Group of Seven: జి ఫర్‌ గ్రేట్‌

7 May, 2021 01:37 IST|Sakshi

బాలికలకు విద్య

మహిళలకు ఉపాధి

జి సెవన్‌ అంటే ‘గ్రేట్‌’ సెవన్‌ అనుకుంటాం. కాదు! ‘గ్రూప్‌’ సెవన్‌. అయితే లండన్‌ జి7 ఆర్థిక మంత్రుల సమావేశంలో జరిగిన తాజా నిర్ణయం గురించి వింటే ఈ దేశాలను గ్రూప్‌ సెవన్‌ కాదు, గ్రేట్‌ సెవన్‌ అనడమే కరెక్ట్‌ అనిపిస్తుంది.

బాలికలు, మహిళల మీదే కోవిడ్‌ ప్రభావం ఎక్కువగా ఉందని ఏడాదిన్నరగా సర్వేలు చెబుతూ వస్తున్నాయి. సర్వేల వరకు వెళ్లక్కర్లేదు. మన చుట్టూ చూస్తేనే తెలిసిపోతుంది. ఇళ్లలో మహిళలకు పని భారం ఎక్కువైంది. ఉద్యోగాలు చేస్తున్న మహిళలు కంపెనీలకు భారమయ్యారు! బాలికల పరిస్థితి కూడా ఇంతే. బడి గంటలు పోయి, ఇంట్లో పని గంటలు వచ్చేశాయి. ఇక గృహహింస, మహిళల అనారోగ్యాలపై కుటుంబ సభ్యుల అలక్ష్యం, నిరాదరణ ఎప్పుడూ ఉన్నవే. ఇప్పుడు మరింత ఎక్కువయ్యాయి. మొదట ఈ పరిస్థితులను చక్కబరిస్తే గానీ కరోనా పర్యవసానాలను నివారించలేమని జి7 దేశాల గుర్తించాయి. బాలికలు, మహిళల చదువు, సంక్షేమాల కోసం నిధులను, విధులను భుజానికెత్తుకున్నాయి.

ఏటా జి7 దేశాధ్యక్షుల సదస్సు జరగడానికి ముందు జి7 ఆర్థిక మంత్రుల సమావేశం జరుగుతుంది. కష్టకాలంలో కలిసికట్టుగా ఉండటానికి, అభివృద్ధి చెందే దశలో ఉన్న దేశాలను గట్టెక్కించడానికి ఒక జట్టుగా ఏర్పడిన ఏడు పారిశ్రామిక, ధనిక దేశాల బృందమే జి సెవన్‌. అమెరికా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, యు.కె., జపాన్‌. వీటితో పాటు ఐరోపా సమాఖ్య ఉంటుంది. జి సెవన్‌ అంటే ‘గ్రేట్‌’ సెవన్‌ అనుకుంటాం. కాదు! ‘గ్రూప్‌’ సెవన్‌. అయితే  లండన్‌లో జి7 ఆర్థిక మంత్రుల సమావేశంలో తాజాగా జరిగిన నిర్ణయం గురించి వింటే ఈ దేశాలను గ్రూప్‌ సెవన్‌ కాదు, గ్రేట్‌ సెవన్‌ అనడమే కరెక్ట్‌ అనిపిస్తుంది. వచ్చే రెండేళ్లలో బాలికల చదువు, మహిళల ఉద్యోగాల కోసం.. అభివృద్ధి చెందుతున్న దేశాలకు సుమారు లక్షా పది వేల కోట్ల రూపాయలను సహాయంగా అందివ్వాలని ఏడు దేశాల ఆర్థిక మంత్రులు తీర్మానించారు. వారి సహాయం పొందే దేశాలలో భారత్‌ కూడా ఉంది.
∙∙
నలభై ఐదేళ్లుగా ఏటా జి7 సదస్సులు జరుగుతున్నాయి. ఏ సదస్సులోనూ ఇంత భారీ ఎత్తున బాలికలు, మహిళల కోసం నిధుల కేటాయింపు లేదు! పైగా ఇది విరాళం వంటి సహాయం. ఈ ఏడు సభ్యదేశాలే తమ కోశాగారం లోంచి తీసి ఇవ్వవలసి ఉంటుంది. అందుకు జి7లోని ఏ దేశమూ కాదనడం ఉండదు కానీ, ప్రపంచంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆరోగ్యం మీద, వాక్సిన్‌లు ఆక్సిజన్‌ల మీద కదా ధార్మిక దృష్టి ఉండవలసింది! ఆ మాట వాస్తవమే కానీ, ఈ ఆపత్సమయంలో మిగతా కూటములలోని భాగస్వాములుగా జి సెవన్‌ దేశాలు తాము అందిస్తున్న సహాయ సహకారాలతో పాటు.. జి7 గ్రూపుగా ప్రస్తుత పరిస్థితుల్లో బాలికల చదువును, మహిళల ఉద్యోగాలను ప్రాధాన్యతా అంశాలుగా గుర్తించాయి! జూన్‌లో జరిగే జి 7 దేశాధ్యక్షుల సదస్సులో ఇప్పుడీ జీ7 ఆర్థిక మంత్రుల నిర్ణయానికి ఆమోదముద్ర పడిన అనంతరం నిధులు పంపిణీకి ప్రణాళిక సిద్ధం అవుతుంది.

విషయం ఏంటంటే.. ఇది ఒకరు అడిగితే చేస్తున్న సహాయం కాదు. సహాయం చేయవలసిన అవసరాన్ని గుర్తించి అందిస్తున్న స్నేహ హస్తం. ఆడపిల్లలకు ఆరేళ్ల వయసు నుంచి పన్నెండేళ్ల పాటు నాణ్యమైన విద్యను అందించడం, మహిళలకు ఉద్యోగాలతో పాటు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడం ఈ సహాయం ముఖ్యోద్దేశం. జి7 దేశాల్లోని డి.ఎఫ్‌.ఐ.లు (డెవలప్‌మెంట్‌ ఫైనాన్స్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌) ఈ నిధుల్ని సమీకరించి, ఆర్థికమంత్రిత్వ శాఖలకు సమకూరుస్తాయి. జి7 తాజా సమావేశం మరొక లక్ష్యాన్ని కూడా నిర్దేశించుకుంది. 2026 నాటికి అల్ప, దిగువ మధ్య తరగతి ఆదాయాలున్న దేశాలలో 4 కోట్ల మంది బాలికలను పాఠశాలల్లో చేర్పించాలి. అలాగే 2 కోట్ల మంది బాలికల్ని వారి పదో ఏట కల్లా చదవడం వచ్చిన వారిలా తీర్చిదిద్దాలి. ఈ రెండు లక్ష్యాలపై కూడా జి సెవన్‌ మంత్రులు సంతకాలు చేశారు.
∙∙
లండన్‌లో ‘ఫారిన్, కామన్వెల్త్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీస్‌’ (ఎఫ్‌.సి.డి.వో.) అని విదేశీ ఆర్థిక వ్యవహారాల కార్యాలయం ఒకటి ఉంది. జి7 దేశాల ఆర్థిక మంత్రుల సమన్వయంతో అది పని చేస్తుంది. డబ్బును తెలివిగా ఇన్వెస్ట్‌ చేసే విషయాన్ని ఎఫ్‌.సి.డి.వో.నే అడగాలి ఏ దేశమైనా! బాలికల చదువు మీద పెట్టుబడి పెట్టడం వివేకవంతమైన పని అంటుంది ఎఫ్‌.సి.డి.వో.!

‘‘దేశంలో పేదరికాన్ని నిర్మూలించేందుకు, దేశ ఆర్థికాభివృద్ధికి వివిధ మార్గాలలో పెట్టుబడులు పెడుతుంటాం. అవి ఎంతవరకు ఫలిస్తాయో, ఎప్పటికి ఫలవంతం అవుతాయో కచ్చితంగా చెప్పలేం. కానీ బాలికల చదువు కోసం ఒక దేశం పెట్టే పెట్టుబడి మాత్రం నమ్మకంగా ఆ దేశంలోని పేదరికాన్ని రూపుమాపుతుంది. ఆ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుంది’’ అని ఎఫ్‌.సి.డి.వో. జి7 మంత్రుల తీర్మానానికి మద్దతు పలికింది. ‘నువ్వొక బాలుడిని చదివిస్తే అది అతడికే ఉపయోగం. ఒక బాలికను చదివిస్తే మొత్తం దేశానికే ప్రయోజనం’ అని జేమ్స్‌ ఎమ్మెన్‌ అన్న మాటను గుర్తుకు తెచ్చేలా ఈసారి జి7 మంత్రుల నిర్ణయాలు ఉన్నాయి. సోమవారం ప్రారంభమైన ఈ సమావేశాలు ‘గర్ల్స్‌ ఎడ్యుకేషన్‌ పొలిటికల్‌ డిక్లరేషన్‌’పై ఏడు దేశాలూ సంతకాలు చేయడంతో బుధవారం ముగిశాయి.

కరోనా చీకట్లలో కాంతి కిరణం: బాలికల చదువుకు, మహిళల ఉపాధికి జి7 దేశాల లక్షా పది వేల కోట్ల రూపాయల తీర్మానం

మరిన్ని వార్తలు