కడలిలో కచ్ఛప నగరం

14 Feb, 2023 21:50 IST|Sakshi

సౌదీ అరేబియా కడలిలో నగర నిర్మాణాన్ని తలపెట్టింది. తాబేలు ఆకారంలోని భారీ ఓడను నిర్మించి, దానిని తేలియాడే నగరంగా తీర్చిదిద్దేందుకు సన్నాహాలు మొదలుపెట్టింది. ఈ తేలియాడే నగరానికి ‘పాంజీయోస్‌’ అని పేరు పెట్టింది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో తలపెట్టిన ఈ నౌకానగర నిర్మాణానికి సౌదీ ప్రభుత్వం 8 బిలియన్‌ డాలర్లు (రూ.65,388 కోట్లు) ఖర్చు చేస్తోంది.

దీని నిర్మాణం పూర్తయితే, ఇందులో అరవైవేల మంది నివాసం ఉండటానికి వీలు ఉంటుంది. ఇందులోని శరీర భాగంలో అరవై నాలుగు అపార్ట్‌మెంట్లు ఉంటాయి. రెక్కల భాగంలో లగ్జరీ విల్లాలు, పర్యాటకుల కోసం హోటళ్లు ఉంటాయి. దీని వెడల్పు 610 మీటర్లు, పొడవు 550 మీటర్లు. ఇటాలియన్‌ స్టూడియో ‘లజారినీ’కి చెందిన ఆర్కిటెక్ట్‌లు, డిజైన్‌ ఇంజనీర్లు ఈ భారీ నిర్మాణానికి రూపకల్పన చేశారు.

దీనిపైన హెలికాప్టర్లు ల్యాండ్‌ కావడానికి కూడా ప్రత్యేకమైన చోటు ఉండటం విశేషం. ఇది సముద్రంలో గంటకు ఐదు నాటికల్‌ మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంది. పర్యాటకుల సౌకర్యం కోసం ఇతర ఓడలు, పడవలు దీని ఒడ్డున నిలపడానికి కూడా వెసులుబాటు ఉండేలా దీన్ని తీర్చిదిద్దుతున్నారు.ఈ ఏడాది ప్రారంభిస్తున్న దీని నిర్మాణం పూర్తి కావడానికి ఎనిమిదేళ్లు పడుతుందని ‘లజారినీ’ ప్రతినిధులు చెబుతున్నారు. 

మరిన్ని వార్తలు