వెంటాడే దృశ్యం

18 Sep, 2022 21:41 IST|Sakshi

హేమంతం! చుట్టూరా ఎత్తైన కొండలు.. మధ్యలో పచ్చటి లోయ.. ఆకు పచ్చటి కొండల మీద తెల్లటి మంచు దుప్పటి కప్పినట్లు ఆలోయ కనిపిస్తోంది.. నేను తెల్లవారి బయలుదేరి ఆ లోయకి చేరుకున్నాను. నాతోపాటు నా స్నేహితుడు జగదీష్‌ కూడా వచ్చాడు.ఇలా ఈ లోయకి రావడానికి కారణం.. వారం రోజుల క్రితం నేను ఏనిమల్‌ ప్లానెట్‌ చానెల్లో చూసిన ఓ గగుర్పాటు కలిగించిన దృశ్యం. అది ఇంకా నన్ను వెంటాడుతోంది.‘ఒక లోయలో ఓ గద్ద ఆకాశంలోంచి వాయువేగంతో ఎగురుతూ వచ్చి మేకపిల్లను ఎత్తుకు పోయే దశ్యం’ అది.

ఆ దృశ్యం చూసి స్థాణువయ్యాను... నమ్మలేకపోయాను. గద్దలు సాధారణంగా కోడిపిల్లలను, పాముల్ని నోటకరచుకొని పోవడం నేను చూశాను. కానీ దానికన్నా ఆకారంలో, బరువులో పెద్దదైన ఓ మేక పిల్లను గద్ద కాళ్ళతో ఎత్తుకుపోవడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. అప్పట్నుంచీ నాలో ఆందోళన మొదలైంది. ఆ దృశ్యాన్ని కెమెరాలో బంధించిన ఫొటోగ్రాఫర్‌ను మెచ్చుకోకుండా ఉండలేకపోయాను. ఆ మర్నాడు గ్రంథాలయానికి వెళ్ళి ఆ ఫొటోని తీసిన ఫొటోగ్రాఫర్‌ గురించి పేపర్లలో చదివాను. ఆ ఫొటోని ఏనిమల్‌ ప్లానెట్‌ చానెల్‌ కోసం ప్రపంచంలోని అతి గొప్ప ఫొటోగ్రాఫర్‌ స్టీవ్‌ మెకర్రీ తన డిజిటల్‌ కెమెరాతో తీశాడు. అందుకోసం అతను లోయలోకి వెళ్ళి చాలా పెద్ద సాహసమే చేశాడు.

ఆ ఫొటోని చూసిన తరువాత నాక్కూడా అటువంటి ఫొటోని నా కెమెరాలో బంధించాలన్న కోరిక కలిగింది. అందుకే ఈరోజు ఈ లోయకి వచ్చాం.  దేశంలోని అతి గొప్ప కెమేరా అయిన నికోన్‌ డిజిటల్‌ని నాతో తెచ్చాను. ఈ లోయకే ప్రత్యేకంగా రావడానికి ఓ ముఖ్యకారణం ఉంది. నా స్నేహితుడు జగదీష్‌ తండ్రి ప్రముఖ ఫొటోగ్రాఫర్‌... నేను చెప్పిన ఫొటో గురించి వినీ అతను ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని చెప్పాడు. ‘గద్ద మేకపిల్లని ఎత్తుకుపోతున్న దృశ్యాన్ని మెకర్రీ మనదేశంలో అందునా మన రాష్ట్రంలోని తూర్పు కనుమల్లో గాలికొండ లోయలో తీశాడనీ చెప్పడంతో ఆ లోయని చూడటానికి ఈ రోజు వచ్చాం.

సూర్యుడు తూర్పు దిక్కు నుదుటన సిందూర తిలకంలా మెరిసిపోతున్నాడు. రాను రాను నీహారికా బిందుసమూహాలు కరిగి లోయంతా హరిత వర్ణంగా పరావర్తనం చెందుతున్న దృశ్యం మనోహరంగా కనిపిస్తోంది. నేను, జగదీశ్‌ ఇద్దరం లోయలోకి దిగాం. చుట్టూ ఎల్తైన సిల్వర్‌ ఓక్‌ వృక్షాలు, వాటి మీద పక్షుల కిలకిలారావాలు సంగీతాన్ని ఆలపిస్తున్నాయి. ఎక్కడి నుంచో కోకిల కలకూజితం లోయలో ప్రతిధ్వనిస్తోంది. సూర్యుడు వెలుగు రేఖలు లోయలో పరుచుకుంటున్నాయి. ఆ సమయంలో నేనూ జగదీశ్‌ లోయలోకి దిగి ఓ చెట్టు కింద నిలబడ్డాం.

ఇప్పుడా లోయని చూస్తుంటే ఆ రోజు నేను చూసిన ఫొటో గుర్తుకు వచ్చింది. ఆకాశం నీలంగా స్వచ్ఛగా ఉంది. లోయలో తెల్లటి కొంగలు ఎగురుతూ మల్లెదండని గుర్తుకు తెస్తున్నాయి. ఇప్పుడు నా చూపులన్నీ ఆకాశం వైపు గద్దల కోసం ఆశగా చూస్తున్నాయి. జగదీశ్‌ కెమెరాని బయిటకు తీసి నాకు అందించాడు. ‘వంశీ! మొన్న నువ్వు చూపించిన గద్ద మేక పిల్లని ఎత్తుకుపోతున్న ఫొటో లాంటి వాటిని మన వాళ్ళు తీయ్యలేరా?’ అని అడిగాడు. ‘ఎందుకు తియ్యలేరు? మనదేశంలో కూడా అద్భుతమైన ఫొటోగ్రాఫర్లున్నారు! ఉదాహరణకు సుధీర్‌ శివరాం, రఘునా«థ్‌ చౌదరి లాంటి గొప్ప ఫొటోగ్రాఫర్లున్నారు! వాళ్ళు ఎన్నో అద్భుతమైన ఫొటోలు తీసి ఎన్నో అంతర్జాతీయి బహుమతులు గెల్చుకున్నారు’ అని చెప్పాను.

అప్పటికి సమయం 7 గంటలైంది. చలి కాస్త తగ్గుముఖం పట్టింది. జగదీశ్‌ ఫ్లాస్క్‌లో తెచ్చుకున్న టీని నాకిచ్చాడు. అది తాగిన తరువాత శరీరం కాస్త వేడెక్కి ఉత్సాహం వచ్చింది. సమయం గడిచిపోతున్నా ఆకాశంలో గద్దలు కనిపించటం లేదు. ఫొటోగ్రఫీలో ఈ సమస్యలు తప్పవు. మంచి ఫొటో కోసం నిరీక్షించక తప్పదు. ఒక మంచి అద్భుతమైన ఫొటో కోసం ఎంతో నిరీక్షణ అవసరం. రెండు గంటలు గడిచాయి. ఎండ తీక్షణ ఎక్కువైంది. నేను మాత్రం నిరాశ చెందకుండా ఆకాశం వైపు చూస్తునే ఉన్నాను.

సరిగ్గా తొమ్మిదిన్నర సమయానికి ఆకాశంలో ఒక అద్భుతం జరిగింది. ఒక విమానం చిన్నగా కదులుతూ వస్తోంది. నేను ఆశ్చర్యంతో దాని వైపే చూస్తున్నాను. క్రమక్రమంగా అది దగ్గర కాసాగింది. అదే విమానం అయితే లోయంతా దాని ‘ధ్వనితో ప్రతి ధ్వనించేది. కానీ ఏవిధమైనా శబ్దమూ వినిపించటం లేదు. రానురాను అది కిందకు దిగుతోంది. నాలో ఉత్కంఠ పెరిగింది. నేను జగదీశ్‌ వైపు తిరిగి దానివైపు చూపించాను. అతను కూడా ఉద్విగ్నతతో ఆకాశంలోకి చూడసాగాడు.

కొద్ది నిమిషాల తరువాత ఆ దిగుతున్న దేమిటో నాకు స్పష్టత వచ్చింది. అది విమానం అయితే కాదు. విమానం అలా ఓ లోయలో కిందకు దిగదు. అది ఎత్తులో సమాంతరంగా ప్రయాణిస్తుంది. కచ్చితంగా అది గద్దపక్షే అయి ఉంటుందనీ నా సిక్త్‌సెన్స్‌ చెప్పింది. ‘జగదీశ్‌! ఆ కిందకు దిగుతున్నదేమిటో పోల్చుకున్నావా?’ అది గద్ద. ఆ పక్షి తప్ప అంత ఎత్తున ఏ పక్షీ ఎగురలేదు’ అని వాడికి చెప్పి కెమెరాని మెడలో నుంచి తీశాను. అది హై మేగ్నిఫైడ్‌ లెన్స్‌ జపాన్‌ తయారీ కెమెరా. కిలోమీటరు దాకా జూవ్‌ు చేసి స్పష్టమైన ఫొటో తియ్యవచ్చు.

‘వంశీ! ఎంత గద్దపక్షి అయితే మాత్రం అంత ఎత్తు నుంచి కింద లోయలో ఏ జంతువుందో చూడగలదా? అసలే దాని కళ్ళు చిన్నవి’ అన్నాడు జగదీశ్‌. జగదీశ్‌ ప్రశ్నలు నాలో అసహనాన్ని కలిగించాయి. ‘గద్ద అంటే ఏమనుకున్నావ్‌? దాని చూపు చాలా తీక్షణమైనది. కిలో మీటరు ఎత్తు నుంచి అది భూమి మీద చిన్న కోడిపిల్లను కూడా స్పష్టంగా చూడగలదు. అంతటి మహత్తర చూపు గల కళ్ళు దానివి. దేవుడు దాని కళ్ళకు అంతటి తీ„è ణతని వరంగా ఇచ్చాడు. అందుకే ఎక్కడ నుంచి వస్తుందో తెలియకుండా వేగంగా వచ్చి కోళ్ళను, పాముల్ని నోట కరుచుకొని వెళ్ళిపోగలదు. దాని రెక్కల్ని టెలాన్స్‌ అంటారు. దాని రెక్కల్లో గొప్ప శక్తి ఉంటుంది. అందువల్ల వాయు వేగంతో కిందకు దిగి వాటిని నోట కరుచుకొని మళ్ళీ ఎగిరిపోగలదు’ అంటూ వాడికి చెప్పాను.

కొద్ది నిమిషాల తరువాత అది మాకు స్పష్టంగా కనిపించేటంతటి ఎత్తుకు దిగింది. ఇప్పుడది మాకు స్పష్టంగా కనిపిస్తోంది. నిశ్చయంగా అది గద్దపక్షే. అది లోయలోకి దిగుతుంటే మా ఇద్దరిలో చెప్పలేని ఉత్కంఠత. మేము లోయకి ఒక వైపున ఉండటం వల్ల లోయ పూర్తిగా కనిపించటం లేదు. రానురాను అది కిందకు దిగి పోతోంది... నేను కెమెరాని చేతిలోకి తీసుకొని ఫొటో కోసం ఎదురు చూస్తున్నాను. గద్దపక్షి లోయలోకి దిగుతోందంటే అది ఏ జంతువునో చూసి ఉంటుంది. అది జంతువో లేక కోడి పిల్లో కావచ్చు.

సమయం గడుస్తోంది. లోయంతా నిశ్శబ్దంగా ఉంది. గద్దపక్షి కిందకు దిగుతూ కనిపించకుండా పోయింది. కొద్దిసేపటి దాకా ఏ జరుగుతోందో తెలియటం లేదు. ఇంతలో ఎగురుతూ వస్తున్న గద్దపక్షి కనిపించింది. నా దగ్గర ఉన్న బైనాక్యులర్‌తో ఆ దృశ్యాన్ని చూశాను. మొదట్లో అస్పష్టంగా, కొన్ని క్షణాల తరువాత స్పష్టంగా కనిపిస్తోంది అది.
వాయువేగంతో ఎగురుతూ అది మావైపే వస్తోంది. దాని రెండు కాళ్ళ మధ్య గిలగిలా కొట్టుకుంటూ చిరుత పులి పిల్ల! ఆ దృశ్యాన్ని చూడగానే ఆశ్చర్యంతో పాటు అనుమానం కలిగింది నాకు! అంత పెద్ద చిరుత పిల్లను ఒక చిన్న గద్దపక్షి.. అంత ఎత్తుకి తీసికెళ్ళడమా? అది సాధ్యమా? అన్న సందేహం వచ్చింది.

వెంటనే ఆ దృశ్యాన్ని కెమెరాలో బంధించాలని కెమెరా తీశాను. రానురాను ఆ గద్దపక్షి మా వైపే వస్తూ ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. ఇంతలో గగుర్పాటు కలిగించే ఒక సంఘటన జరిగింది. గద్దపక్షి కాళ్ళ మధ్య కొట్టుకుంటున్న చిరుత పిల్ల తప్పించుకొని కిందకు జారిపోసాగింది. గద్దపక్షి కాళ్ళ పట్టు తప్పడం వల్ల అలా జరిగి ఉంటుంది.
గాల్లో ఎగురుతున్న ఆ పక్షి లోయలోకి జారిపోతున్న చిరుతపిల్ల. ఆ దృశ్యం కనిపిస్తోంది. అంతలోనే గద్దపక్షి తేరుకుంది. ఒక్కసారిగా రెక్కలను టపటపలాడిస్తూ కిందకు దిగడం మొదలు పెట్టింది. వెంటనే నేను కెమెరాని క్లిక్‌ మనిపించాను. ఒకటి కాదు.. రెండు కాదు.. పదిసార్లు క్లిక్‌ మనిపించాను. అలా నేననుకున్న ఫొటో తీయగలిగాను. 

వారం రోజుల తరువాత స్టూడియో నుంచి ప్రింట్లు వచ్చాయి. కేబినెట్‌ సైజులో ఆ ఫొటోలు అద్భుతంగా కనిపిస్తున్నాయి. గాల్లో ఎగురుతున్న గద్దపక్షి.. దాని కింద లోయలోకి జారిపోతున్న చిరుత పిల్ల. ‘సార్‌! ఎక్కడ తీశారు ఈ ఫొటోల్ని. అద్భుతంగా, గగుర్పాటు కలిగించేటట్లున్నాయి’ అన్నాడు ఆ ఫొటోలను తెచ్చిన స్టూడియో కుర్రాడు. అతనికి ఏం చెప్పాలో తెలియక ఓ నవ్వు నవ్వి ఊరుకున్నాను. వారం రోజుల తరువాత ఆ ఫొటోలు అన్ని దిన, వార, పత్రికల్లోనూ వచ్చాయి. వాటికి అద్భుతమైన రెస్పాన్స్‌ పాఠకుల నుంచి వచ్చింది.

ఆ రెస్పాన్స్‌ చూసి నాకు చాలా ఆనందం కలిగింది. ఈ ఫొటోతో నా చిరకాల వాంఛ తీరిందనిపించింది. అద్భుతమైన ఫొటోలను ఎక్కడ చూసినా నేనూ ఇలాంటి వాటిని తియ్యాలనీ కలలు కనేవాడిని. ఆ కల ఈ రూపంలో తీరింది. నెల రోజుల తరువాత ఢిల్లీలోని ‘బర్డ్స్‌ ఆఫ్‌ ఇండియా’ సంస్థ వారు ఒక పోటీని ప్రకటించి అద్భుతమైన నమ్మలేని ఫొటోలను పంపాలనీ కోరారు. ప్రథమ బహుమతి 10 లక్షలు. నేను ఆ పోటీకి నా ఫొటోని పంపాను. ఇంకా ఫలితాలు ప్రకటించలేదు. నెల రోజుల తరువాత ఓ అనుకోని సంఘటన జరిగింది.

ఒక రోజు నేను మా వూళ్ళోనే ఉంటున్న మా అక్కను చూద్దామని బయలుదేరాను. ఈ మధ్యన అక్కకు ఒంట్లో బాగుండటం లేదు. వీధికి కొద్ది దూరంలో అక్క రెండేళ్ళ కూతురు మృదుల ఇంటి ముందర ఆడుకుంటోంది. నేను నడక వేగం పెంచాను. ఇంతలో ఆకాశంలో ఏదో అలజడి. నా దృష్టి ఆకాశంవైపు మళ్ళింది. ఆకాశంలో ఒక పెద్ద గద్దపక్షి ఒకటి వాయువేగంతో కిందకు దిగుతోంది. ఆ వేగానికి గాల్లో శబ్దం కలుగుతోంది. నేను దాన్ని గమనిస్తూ నిలబడ్డాను. కొద్ది క్షణాల తరువాత అది మా అక్క కూతురు మృదుల వైపు దిగడం కనిపించింది.

నాకు వెంటనే నేను తీసిన ఫొటో ఆ ఘటన గుర్తుకు వచ్చింది. ఆ లోయలో చూసిన ఆ బీభత్స దృశ్యం నా కళ్ళ ముందు కదలాడి ఒక్కసారిగా పరుగు మొదలెట్టాను. రెండు క్షణాల్లో ఒక అద్భుతం జరిగింది. నేను అక్కడకు చేరి బృదులను ఎత్తుకొని ఇంట్లోకి పరిగెత్తడం, ఆ గద్దపక్షి  భూమి మీదకు దిగడం ఒకేసారి జరిగాయి. నేను మృదులను ఇంట్లోకి తీసికెళ్ళి తలుపేసి వీధిలోకి వచ్చాను. గద్దపక్షి నిరాశతో మళ్ళీ ఎగిరిపోతూ కనిపించింది. అది ఇప్పుడు గట్టిగా అరవడం వినిపించింది. నాకు ఆ దృశ్యం చాలా ఆనందం కలిగించింది.

నేనే గాని  ఆ లోయకి ఫొటో కోసం వెళ్ళకపోయి ఉంటే ఈ రోజు మృదుల ఆ గద్దపక్షికి  బలైపోయి ఉండేది. ఆ విషయం తలపునకు రాగానే నా ఒంట్లో వణుకు మొదలైంది. పెళ్ళైన పదేళ్ళకు పుట్టిన మృదులకు ఏం జరిగినా అక్క తట్టుకోలేదు. ఇంక నా ఫొటోకి పోటీలో బహుమతి రాకపోయినా నేను బాధపడను. కానీ మృదులను కాపడినందుకు నాకెంతో ఆనందంగా ఉంది. మృదులను కాపాడిన దృశ్యం పదేపదే నా కళ్ళముందు కదలాడసాగింది. -గన్నవరపు నరసింహమూర్తి

మరిన్ని వార్తలు