విటనటనలు

30 Nov, 2020 00:43 IST|Sakshi

కవిత 

ఊపిరి ఆగితేనే మరణం కాదు 
ఊహలుడిగినా నిర్జీవ దేహ శకలమే 
అనుభూతుల జలపాతాలు 
అహరహం నీలో ఉప్పొంగినపుడే 
నిరంతర ప్రవాహ చైతన్యానివి.

ఆకులు రాలితేనే గ్రీష్మం అనలేము 
ఆత్మీయ బంధాలు ఒక్కొక్కటిగా 
విరిగిన కొమ్మలై బ్రతుకు మాన్పడితే
జీవనం మోడు వారిన వనమే
చెలిమి పవనాలు వీస్తేనే 
జీవితం సతత హరితం.

కళ్లు లేకపోవడమే గుడ్డితనమా 
కఠిన వాస్తవాలను చూడలేని తనమూ 
అనంతానంత అంధత్వమే 
పొరలు పొరలుగా కమ్మిన మోహ తెరలను చీల్చే 
దార్శనికత నీ మనో నేత్రపు లోచూపు.

మాట్లాడకపోవడం మూగతనమని
ఎన్నాళ్లు బొంకుతావు?
మాట్లాడాల్సిన సమయంలో మనిషి మౌనం
మరణాసన్నపు రహస్య నిశ్శబ్దం 
భయ రహిత కంఠ స్వరమే 
నిస్వన ప్రభంజనం.

వినబడక పోవడం చెవుడే కావచ్చు 
వినీ విననట్లుండే 
విటనటనలనేమందాం?
వీనులు విలువల దోనులవుతేనే 
సత్యం సజీవ చిత్రమై నిలుస్తుంది. 

నటనకు నటనలు నేర్పే 
నంగనాచితనాల ఆటలో 
ముఖాలన్నీ ముసుగులు కప్పుకొని సంచరిస్తున్నాయి
ఆత్మలు అసహజ రూపాలై వెక్కిరిస్తున్నాయి.

సహజత్వానికి సమాధి కట్టుకొని
ఎన్నాళ్లు శవాల్లా కుళ్లిపోతారు ?
బిడ్డ మూతిపై చనుబాల పూలు పూసినంత 
నిర్మలంగా పరిమళించలేరా ? 
-గాజోజు నాగభూషణం 
 9885462052 

మరిన్ని వార్తలు