క్రైం స్టోరీ: రాంగ్‌ ఇన్ఫర్మేషన్‌.. ట్విస్టు అదిరింది!

2 Jun, 2022 21:21 IST|Sakshi

రాం నగర్‌కు ఫర్లాంగు దూరంలో కొత్తగా కట్టిన ఇల్లది.  చుట్టుపక్కల వేరే ఇళ్లేం లేవు. చుట్టూ ప్రహరీ మధ్యలో రెండంతస్తుల భవనం అది. చుట్టూ పోలీసులు మోహరించారు. గుంపులు గుంపులుగా జనం. నేరుగా లోపలికి వెళితే మూడు శవాలు పడున్నాయి. ఒక వృద్ధురాలు.. భార్య భర్తల జంట. తలపై మోది కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు.

పోలీస్‌ టీమ్‌ సాక్ష్యాలు సేకరిస్తోంది. డాగ్‌ స్క్వాడ్‌ అక్కడే వెతుకుతున్నారు. రెండు బీరువాలు పగలగొట్టి నగదు, నగలు కలిపి దాదాపు యాభై లక్షల వరకు దోచుకున్నారు. బట్టలు చెల్లాచెదురుగా పడేశారు. హత్యానంతరం చేతులు వాష్‌ చేసుకుని తీరిగ్గా అక్కడే భోంచేసివెళ్లిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి.

సిటీలో ఈ తరహా కేసులో ఇది మూడవది. హంతకుల ఆచూకీ కనుక్కోవడానికి పోలీస్‌ టీమ్‌ శత ప్రయత్నాలు చేస్తోంది. బాగా డబ్బున్న ఇళ్లను ఎంచుకుంటున్నారు.. సిటీకి దూరంగా విడిగా ఉన్న వాటిని టార్గెట్‌ చేసి.. రాత్రివేళ చొరబడి దొంగతనం చేస్తున్నారు. బహుశా హంతకులు ఇరవై ఐదు నుండి ముప్పై లోపు వయసు గల వారే అని పోలీసుల నమ్మకం. చనిపోతున్న వారందరూ ఉద్యోగులే కావడం గమనార్హంగా మారింది. శవాలను పోస్టుమార్టమ్‌కు పంపించేశారు.

‘ఈ వరుస హత్యల మిస్టరీ ఛేదించమని పై నుండి ఒకటే ఒత్తిడి. సరైన ఆధారాలు దొరకనందున ఆలస్యమౌతోంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు’ అంటూ స్టేషన్‌ వసారాలో కాలు కాలిన పిల్లిలా అటూ ఇటూ తిరుగుతున్నాడు ఎస్సై రంగనాథం.

‘సార్‌ ! వాళ్ళు ఇక్కడే ఎక్కడో ఉంటారు. కచ్చితంగా దొరికిపోతారు’ అన్నాడు అక్కడే ఉన్న పోలీస్‌ ఇన్ఫార్మర్‌ సుధాకర్‌.  ‘నువ్వు సిటీలో తచ్చాడుతూ ఉండు. అనుమానాస్పద వ్యక్తులు తారసపడితే వెంటనే మాకు ఫోన్‌ చెయ్‌’ చెప్పాడు ఎస్సై రంగనాథం.

 ‘ఓకే సార్‌ ’ అంటూ అక్కడి నుండి కదిలాడు సుధాకర్‌. అక్కడున్న సిబ్బందిని వెంటబెట్టుకుని బయటికి వెళ్లాడు రంగనాథం. టీ కొట్టు దగ్గర చిల్లర వ్యాపారుల స్థావరాల దగ్గర తన ఫ్రెండ్స్‌ని వెంటేసుకుని మామూలు వ్యక్తిగా తిరగడం మొదలు పెట్టాడు సుధాకర్‌.
∙∙ 
నగరంలో ఈ హత్యలు సంచలనంగా మారిపోయాయి. కొత్తవాళ్లను నమ్మడానికి భయపడుతున్నారు. రాత్రిపూట ఇళ్లకు వాకిళ్ళు తీయాలంటేనే బెదిరి పోతున్నారు. నగరంలోకి బయట నుండి ఎవరైనా కొత్తగా వచ్చారా అన్నదానిపై దృష్టి పెట్టిన ఎస్సై రంగనాథం సుమారు పదిహేను మందిని స్టేషన్‌కు పిలిపించాడు విచారించేందుకు. సుధాకర్‌ కూడా అక్కడే ఉన్నాడు.

వాళ్లలో ఒకడు..‘సార్‌ ! నేను గాజుల వ్యాపారం చేస్తాను. నేను వచ్చి కూడా ఆరు సంవత్సరాలు దాటిపోయింది. రాజీవ్‌ నగర్‌లో చిన్న కొట్టు వేసుకున్నాను ‘ అని, ఇంకొకడు ‘ సార్‌! నేను బట్టల వ్యాపారం చేస్తాను.. నేను వచ్చి సంవత్సరం దాటింది’ అని ఇలా అందరూ తలో వ్యాపకం గురించి చెప్పుకొచ్చారు.

‘వీళ్ళందరూ బతుకుతెరువు కోసం వచ్చారు. కష్టపడి సంపాదిస్తున్నారు కాబట్టి అలాంటి పని చేసి ఉంటారని నమ్మకం లేదు’ అన్నాడు సుధాకర్‌. వాళ్ళను అన్ని విధాలుగా పరిశీలించి వదిలేశాడు రంగనాథం.

అంతలోపే ‘సార్‌! శివాజీ నగర్‌ శివారులో ముగ్గురు వ్యక్తులు అనుమానస్పదంగా తచ్చాడుతున్నారు’ అంటూ ఒక అజ్ఞాత వ్యక్తి నుంచి ఫోన్‌ వచ్చింది.  వెంటనే ఆ ఏరియాకు బయలుదేరి వెళ్లాడు ఎస్సై రంగనాథం. అక్కడ ఎవరూ కనిపించలేదు. మళ్లీ అదే నంబర్‌కు కాల్‌ చేశాడు. పనిచేయడం లేదు. చీకటి పడుతోంది ‘ఈ రాత్రికి సిటీ ఉత్తర భాగాన ఉన్న ఇళ్ళ వైపు దృష్టి పెట్టాలి. చెక్‌ పోస్టులలో నాకాబందీ వేయాలి’ అన్నాడు రంగనాథం.

‘మీరు పొరబడుతున్నారు. అక్కడ తిష్టవేసి ప్రయోజనం లేదు. అది ఎలాగూ జనసంచారం గల ప్రాంతం. ఈసారికి సిటీలోనే ప్లాన్‌ చేసి ఉండవచ్చు. ఎందుకంటే నగరం శివారులో గల ఇళ్ళల్లోనే దొంగతనాలు జరుగుతున్నాయని గ్రహించి.. పోలీసులు అక్కడే తిరుగుతుంటారని తెలుసు కాబట్టి  ఈసారికి స్కెచ్‌ మార్చి ఉండొచ్చు. ఆలోచించండి సార్‌ ’ అన్నాడు సుధాకర్‌. ‘అవును.. నువ్వు చెప్పింది కూడా కరెక్టే. టౌన్‌లోకి వెళ్దాం’ అంటూ అక్కడి నుండి నిఘా మార్పించాడు ఎస్సై రంగనాథం.
∙∙ 
సరిగ్గా అర్ధరాత్రి.. ఉత్తర భాగాన గల అమృత నగర్‌ నిశ్శబ్దంగా నిద్రపోతోంది. పోలీసు పహారా కూడా పెద్దగా లేదు. అక్కడున్నది మొత్తం ఉద్యోగస్తుల ఇళ్లే. అవీ అక్కడొకటి.. ఇక్కడొకటిగా విసిరేసినట్టుగా ఉన్నాయి. చివరి ఇంటి ప్రహరీని  ముసుగులు ధరించిన నలుగురు కుర్రాళ్ళు ఎక్కుతున్నారు. పట్టుకుంటే జారిపోవడానికి ఒళ్లంతా నూనె రాసుకున్నారు. చేతిలో ఆయుధాలు పట్టుకుని చాకచక్యంగా లోపలికి ప్రవేశించారు.

పడుకున్న వాళ్లని లేపి చంపుతామని బెదిరించారు. ఆ బెదిరింపులకు ఆ ఇంటి వాళ్ళు బెదరకపోయేసరికి..  గట్టిగా అరుస్తారేమోననే భయంతో విచక్షణ రహితంగా వారిపై దాడి చేశారు. నోటిలో గుడ్డలు కుక్కి దారుణంగా హత్య చేశారు. డబ్బు, బంగారం దోచుకుని పారిపోయారు. తెల్లవారేసరికి ఈ వార్త సిటీ అంతా వ్యాపించింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. 

‘నేను అప్పుడే చెప్పాను.. ఇది నగరానికి దూరంగా ఉన్న టీచర్స్‌ కాలనీ.. ఇక్కడ జరగవచ్చు అని! ఆ విషయమే నీతో అన్నాను కూడా! గత కొన్నేళ్లుగా ఇన్ఫార్మర్‌గా పని చేస్తున్నావ్‌. నువ్వు చెప్పిన క్లూస్‌ గతంలో చాలా పాసయ్యాయి. ఆ నమ్మకంతో నీ మాట విని నిఘా మార్చా. ఇప్పుడు చూడు ఏం జరిగిందో?’ అంటూ ఎస్సై రంగనాథం..  సుధాకర్‌ పై చిందులు తొక్కాడు. 

‘సారీ సార్‌.. ఇలా జరుగుతుందని నేనూ ఊహించలేదు. ఈసారికి మన కళ్లుగప్పి సిటీలో ఉన్న పెద్దవాళ్ల ఇళ్లకు కన్నం వేస్తారనుకున్నా’ అన్నాడు తల గీరుకుంటూ సుధాకర్‌.  ‘మన స్టేషన్‌లో స్టాఫ్‌ ఎక్కువ లేకపోవడం చేతనే ఇలాంటి తప్పిదాలు జరుగుతున్నాయి’  అంటూ అసహనం వ్యక్తం చేశాడు ఎస్సై రంగనాథం.

ఒక కేసు పూర్తిగా శోధించక ముందే మరో కేసు జరగడం.. ఎస్సైని నిద్రకు దూరం చేసింది. అదనపు పోలీసులు వస్తే తప్ప నగరాన్ని కాపాడలేం అనుకున్నాడు. ఎంత పహార కాసినా ఒక్కడు కూడా పట్టుబడలేదు. దిక్కుతోచని పరిస్థితుల్లో సుధాకర్‌ మీదే ఆధారపడ్డాడు మళ్లీ. ‘ఏవైనా ఆనవాళ్లు దొరికాయా?’ అని అడిగాడు అతన్ని.  

‘నేను జనాల్లో తిరుగుతున్నాను. అందర్నీ అబ్జర్వ్‌చేస్తున్నాను. అనుమానం వచ్చేలా మాట్లాడుకోవడం గానీ.. ప్రవర్తించడం గానీ ఎవరూ చేయట్లేదు సార్‌. అయినా వదలట్లేదు. ప్రతి మనిషిని ఆరా తీస్తున్నాను’ చెప్పాడు సుధాకర్‌.

‘ఈ కేసులపై ఒక ఇంటెలిజెన్స్‌ పోలీసుని కూడా నియమించారు కానీ అతనికి కూడా ఎలాంటి ఆధారాలు దొరకలేదు. పాత నేరస్తులందర్నీ పిలిపించి వేలిముద్రలు కూడా చెక్‌ చేశాం. ఎవరివీ మ్యాచ్‌ కాలేదు’ చెప్పాడు ఎస్సై రంగనాథం.

‘ఆ దొంగలు చాలా తెలివిగా తప్పించుకుంటున్నారు సార్‌ ’ అన్నాడు సుధాకర్‌. ‘అవును కానీ నాకు ఒక డౌట్‌.. ఆ దొంగతనాలు చేస్తున్నది మన ప్రాంతం వాళ్లు కాదేమో అని! పొరుగు రాష్ట్రాల నుండి వచ్చినవారై ఉంటారు. ఒకసారి ఊరి చివరన గుడిసెలు వేసుకున్న వాళ్ళని పిలిపిస్తే సరిపోతుందేమో’ అన్నాడు రంగనాథం.

‘వాళ్లు పాపం అడుక్కునే వాళ్ళు. ఇంత పెద్ద స్కెచ్‌ వేసి హత్యలు చేసేంత ధైర్యం గాని ఐడియా గాని వాళ్లకు ఉండదని నా అభిప్రాయం. అడుక్కోవడం తప్ప వాళ్లకు మరో పని తెలియదు సార్‌..’  అన్నాడు సుధాకర్‌.

‘నువ్వు చెప్పేదీ నిజమే అనుకో! అయినా ఒకసారి పరిశీలిస్తే పోయేదేముందీ!’ ఎస్సై రంగనాథం. ‘సరే’ అన్నట్టుగా తలూపుతూ వాచీ వంక చూస్తుకున్నాడు సుధాకర్‌. ‘సర్‌.. ఇప్పుడెలాగూ లంచ్‌ టైమ్‌ అయింది. నేను ఇంటికెళ్లి భోజనం చేస్తాను. మీరు బయలుదేరే ముందు కాల్‌ చేయండి.. రెడీగా ఉంటాను. దార్లో పికప్‌ చేసుకుందురు’ అంటూ స్టేషన్‌ నుంచి బయటకు నడిచాడు సుధాకర్‌. 
∙∙ 
సరిగ్గా మిట్టమధ్యాహ్నం.. స్టేషన్‌ నుండి పోలీస్‌ జీప్‌ బయలుదేరింది. సుధాకర్‌కు ఇన్‌ఫామ్‌ చేశాడు  ఎస్సై రంగనాథం. ఊరి మధ్యలో కొట్టాల వీధిలో జీప్‌ ఎక్కాడు సుధాకర్‌. జీప్‌ నేరుగా ఊరి బయట గుడిసెలు ఉన్న ప్రాంతానికి చేరుకుంది. అక్కడ ఒక్క గుడిసె కూడా లేదు. 

ఎస్సై ఆశ్చర్యపోతూ ‘సుధాకర్‌! ఇక్కడ గుడిసెలు ఉండాలి కదా! మార్నింగ్‌ ఉన్న గుడిసెలు ఒక్కపూటలో ఎలా మాయమైనట్టు?’ అడిగాడు.  ‘వాళ్లు అడుక్కునే వాళ్ళు కదా సార్‌! ఒక చోట స్థిరంగా ఉండరు. ఊర్లు మారుతా పోతారు’ చెప్పాడు సుధాకర్‌.

 ‘ఇంత ఉన్నపళంగా మారాల్సిన అవసరం ఎందుకొచ్చింది?’ ఎస్సై అనుమానం. ‘వాళ్ళంతే సార్‌.. ఉదయం ఓ చోట ఉంటే మధ్యాహ్నం మరోచోటుకు వెళతారు. ఒకే చోట ఉంటే వాళ్లకు అన్నం పుట్టదు కదా అందుకోసం’ సుధాకర్‌. క్షణం ఆలోచించాడు ఎస్సై రంగనాథం. అంతలోనే డిపార్ట్‌మెంట్‌ నుండి ఫోన్‌ వచ్చింది అర్జంట్‌గా స్టేషన్‌కు రమ్మంటూ.

‘మీరు వెళ్ళండి.. వీళ్ళు ఎక్కడున్నా వెదికి స్టేషన్‌కు తీసుకురండి’  అంటూ తన టీమ్‌కి చెప్పి సుధాకర్‌ వైపు తిరిగి ‘మీరు ఈ పరిసర ప్రాంతంలోనే ఉండి వారిపై ఓ కన్నేసి ఉంచండి’ అంటూ రంగనాథం వెళ్లిపోయాడు. 

పోలీసులు అక్కడి నుండి వెళ్ళిపోగానే సుధాకర్‌ ఒక్కడే నిలిచిపోయాడు. అక్కడున్న చిన్న దిమ్మెపై కూర్చుని ఆలోచించసాగాడు. సాయంకాలం అయిదు గంటలప్పుడు స్టేషన్‌ నుండి ఫోన్‌ వచ్చింది. బయలుదేరి స్టేషన్‌కు వెళ్ళాడు. స్టేషన్‌ ఆవరణలో నేల పై కూర్చుని ఉన్న నలుగురు యువకులు.. వాళ్ల ముందు టేబుల్‌ను ఆనుకుని నిలబడ్డ ఎస్సై రంగనాథం, అతని పక్కనే సీఐ రామకృష్ణ కనిపించారు సుధాకర్‌కు. 

సుధాకర్‌ను చూడగానే ఎస్సై విప్పారిన మొహంతో  ‘దొంగలు దొరికిపోయారు సుధాకర్‌! చాలా తెలివైనవాళ్ళు’ అన్నాడు. అతని మాటల్లో ఏదో వెటకారం వినిపించింది సుధాకర్‌కు. దొరికిన దొంగల వైపు చూడగానే అతని మొహంలో రంగులూ మారాయి. ‘ చాలా చాకచక్యంగా దొంగల్ని పట్టేశారు సార్‌.  ఇక నేను వెళ్ళొస్తాను’ అంటూ ఒకడుగు ముందుకేసిన సుధాకర్‌ కాలర్‌ పట్టుకున్నాడు ఎస్సై..

‘ఆగు’ అంటూ.  ‘అసలైన దొంగవి నువ్వు వెళ్ళిపోతే ఎలా? వాళ్లకు మార్గదర్శకుడివి! బాగానే స్కెచ్‌ వేశావు’ అంటూ సుధాకర్‌ చేతికి బేడీలు వేశాడు. అక్కడే నిజానిజాలు బయటపడ్డాయి. 

ఆ దొంగల ముఠాను నడిపిస్తున్నది సుధాకర్‌. వాళ్లకు నాలుగు తగిలించగానే అసలు విషయాలు బయటపడ్డాయి. వాళ్ళు చేసే దొంగతనంలో సగం వాటా తను తీసుకుని మిగిలింది వాళ్లకు ఇచ్చేవాడు. అనుమానం రాకుండా వాళ్లను అడుక్కుతినే వాళ్ళలాగా నటింపచేస్తూ పగటిపూట స్కెచ్‌ వేసి రాత్రిపూట చోరీకి పంపించేవాడు. అలా వాళ్లకు దిశానిర్దేశం చేసేవాడు సుధాకర్‌.

ఒకపక్క పోలీస్‌ ఇన్ఫార్మర్‌గా ఉంటూనే పోలీసుల కదలికలను పసిగడుతూ వాళ్లకు సూచనలు ఇచ్చేవాడు. ఎవరికీ అనుమానం రాకుండా ఆ దొంగల్ని ఊరి బయట గుడిసెల్లో పెట్టాడు. దొరికిపోతారనే భయంతో వాళ్లను అప్పటికప్పుడు ఖాళీ చేయించాడు. ఇవన్నీ గంటలో జరిగిపోయాయి. పోలీసులు ఎక్కడున్నా వాళ్లకు ఫోన్‌ చేసి దారి మళ్ళించేవాడు. అలా పోలీసులకు రాంగ్‌ ఇన్ఫర్మేషన్‌ ఇస్తూ దొంగల్ని తప్పించేవాడు.

‘డిపార్ట్‌మెంట్‌ నిన్ను బాగా నమ్మింది. దాన్ని ఆసరాగా తీసుకునిమాకు రాంగ్‌ ఇన్ఫర్మేషన్‌ ఇస్తూ నువ్వు పబ్బం గడుపుకున్నావ్‌. డిపార్ట్‌మెంట్‌ ఇచ్చే సూచనల కన్నా నువ్వు ఇచ్చే ఇన్ఫర్మేషన్‌నే ఎక్కువగా నమ్మాను. డిపార్ట్‌మెంట్‌కే ద్రోహం చేస్తావా? నీవల్ల ఎంత మంది ప్రాణాలు పోయాయో తెలుసా? నిన్ను క్షమించకూడదు’ అంటూ దొంగతనం చేసిన సొమ్మంతా సుధాకర్‌ దగ్గర రికవరీ చేశాడు ఎస్సై రంగనాథం. కేసు పెట్టి సుధాకర్‌ సహా  అయిదుగురినీ జైల్లో పెట్టించాడు.
 
  - నరెద్దుల రాజారెడ్డి 

మరిన్ని వార్తలు