Fathers Day: లవ్‌ యూ నాన్న..

20 Jun, 2021 08:39 IST|Sakshi

నాన్నా.. 
‘మీరు’ అనే పెద్దరికంతో దూరంగానే ఉండిపోయారు..
‘నువ్వు’ అనే ఆలింగనంతో దగ్గరవలేదు!
ఆ పిలుపు భయాన్ని పెంచింది తప్ప ప్రేమను చూపించలేకపోయింది!
అందుకే మీతో మాట్లాడాల్సిన ప్రతిసారీ అమ్మను మధ్యవర్తిగా పెట్టాల్సి వచ్చింది!
మీ చెప్పుల్లో కాళ్లు పెట్టి నడిచాం.. మీ కళ్లజోడును  తగిలించుకుని గంభీరాలు పోయాం
మీ చొక్కాలో చేతులు దూర్చి.. మీ స్వరాన్ని అనుకరించి సరదా పడ్డాం!
కానీ మీతో ఆడుకునే భాగ్యానికి నోచుకోలేకపోయాం!
మీ మీసాలెప్పుడూ  తెచ్చిపెట్టుకున్న కోపాన్ని ప్రదర్శించాయి.. వస్తున్న నవ్వును ఆపేశాయి
ఎందుకు నాన్నా?
ఎప్పుడూ భావోద్వేగాల ఫ్రూఫ్‌ జాకెట్‌లోనే కనిపించారు ?
బాధ్యతనే మోశారు... ఆత్మీయతను ఎందుకు దాచుకున్నారు!
మాకు గమనించే వయసొచ్చిందని బీరువా వెనకగూట్లో సిగరెట్లను దాచడం మానేశారు!
ఫ్రెండ్స్‌తో పార్టీలూ తగ్గించారు.. స్టయిల్‌గా ఉండే క్రాఫ్‌ను సాదాసీదాగా మార్చుకున్నారు!
పెరుగుతున్న ఖర్చులను భరించడానికి పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలూ మొదలుపెట్టారు!
అయినా హిట్లర్‌గానే మిగిలిపోయారు!  
లవ్‌ యూ నాన్నా.. హ్యాపీ ఫాదర్స్‌ డే నాన్నా!!

ఒక్కోసారి ఒక మాట చెప్పలేనిది .. అక్షరం చెపుతుంది.... జీవన ప్రయాణంలో జన్మనిచ్చినవాళ్లు .. దూరంగా ఉన్నా ఉత్తరాలు 
ఆ బంధాన్ని పట్టి ఉంచుతాయి.. 
బాధ్యతను గుర్తుచేస్తాయి..
స్వాతంత్య్రోద్యమమైనా, సార్వత్రిక ఎన్నికలైనా, కూతురి పెళ్లి అయినా.. 
గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసుకున్న రోజైనా.. 
గెలుపు, ఓటముల ప్రసక్తి అయినా.. 
ఆశనిరాశల ఆరాటమైనా.. 
ఏ సందర్భం అయినా తమ పితృ  వాత్సల్యాన్ని భట్వాడా చేశారు కొందరు తండ్రులు.  
ఆ అక్షరాల్లోని వాళ్ల మనసు.. 
పెంపకంలో వాళ్లు వదిలిన జాడలు 
ఈ ఫాదర్స్‌డే సందర్భంగా...

టు ఇందిరా  
ఫ్రమ్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ (అలహాబాద్‌ నైని సెంట్రల్‌ జైల్‌ నుంచి)
సందర్భం:    ఇందిర 13వ పుట్టిన రోజు

 
డియర్‌ ఇందిరా.. 
ఏది సరైంది.. ఏది కాదు, ఏం చేయాలి.. ఏం చేయకూడదు అనేవి ఉపన్యాసాలతో తెలుసుకోలేం. చర్చించడం ద్వారా తెలుసుకుంటాం.  నీతో నేనెప్పుడూ  చర్చించడాన్నే ఇష్టపడ్తాను. ఇప్పటికే మనం చాలా అంశాలను  చర్చించుకున్నాం. కానీ ఈ ప్రపంచం చాలా విశాలమైంది. ఎప్పటికప్పుడు కొత్త విషయాలను నేర్పిస్తూనే ఉంటుంది. అన్నీ తెలుసనే భావనను దరిచేరనీయకు. నిరంతరం నేర్చుకుంటూనే ఉండాలి. జీవితంతో పాటు అది కొనసాగాలి.  సూర్యుడితో స్నేహం చేద్దాం. అంటే ఎప్పుడూ మెలకువగా ఉందాం. డబ్బు ఎప్పుడూ మంచిది కాదు. అది  వస్తువులను పొందడానికి మాత్రమే  సహాయపడుతుంది. నువ్వెలా ఉండాలంటే ఈ దేశ సేవలో ఒక యోధురాలిలా! 
- మీ నాన్న జవహర్‌లాల్‌ నెహ్రూ

టు అక్షిత
ఫ్రమ్‌ నారాయణమూర్తి (ఇన్ఫోసిస్‌)
సందర్భం: పెళ్లై అక్షిత అత్తగారింటికి వెళ్లే ముందు...


డియర్‌  అక్షితా
మీరు పుట్టినప్పటి నుంచి  ప్రతి అడుగూ  జాగ్రత్తగా వేయడం మెదలుపెట్టా.  ఫలానా టైమ్‌లో నాన్న తప్పు చేశాడని మీకు అనిపించే పరిస్థితి రాకూడదని.  ఆర్థికంగా కాస్త వెసులుబాటు కలగగానే  మిమ్మల్ని కారులో స్కూల్‌కు పంపే విషయమై మీ అమ్మతో మాట్లాడిన సందర్భం నాకింకా గుర్తు. కానీ మీ అమ్మ సమ్మతించలేదు. ఎప్పటిలాగే మిమ్మల్ని ఆటోరిక్షాలోనే పంపాలని పట్టుబట్టింది. దాని వల్ల మీ ఫ్రెండ్స్‌తో మీకున్న స్నేహం స్థిరపడింది. చిన్న చిన్న ఆనందాలు జీవితాన్ని ఎంత ఉత్తేజపరుస్తాయో తెలుసుకున్నారు. అన్నిటికన్నా సింప్లిసిటీలో ఉన్న గొప్పదనాన్ని అర్థంచేసుకున్నారు. సంతోషంగా ఉండడానికి డబ్బు వెచ్చించాల్సిన అవసరం లేదనీ గ్రహించారు. బయట చాలా మంది అడుగుతుంటారు నన్ను ‘మీ పిల్లలకు మీరు నేర్పిన విలువల గురించి చెప్పండ’ని. ఆ క్రెడిట్‌  మీ అమ్మకే ఇస్తాను. నేను సాధారణమైన తండ్రిని. ఎంత నార్మల్‌ అంటే.. నీ జీవిత భాగస్వామిని ఎంచుకున్న విషయాన్ని నువ్వు నాతో చెప్పినప్పుడు అసూయపడేంత. నా కూతురి ప్రేమను పరాయి వ్యక్తెవరో పంచుకోబోతున్నాడనే నిజం మింగుడుపడనంత. కానీ రిషీని కలిశాక ఆ అభిప్రాయాలన్నీ పటాపంచలైపోయాయి. రిషీ తెలివి, నిజాయితీ నిన్ను ఇంప్రెస్‌ చేసినట్టుగానే నన్నూ ఇంప్రెస్‌ చేశాయి. నీ నిర్ణయం పట్ల గర్వపడ్డాను కూడా. కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టావ్‌. మా నుంచి పొందినదాని కన్నా మరింతి గొప్ప స్థితిలోకి వెళ్లాలి. జీవితంలో సంయమనం చాలా ముఖ్యమని మరిచిపోవద్దు.  జాగ్రత్త తల్లీ
- మీ అప్పా

టు మాలియా, సాషా.. 
ఫ్రమ్‌ బరాక్‌ ఒబామా
సందర్భం: అమెరికాకు 44వ అధ్యక్షుడిగా ఎన్నికైనప్పుడు.   


డియర్‌ మాలియా, సాషా.. 
ఈ రెండేళ్లు  నా ప్రచార కార్యక్రమాల్లో పడి  మిమ్మల్ని ఎంత మిస్‌ అయ్యానో నాకే తెలుసు. ఈ రోజు మీతో కొన్ని విషయాలు షేర్‌ చేసుకోవాలనుకుంటున్నాను. మీరు నా జీవితంలోకి రాకముందు నాకు నేనే లోకం. నేను కోరుకున్నది పొందడమే లక్ష్యం. ఎప్పుడైతే మీరు వచ్చారో అప్పటి నుంచి నా జీవనగమనం మారిపోయింది. మీతోడిదే నా లోకమైంది. మీ నవ్వులు, కేరింతలు, అల్లర్లతో మనసు నిండిపోని రోజు లేదు. నాకు నేను ముఖ్యమనే ఆలోచనే పోయింది. నాకోసం నేను పెట్టుకున్న ఆశయాలు  మీముందు చిన్నవయ్యాయి. మీ కళ్లల్లో కనపడే ఆంనదాన్ని మించిన గొప్ప లక్ష్యం లేదనిపించసాగింది. మిమ్మల్ని సంతోషంగా ఉంచే బాధ్యతను మించిన పరమార్థం లేదు నా జీవితానికనిపించింది. మీకే కాదు ఈ దేశంలోని పిల్లలందరికీ సంతోషంగా బతికే హక్కు ఉంది. మీతోపాటు వాళ్లంతా  ఆ హక్కును పొందేలా చూడ్డానికే అధ్యక్ష్య పదవికి పోటీ చేశా. వైట్‌హౌజ్‌లోని కొత్తజీవితానికి సహనం, సంయమనాన్ని ఫ్రెండ్స్‌గా తోడు తెచ్చుకుంటారని భావిస్తున్నా. 
విత్‌ లవ్‌ .. 
- యువర్స్‌ డాడ్‌ బరాక్‌ ఒబామా

టు మేఘన ఫ్రమ్‌ గుల్జార్‌
సందర్భం: మేఘన గ్రాడ్యుయేషన్‌ పూర్తయినప్పుడు

 
మేఘనా.. నీ చదువు పూర్తయ్యింది. అవకాశాల ప్రపంచంలోకి అడుగుపెట్టబోతున్నావు. నీ ఆసక్తిని బట్టే అవకాశాన్ని ఎంచుకో. దానివల్ల నిన్ను నువ్వు తెలుసుకునే ప్రయత్నమూ మొదలవుతుంది. మనల్ని మనం తెలుసుకోలేని జీవన ప్రయాణం వ్యర్థం. నీకు ఆ శక్తి ఉంది. నువ్వు అనుకున్నది సాధించగల సమర్థురాలివనీ తెలుసు. డిగ్రీతో అకడమిక్‌ క్వాలిఫికేషన్‌ తెచ్చుకున్నావు. ఇంకొంచెం ఎఫర్ట్‌తో జీవన పాఠాలన్నీ ఆకళింపు చేసుకో. సరైన నిర్ణయం తీసుకో. ఆల్‌ ది బెస్ట్‌ బేటా..!
- తుమ్హారే పాపా

టు దీపిక పడుకోణ్‌ ఫ్రమ్‌ ప్రకాశ్‌ పడుకోణ్‌ 
మై డియర్‌ దీపిక... 


జీవితంలో ప్రతిసారీ గెలవలేం. కావల్సినవన్నీ మన దారికి రావు. మనం కోరుకున్నట్టుగా పరిస్థితులు ఉండవు. మారవు. కొన్ని గెలవాలంటే కొన్ని కోల్పోవాలి. జీవితంలో కొన్ని సార్లు తగ్గడమే నెగ్గడం. అది నేర్చుకో. అయితే పూర్తిగా వదిలేయకూడదు. నా కెరీర్‌ అంతా కూడా నేను చేసింది అదే. మొదటి ఆట నుంచి రిటైర్‌మెంట్‌ వరకు ప్రయత్నాన్ని వీడలేదు. ఎంతటి క్లిష్ట సమయాల్లోనైనా సరే వల్లకాదు వదిలేయాలన్న ఆలోచనకు తావివ్వలేదు. నా శక్తిపైనే దృష్టిపెట్టాను. నీ నుంచీ అదే కోరుకుంటున్నా బేటా! గెలవడమంటే నిలబడడమే!
- విత్‌ లాట్స్‌ ఆఫ్‌ లవ్, డాడీ

టు సర్వజిత్, అచిన్త్య .. ఫ్రమ్‌ వివిఎస్‌ లక్ష్మణ్‌ 


సర్వజిత్, అచిన్త్య..  తాత్వికంగా చెప్పడం కాదు కానీ ఊహించని వాటిలోనే జీవన సౌందర్యం దాగుంది. అందుకు ఉదాహరణ నా జీవితమే. ఎప్పటికప్పుడు భిన్నమైన అంచనాలతోనే సాగింది నా జీవితం. ఆస్వాదించే స్వభావం అలవడింది. దేన్నయినా ఎదుర్కొనే సమర్థత వచ్చింది. అదృష్టవశాత్తు అత్యున్నత స్థాయిలో క్రికెట్‌ ఆడే అవకాశం దక్కింది. ఈ దేశం తరపున ప్రాతినిథ్యం వహించే చాన్స్‌ దొరికింది. ఈ ఆట నాకు చాలా విషయాలు నేర్పింది. క్రమశిక్షణ, లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం, దాని ప్రాముఖ్యత, కృషి విలువను అనుభవంలోకి తెచ్చింది. ముఖ్యంగా గెలుపు, ఓటములను ఎలా బ్యాలెన్స్‌ చేసుకోవాలో తెలుసుకున్నాను. అవి నాణానికి రెండు వైపులు అని అర్థంచేసుకున్నాను. మీరూ వీటిని దృష్టిలో పెట్టుకొని మీ జీవితానికి బలమైన పునాది వేసుకోవాలి.
- ఇట్లు ,మీ నాన్న 

మరిన్ని వార్తలు