Crime Story: పనిష్మెంట్‌.. ఆ ‘బొమ్మ’ ఎంత పనిచేసింది? ఆఖరికి ఏమైంది?

23 May, 2022 18:53 IST|Sakshi

న్యూఢిల్లీ ..సీబీఐ ఆఫీస్‌..నాలుగు అంతస్తుల ఆ భవనానికి కట్టుదిట్టమైన భద్రతతో .. అడుగడుగునా శక్తిమంతమైన సీసీ కెమెరాలు అమర్చి ఉన్నాయి. నాలుగవ అంతస్తులోని కాన్ఫరెన్స్‌ హాల్లో సీబీఐ డైరెక్టర్లు .. మిగిలినవారు ఎవరికోసమో ఉత్కంఠగా వేచి ఉన్నారు. అరగంట తర్వాత అక్కడికి చేరుకున్న కిరణ్‌ మిశ్రాను అభినందనలతో ముంచెత్తారు. వారి అభినందనలను స్వీకరిస్తూనే ఆలోచనల్లోకి జారిపోయాడు కిరణ్‌ మిశ్రా.
∙∙∙ 

ఒక ఉగ్రవాద ముఠా దేశంలోకి రహస్యంగా ప్రవేశించిందని .. దేశంలో పలుచోట్ల  అల్లకల్లోలం సృష్టించడానికి పన్నాగంతోనే వారు వచ్చినట్టు సీబీఐ ఏజెంట్లు పసిగట్టారు. ఆ సమాచారం తెలియగానే సీబీఐ చీఫ్‌.. రాజీవ్‌ అగర్వాల్‌ వెంటనే కిరణ్‌ మిశ్రాతో రహస్య సమావేశమయ్యాడు.

‘మిస్టర్‌ మిశ్రా.. మనకు మన ఏజెంట్లు అందించిన సమాచారం మీకు తెలిసిందే కదా! ఆ ఉగ్రవాద ముఠాను సమూలంగా అంతమొందించాలి. ఈ పనికి మీరు మాత్రమే సమర్థులు. మీకు ‘షూట్‌ ఎట్‌ సైట్‌’ ఆర్డర్స్‌ ఇచ్చారు. ఉగ్రవాదులను మీరు ప్రాణాలతో పట్టుకున్నా సరే .. లేకుంటే.. అంటూ ఆగిపోయాడు.

అందుకు సమాధానంగా కిరణ్‌ మిశ్రా.. ‘సర్‌ ఆ ఉగ్రవాద ముఠాను మన దేశంలో లేకుండా చేస్తాను. అది ఈ దేశ పౌరుడిగా నా బాధ్యత’ అంటూ పైకి లేచి అక్కడ నుండి వెళ్ళిపోయాడు.
∙∙∙ 
కాన్ఫరెన్స్‌ హాల్లో అందరు వెళ్లిపోయారు. అక్కడ కిరణ్‌ మిశ్రా తప్ప ఎవరూ లేరు. ఇంతలో అక్కడికి చీఫ్‌ రాజీవ్‌ అగర్వాల్‌ అడుగుపెట్టాడు. మిస్టర్‌ మిశ్రా అని అతడి భుజంపై చేయి వేశాడు. ఉలిక్కిపడి తేరుకున్న కిరణ్‌ మిశ్రా చీఫ్‌ను చూస్తూ విష్‌ చేశాడు.

అతడిని చూస్తూ ఏదో జరిగిందని ఇట్టే గ్రహించాడు అగర్వాల్‌. ‘ఏం జరిగింది?’ అడుగుతూ అక్కడున్న కుర్చీని చూపిస్తూ తాను కూడా మరొక కుర్చీలో కూర్చున్నాడు చీఫ్‌ అగర్వాల్‌.

‘సర్‌.. నేను ఆ ఉగ్రవాద ముఠా జాడ కనిపెట్టి వారిని బంధించాలని చూశాను. కానీ వారి ప్రాణాలు బలి తీసుకొనక తప్పలేదు’ అంటూ ఆగిపోయాడు. అది వింటున్న సీబీఐ చీఫ్‌.. ‘అదంతా మన వృత్తిలో భాగమే కదా! అయినా మీకు షూట్‌ ఎట్‌ సైట్‌ ఆర్డర్స్‌ ఇచ్చారు’ అంటున్న చీఫ్‌ మాటలకూ అడ్డు పడుతూ ..‘సర్‌ ఆ ముఠాలో ఇద్దరు చాలా తెలివిగా తప్పించుకున్నారు. వారి నుండి  ప్రమాదం పొంచి ఉంది’ అని ఆందోళనగా చెప్తున్న కిరణ్‌ మిశ్రాను చూస్తూ ఆలోచనలో మునిగిపోయాడు రాజీవ్‌ అగర్వాల్‌.

కొద్దిసేపటి తర్వాత ‘మీ ఇంటి వద్ద సెక్యూరిటీని మఫ్టీలో ఉండేటట్టు ఏర్పాటు చేస్తాను. ఇంకా మీ అమ్మాయి వెళ్లే స్కూల్‌ వద్ద కూడా కట్టుదిట్టమైన భద్రతను పెంచుతాను’ అని అక్కడున్న బజర్‌ మోగించాడు.

సరిగ్గా అదే సమయంలో..
శిఖర్‌ స్కూల్‌.. సాయంత్రం స్కూల్‌ బెల్‌ మోగింది. పిల్లలందరితో పాటు దక్ష బయటకు వచ్చింది. ఇంతలో ఒక చెట్టు పక్క ఒక వ్యక్తి.. ఆ వ్యక్తి చేతిలో పట్టుకున్న బొమ్మలు దక్షను ఆకర్షించాయి. దక్ష తన వద్ద ఉన్న వంద రూపాయలను ఇచ్చి ఆ బొమ్మను తీసుకుంది.
∙∙∙
ఇంటికి వెళ్లిన దక్ష.. తాను తెచ్చుకున్న బొమ్మను బయటకు తీయకుండా తన స్కూల్‌ బాగ్‌లోనే దాచి పెట్టింది. దక్షకు తాను తెచ్చుకున్న బొమ్మతో ఆడుకోవాలని చాలా ఆతృతగా ఉంది.

ఇంతలో కిరణ్‌ మిశ్రా లోపలికి అడుగు పెట్టాడు. తండ్రితో అన్ని విషయాలు చెప్పుకుంటూ ఉండిపోయిన దక్షకు ఉన్నట్టుండి తాను కొనుక్కున్న బొమ్మ గుర్తొచ్చింది. బొమ్మను తీసుకొచ్చి చూపిస్తూ ‘నాన్నా ఈ బొమ్మ చూడు.. దీని కళ్ళు ఎంత బాగా ఆర్పుతుందో చూడు’ అంటూ ఆ బొమ్మను తండ్రి చేతిలో పెట్టింది దక్ష.

బొమ్మను అటు ఇటు తిప్పి చూస్తూ ఏదో అడగబోతున్న కిరణ్‌ మిశ్రాకు బయట నుండి ‘సర్‌’ అన్న పిలుపు వినిపించింది. బయట సీబీఐ చీఫ్‌ పంపించిన సెక్యూరిటీ వచ్చి ఉన్నారు. వారితో మాట్లాడుతూ ఉండిపోయాడు మిశ్రా. బొమ్మ సంగతి మరిచిపోయాడు.
∙∙∙ 
తర్వాత మిశ్రాకు ఒక కేసు పని మీద వేరే ఊరు వెళ్ళవలసి వచ్చింది. ఎయిర్‌ పోర్ట్‌ చేరుకున్న మిశ్రాకు తాను వెళ్లబోయే విమానం రెండుగంటలు  ఆలస్యం అని తెలిసింది. టైమ్‌ చూసి ఇంకా దాదాపు గంటన్నర సమయం ఉందనుకుంటూ లాప్‌టాప్‌లో ఏదో పని చేసుకోసాగాడు మిశ్రా. అనుకోకుండా లాప్‌టాప్‌లో మరొక సైట్‌ ఓపెన్‌ అయ్యింది. ఆ సైట్‌లో ఒక బొమ్మ కనిపించింది.

ఆ బొమ్మ గురించిన సమాచారం చూస్తున్న  మిశ్రాకు ఒక్కసారిగా ఏదో గుర్తొచ్చి ఒళ్ళు జలదరించింది. ‘అచ్చం అలాంటి బొమ్మని  కూతురు దక్ష వద్ద చూశాడు!’ అది గుర్తు రాగానే కంగారుగా పైకి లేచాడు. తానిప్పుడు వెళ్ళాల్సింది విమానంలోకి కాదు. వెంటనే ఇంటికి వెళ్ళాలి.

ఇంటికి.. ఇంటి దగ్గర ఉన్న సెక్యూరిటీకి ఫోన్‌ చేశాడు. కానీ ఏ ఒక్కరి ఫోన్‌ కూడా పని చెయ్యడం లేదు. వెంటనే ఏదో జరిగిందని మిశ్రాకు రూఢి అయ్యింది. అతని మెదడు శరవేగంగా ఆలోచించసాగింది. వెంటనే సీబీఐ ఆఫీస్‌కు ఫోన్‌ చేశాడు. వారితో.. ‘మీరు వెంటనే వెళ్లి మా ఇంటిని చుట్టుముట్టండి. క్విక్‌.. తొందరగా.. ఏ మాత్రం సమయం లేదు’ చెప్పుకుపోతున్నాడు మిశ్రా.

కేవలం పది నిమిషాల్లో  సీబీఐ కమాండోలు మిశ్రా ఇంటి వద్దకు చేరుకున్నారు.అక్కడ.. సెక్యూరిటీ వాళ్ళు పడిపోయి ఉన్నారు. మిశ్రా ఇంటి తలుపులు వారగా వేసి ఉన్నాయి. లోపలకు వెళ్ళడానికి తుపాకులు ఎక్కుపెట్టి మెల్లిగా తలుపులను తోశారు. లోపల ఏదో పొగ లాంటిది కమ్ముకుని ఉంది. కమాండోలు ఆ పొగ తమను కమ్ముకోకుండా ప్రయత్నాలు చేస్తూ లోపలికి అడుగుపెట్టారు.

ఇంతలో వారికి ఎదురుగా ఇద్దరు ముసుగులు ధరించిన వ్యక్తులు శ్రుతిని, దక్షను తీసుకుని బయటకు వస్తున్నారు. వారిద్దరూ అప్పటికే స్పృహ తప్పి ఉన్నారు. వారిని చూసిన కమాండోలు వారిపై తుపాకీలు ఎక్కుపెట్టారు. కానీ ఆ ముసుగు వ్యక్తులు ఒకరు శ్రుతిని .. మరొకరు ఆమె కూతురు దక్షను అడ్డం పెట్టుకుని వస్తున్నారు.

ఒకవేళ కమాండోలు వారిని షూట్‌ చేస్తే ఆ బుల్లెట్లు శ్రుతికో.. దక్షకో తప్పకుండా తగులుతాయి. కమాండోలు నిస్సహాయులై బయటకు నడిచారు. ముసుగు వ్యక్తులు బయటకు రాగానే ఆ ఇంటి ముందుకు ఒక వ్యాన్‌ వచ్చి ఆగింది. స్పృహ తప్పిన శ్రుతిని భుజాన వేసుకుని ఒక ముసుగు వ్యక్తి ... స్పృహలో లేని దక్షను ఎత్తుకున్న మరో ముసుగు వ్యక్తి ఆ వ్యాన్‌ ఎక్కబోయే ఆ సమయంలో ఆ ముసుగు వ్యక్తుల వెనుక.. తుపాకీ గుళ్ల వర్షం.

ఆ బుల్లెట్ల దెబ్బలకి అక్కడే కుప్పకూలిపోయారు ఆ ముసుగు వ్యక్తులు. ఇంతలో మరికొన్ని బుల్లెట్లు ఆ వ్యాన్‌ చక్రాల మీద దిగాయి. కింద పడిపోయిన శ్రుతిని, దక్షను కమాండోలు లేవదీయబోతూ .. ఆ బుల్లెట్లు ఎక్కడనుండి వచ్చాయా అని వెనుతిరిగి చూశారు.

అక్కడ.. సీబీఐ చీఫ్‌ రాజీవ్‌ అగర్వాల్‌. చీఫ్‌ను చూసిన కమండోలు సెల్యూట్‌ చేశారు. ఈ లోపు అక్కడికి చేరుకున్న మిశ్రా మెల్లిగా పైకి లేస్తున్న దక్షను.. శ్రుతిని చూసి ఊపిరి పీల్చుకున్నాడు. ‘‘సర్‌.. మీరిక్కడ’’.. అని అడగబోతున్న మిశ్రాను చూసిన చీఫ్‌ ‘‘నీ ఫోన్‌ వల్లే నేనిక్కడికి చేరుకున్నాను. కానీ మీ ఇంట్లో ఇలా జరుగుతుందని నీకెలా తెలుసు?’’ ప్రశ్నించాడు చీఫ్‌.

‘సర్‌ నేను ఎయిర్‌ పోర్ట్‌లో ఉన్నప్పుడు ఒక బొమ్మ చూశాను. అదే బొమ్మ నా కూతురు వద్ద ఉండటం నాకు గుర్తొచ్చింది. ఏదో జరగబోతుందని ఊహించాను. ఆ బొమ్మ పేరు...‘ మై ఫ్రెండ్‌ కేలా’. జర్మనీలో తయారైన ఈ బొమ్మలో అతి శక్తిమంతమైన బ్లూ టూత్‌ని అమర్చి ఆ బొమ్మ ఉన్న చుట్టుపక్కల మాట్లాడే మాటలు మొత్తం వింటారు. అంతే కాదు ఆ బొమ్మకు  సంబందించిన వెబ్‌సైట్‌లోకి యాక్సిస్‌ అయితే చాలు.. ఆ బొమ్మ ఎక్కడ ఉన్నది దాని ద్వారా జరిగే పనులన్నిటినీ తెలుసుకోవచ్చు. శత్రువులు ఇలా ఈ ‘మై ఫ్రెండ్‌ కేలా’ బొమ్మ ద్వారా నా కుటుంబాన్ని టార్గెట్‌ చేశారు’ అని వివరించాడు మిశ్రా.

అంతా వింటున్న దక్ష ఇంటిలోపలికి పరిగెత్తుకు వెళ్లి తన బ్యాగ్‌లో ఉన్న బొమ్మను తెచ్చి బయటకు విసిరేసింది. వెంటనే అక్కడున్న కమండోలు ఆ బొమ్మను స్వాధీనం చేసుకున్నారు. ‘వెల్‌ డన్‌ మిస్టర్‌ మిశ్రా’.. అంటూ సీబీఐ చీఫ్‌ మిశ్రా భుజం తట్టి అక్కడ నుండి ముందుకు కదిలాడు. ‘నాన్నా’ అంటూ వచ్చిన దక్షను ఎత్తుకుని తన భార్య శ్రుతి చేయి పట్టుకుని ఇంటి లోపలికి నడిచాడు కిరణ్‌ మిశ్రా.
                           
-శ్రీసుధామయి 
ఇది కూడా చదవండి: క్రైం స్టోరీ: బ్లాక్‌మెయిలర్‌.. చచ్చిపోయాడంటూ బెదిరించి డబ్బు గుంజి.. ఆఖరికి

మరిన్ని వార్తలు