అతడు ఆమె ఫోన్‌

13 Feb, 2022 00:26 IST|Sakshi

సండే సినిమా/గెహరాయియా

స్త్రీ పురుష సంబంధాలు ఎంత ఆకర్షణీయమైనవో అంత లోతైనవి. సామాజిక సూత్రాలకు, నైతిక విలువలకు ఎడంగా జరిగి స్త్రీ పురుషుల మధ్య బంధం ఏర్పడితే అది ఏ ఒడ్డుకు చేరుస్తుందో చెప్పలేము. ఆగి, ఆలోచించుకునే వాస్తవిక స్పృహ ఇవ్వకుండా స్త్రీ పురుషుల అనంగీకార అనుబంధాలకు ఎడతెగని వాహికగా ఉంటున్న స్మార్ట్‌ ఫోన్‌ మన జీవితాలను ఎటు తీసుకెళుతోంది అని కూడా ఆలోచింపచేస్తున్న సినిమా ‘గెహరాయియా’. అమేజాన్‌లో తాజా విడుదల.

స్త్రీ, పురుషులు ఒకరికొకరు కట్టుబడి ఉండటం ఈ సమాజం కొన్ని వందల ఏళ్లుగా ఏర్పరుచుకున్న విలువ. ఆ విలువకు బయట జరిగి ‘అనంగీకార’ అనుబంధాలకు వెళ్లిన జంటలు ఎక్కువగా కష్టాలనే ఎదుర్కొన్నారు, సమాజపు దృష్టిలో దోషులుగానే నిలుచున్నారు. భారతీయ సమాజంలో అయితే ప్రేమలోగాని, వివాహంలోగాని జీవిత భాగస్వామిని వంచన చేసి మరొకరితో బంధంలో ఉండటం పూర్తి అనైతికంగా పరిగణించబడుతుంది. కాని ఎల్లకాలం ఎల్లవేళలా ఇరుపక్షాల మనసు అన్ని రకాల కట్టుబాట్లకు లొంగదు. అది ఒక్కోసారి ‘ఇదే నాకు కావలసింది’ అనుకుంటుంది. ‘ఉన్నది సరి కాదు... ఇది సరిౖయెనది’ అనుకుంటుంది.

‘ఉన్నది ఉండగా... ఇది కూడా ఉంటే ఏమవుతుంది?’ అనుకోనూవచ్చు. ‘ఇది ఒక చిన్న సరదా... ఎవరికి తెలుస్తుందిలే’ అని భావించవచ్చు. స్త్రీ, పురుషుల అంచనాలు కేవలం అంచనాలు మాత్రమే. ఒకసారి రంగంలోకి దిగాక పరిణామాలు అంచనాలకు తగినట్టుగా ఉండవు. సంక్షోభాలు తెచ్చిపెడతాయి. అశాంతి, ప్రమాదం, హింస, పగ, పరారీ... ఏమైనా జరగొచ్చు. ఒకప్పుడు ఈ పరిణామాలు వేగంగా జరిగే అవకాశం తక్కువ కమ్యూనికేషన్‌ పరిమితుల వల్ల. ఇవాళ స్మార్ట్‌ఫోన్‌ వచ్చింది. అది అనుక్షణ ప్రసారానికి సంభాషణకి వీలు కల్పిస్తోంది. దీని వల్ల ఎలాంటి మంచి జరుగుతున్నదో కాని పత్రికలలో చెడు పరిణామాల వార్తలే చూస్తూ ఉంటాం.

ఈ సినిమా కథ ఏమిటి?
రెండు జంటలు. దీపికా పడుకోన్‌– ధైర్య కరవా... సిద్ధాంత్‌ చతుర్వేది– అనన్యా పాండే. రెండు జంటలూ లివ్‌ ఇన్‌ రిలేషన్‌లో ఉంటాయి. రెండు జంటలూ పెళ్లి ఆలోచనల్లో కూడా ఉంటాయి. దీపికా యోగా ఇన్‌స్ట్రక్టర్‌. ఆమె బాయ్‌ఫ్రెండ్‌ ధైర్య కరవా రచయితగా స్ట్రగుల్‌ అవుతుంటాడు. అనన్యా పాండే శ్రీమంతురాలు. ఆమె బోయ్‌ఫ్రెండ్‌ సిద్ధాంత్‌ చతుర్వేది కార్పొరేట్‌ దిగ్గజం. దీపికా, అనన్యా కజిన్స్‌ అవుతారు కనుక ఈ నలుగురూ చాలా రోజుల తర్వాత కలుస్తారు. అది కూడా అత్యంత విలాసవంతమైన చిన్న పడవ మీద... సముద్రంలో ప్రయాణిస్తూ. కాని దీపికా పట్ల సిద్ధాంత్‌ ఆకర్షితుడవుతాడు.

ఇద్దరూ తమ లివ్‌ ఇన్‌ పార్ట్‌నర్‌లను చీట్‌ చేస్తూ రిలేషన్‌లోకి వెళతారు. తాను చేస్తున్న వెంచర్‌ పూర్తయితే దానికి అందాకా ఆర్థికంగా మద్దతుగా ఉంటున్న అనన్యతో తెగదెంపులు చేసుకుని నిన్ను పెళ్లి చేసుకుంటాను అని దీపికతో చెబుతాడు సిద్ధాంత్‌. వారిద్దరూ అలాంటి అంచనాతో తమ రహస్య బంధాన్ని కొనసాగిస్తారు. కాని అంచనా తప్పుతుంది. సిద్ధాంత్‌ వెంచర్‌ నిధుల గోల్‌మాల్‌లో మునుగుతుంది. మరోవైపు దీపిక గర్భవతి అవుతుంది. ఇంకో వైపు అనన్యకు తన బోయ్‌ఫ్రెండ్‌ ఎవరితోనైనా అఫైర్‌లో ఉన్నాడా అని అనుమానం వస్తుంది.

ప్రేమ, రిలేషన్‌ ఉండాల్సిన చోట ఊపిరాడనితనం, అసహనం, దీని నుంచి ఎలాగైనా బయటపడాలన్న క్రైమ్‌ ఆలోచనలు... అన్నీ ఈ ‘రహస్యం’గా ఉంచాల్సిన ‘బంధం’ వల్ల ఏర్పడతాయి. స్త్రీ పురుషులు తమ పాత బంధాల నుంచి ఓపెన్‌గా, చట్టబద్ధంగా విడిపోయి కొత్త బంధాల్లోకి వెళ్లొచ్చు. కాని ఉన్న బంధాల్లో ఉంటూ రహస్య బంధం కొనసాగించాల్సి వచ్చినప్పుడు, లేదా ఉన్న బంధాన్ని సరిగ్గా ముగించకుండా కొత్త బంధాల్లో మునిగినప్పుడు పరిణామాలు భయానకం అవుతాయి. ఈ సినిమా కూడా అలాగే ముగుస్తుంది. పైపై ఆకర్షణల లోతు ఎంత అగాధంగా ఉంటుందో ‘గెహరాయియా’ (అగాధాలు) చెబుతుంది.

ఫోన్‌ ఒక పాత్రధారి
ఫోన్‌ ఒక కమ్యూనికేషన్‌ మాధ్యమం. అదే సమయంలో ఇవాళ స్త్రీ,పురుష బంధాలకు ఒక ప్రధాన వాహిక. ఒకప్పుడు అబ్బాయి. అమ్మాయిల ప్రేమ దగ్గరి నుంచి వివాహేతర రహస్య బంధాల వరకూ కమ్యూనికేషన్‌ ఒక దుస్సాధ్యంగా ఉండేది. కాని స్మార్ట్‌ఫోన్‌ వల్ల ఆ సమస్య అవసరమైన దాని కంటే ఎక్కువే అయిందని ఈ సినిమా చూస్తే అనిపిస్తుంది. ఇందులో సినిమా అంతా పాత్రలు మాట్లాడినంత ఫోన్‌ మాట్లాడుతుంది.

దీపిక, సిద్ధాంత్‌ల మధ్య రహస్య బంధం పూర్తిగా వాట్సప్‌ చాట్‌ వల్ల బలపడుతుంది... ముందుకు పోతుంది... చివరకు విషాద పరిణామమూ తీసుకుంటుంది. బంధం ఏర్పడేంత వరకూ ‘కిక్‌’ ఇచ్చే వాట్సప్‌ సంభాషణలు బంధం ఏర్పడ్డాక ‘అనుక్షణం వెంటాడే’ సంభాషణలుగా మారతాయి. స్త్రీగాని, పురుషుడు గాని ఇంట్లో ఉన్నా, ఆఫీస్‌లో ఉన్న ఈ ఎడతెగని చాటింగ్‌ ‘మతి’ని గతి తప్పేలా చేస్తున్నదేమోనని ఈ సినిమా చూస్తే అనిపిస్తుంది.

డిస్ట్రబ్‌ చేసే మూవీ
వివాహేతర బంధాలు ఎంత డిస్ట్రబ్‌ చేస్తాయో అంత డిస్ట్రబ్‌ చేసే మూడ్‌లో ఈ సినిమా కథనం ఉంటుంది. దర్శకుడు షకున్‌ బాత్ర ఆ జాగ్రత్త తీసుకున్నాడు. కాని ఒక విలువను ఆపాదించడం లేదా ఆరోగ్యకరమైన అర్థవంతమైన ముగింపును ఇవ్వకపోవడంతో ప్రేక్షకుడికి ఒక డిస్ట్రబెన్స్‌ భావన మాత్రమే కలుగుతుంది. ఉన్న బంధాలు అన్నీ ఏవో కొద్ది ఇష్టాయిష్టాలతోనే ఉంటాయి. సమస్యలు లేని బంధాలు ఉండవు. అవి మరీ ఘోరంగా ఉంటే కొత్తబంధాల్లోకి వెళ్లడం పట్ల సమాజానికి అభ్యంతరం ఉండదు. కాని దూరపు కొండలు నునుపు అనే భావనతో బాధ్యతలు అధిగమించే ఆకర్షణల్లో పడటం పట్ల మాత్రం ఈ సినిమా కచ్చితంగా ఒక హెచ్చరికే. దీపిక మంచి నటనకు ఈ సినిమా చూడొచ్చు. లేదంటే చదివిన ఈ రివ్యూ సరిపోతుంది.

మరిన్ని వార్తలు