Ganesh Chaturthi 2022: వినాయకుడినే మొదట ఎందుకు పూజించాలి?

31 Aug, 2022 08:10 IST|Sakshi

ఏడాదిలో మహా ప్రధానమైన పర్వదినం గణేశ చతుర్థి. మహాగణపతి పార్వతీ తనయుడుగా ఆవిర్భవించిన రోజు. ఇంటిల్లిపాదీ, ఊరూ వాడా పూజించుకునే పర్వమిది. కొన్నిచోట్ల నవరాత్రులు చేసే సంప్రదాయం ఉంది. ఈ స్వామి ఆరాధన వల్ల అన్ని శుభాలు లభిస్తాయని ప్రతీతి. భక్తితో పూజిస్తే చాలు అపారమైన కృపావర్షం కురిపించే సులభ ప్రసన్నుడు విఘ్నరాజు గురించి కొన్ని విశేషాలు...
చదవండి: పచ్చగా నిను కొలిచేమయ్యా.. చల్లగా చూడు మా బొజ్జ గణపయ్యా.. 

వినాయకుడికి, విద్యకు సంబంధం ఏమిటి?
చదువంటే గణపతికి ఇష్టం. నారదుడు, బృహస్పతి ద్వారా కేవలం అరవై నాలుగు రోజుల్లో విద్యలు నేర్చిన ఘనుడు. ఆయన సామర్థ్యం గురించి ఓ చిన్న ఇతివృత్తం ఉంది. వేదవ్యాసుడు భారతం రాయాలనుకున్నప్పుడు వేగంగా రాసే లేఖకుడు ఉంటే బావుండునని అనుకున్నాడట. గణపతి దగ్గరకు వచ్చాడట. ‘లక్ష శ్లోకాలు చెబుతాను వేగంగా రాసిపెడతావా!’ అని అడిగాడట.‘అలాగే రాస్తాను కానీ, మీరు వెంట వెంటనే చెబుతుండాలి. చెప్పడం ఆపితే నేను మాయం అవుతా!’ అన్నాడట గణపతి. 

‘సరే! నేను చెప్పే శ్లోకాలను అర్థం చేసుకుని రాయగలిగితే నేనూ వేగంగా చెబుతా!’ అన్నాడట వ్యాసుడు. అలా సరస్వతి నది తీరాన మహాభారత రచన మొదలైంది. వ్యాసుడు ప్రతి వంద శ్లోకాల మధ్యలో అతి కఠినమైనవి చెబుతుండేవాడట. వినాయకుడు వాటిని అర్థం చేసుకుని రాసేలోపు మిగతా వంద గుర్తు తెచ్చుకునేవాడట. చివర్లో మరో పది శ్లోకాలు చెప్పాల్సి ఉండగా అనుకోకుండా వ్యాసుడి కవిత్వ ధార ఆగిపోయింది!

తన నిబంధన ప్రకారం వినాయకుడు మాయమయ్యాడు. తన రచన ఆ మేరకు అసంపూర్ణంగా మిగిలిపోయిందని విచారించాడట వ్యాసుడు. సరే  తానే రాస్తానని తాళపత్రాలు తీసి చూస్తే ఏముంది? ఆయన చెప్పాల్సిన పది శ్లోకాలు అక్కడే ఉన్నాయట. అంటే ఆ శ్లోకాలన్నీ విఘ్నాధిపతికి ముందే తెలిసుండాలి. అంటే వ్యాసుడు తన రచన ఎలా ముగిస్తాడో ముందుగానే వూహించాడు! వ్యాసుడు గణపతికి కృతజ్ఞతతో ‘నీ పుట్టినరోజున పుస్తకాలను ఉంచి పూజించే విద్యార్థులు సర్వశుభాలూ పొందుతారు. వారికి సకల విద్యలు అబ్బుతాయి’ అని ఆశీర్వదించాడట. నాటినుంచి వినాయక చవితినాడు చేసే పూజలో పిల్లలు తమ పుస్తకాలను, కలాలను ఉంచి, పుస్తకాలకు పసుపు కుంకుమలు అలంకరించి పూజించడం ఆచారంగా మారింది.  

క్షేమం, లాభం కూడా..
ఏ పూజ చేసినా, తొలుత గణపతిని ప్రార్థించిన తర్వాతనే తక్కిన వారిని ఆరాధించాలని, లేకపోతే ఆ పూజ నిష్ఫలమవుతుందని, అదే గణపతిని పూజించినట్లయితే సిద్ధి బుద్ధితోబాటు క్షేమం, లాభం కూడా కలుగుతాయని స్వయంగా పార్వతీ పరమేశ్వరులే చెప్పినట్లు పురాణాలు చెబుతున్నాయి. అందుకనే ఏ కార్యాన్ని ప్రారంభించడానికయినా ముందుగా గణపతిని పూజించి, ఆ తర్వాతనే ఆ పనిని మొదలు పెట్టడం ఆచారంగా వస్తోంది.

వీటిలోని ఆంతర్యం ఇదే!
వినాయకుని నక్షత్రం ‘హస్త’. ఈ నక్షత్రానికి అధిపతి చంద్రుడు. నవధాన్యాలలో చంద్రునికి బియ్యం. అందుకే బియ్యాన్ని భిన్నం చేసి, ఉండ్రాళ్లుగా తయారు చేసి చంద్ర నక్షత్రమైన హస్తా నక్షత్రంలో ఆవిర్భవించిన వినాయకునికి నివేదన చేస్తారు.

పత్రిపూజ: అదేవిధంగా వినాయకునిది కన్యారాశి. ఈ కన్యారాశికి అధిపతి బుధుడు. బుధునికి ఆకుపచ్చ రంగు ప్రీతికరమైనది. అందుకే వినాయక చవితి రోజున విఘ్నేశ్వరుని ఆకుపచ్చ రంగులో ఉన్న పత్రితో పూజ చేస్తారు.

మూషిక వాహనం: మూషికం అంటే ఎలుక వాసనామయ జంతువు. తినుబండారాల వాసనను బట్టి అది ఆ ప్రదేశానికి చేరుకుంటుంది. పంజరంలో చిక్కుకుంటుంది. ఆ విధంగానే మనిషి జన్మాంతర వాసనల వల్ల ఈ ప్రాకృతిక జీవితంలో చిక్కుకొని చెడు మార్గాలు పట్టినప్పుడు మూషిక వాహనుడుగా వాసనలను అనగా కోరికలను అణగద్రొక్కేవాడు – వినాయకుడు.
చదవండి: గణేశ్‌ చతుర్థి: కుడుము..ఆరోగ్యకరము  

మరిన్ని వార్తలు