్నం బ్యాంక్‌కి రా, మాట్లాడదాం’ బంతి పూల కవర్‌ బండి హాండిల్‌కి తగిలించి ముందుకు కదిలాను. మన మొహం చిరునవ్వుకి రోజూ ఎవరో ఒకరు కారణమవుతారు. నాకివ్వాళ  జోగిబాబు. 

చదవండి: కథ: చావు నీడ.. ఏం మనిషివయ్యా? నేను గుర్తుకు రాలేదా?

మరిన్ని వార్తలు