ఈవారం కథ: తమ తమ నెలవులు.. లండన్‌ వెళ్లిన భర్త.. ఆమె పరిచయం ఎక్కడికి దారితీసింది?

22 May, 2022 12:10 IST|Sakshi

‘వెళ్లడం అవసరమా? అసలే చలికాలం. పైగా నీ చిన్న కూతురు నువ్వు లేకపోతే ముద్ద కూడా ముట్టుకోదు. దాన్ని దారిలోకి తీసుకురావడానికి నాకు ఎన్ని రోజులు పడుతుందో!’ సూటుకేసులో బట్టల్ని మరోసారి లెక్క చూస్తూ నా వైపు జాలిగా చూసింది తను.

‘తెలిసి కూడా అడుగుతావేంటి? ఇది తప్పించుకోలేని బాధ్యత. వెళ్లక తప్పదు. ఆరు వారాలేగా?’ ‘మ్‌..’ ఆడవాళ్ళ ప్రతీ ‘మ్‌’ కి వంద అర్థాలు ఉంటాయి అనుకుంటా. సందర్భాన్ని బట్టి అర్థం మారుతుంది. 

‘పోనీ న్యూ ఇయర్‌కి నువ్వు కూడా అక్కడికి రావొచ్చు కదా? చాలా రోజులయింది మనం అలా ఎటైనా వెళ్లి. ఇరవై రోజుల్లో వచ్చేస్తుంది వీసా’ . ‘వేరే చోటుకైతే వచ్చేదాన్నే. ఇది నువ్వు ఒక్కడివే వెళ్ళాలి. నీ కోసం వెళ్ళాలి’ నవ్వింది.  

‘నాన్నా.. మేమూ వస్తాం.. మేమూ వస్తాం..’  నేనేదో చెప్పేలోపు, ఏడుస్తూ వచ్చేసి నన్ను పట్టేసుకున్నారు పిల్లలిద్దరూ. ‘నాన్న ఎక్కడికీ వెళ్లట్లేదు గానీ పదండి ముందు. నేను వీళ్ళని పడుకోబెట్టి వస్తా. నువ్వు ఏమైనా మర్చిపోతే సర్దుకో ఈ లోపు’ అంటూ  పిల్లల్ని నా నుంచి విడిపించి, తను తీసుకుని వెళ్ళిపోయింది. తను సర్దిన బ్యాగుల వంక చూశాను.

చేతి రుమాలుతో సహా అన్నీ సరిగ్గా ఉన్నాయి. నవ్వొచ్చింది. ఈ ఆడవాళ్ళకి ఎలా తెలుస్తాయో మన చిన్నచిన్న అవసరాలు కూడా. తెల్లవారు జామున ఫ్లైటు. ఇంకా నాలుగు గంటల టైముంది. నిద్ర పట్టట్లేదు. అలవాటైన ప్రయాణాలే అయినా ప్రతిసారీ కొత్తే. బలవంతంగా కళ్ళు మూసేశాను. కళ్ళను మూసినంత వేగంగా ఆలోచనల్ని కూడా ఆపగలిగితే ఎంత బావుండేదో! ఒక అరగంట తర్వాత అనుకుంటా వెనక నుండి నన్ను చుట్టుకుని పడుకుంది తను.

‘పిల్లలు పడుకున్నారా?’   ‘మ్‌...’ ‘పోనీ ఎయిర్‌ పోర్టుకి వస్తావా?’.. తనేమీ సమాధానం చెప్పలేదు. మరింత గట్టిగా నన్ను పొదువుకుంది. తన మౌనానికి అర్థం నాకు తెలుసు.
∙∙∙ 
హీత్రో  విమానాశ్రయం.. లండన్‌. డిసెంబర్‌ చలి సూదుల్లా గుచ్చుతోంది. ఇంకా సాయంత్రం అవ్వకుండానే చీకటి పడిపోయింది. విమానాశ్రయం దగ్గర టాక్సీ మాట్లాడుకుని హోటల్‌కి బయల్దేరాను. పంజాబీ టాక్సీ డ్రైవర్‌ నన్ను చూసిన ప్రాంతీయాభిమానం వల్లేమో ఆపకుండా హిందీలో మాట్లాడుతూనే ఉన్నాడు. గాలి కోసం కారు అద్దాలు కొద్దిగా తెరిచాను.

మధ్యాహ్నం మంచు పడినట్టుంది. సన్నగా తుంపర మొదలైంది. ఇక్కడ వర్షం ఎప్పుడు ఎందుకు పడుతుందో అర్థం కాదు. కారు అద్దాలు మూసేశాను. చీకటి.. అద్దంలో నాకు నేను కనిపించాను. స్పష్టాస్పష్టంగా. 

‘ఆజ్‌ ఫిర్‌ జీనే కీ తమన్నా హై.. ఆజ్‌ ఫిర్‌ మర్నే కా ఇరాదా హై..’ లతా మంగేష్కర్‌ పాట రాగానే వాల్యూమ్‌ పెంచాడు డ్రైవర్‌. దేవానంద్‌ చేతిలోని కుండని విసిరేసి గడ్డిలో పొర్లుతూ పాడుతున్న వహీదా రెహమాన్‌ గుర్తొచ్చింది. తెలియకుండానే చాలా సేపటి తర్వాత నవ్వొచ్చేసింది. హోటల్‌ రూముకి చేరాక టైమ్‌ చూసుకున్నా. ఇండియాలో అర్ధరాత్రి దాటుంటుంది.

చేరానని మెసేజ్‌ పెడదామనుకునే లోపు తనే వీడియో కాల్‌ చేసింది. ఇలా ఉన్నపళంగా వీడియో కాల్‌ చేసేస్తే నాకు చెడ్డ కోపం వచ్చేస్తుంది. ఈ సంగతి తనకి కూడా తెలుసు. ఒక్క రోజులో ఏమైపోతాను? అయినా మొహం చూస్తూ ఎలా మాట్లాడతారో! విసుగుకి అలసట రంగు పులిమేసి, ఫోన్‌ ఎత్తేసరికి నా చిన్న కూతురు. వదిలేసి వచ్చానని నిద్రపోకుండా ఏడుస్తోంది.
∙∙∙ 
కొత్త ప్రాజెక్ట్‌ పనులూ, మీటింగులతో మూడు వారాలు తెలియకుండానే గడిచిపోయాయి. తెల్లారితే కొత్త సంవత్సరం. పనంతా పక్కన పడేసి మధ్యాహ్నం నుండే ఇళ్ళకి బయల్దేరారు అందరూ. నా టీమ్‌లో ఉన్న నలుగురూ యూరోప్‌ రావడం మొదటిసారి. వాళ్ళ ఉత్సాహం అడుగడుగునా తెలుస్తోంది.

 ‘ఇవ్వాళ రాత్రి ఎక్కడికి వెళ్తున్నారు?’ బ్యాగ్‌ సర్దుకుని వెళ్ళబోతూ అడిగాడో కుర్రాడు. అక్కడున్నవాళ్లలో ఇతనొక్కడే తెలుగు వాడు. ఇంకా పెళ్లి కాలేదు. ‘ఎక్కడికీ లేదు. హోటల్లోనే’ నా కంప్యూటర్‌ స్క్రీన్‌ వైపు చూస్తూ తలెత్తకుండానే చెప్పాను.

‘సరదాగా మాతో రావొచ్చు కదా?’ మిగతా ముగ్గురు కూడా ఆగి నా సమాధానం కోసం చూస్తున్నారు. ‘లండన్‌ నాకు కొత్త కాదు’  తెచ్చి పెట్టుకున్న నవ్వుతో అన్నాను. అయినా ఈ కుర్రాళ్ళకి ఇదేం సరదానో.. ఎక్కడికెళ్లినా అందరినీ లాక్కెళ్ళాలి అనుకుంటారు. 

‘మాకు మాత్రం కొత్తే. తెలిసిన వాళ్ళుంటే బావుంటుంది అని అడిగాం. సరే హ్యాపీ న్యూ ఇయర్‌.. వస్తాం’ అంటూ బయల్దేరారు. నేను చెప్పిన సమాధానానికి నొచ్చుకున్నట్టున్నారు. ‘ఇంతకీ ఎక్కడికెళ్తున్నారు?’ అనుకోకుండా అడిగేశాను.

‘పికడిలీ సర్కస్‌. రావాలనుకుంటే ఫోన్‌ చెయ్యండి’  చెప్పేసి వెళ్లిపోయారు. లండన్‌లో చూడవలసిన, పనికట్టుకుని చూసే ప్రదేశాల్లో పికడిలీ సర్కస్‌ ఒకటి. ప్రత్యేకించి సర్కస్‌ లాంటివేమీ ఉండవు. అలా పిలిచి పిలిచి ఇక్కడి వాళ్లకు అలవాటైపోయింది. వాళ్ళు చెప్పినప్పటి నుండి పని ముందుకు సాగట్లేదు. నిశ్శబ్దం.. ఆఫీసంతా ఖాళీగా ఉంది.

కొన్ని చోట్లు, కొందరు మనుషులు, వారు తెచ్చిన  జ్ఞాపకాలు.. మనసులోంచి ఎంత బలవంతంగా తీసేద్దాం అనుకున్నా కుదరదు. కాఫీ తెచ్చుకుని ఆఫీసు కిటికీలోంచి చూశాను. ఊరంతా సందడిగా ఉంది. తేదీ మాత్రమే మారుతున్నా, రాత్రికి రాత్రి జీవితాలు మారిపోతున్నట్టు ఎందుకో ఇంత ఉత్సాహం అందరికీ! దీన్నే రేపటి మీద ఆశ అంటారేమో! రంగుల వెలుగులు నన్నూ నా ఆలోచనల్ని ఒక పుష్కరం వెనక్కి లాక్కెళ్ళాయి...     
∙∙∙       
అడల్ట్‌ క్లబ్, పికడిలీ సర్కస్‌..
ఎరుపు, నీలం గులాబీ రంగుల మసక మసక లైట్ల మధ్య అక్కడక్కడా సోఫాలు వేసి ఉన్నాయి. ఒక పెద్ద స్టేజీ మీద అమ్మాయిలు ఒకరి తర్వాత ఒకరు సంగీతానికి అనుగుణంగా డాన్స్‌ చేస్తున్నారు. మొదటిసారి శృంగారం ఒలకబొయ్యడం అంటే  ఏంటో ప్రత్యక్షంగా చూస్తున్నాను. నాతో వచ్చిన ఇద్దరూ చెరో అమ్మాయితో మాటలు కలిపారు. ఎందుకో ఆ చోటు నాకు నచ్చలేదు. చుట్టూ చూసి వెళ్లిపోదాం అని ఆలోచిస్తూ.. పరధ్యానంగా స్టేజి మీద అమ్మాయిల్ని చూశాను.

‘చూడటానికి సిగ్గు పడుతున్నావా?  సిగ్గు పడుతూ చూస్తున్నావా?’ పక్కన కూర్చుంటూ అడిగింది ఆమె. ‘అదేం లేదు’  కొద్దిగా దూరంగా జరిగాను.  ‘లోపలకి వచ్చే వరకే ఈ సిగ్గులు.. అందరినీ చూశావా? ఎవరయినా నచ్చారా?’ ఆమె మాట్లాడే ఇంగ్లిష్‌ స్పష్టంగా ఉంది. మత్తుగా మాట్లాడాటానికి ప్రయత్నిస్తోంది ఆమె.

‘దేనికి?’ ముఖం చిట్లించాను. అర్థం చేసుకుందో, తన వంతు వచ్చిందో గానీ ఏమీ మాట్లాడకుండా స్టేజ్‌ మీదకి వెళ్లి డాన్స్‌ చెయ్యడం ప్రారంభించింది. పొడవాటి రాగి జుత్తు. రష్యన్‌ డాన్సర్‌ అని చెప్పాడు నా పక్కన కూర్చున్న పెద్దాయన. స్టేజ్‌ మధ్యలో ఉన్న ఒక పోల్‌ పైకి సునాయాసంగా పాకుతూ నృత్యం చేస్తున్న ఆమె మధ్య మధ్యలో నా వైపు చూస్తోంది. ఎందుకో.. ఆ రాత్రి అప్పుడే ఇంటికి వెళ్లాలనిపించలేదు.        

కాసేపటికి.. 
ఒక మూల జనం లేని చోట, సోఫాలో నన్ను కూర్చోబెట్టి, నా చుట్టూ ఉన్న కర్టెన్‌ని మా ఇద్దరికీ చాటుగా లాగింది. ‘ఇక్కడా?’ డాన్స్‌ చేస్తూ నా ఒళ్ళో కూర్చోబోయిన ఆమెని ఆపి అడిగాను. ‘మరింకెక్కడ?’ నవ్వింది.

‘అందరూ చూస్తుండగా??’ కర్టెన్‌ కొద్దిగా పక్కకు జరిపి దూరంగా ఉన్న మనుషుల్ని చూస్తూ అన్నాను. ‘నువ్వనుకుంటున్న చోటు ఇది కాదు. ఇక్కడ మేము డాన్స్‌ మాత్రమే చేస్తాం’ పగలబడి నవ్వింది ఆమె నా ఆలోచనకి, ఆశకి. నవ్వుతూనే ఉంది.  నాకెందుకో అవమానంగా అనిపించింది. వెంటనే లేచాను.

‘ఆగు..’ నా చేతి వాచీలో టైమ్‌ చూసింది. ఒక్క సెకను ఆలోచించుకుని  ‘ఇప్పుడే వస్తాను’ అంటూ కౌంటర్‌ దగ్గరకు  వెళ్లి, ఏదో చెప్పి తన బ్యాగ్‌ తగిలించుకుని వచ్చేసింది.   
∙∙∙      
‘ఇదేనా నువ్వుండే గది?’ అగ్గిపెట్టెలా ఉన్న ఆ గదిలో మంచం మీద కూర్చుంటూ అడిగాను. ‘హా’ నా కోటు తీసుకుని తలుపుకున్న కొక్కేనికి తగిలించింది. ‘ఇవన్నీ?’ చుట్టూ చూశాను. కొన్ని పెయింటింగ్స్‌ వాటి మీద ఏవో రాతలూ. 

‘ఆ అర్థం లేని బొమ్మలు నేను గీసినవి..’ హీల్స్‌ తీసేసి ఒక మూలన పెట్టింది. ‘మరి ఇవి?’ గదిలో అక్కడక్కడా మగవారు వాడే వస్తువులు. గోడ మీద అతికించిన కొన్ని ఫొటోలు, చిన్న చిన్న ఉత్తరాలు. 

‘ఇక్కడికి ఎప్పుడైనా వచ్చే వాళ్ళు ఇచ్చేవి, మర్చిపోయేవి, వదిలేసేవి!’  ‘వారి జ్ఞాపకాలా?’ ‘కాదు.. నా దగ్గర వదిలేసిన బరువులు! ఎప్పుడైనా మళ్ళీ కావాలనిపిస్తే వచ్చి తీసుకెళ్తుంటారు’ పక్క గది లోంచి అప్పుడే వచ్చిన పిల్లిని ముద్దాడి, దానికి చిన్న గిన్నెలో పాలు పోసింది.

‘ఈ పిల్లి ఇక్కడే ఉంటుందా?’ దానికి నేను నచ్చినట్టు లేను. వచ్చి వాసన చూసి వెళ్ళిపోయింది.  ‘మ్‌.. నువ్వు క్లబ్‌కి ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చావా? నిన్ను మొదటిసారి చూస్తున్నాను’

‘లేదు. ఇంకో రెండునెలల్లో నా పెళ్లి...’ ఆఖరు మాటను వినిపించీ వినిపించినట్టు చెప్పాను. ‘పెళ్లి చేసుకోబోయే అమ్మాయితోనే మొదలెట్టాల్సింది కదా?’ జుత్తు పైకి ముడి వేసుకుంటూ ఆట పట్టిస్తున్నట్టు అంది. మెడ వెనుక కమలం పువ్వు పచ్చ బొట్టు, అప్పటి వరకూ జుత్తు వెనక దాక్కుని కనిపించలేదు నాకు.

‘అనుభవాలు చేదు జ్ఞాపకాలు అవ్వకూడదని ముందు జాగ్రత్త’ కొట్టినట్టు చెప్పాను. ‘ఎంత వద్దనుకున్నా ఈ రోజు అనుభవాలే రేపు మనల్ని కట్టి పడేసే జ్ఞాపకాలు. నీతో వచ్చిన మీ ఫ్రెండ్స్‌కి చెప్పావా నువ్వు ఇలా వస్తున్నట్టు?’ అద్దం ముందు నుంచుని మేకప్‌ తొలగించుకుంటూ అడిగింది. నాకెందుకో ఆమె అనవసరంగా  మాటల్తో టైమ్‌ వృథా చేస్తున్నట్టు అనిపించింది.

ఆమె దగ్గరగా వెళ్లాను. నా కంటే కొంచెం ఎత్తుగా ఉంది. నన్ను చూసి కళ్ళెగరేసింది. దగ్గరికి తీసుకుని, మొహమాటంగా నవ్వి ముందుకి వంగాను. ‘పెదవుల మీద వద్దు’ నన్ను తోసేసి నవ్వింది.

‘అలాంటప్పుడు ఇంత వరకూ తీసుకురావడం ఎందుకు?’ ఆమె అడ్డు చెప్పడం నచ్చలేదు నాకు. ‘చెప్పాను కదా.. నేను డాన్సర్‌ను మాత్రమే. అక్కడ సిగ్గు పడుతున్నావని ఇలా!’ నవ్వి, నా ముక్కుని పట్టుకుని అటూ ఇటూ ఆడించింది. నన్ను చిన్న పిల్లాడిలా చూస్తున్నట్టు అనిపించింది.  

‘డబ్బులిస్తున్నా కదా?’ ఈ మాట అంటున్నప్పుడు ఆమె వైపు సూటిగా చూడలేకపోయాను. ‘ఆ డబ్బులేవో నేనే ఇస్తానులే. కాసేపుండి వెళ్లిపో. ఎలాగూ ఇవ్వాళ డ్యూటీకి మళ్ళీ రానని క్లబ్‌లో చెప్పేశాను.’ 

‘నేను వెళ్తాను’ నా కోట్‌ తీసుకోబోయాను. ‘ఇప్పుడు వెళ్ళలేవు’ బయట అప్పుడే మొదలైన వర్షాన్ని చూపిస్తూ నా కళ్ళలోకి చూసింది. లేత నీలం రంగు గాజుకళ్ళు. ఆకాశంలా ఉన్నాయి. ఆమె చూపుని తప్పించుకోడానికి ప్రయత్నించాను. ఆమె ఏమీ మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయింది. కాసేపటికి బట్టలు మార్చుకుని వచ్చి, గాజు కప్పుల్లో ఉన్న కొవ్వొత్తుల్ని వెలిగించింది. మంచి వాసన.. 

‘సారీ. ఇందాక..’ తప్పు ఒప్పుకోవడం మంచిదనిపించి చెప్పాను. ‘ఫర్వాలేదు. చాలా నిజాలు ఎగతాళిగా మాట్లాడినప్పుడో, ఆవేశంగా ఉన్నప్పుడో బయటికొచ్చేస్తాయి. అదీగాక మా దగ్గర నుండి ఎవరైనా అంత కన్నా గొప్పగా ఏం ఆశిస్తారు? సరే.. రా..! చాలా ఆశ పెట్టుకుని వచ్చావు పాపం’ మంచం మీద కూర్చుంటూ పిలిచింది. ఇందాకటి నా ప్రవర్తనకి సిగ్గుపడ్డాను. 

‘నీ పేరేంటి?’ మంచానికి ఇవతల పక్క కూర్చుంటూ అడిగాను. ‘ఎవరికి నచ్చిన పేరుతో వాళ్ళు పిలుస్తారు’ నా వెనకున్న కిటికీ పరదాల్ని మూయడానికి కొద్దిగా వంగింది. ఆడవాళ్లు వాడే పెర్ఫ్యూమ్‌ల గురించి పెద్దగా అవగాహన, తెలుసుకోవాలన్న ఆసక్తీ ఎప్పుడూ నాకు లేవు గానీ, ఒక మగవాడు వారి వశం అవ్వడంలో కళ్ళ తర్వాత ప్రధాన పాత్ర పోషించేది వారు వాడే పెర్ఫ్యూమ్‌ అనడంలో సందేహం లేదనిపించింది. ఆమె నాకు దగ్గరగా కూర్చుంది. ఏదేదో మాట్లాడుతోంది. చాలా మాటలు నా చెవులను కూడా చేరట్లేదు. జీవితంలో ఎప్పుడూ ఒక అమ్మాయి నాకు అంత దగ్గరగా రాలేదు. 

‘నీ గురించి  చెప్పు..’ ఆమె గురించి ఆమె మాటల్లో వినాలనిపించింది. ‘తెలుసుకుని ఏం చేస్తావు?’ నవ్వింది అదోలా.  మళ్లీ తనే మాట్లాడుతూ ‘అసలు మనలో దాచుకున్న నిజాలు ఎవరికైనా చెప్తే వింటారా? అర్థం చేసుకుంటారా? మన జ్ఞాపకాల్ని, మన గాయాల్ని మోయాల్సిన అవసరం ఎవరికైనా ఎందుకుంటుంది? ఎవరి కథలు వారివే. ఎవరి బరువు వారిదే. మన జీవిత కాలపు అనుభవాలు వారికి ఒక సాయంత్రపు సరదా కాలక్షేపం. తెల్లవారితే మరో కథ, మరో కొత్త సరదా. ఎవరి కథకి వారే ప్రధాన సూత్రధారులు.. వేరే వారి కథలో మాత్రం..’ అంటూ ఆపేసింది. ఆ రాత్రి మెల్లగా గడిస్తే బావుణ్ణు అనిపించింది.

‘నాకు నీ ఒంటి రంగు బాగా నచ్చింది’ ముఖం మీద పడుతున్న నా జుత్తులోకి ఆమె వేళ్ళని పోనిచ్చి ఆడుతూ అంది. మగవాళ్లకి తమ జుత్తు మీద ఎవరైనా చెయ్యి వేస్తే నచ్చదు. కానీ, ఇష్టమైన వాళ్ళకి అది మినహాయింపేమో. రెండు గంటల క్రితం ఒక అంగడి బొమ్మగా చూసి నేను అసహ్యించుకున్న ఆమె.. ఇంత తక్కువ సమయంలో ఇంత దగ్గరైపోవడం చూస్తే నేను ఇంత బలహీనుడినా లేక ఆమెలో నిజంగానే ఏదైనా మాయ ఉందా అర్థం కాలేదు. ఆ క్షణం మునుపెన్నడూ లేని కొత్త సంతోషం ఏదో నాలో.  అప్పుడే దూరం కాకుండా ఉంటే బావుండు!

‘నువ్వు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి లండన్‌లోనే ఉంటుందా? ఎన్నాళ్ళుగా ప్రేమించుకుంటున్నారు?’ ఉన్నట్టుండి మా మధ్యకి తన ప్రస్తావన తీసుకురావడం నాకు ఇబ్బందిగా అనిపించింది. ‘లేదు. ఇండియాలో ఉంటుంది. మా మావయ్య కూతురు. పెళ్లయ్యే వరకు మేం కలిసి ఉండకూడదు.. మా దేశంలో అంతే’ అంటూ  నవ్వాను.

‘మంచిదే! మొత్తం ముందే తెలిసిపోతే తర్వాత ప్రయాణం విసుగ్గా ఉంటుంది. మా దేశంలో ఒక సామెత చెప్తారు. పెళ్లి చేసుకో..  ప్రేమ వెతుక్కుంటూ వెనకే వస్తుందని’ ఆమె చెప్పింది నిజమే అనిపించినా ఒప్పుకోవాలనిపించలేదు. నన్ను ఆమె నుండి దూరంగా నెట్టేస్తున్నట్టు తోచింది. ‘నాకు నువ్వు నచ్చావు!’

‘నీకు తెలుసా? పికాడిల్‌ అంటే ఒక రకమైన ఫ్రిల్డ్‌ కాలర్‌. ఇక్కడుండే టైలర్‌ తను కుట్టే చొక్కాలకి పికాడిల్స్‌ను తయారుచేసి గొప్పోడు అయ్యాడంట. అప్పటి నుండే ఇది పికాడిలీ సర్కస్‌ అయింది’ నేను చెప్పిన మాటలని దాటేస్తోంది.

‘ఐ లైక్‌ యూ.. ’  ధైర్యమో, ఆమె దగ్గర నాకు చనువు ఉందనిపించిందో, ఉన్నట్టుండి అనేశాను. బదులేమీ ఇవ్వకుండా  నా చేతి వేళ్ళ మధ్యకి ఆమె వేళ్ళని పోనిచ్చి మా ఇద్దరి చేతుల్నీ పోల్చింది. ‘నేను చెప్పింది విన్నావా?’ 

‘ఇది నిశ్చితార్థం ఉంగరమా? చాలా బావుంది!’ కాదని చెప్పాను. నా ఉంగరం తీసి ఆమె వేలికి పెట్టుకుని చూసింది. సరిపోలేదు. ‘ఇది నా మెడకి సరిపోయేలా ఉంది’ నవ్వి, తిరిగి నా వేలికి పెట్టేసింది.   ‘నువ్వు ఎవరినీ ప్రేమించలేదా?’ 

ఆమె జవాబు చెప్పలేదు. ‘కాసేపు నీ ఒళ్ళో పడుకోనా?’ పడుకుంటూనే అడిగింది. ‘నిన్ను చూస్తే చాలా దగ్గరై, బాగా దూరమై పోయిన ఎవరో గుర్తొచ్చారు. అందుకేనేమో అనుకోకుండానే నిన్ను ఇంత దూరం తీసుకొచ్చేశాను. శృంగారం ఇక్కడ చాలా సర్వ సాధారణమైన విషయం. దానికి ప్రేమ అవసరం లేదు. కోరిక ఉంటే సరిపోతుంది. కానీ ముద్దు అలా కాదు. అది ప్రేమించిన వారికే ఇస్తాం. ప్రేమ ఉంటేనే ఇవ్వగలం. మనసులో భావాలు ఆజ్ఞ ఇస్తేనే పెదవులకి అనుమతి దొరికేది.

‘ముద్దుకి మొనాగమీ అంటావా?’ ఆమె మెడ వెనుక ఉన్న పచ్చ బొట్టుని వేలితో తాకాను. అలా మాట్లాడుతూనే చాలా సేపటికి నిద్ర పోయింది. నా ఉంగరం తీసి నిద్రపోతున్న ఆమె గొలుసులో లాకెట్‌లా వేశాను. అమ్మమ్మ గుర్తొచ్చి నవ్వొచ్చింది. తాతయ్య ఇంటి ఖర్చుల కోసం ఇచ్చిన డబ్బుల్లోంచి కొంచెం కొంచెం దాచి, నేను ఉద్యోగంలో చేరిన మొదటి రోజు చేయించి ఇచ్చిన ఉంగరం అది. చాలా విలువైంది అని చెపుతూంటుంది. మనకి ఇష్టమైన వారి ముందు, వారితో మనం పంచుకున్న క్షణాల ముందు వస్తువుల విలువ చాలా తక్కువేమో.
∙∙ 
‘గుడ్‌ మార్నింగ్‌’ చెప్పింది, కళ్ళు తెరిచే సరికి ఎదురుగా సోఫాలో కూర్చుని నన్నే చూస్తున్న ఆమె. ఎప్పుడు కునుకు పట్టేసిందో కూడా తెలియలేదు. మనిషికి నిద్ర శాపమేమో అనిపించింది. ఆమె మెడలోని నా ఉంగరం మీద పడిన సూర్యుడి వెలుగు నా కళ్ళలో పడి ఆమెను స్పష్టంగా చూడనివ్వకుండా చేస్తోంది. పిల్లి నా కాళ్ళ దగ్గర ఒద్దికగా ముడుచుకుని పడుకుంది. ‘నాకు వెళ్లాలని లేదు’ వెలుగుకు చేతిని అడ్డుపెట్టుకుంటూ అన్నాను. రాత్రి కొక్కేనికి తగిలించిన నా కోటు వేసుకుని ఉంది ఆమె. 

‘సరే చెప్పు.. ఏం చేద్దామో’ లేచి దగ్గరగా వచ్చి కూర్చుంది. ‘నన్ను పెళ్లి చేసుకో. నాతో పాటు వచ్చెయ్‌.’ ‘ఒక్క రాత్రిలోనే?’ పగలబడి నవ్వుతూ చెప్పింది. ‘నేను నీకు నచ్చలేదా?’ సూటిగా అడిగాను. ఆమె సమాధానం చెప్పకుండా నా కోటు తీసి నా చేతిలో పెట్టింది. ‘నిజంగా చెప్తున్నాను. నీలా ఎవరూ నాతో లేరు. మనం పెళ్లిచేసుకుందాం..ప్లీజ్‌!’

‘ష్‌..’ నా పెదవుల మీద ఆమె వేలిని ఉంచింది. నేనింకేదో చెప్పబోయాను. ముందుకు వంగి తన పెదవులను నా పెదవులపై ఉంచింది. మధ్య అడ్డుగా ఉన్న ఆమె వేలు ఊపిరాడక తప్పుకుంది. ఇప్పటి వరకూ ఆమె పెట్టిన హద్దుల్ని ఆమే చెరిపేసింది. అలా ఎంత సేపున్నామో లెక్కపెట్టలేదు. క్లబ్‌ నుండి వచ్చిన ఆమె స్నేహితురాళ్ళు తలుపు కొట్టడంతో ఈ లోకంలోకి వచ్చాం.  

‘సాయంత్రం ఇంక క్లబ్‌కి వెళ్లొద్దు. నేనొచ్చి నిన్ను నాతో తీసుకెళ్తాను.’ ‘నువ్వు చాలా మంచోడివి’ నా జుత్తుని సరిచేసి, ‘సాయంత్రం ఆరు గంటల తర్వాత రా. ఇప్పుడు ఈ పక్క డోర్‌ నుండి బైటికి వెళ్ళు. మా వాళ్ళు చూస్తే అల్లరి చేస్తారు’ చెప్పేసి తలుపు తియ్యడానికి వెళ్తూ వెనుక నుండి గట్టిగా హత్తుకుని వదిలేసింది. ‘బాయ్‌’ వెళ్తూ వెళ్తూ వెనక్కి తిరిగి చూడాలనిపించింది. కానీ, అప్పటికే ఆమె తలుపు మూసిన చప్పుడు వినిపించింది. అదే ఆఖరుసారి ఆమెని చూడటం. 
∙∙ 
‘ఆదీ.. వస్తున్నారా? మేం వెళిపోమా?’ ఆ తెలుగు కుర్రాడి మెసేజ్‌ టోన్‌ నా ఆలోచనల్లోంచి నన్ను బైటికి విసిరి కొట్టింది. వస్తున్నానని ఫోన్‌ చేసి చెప్పాను. అడల్ట్‌ క్లబ్, పికడిలీ సర్కస్‌.. చాలా వరకూ అలానే ఉంది. లోపల కొద్దిగా ఆధునీకరించినా కొత్త అమ్మాయిలు, మసక దీపాలు, నృత్యాలు ఏమీ మారలేదు. తరాలు మారినా కొన్ని మారకపోవడం నచ్చుతుంది నాకు. అర్ధరాత్రి వరకు హడావుడిగా సాగిన నూతన సంవత్సర వేడుకలు వెలుగు రాకుండానే చప్పబడి పోయాయి. ఎలాగో ధైర్యం తెచ్చుకుని ఆమె ఉండే ఇంటికి వెళ్లి తలుపు తట్టాను. నా లోపల కంగారు ఆత్రం ఆరాటం. ఆమె నాకు ఏమవుతుంది అంటే ఏం చెప్పాలి? ఏ పేరు పెట్టాలో తెలీదు.  

‘ఎస్‌..’ ఎవరో అమ్మాయి తలుపు తీసింది. ఇరవై ఏళ్ళుండొచ్చు. ‘నేను ఇక్కడికి...’ ఏం చెప్పాలో అర్థంకాలేదు. ఆమె అక్కడుండే అవకాశం లేదని నాకు అనిపించింది. 
‘క్రితంసారి వచ్చినపుడు ఏమైనా వదిలేశారా? లోపలకి రండి. ఫీల్‌ ఫ్రీ..’ పార్టీ జరుగుతున్నట్టుంది. గది బైట నన్నొదిలేసి వెళ్లిపోయింది. అదే గది.. గదిలో మరిన్ని వస్తువులు, కొత్త కొత్త మనుషుల ఫొటోలు.. ఆమె జ్ఞాపకాల జాడ కనిపించలేదు నాకు.

ఆమె నాకొక సమాధానం లేని ప్రశ్నగా మిగిలిపోయిందన్న చిన్న అసంతృప్తితో వెళ్తున్న నన్ను అద్దం దగ్గరున్న ఫొటో ఆకర్షించింది. వెనుకకి తిరిగి చేతులతో జుత్తుని పైకి పట్టుకుని ఎడమ పక్కకి చూస్తున్న అమ్మాయి.. ఆమె మెడ మీద నాకు బాగా పరిచయం ఉన్న కమలం.. ఆ కమలానికి పైన కొద్ది దూరంలో కొత్తగా సూర్యుడి పచ్చ బొట్టు. ఆమే! ఫొటో పక్కన మేకుకి తగిలించిన నా ఉంగరం. ఫొటోని తడిమాను.

ఫొటో వెనుక ఇలా రాసుంది. ‘బహుశా మనం అందరం బురదలో పుట్టిన కమలం లాంటి వాళ్ళమే. జీవితంలోని అడ్డంకుల్ని, కష్టాల్ని, బాధల్ని తట్టుకుంటే మలినం అంటని కమలంలా స్వచ్ఛంగా పైకి వస్తాం. ప్రతి మేఘానికీ ఒక వెండి అంచు ఉన్నట్టే, కష్టాల మబ్బుల్ని తొలగించి, మనలోని జ్ఞానాన్ని వెలికి తీసే వెలుగు.. సూర్యుడి రూపంలో మనల్ని పలకరిస్తూనే ఉంటుంది. అది అందుకుని వికసించాలే గానీ స్వంతం చేసుకోవాలని ప్రయత్నిస్తే అర్ధాంతరంగా మన కథ ముగిసిపోతుంది. ఎవరి కథకి వారే ప్రధాన సూత్రధారులు.. వేరే వారి కథలో మాత్రం సహాయ పాత్రధారులు కదా!  –సాషా’

‘సాషా...’ ఆమె పేరు పలుకుతున్నపుడు మునుపు ఎన్నడూ లేని ఒక సంతృప్తి. ఫొటో అక్కడే వదిలేసి, చేతి రుమాలుతో కళ్ళజోడు తుడుచుకుని పెట్టుకున్నాను. రుమాలు మీద ఎర్రని అక్షరాల్లో నా భార్య కుట్టిన నా పేరు. తను గుర్తొచ్చింది. ఇంతలోనే తన నుంచి మెసేజ్‌.. ‘నూతన సంవత్సర శుభాకాంక్షలు. వెళ్ళిన పని అయిందా?’ అంటూ. ‘పని అయిపోయింది.

ఒక వారం ముందుగానే వచ్చేస్తున్నా. నిన్ను చూడాలనిపిస్తోంది.’ మెసేజ్‌ టైప్‌ చేసి పంపకుండానే, వీడియో కాల్‌ చేశాను. ఎందుకో తనని చూడాలనిపించింది. దీన్నే మిస్‌ అవ్వడం అంటారేమో. పెళ్లయిన చాలా సంవత్సరాల తర్వాత కొత్తగా తెలుస్తున్నట్టుంది. బావుంది ఈ అనుభూతి. బయటికొచ్చాను. తెల్లవారిపోయింది!

-∙రవి మంత్రిప్రగడ 
  

మరిన్ని వార్తలు