Smart Necklace: నెక్లెస్‌ ఉంటే ఆరోగ్యం పదిలం...

7 Aug, 2022 12:56 IST|Sakshi

నెక్లెస్‌కు, ఆరోగ్యానికి సంబంధమేంటి? ఇదేదో బోడితలకు మోకాలికి ముడిపెట్టే వ్యవహారంలా ఉందనుకుంటు న్నారా? మీరు తప్పులో కాలేశారన్న మాటే! ఇక్కడ చెప్పుకుంటున్నది సాదాసీదా నెక్లెస్‌ల గురించి కాదు. అలాగని కళ్లు మిరుమిట్లుగొలిపించే రవ్వల నెక్లెస్‌ కూడా కాదు. చూడటానికి సాదాసీదాగానే కనిపిస్తుంది గాని, ఇది స్మార్ట్‌ నెక్లెస్‌. దీన్ని మెడలో వేసుకుంటే చాలు, అనుక్షణం మీ ఆరోగ్యాన్ని కనిపెడుతూనే ఉంటుంది. ఏమాత్రం తేడా వచ్చినా, వెంటనే అప్రమత్తం చేస్తుంది.

ఈ నెక్లెస్‌ వేసుకునేటప్పుడు, మెడవెనుక భాగంలో ఒక సెన్సర్‌ అమర్చి ఉంటుంది. ఈ సెన్సర్‌ చెమట ద్వారా ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు గ్రహిస్తూ ఉంటుంది. అమెరికాలోని ఒహాయో స్టేట్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ స్మార్ట్‌ నెక్లెస్‌ను రూపొందించారు. ఇప్పటికే దీనిని మనుషులపై ప్రయోగించి, అన్ని రకాల పరీక్షలూ చేశారు. సెన్సర్‌ అమర్చిన ఈ నెక్లెస్‌ చెమటలోని సోడియం, పొటాషియం, హైడ్రోజన్‌ అయాన్ల పరిమాణాన్ని 98.9 శాతం కచ్చితంగా గుర్తించగలుగుతోంది.

అలాగే చెమటలో గ్లూకోజ్‌ స్థాయిలో వచ్చే మార్పులను ఇది ఇట్టే గుర్తించగలుగుతోందని ఒహాయో వర్సిటీ పరిశోధన బృందానికి చెందిన ప్రొఫెసర్‌ జింఘువా లీ తెలిపారు. డయాబెటిస్‌ రోగులకు ఇది అద్భుతంగా పనిచేస్తుందని, దీని ద్వారా ఒంట్లోని చక్కెర స్థాయిలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, తగిన జాగ్రత్తలు తీసుకోవడానికి వీలవుతుందని వివరించారు.

మరిన్ని వార్తలు