Story: ఆమె జ్యోతి.. తన ‘కథ’ తెలుసుకున్న రాణి తిరిగి వస్తుందా?

30 Aug, 2022 14:55 IST|Sakshi

ప్రసాదమూర్తి 

‘మేడంగారూ ఇవాళ మీ కథ చెప్తానన్నారు కదా?’
మేడంగారి పేరు జ్యోతిర్మయి. అందరూ జ్యోతిమేడం అంటారు. కథ అడిగినావిడ పేరు రాణి. ఇలా రాణి అడిగినప్పుడు అప్పుడే బెంగాల్‌ కాటన్‌ కనకాంబరం రంగు చీర కుచ్చిళ్ళు సవరిస్తూ గదిలో నుంచి వచ్చింది జ్యోతి. 
‘మీరు చీర కట్టుకుంటే మేడంగారూ రెప్పేయబుద్ధి కాదంటే నమ్మండి.’ రాణి మాటకి జ్యోతి మేడం ముసి ముసిగా నవ్వుకుంది.

‘ఎంతైనా  అందంలో మనోళ్ళని మించినాళ్ళు వుండర్లెండి.’ 
ఈ మాట అన్న రాణి వైపు కోపంగా చూసింది జ్యోతి. ఆమె ఒక రెసిడెన్షియల్‌ స్కూల్లో పాతికేళ్ళుగా తెలుగు టీచర్‌గా పనిచేస్తోంది. భర్త జర్నలిస్టు.  ఇద్దరిదీ ప్రేమ వివాహం. నలభై ఏళ్ళకే మోకాళ్ళ నొప్పులు. ఇప్పుడు ఏభైలో పడింది టీచర్‌. ఇంటి పనీ, బయటి పనీ ఆమె వల్ల కావడం లేదు. అందుకే రాణిని వంటకోసం పెట్టుకున్నారు. రాణి

వయసూ టీచరమ్మ వయసూ ఇంచుమించూ ఒకటే అవ్వడం వల్ల ఆమెను రాణిగారూ అంటుంది ఈ టీచర్‌ గారు. 
రాణి పదోతరగతి దాకా చదువుకుంది. భర్త తాగుబోతు. కొడుకు ప్రయోజకుడై, పెద్ద  ఉద్యోగం చేస్తున్నాడు. తల్లి విషయంలో కంటే వాడి ప్రయోజకత్వం పెళ్ళానికే ఎక్కువ పనిచేసినట్టుంది. అంత బతుకూ బతికి వంట పనిచేసుకుని పొట్ట పోసుకోవలసి వస్తోంది రాణికి.

పాపం అందుకే  జ్యోతికి రాణి అంటే సానుభూతి. ఎంతైనా స్త్రీ హృదయం కదా. కానీ రాణి దగ్గర నచ్చని విషయం ఏంటంటే మాటి మాటికీ మనాళ్ళూ మనాళ్ళూ అంటూ సాగదీస్తుంది. జ్యోతి ఒడ్డూ పొడుగూ పొందిక అన్నీ చూసి టీచరమ్మ తమ కులమే అని నిర్ధారించేసుకుంది.

పనిలో చేరిన రెండో రోజునే ‘మేం ఫలానా అండి టీచర్‌ గారూ’ అంటూ గొప్పగా తమ ఇంటి పేరు చెప్పింది. మరి మీరో అన్నట్టుగా ఉంది ఆ మాట. మేం ‘బలపాల వారమండి రాణిగారూ’ అంది జ్యోతి . దీంతో టీచరమ్మ మా వాళ్ళమ్మాయే అని పూర్తి నమ్మకంతో అన్నీ ఓపెన్‌గా మాట్లాడేస్తుంది రాణి. 

‘మీరు బలపాలవారా మరి చెప్పేరు కదేమండి టీచర్‌గారూ. మన వాళ్ళలో బలపాల వారు చాలా బలిసిన వారే ఉన్నారుగా. అదీ సంగతి. మిమ్మల్ని చూసిన మొదటి రోజే అనుకున్నాను.’

ఈ మాటలకు  ఒళ్ళంతా  కంపరం పుట్టింది జ్యోతికి. కులంతో వచ్చిన అహంకారంతో మాట్లాడుతుందా, లేక అమాయకంగా మాట్లాడుతుందా అన్న తర్జనభర్జన చాలానే జరిగింది జ్యోతిలో. రాణి కుటుంబ నేపథ్యం, ఆమె పడిన అష్టకష్టాలు, బాధలు, ఆమె  మనస్తత్వం అన్నీ బాగా స్టడీ చేశాక, ‘పాపం పిచ్చిది ఏదో అలా వాగేస్తుంది అంతే’ అని నిర్ధారించుకుంది.

జీవితమంతా దేహానికి అంటుకున్న ముళ్ళను విదిల్చుకుంటూ మనిషితనంతో గుబాళించడమే తెలిసిన జ్యోతికి రాణి వాలకం పెద్ద బాధ కలిగించ లేదు.   
కానీ రాణికి తన కథ చెప్పి తీరాలన్న కోరిక జ్యోతి మనసులో ఒకానొక ఘడియలో చిన్నగా మొలకెత్తి రాను రాను అది వటవృక్షమై బయటపడాలని హడావుడి చేస్తోంది. అయితే అసలు విషయం తెలిస్తే రాణి ఎక్కడ పారిపోతుందో అని ఒక ఆందోళన.

కానీ ఆమెకు తన కథ చెప్తే గానీ తనలో ఏభై ఏళ్ళుగా పేరుకుని గడ్డకట్టి బండబారి కొండలా మారిన నిజం, ముక్క ముక్కలై కరిగి కరిగి నీరై ఆవిరయ్యే అవకాశం లేదని టీచరమ్మ ఆలోచన.  చెప్పాలంటే ఎలా చెప్పాలి? 

ఊహ తెలిసినప్పటి నుంచి తన మనసులోనే పడిన ఘర్షణ ఒకటే. అదే తన కులం పేరు. తల్లిదండ్రులు ఇద్దరూ టీచర్లు కావడం వల్ల సంఘంలో కొద్దో గొప్పో గౌరవం, మర్యాదా దొరికాయి. కానీ తన కులం పేరు చెప్తే ఆ గౌరవాలూ ఆ మర్యాదలూ ఎక్కడ పోతాయో అని జ్యోతి బడిలో దోస్తుల్ని ఎవరినీ చిన్నప్పుడు తమ వాడలోకి  రానిచ్చేది కాదు.

వస్తే వాడలో వాతావరణం చూసి తనతో స్నేహం చేయరేమో అని అనుమానం. కాలేజీ రోజుల్లో.. యూనివర్సిటీ రోజుల్లో.. ఉద్యోగం చేస్తున్న రోజుల్లో బతుకంతా ఇదే బరువు. ఒకటే మోత. ఎవరికీ తెలియని అనంత భారం. ఇలా ఏభయ్యేళ్ళ పాటు కులం అనేది ఆమెను లోపల్లోపల తగలబెడుతూ వచ్చింది. ఆ బూడిదలోంచి తాను తిరిగి పుడుతూ వచ్చింది  జ్యోతి. 

కానీ ఇంతకాలానికి తన కులం పేరు బ్రహ్మాండం బద్దలయ్యేట్లు చెప్పాలన్న కోరిక జ్యోతికి కలిగింది. ‘రాణిగారూ మీరు ఎవరి దగ్గర పనిచేస్తున్నారో తెలుసా’ అని అన్నప్పుడు రాణిగారి మొహంలో కులానికి ఎన్ని రంగులుంటాయో అన్ని రంగులూ చూడాలని టీచరమ్మ ఉబలాటం.

జ్యోతి స్కూలుకి వెళ్ళి సెలవు పెట్టి వచ్చింది. కేవలం తన కథ రాణిగారికి చెప్పాలనే. రాణిగారు కూడా కుతూహలంతో ఎదురు చూస్తోంది. జ్యోతి తీరుబడిగా కుర్చీలో కూర్చుంది. రాణి కింద ప్లాస్టిక్‌ పీట మీద కూర్చుని కూరగాయలు తరుగుతోంది. అలా చూసినప్పుడు భూమి పైకి లేచినట్టు, ఆకాశం కిందకి కూలినట్టు అనిపిస్తుంది జ్యోతికి.

యుగాలుగా కింద కూర్చున్న జాతి పైకి, పైన కూర్చున్న జాతి కిందకీ తల్లకిందులైనట్టు అనిపించినప్పుడు జ్యోతిర్మయిలో యుగాలుగా మండుతున్న కసి ఏదో కొంచెం కొంచెం చల్లారుతున్న భావన గొప్ప ఉపశాంతినిచ్చింది.

ఈ దృశ్యాన్ని ఏ చిత్రకారుడైనా చిత్రించాలని, దాన్ని పట్టుకుని తన బాల్యపు గతం నుంచి తిరిగి ప్రయాణం మొదలు పెట్టి వర్తమానం దాకా ఊరేగాలని ఆమెకు అప్పుడప్పుడూ అసాధ్యమైన ఊహలు కూడా కలుగుతాయి.

అంతలోనే జ్యోతిలోని బౌద్ధ భిక్షుకి నిద్ర లేస్తుంది. ‘పాపం రాణి ఒక చిన్న పిల్లలాంటిది’ అంటూ.  ‘కరుణామయులైన వారు తమను మాత్రమే గాక, ఇతరులనూ విముక్తి చేయాలని కోరుకుంటారు.’ బుద్ధుని బోధనల్లో చాలా విలువైన ఈ పంక్తులను తాను మాటి మాటికీ స్మరించుకుంటుంది.

అందుకే తనను దహించే అగ్నిని తానే చల్లార్చుకుని రాణిని ఎప్పటిలా ప్రేమిస్తుంది. చిన్న పిల్లల మీద ఎవరైనా కసి తీర్చుకోవాలనుకుంటారా? ఇదీ జ్యోతి అంతరంగం. 

‘రాణిగారూ మీకు కులం గురించి ఏం తెలుసు?’
అమాయకంగా మొహం పెట్టిన రాణి వైపు చూసి జ్యోతి నవ్వుకుంది. మీకొక కథ చెప్పనా అని సమాధానం రాకుండానే చెప్పింది. ‘ గౌతముడు తన దగ్గరకు వచ్చిన సునీత అనే అంటరాని కులస్తుడిని  తన సంఘంలో చేర్చుకున్నాడు. అతని వృత్తి వీధులు ఊడ్వడం. నువ్వు మా సంఘంలో ఏం చేస్తావు అని ఒక సాటి భిక్షువు అతడ్ని అడిగాడట.

అప్పుడు సునీత అనే అతను ఏం చెప్పాడో తెలుసా? ‘ నేను ఇన్నాళ్ళూ వీధులు ఊడ్చాను. ఇప్పుడు మనుషుల మనో వీధులు శుభ్రం చేస్తాను’ అన్నాడట. ఎంత బాగా చెప్పాడో కదా?’ అంటూ రాణి మొహంలోకి చూసింది జ్యోతి. రాణి..  పాఠం అర్థం కాని పిల్లలా మొహం పెట్టింది.

అప్పుడు మళ్ళీ ఇలా  అంది..  ‘రాణిగారూ కులానికి ఏ విలువా లేదు. వ్యక్తి చేసే పనికే విలువ వుంటుంది. ఒకసారి అశోకుడితో ఆయన మంత్రి.. ప్రభూ మీరు అన్ని రకాల కులాలకు చెందిన భిక్షువులకు సాష్టాంగపడి, పాదాభివందనం చేయడం సబబుగా లేదు అన్నాడు. దానికి అశోక చక్రవర్తి ఏమన్నాడో తెలుసా రాణిగారూ?’

‘ ఏమన్నారండీ?’
‘ఉచితంగా ఇచ్చినా ఎవ్వరూ ఆశించని విలువ లేని వస్తువు ఈ నా శిరస్సు. దీనిని ఓ పవిత్రకార్యానికి వినియోగించే అవకాశమే నేను భిక్షువులకు చేసే పాదాభివందనం అని అశోకుడు బదులిచ్చాడు. ఎంత గొప్ప మాట ఇది రాణిగారూ! అర్థమైందా?’

‘ఏమోనమ్మా. అన్నట్టు అశోకుడు మన వాడేనంటగా ఎవరో అంటే విన్నాను.’  
ఈ మాటతో తల పట్టుకుంది టీచరమ్మ. ఈమెకు ఎలా వివరించి చెప్పాలబ్బా అని తనలో తనే తెగ ఘర్షణ పడింది. ఒక మనిషి గొప్పతనం పుట్టుకతో రాదని, రంగుతో రాదని, కులంతో రాదని, అతని ఆచరణతోనే వస్తుందని తాను చదివిన బౌద్ధ బోధనల్లోని సారాన్ని కథలు కథలుగా చెప్పాలని ప్రయత్నించింది. కానీ ఆమెకు ఎక్కడా ఎక్కలేదు. ‘మేడంగారూ మీ ఊరి కథ చెప్పండి బాబూ ఇవన్నీ నాకెందుకు’ అనేసింది.

‘ సరే చెప్తాను వినండి. మా ఊరి కథలోనే నా కథ కూడా వుందన్నాను కదా. అర్థం చేసుకోండి మరి. అసలు నిజానికి నూజివీడు అనేది ముందు నువ్వు చేల వీడు. ఒకసారి ఉయ్యూరు నుంచి దొరగారు వచ్చి ఆ నువ్వు చేల వనాన్ని చూశాడట. అక్కడ తోడేలు, మేకపోతూ భయంకరంగా కొట్లాడుకోవడం చూసి ఆశ్చర్యపోయాడట.

ఇదేదో పౌరుషం గల నేలలా వుందే అనుకుని అక్కడ కోట కట్టించుకున్నాడట. ఆయనతో పాటు మరి కొందరు దొరలు కూడా వచ్చారు. అది క్రమంగా నువ్వుచేలవీడు, నూజేలవీడు అయ్యి.. చివరికి నూజివీడు అయ్యింది.’

‘భలే కథండి టీచర్‌గారూ, ఇంతకీ మీ కథేంటో మరి..!’
‘అక్కడికే వస్తున్నాను మరి. దొరలకు సేవకులు కూడా అవసరమే కదా.. బలాపాముల అనే ఊరి నుంచి ఇద్దరు బలమైన పొడవైన వ్యక్తుల్ని తమ కోటకు తెచ్చుకున్నారట. ఆ ఇద్దరు వ్యక్తుల సంతాన వారసత్వమే మేము.’

‘అదేంటండీ మనోళ్ళు దొరలకు సేవ చేయడానికి వచ్చారా? అబ్బే నాకేం నచ్చలేదు ఈ కథ.’ తరుగుతున్న కూరగాయల్ని పక్కనే పెట్టి రాణి, గోడకి చేరబడి రెండు మోకాళ్ళూ మునగదీసుకుని రెండు చేతులతో వాటిని పట్టుకుని ‘సరే చెప్పండి తర్వాతేమైందో ’ అన్నది.

‘ఆగండి రాణి గారూ. అప్పుడే కంగారెందుకు? మీరు కంగారు పడాల్సిన విషయాలు చాలా వున్నాయి’ అంటూ తిరిగి కథ అందుకుంది. ‘మా తాతలు ఇద్దరు ఎంత పొడగరులంటే తాటి చెట్లను రెండు చేతులతో పట్టుకుని ఈడ్చుకుంటూ వెళ్ళిపోగలరు’ జ్యోతి మాటలకి నోరు వెళ్ళబెట్టింది రాణి.

‘చెట్లనే కాదండీ, పశువుల కళేబరాలను కూడా ఒంటిచేత్తో ఈడ్చి పారేసేవారు.’
ఈ మాట విన్నది విన్నట్టే రాణి, గోడకు అతుక్కుపోయి నోరు తెరిచింది. వెంటనే తేరుకోని ‘అదేంటి మేడంగారూ కళేబరాలేంటి? మనోళ్ళకి అదేం ఖర్మ?’ అంది
 ‘అవును అది మా తాతల వృత్తి మరి.’

ఆ మాటతో గోడకు జారబడ్డ రాణి ఎవరో మంత్రించినట్టు ఉన్నట్టుండి శిలావిగ్రహంలా మారిపోయింది. ఏదో అనాలని నోరు తెరవబోయింది.
జ్యోతి, ‘ఆగు. ఏం  మాట్లాడకు. చెప్పేది విను’  అని హూంకరించింది. ఎప్పుడూ రాణిగారూ అనే మేడం ఒక్కసారిగా ఏకవచన సంబోధన చేసిన విషయం కూడా గమనించలేదు రాణి.

జ్యోతి చెప్పుకుంటూ వెళ్లింది.. ‘అవును మా ముత్తాతలు ఆ పనే చేసేవారు. ఒకరు పెద రామయ్య, ఒకరు చినరామయ్య. దొరల సంతానం కోటలో పెరిగింది. మా తాతల సంతానం పేటలో పెరిగింది. గొడ్ల కోతలో, చెప్పుల చేతలో  వారిని కొట్టే వారు రాజమహేంద్రం దాకా విస్తరించిన నూజివీడు జమీనులో ఒక్కడూ లేడంట. అంత గొప్పోళ్ళు మా తాతలు. జాగ్రత్తగా విను’ ఇక గారు అనడం మర్చిపోయింది జ్యోతి. ‘ వింటున్నావా..?’

‘ ఆ.. ఆ.. ’ అని తడబడుతూ తలూపింది రాణి.
‘మా తాతల కళా నైపుణ్యం గురించి చాలా చెప్పాలి. గొడ్లను కోసి వాటి చర్మాలను ఇంటికి తెచ్చినప్పుడు ఏదో రాజ్యాన్ని జయించి భుజం మీద ఆ రాజ్యాన్ని మోసుకు వస్తున్నంత గర్వంగా కనపడేవారట అందరికీ.  ఆ తర్వాత చాలా కాలం ఆ వృత్తి మా వాళ్ళు చేశారు. మా మేనమామ, ఆయన పిల్లలూ  ఆ పని చేయడం నేను దగ్గరగా చూశాను.

నాకు ఆ పనులన్నీ చూడ్డం ఇష్టమే కాని, వాటిని నా స్నేహితులు చూడ్డం ఇష్టం ఉండేది కాదు. అందుకే ఎవరినీ రానిచ్చే దాన్ని కాదు మా ఇంటికి. చర్మాన్ని నేల మీద పరచి కత్తితో గీరి, ఉప్పు రాసి సున్నం నీటిలో తంగేడు చెక్క, కరక్కాయలు వేసి మూడు నాలుగు రోజులు నానబెట్టేవారు. అబ్బా ఆ కంపు భరించలేక చచ్చేవాళ్ళం’ఇలా అని రాణి వంక కసిగా చూసింది జ్యోతి. 

వాసనేదో వస్తున్నట్టే అనిపించినా ముక్కు మూసుకోవాలన్న స్పృహ కూడా లేకుండా అలాగే కూర్చుని వింటోంది రాణి. జ్యోతిని చూడ్డానికి భయం కూడా వేస్తోంది ఆ సమయంలో. 
‘నానబెట్టిన చర్మాన్ని తీసి, వెంట్రుకలన్నీ గీకి, దాన్ని నేల మీద గట్టిగా లాగి నాలుగు వైపులా మేకులు కొట్టి ఎండబెట్టేవారు. అప్పుడు వాళ్ళు ఆకాశాన్ని నేల మీద పరిచినంత సంబరపడిపోయేవారు. ఎండిన చర్మాన్ని గంజి రాసి రోల్‌ చేసి మడత పెట్టి, కొన్ని రోజుల తర్వాత ఆ చర్మాన్ని అనేకానేక రూపాల్లో కత్తిరించి చెప్పులు తయారు చేసేవారు.

దొరల పాదాల కింద తరించడానికి తమ జీవితాలనే కత్తిరించుకున్నంత సంతృప్తి పడేవారు. ఇప్పుడు అర్థమైందా మా ఊరి కథ.. నా కథ..? అర్థమైందా నేనెవరో?’ గద్దించినట్టు జ్యోతి అనేటప్పటికి ఉలిక్కిపడింది రాణి. రాతి బొమ్మలో చలనం వచ్చినట్లయింది. జ్యోతి కూడా ఉన్నట్టుండి ఉలిక్కిపడింది. తానెక్కడికో వెళ్ళిపోయింది.

స్పృహలోకి వచ్చినట్టు ఒకసారి కలయజూసింది. రాణిగారూ రాణిగారూ అని కలవరించినట్టు అరిచింది సన్నగా. మేడంగారూ మేడంగారూ అని రాణి కూడా కలవరించింది. జ్యోతికి అంతలోనే రాణి మీద జాలి, కరుణ ప్రేమ తన్నుకొచ్చాయి. 

‘సారీ అండీ రాణిగారూ. నాలో ఎవరో పూనినట్టున్నారు. నా గురించి నేను మనసారా చెప్పుకోవాలన్న జీవితకాలపు కోరికలో నన్ను నేనే మరిచిపోయి చాలా వికృతమైన ఆనందాన్ని పొందాను. సారీ. ఏమీ అనుకోకండి.’ 

‘అయ్యో.. అంత మాటెందుకు మేడంగారూ. నా పిచ్చి మాటలతో వెన్నపూసలాంటి మిమ్మల్ని ఎంత కోతపెట్టానో పిచ్చి ముండని. పిచ్చి  ముండని’ అనుకుంటూ తనలో తనే ఏదో గొణుక్కుంటూ వంట ఏదో అయ్యిందనిపించి త్వరగా వెళ్ళిపోయింది రాణి. ఉదయమే వచ్చింది. వస్తూ వెంట ఎవరినో తీసుకొచ్చింది. ‘ మీకు వంటకి ఇబ్బంది కలక్కూడదని ఈమెను తీసుకు వచ్చా మేడంగారూ.

నేను కాశీకి పోతున్నాను. గంగలో మునిగితేనే గానీ నా పాపానికి విరుగుడు లేదు. పాపిష్టి దాన్ని మీ మనసెంత నొప్పించానో. నా కడుపుకింత కూడు పెట్టిన మిమ్మల్ని కులం కులం అని ఎంత క్షోభ పెట్టానో. వస్తానమ్మా.. బతికి బాగుంటే మళ్ళీ మీ దగ్గరకే వస్తాను టీచర్‌గారూ.

మీరు క్షమిస్తారు. మీ మనసు నాకు తెలుసు. ఆ గంగమ్మ క్షమిస్తుందో లేదో..’ కథలూ సీరియల్సూ చదివే అలవాటున్న రాణి తనకు తెలిసిన భాషలో ఏదో అనేసి  విసురుగా వెళ్ళిపోయింది. జ్యోతినుంచి సమాధానం కూడా వినలేదు. 

జరిగిందంతా రాత్రికి సహచరుడు సురేష్‌కి చెప్పి కొంత ఉపశమనం పొందింది జ్యోతి. రాణి మనసు గాయపరచానేమో అని దిగులుపడిపోతోంది. 
‘జీవితమంతా ఒక కొండను లోపల మోసుకుంటూ తిరిగావన్న మాట. నాక్కూడా ఎప్పుడూ చెప్పనే లేదు. పోన్లే ఇప్పటికైనా బరువు దించుకున్నావు. ఆమె గురించి ఆలోచించకు.

తానేదో పాపం చేసిందని, ఆ  పాపం కడుక్కోవడానికి కాశీకి వెళ్ళిందని ఆమె చెప్తే నువ్వు నమ్ముతున్నావు. కానీ ఆమె నీ దగ్గర పనిచేసి పాపపంకిలమైనందుకు ప్రాయశ్చిత్తం చేసుకోడానికి వెళ్లిందని నేను అనుకుంటున్నాను. వదిలేయ్‌. పడుకో. ఇన్నేళ్ళూ నువ్వు కోల్పోయిన నిద్రను ఈ రాత్రికి సంపూర్ణంగా ఆస్వాదించు’ అని కళ్ళు మూసుకున్నాడు సురేష్‌. 

జ్యోతికేవేవో జ్ఞాపకాలు గుండెల్లో సుడులు తిరిగాయి. తనకు ప్రమేయం లేని తన పుట్టుక తన బతుకంతా ఒక కొండలా కాళ్ళకి ఎలా చుట్టుకుందో, ఎవరికీ కనపడని ఆ బరువును ఈడ్చుకుంటూ ఎలా నడిచిందో.. తలుచుకుంటూనే భయపడిపోయింది. ఎన్నో ఘటనలు.. ఎంతో కన్నీరు.

ఒంటె తన అవసరానికి మంచి నీళ్లను దేహంలో దాచుకుంటుందట. జ్యోతి కన్నీళ్ళు దేహంలో దాచుకునే విద్యను  చిన్నప్పుడే అభ్యసించింది. ‘ఏమో ఆమె తిరిగి వస్తుందనే నా నమ్మకం’ జ్యోతి తనలో తాను అనుకుంటూనే పైకి అనేసింది.

‘అది నీ పిచ్చి నమ్మకం జ్యోతీ..’
‘కొన్నిసార్లు సిద్ధాంతంతో కూడిన సందేహం కంటే ప్రేమతో కూడిన నమ్మకమే గెలుస్తుంది సురేష్‌!’

‘నేను మాత్రం రాణి తిరిగి వస్తుందంటే ససేమిరా నమ్మను. ఆమె కులం ఆమెను రానివ్వదు’అన్నాడు.
‘ఏమో సురేష్‌ , ఆమె వస్తుందనుకుంటే నా మనసుకు రిలీఫ్‌గా వుంది.’ 

‘చూద్దాం అంటే చూద్దాం’  అని ఇద్దరూ చెరో వైపూ తిరిగి కళ్ళు మూసుకున్నారు. జ్యోతి కన్నుల మీద రాత్రంతా గంగానది ప్రశాంతంగా ప్రవహిస్తూనే వుంది. ఆ అలల మీద ఒకే ప్రశ్న తేలియాడుతోంది.
‘ఇంతకీ ఆమె వస్తుందా..?’  

చదవండి: కథ: కొత్త బట్టలు.. మా యమ్మ ఫోన్‌ సేసి అడిగినప్పుడ్నుంచి ఏడుచ్చా పనుకున్యా!

మరిన్ని వార్తలు