‘ఏ కలర్స్‌ అద్దమంటారు’ .. ఓ డిజైనర్‌ ప్రయాణం

3 Oct, 2021 03:18 IST|Sakshi

‘‘మేడమ్‌! మీ వీడియోలు చూశాం. పోయిన వారం హైదరాబాద్‌కి వచ్చాం, మిమ్మల్ని చూసిపోదామని...’’ అని ఏలూరు దగ్గర వేల్పుచర్ల అనే గ్రామం నుంచి ముగ్గురు మహిళలు వచ్చారు.

‘‘మేడమ్‌! మా అమ్మ ఇలా ఉంటారు’’ అని ఫోన్‌లో ఫొటో చూపిస్తూ ‘‘అమ్మకు ఏ కలర్‌ కాంబినేషన్‌లో చీరలు తీసుకోమంటారు’’ అని ఓ యువతి అడుగుతోంది.
ఇంతలో ఆమె భర్త వచ్చి ‘‘గాయత్రీ! వేర్‌హౌస్‌కి వెళ్తున్నాను’’ అని చెప్పి బయలుదేరారు.

షోరూమ్‌ వెనుకగా ఉన్న ప్రింటింగ్‌ యూనిట్‌లో ఒక వ్యక్తి ఒక చీరను తెచ్చి బోర్డరు చూపిస్తూ... ‘‘ఏ కలర్స్‌ అద్దమంటారు’’ అని అడిగి ఆమె ‘పింక్‌’ అని చెప్పగానే తలూపుతూ వెళ్లిపోయాడు.

‘‘మీ వీడియోలు రోజూ చూస్తుంటాం. అలవాటైపోయింది. మీరు మా ఇంట్లో ఒకరిలా అయిపోయారు’’ అంటూ ఆ మహిళలు గాయత్రితో మాటల్లో పడిపోయారు.

‘‘మమ్మీ! వీడియో అప్‌ లోడ్‌ చేశాను. అమ్మమ్మ క్యారియర్‌ పంపించింది. ఆఫీస్‌ రూమ్‌లో పెట్టాను’’ అని క్లుప్తంగా చెప్పి మరో ఫ్లోర్‌లోకి వెళ్లి పోయాడు ఓ కుర్రాడు.
ఇది... హైదరాబాద్, సైనిక్‌పురిలో ‘గాయత్రీరెడ్డి ట్రెడిషనల్‌ డిజైనర్‌ స్టూడియో’ నిర్వహిస్తున్న ఫ్యాషన్‌ డిజైనర్‌ గాయత్రి డైలీ రొటీన్‌. ఇది ఆమె తనకు తానుగా నిర్మించుకున్న సామ్రాజ్యం.

2008లో ఇంట్లో ఒక మూలగా ఒక టేబుల్‌తో మొదలైన తొలి అడుగు ఇప్పుడు పర్వత శిఖరానికి చేరువలో ఉంది. అన్నీ అమరిన దశ నుంచి జీవితం ఒక్కసారిగా పరీక్ష పెట్టింది. అంతా అగమ్యం. జీవితం తనను ఎటు తీసుకువెళ్తుందో తెలియని అస్పష్టమైన అయోమయమైన స్థితిలో వేసిన మొదటి అడుగు అది. గమ్యం కనిపించకపోయినా సరే... నీ ప్రయాణం ఆపవద్దు అనే ‘సంకల్పం’ మాత్రమే ఆమెకు తోడు.

నేను కూడా నీకు తోడుగా వస్తానని భర్త నైతిక మద్దతునిచ్చాడు. ‘కుటుంబాన్ని నడిపించాల్సిన నేను వ్యాపారంలో నష్టపోయాను. నా బాధ్యతను నీ భుజాలకెత్తుకున్నావు. ఈ టైమ్‌లో నేను చేయగలిగింది ఇంతవరకే’ అని మాత్రం చెప్పాడాయన. పదమూడేళ్ల కిందట అలా మొదలైన ఆమె ప్రయాణం ఇప్పుడు నెలకు వందమందికి పైగా ఉద్యోగులకు జీతాలిచ్చే స్థాయికి చేరింది. బంధువులను మొహమాట పెట్టి కస్టమర్‌లుగా మార్చుకోలేదామె. కస్టమర్లను ఆత్మీయ బంధువులుగా మార్చుకున్నారు.

మధ్యవర్తులెవరూ లేరు!
‘‘నా కస్టమర్‌కు నేను మంచి క్వాలిటీ ఇవ్వాలి. ధర అందుబాటులో ఉండాలి. అందుకోసం చేనేతకారులున్న ప్రతి గ్రామానికీ వెళ్లాను. ఐదేళ్ల పాటు నిరంతర ప్రయత్నం తర్వాత నేను వారి విశ్వాసం చూరగొనగలిగాను. అప్పటి వరకు చేనేతకారులు వాళ్ల వాళ్ల గ్రామాల్లో షావుకారు చేతిలో ఉండేవారు. షావుకారు నూలు కొనుగోలు కోసం డబ్బు పెట్టుబడి పెట్టి ఉంటాడు. కాబట్టి చేనేతకారులు నేసిన దుస్తులను షావుకారుకు తప్ప మరెవరికీ ఇవ్వడానికి వీల్లేదనే విరచిత రాజ్యాంగం ఒకటి అమలులో ఉండేది. బయటి వాళ్లు ఎవరైనా సరే ఆ షావుకారు దగ్గర కొనాల్సిందే.

ఏ వ్యాపారమైనా సరే... ఉత్పత్తిదారుడికీ– వినియోగదారుడికి మధ్య వారధిగా ఉండే వ్యక్తుల సంఖ్య పెరిగే కొద్దీ ధర కూడా పెరిగిపోతుంది. నేను ఐదేళ్లు కష్టపడి షావుకారు అనే ఒక మధ్య వ్యక్తిని తొలగించగలిగాను. అలాగే నాకు ఏ కౌంట్‌ నేత కావాలో, ఏయే కాంబినేషన్‌లలో కావాలో చేనేతకారులకు ముందుగానే చెప్తాను. ఇంత పోటీలో కూడా నన్ను మార్కెట్‌లో నిలబెట్టింది. సౌకర్యం విషయంలో ఫ్యాబ్రిక్‌ ధరించినప్పుడు ఒంటికి హాయిగా అనిపించాలి. మన్నిక విషయంలో పెట్టిన డబ్బు వృథా కాలేదని సంతృప్తి కలగాలి. ఇవే నేను నమ్మిన సూత్రాలు. అనుసరిస్తున్న నియమాలు.’’ అని చెప్పారు గాయత్రి.

పిల్లలకు కొంతే ఇవ్వాలి!
‘‘మరో రెండేళ్లకు యాభై ఏళ్లు నిండుతాయి. అప్పటికి షోరూమ్, వేర్‌ హౌస్, నగరంలో ఉన్న మూడు ప్రింటింగ్‌ యూనిట్‌లను ఒక చోటకు చేర్చాలి. ఇప్పటి వరకు దేశంలో అన్ని రకాల వస్త్రకారులను అనుసంధానం చేస్తూ నేను ఏర్పాటు చేసిన నెట్‌వర్క్‌ను నా ఉద్యోగులతో నడిపించాలని, ఇక నా పరుగులు ఆపేయాలనేది కోరిక. భగవంతుడి దయ వల్ల పోగొట్టుకున్న ఆస్తులకంటే ఎక్కువే సంపాదించుకున్నాం. పిల్లలను చదివించాం, జీవితాన్ని మొదలుపెట్టడానికి భరోసాగా కొన్ని ఆస్తులను మాత్రమే వాళ్లకు ఇస్తాం. వాళ్ల జీవితాన్ని వాళ్లే మొదలు పెట్టాలి. అలా చేయకపోతే డబ్బు మీద గౌరవం ఉండదు, జీవితం విలువ తెలియదు. ఇక సమాజానికి తిరిగి ఇవ్వడం మొదలు కావాల్సిన సమయం వచ్చింది. అది నా ఉద్యోగులతోనే మొదలవుతుంది’’ అని చెప్పేటప్పుడు గాయత్రీరెడ్డిలో జీవితం నేర్పిన పరిణతితోపాటు స్థితప్రజ్ఞత కనిపించింది.

అక్షరం నేర్పిన విలువలు
ఇల్లు దిద్దుకోవడం, చక్కగా వండి పెట్టుకోవడం, పిల్లల్ని జాగ్రత్తగా పెంచుకోవడం... ఇదే నా లోకంగా ఉండేది. ఆర్థిక సమస్యలే రాకపోయి ఉంటే నాలో ఇంత శక్తి ఉందని నాకు కూడా ఎప్పటికీ తెలిసేది కాదేమో. అయితే కంచి పరమాచార్య చెప్పినట్లు మనం దేనిని పైకి విసురుతామో అది మనకు అంతకంటే వేగంగా వచ్చి చేరుతుందని నమ్ముతాను. మా వారు మధ్యప్రదేశ్‌లో కాంట్రాక్టులు చేస్తున్నప్పుడు తప్పని సరై నేర్చుకున్న హిందీ ఇప్పుడు నార్త్‌ ఇండియా పర్చేజ్‌కి, అక్కడి నుంచి వచ్చిన పనివాళ్లతో మాట్లాడడానికి పనికొస్తోంది. బెంగళూరులో ఉన్నప్పుడు రోజంతా ఏమీ తోచడం లేదని నేర్చుకున్న ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సు ఈ రోజు నన్ను విజేతగా నిలబెట్టింది. అంతకంటే ముందు ఇంకో విషయం చెప్పాలి. పదో తరగతి వరకే చదివిన నేను మా ఇంటి దగ్గరున్న లైబ్రరీలో ఉన్న పుస్తకాల్లో చందమామ నుంచి ఆధ్యాత్మికం వరకు దాదాపుగా చదివేశాను. ఆ అక్షరజ్ఞానం నేర్పిన విలువలే నాకు యూనిట్‌ నిర్వహణలో ఉపయోగపడుతున్నాయి.

– గాయత్రీరెడ్డి, ఫ్యాషన్‌ డిజైనర్‌

– వాకా మంజులారెడ్డి

మరిన్ని వార్తలు