వెల్లుల్లి టవర్‌!

8 Sep, 2020 08:00 IST|Sakshi

ఒక ప్లాస్టిక్‌ బాటిల్‌కు నిలువెల్లా కంతలు పెట్టి ఎంచక్కా  వెల్లుల్లిపాయలను పెంచుకోవచ్చు. పుణేకు చెందిన అభిజిత్‌ టికేకర్‌ అనే ఇంటిపంటల సాగుదారు ఈ వెల్లుల్లి టవర్‌ అనుభవం గురించి వివరిస్తున్నారు. కంపెనీ సెక్రటరీగా పనిచేస్తున్న అభిజిత్‌ లాక్‌డౌన్‌ కాలంలో ఎండు ఆకులతో తన ఇంటిపైన ఎండాకులతో లీఫ్‌ కంపోస్టు తయారు చేసుకొని, కిచెన్‌ గార్డెనింగ్‌ ప్రారంభించారు. ప్లాస్టిక్‌ సీసాలో లీఫ్‌ కంపోస్ట్‌ లేదా మట్టి, కొబ్బరిపొట్టు, కంపోస్టు కలిపిన మిశ్రమాన్ని నింపుకోవాలి. చూపుడు వేలు పట్టే అంత చుట్టుకొలత ఉన్న ఇనుప చువ్వను తీసుకొని స్టౌ మంటలో పెట్టి బాగా వేడెక్కిన తర్వాత.. ప్లాస్టిక్‌ సీసాపైన చుట్టూతా బెజ్జాలు పెట్టుకోవాలి. ఒక్కో వరుసలో అంగుళం దూరంలో బెజ్జాలు పెట్టుకోవాలి. ఆ బెజ్జాల్లో వెల్లుల్లి రెబ్బలను నాటాలి. ముక్కు బయటకు ఉండేలా నాటాలి.

సీసాలోని మట్టి మిశ్రమంలో తేమ ఆరిపోకుండా చూసుకోవాలి. పై నుంచి తగుమాత్రంగా నీటిని అందిస్తూ ఉండాలి. కొన్ని రోజులకు వెల్లుల్లి రెబ్బలు వేరుపోసుకొని మొలకలు వస్తాయి. ఉల్లి పొరకల మాదిరిగా వెల్లుల్లి మొక్కలు వస్తాయి. వెల్లుల్లి పొరకలతో చట్నీ, గార్లిక్‌ బటర్‌ వంటి అనేక వంటకాలు చేసుకోవచ్చు. ఇలాంటి బాటిల్‌ టవర్‌కు తక్కువ బెజ్జాలు పెట్టుకుంటే.. వెల్లుల్లి పాయలను కూడా ఇలా పెంచుకోవచ్చు అంటున్నారు అభిజిత్‌. బ్రౌన్‌లీఫ్‌.ఆర్గ్‌ వెబ్‌సైట్‌ ద్వారా కంపోస్టింగ్‌తోపాటు ఇంటిపంటల సాగుపై మెలకువలు నేర్చుకున్నానన్నారు. తన 8 ఏళ్ల కుమార్తె కిచెన్‌ గార్డెనింగ్‌ ద్వారా ఎన్నెన్నో విషయాలు ఆసక్తికరంగా నేర్చుకుంటున్నదని ఆయన సంతోషపడుతున్నాడు. 

మరిన్ని వార్తలు