Psychology: అక్కలకు ఇంకా పెళ్లి కాలేదు! కుటుంబం ఇలా.. ఒత్తిడిలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌.. పరిష్కారం?

16 Nov, 2022 13:59 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

జీవన శైలి మారింది.. పర్యవసానంగా వచ్చిన.. వస్తున్న శారీరక సమస్యల మీదే మన దృష్టి అంతా! అదే తీవ్రత మానసిక ఆరోగ్యం మీదా ఉంది.. కానీ అది అవుట్‌ ఆఫ్‌ ఫోకస్‌లో ఉంది! ఫలితంగా సమాజమే డిప్రెషన్‌లోకి వెళ్లొచ్చు! వెళ్లకూడదు అనుకుంటే మానసిక సమస్యలు, రుగ్మతల మీద సాధ్యమైనంత వరకు చర్చ జరగాలి.. కౌన్సెలింగ్, వైద్యం దిశగా ప్రయాణం సాగాలి! ఆ ప్రయత్నమే ఈ కాలమ్‌!! 

ఆనంద్‌ 28 ఏళ్ల సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. హైదరాబాద్‌లో ఉద్యోగం. తన ఫ్రెండ్‌ కుమార్‌తో కలసి మాదాపూర్‌లో ఒక డబుల్‌ బెడ్‌ రూమ్‌లో ఉంటున్నాడు. రోజూ ఉదయాన్నే జాగింగ్‌కు, అట్నుంచటే జిమ్‌కు వెళ్లేవాడు. ఇరుగుపొరుగు కనిపిస్తే నవ్వుతూ పలకరించే వాడు. నీట్‌గా రెడీ అయ్యి, తన కొత్త బైక్‌పై ఆఫీస్‌కి వెళ్లేవాడు.

అక్కడ కొలీగ్స్‌ అందరితో సరదాగా ఉండేవాడు. వారానికి ఐదురోజులు పనిచేయడం, వీకెండ్స్‌లో ఫ్రెండ్స్‌తో కలసి ఔటింగ్‌కి వెళ్లడం అలవాటు. అయితే గత రెండు నెలలుగా ఆనంద్‌ ప్రవర్తన మారిపోయింది. రూమ్మేట్‌ కుమార్‌తో మాట్లాడటం తగ్గించేశాడు.

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ తీసుకున్నాడు. స్నానం చేయడం లేదు, సరిగా డ్రెస్‌ చేసుకోవడం లేదు. అత్యవసరమైతే తప్ప రూమ్‌ దాటి బయటకు వెళ్లట్లేదు. అన్నీ ఆన్‌లైన్‌లోనే ఆర్డర్‌ చేసుకుంటున్నాడు. కుమార్‌కు ఇదంతా కొత్తగా అనిపించింది. అడిగితే ‘‘నేను బాగానే ఉన్నాను’’ అని చెప్తున్నాడు. 

..కానీ బాగాలేడు..
క్రమేపీ ఆనంద్‌కు ఆరోగ్య సమస్యలూ మొదలయ్యాయి. తరచూ తలనొప్పి, ఒళ్లు నొప్పులంటూ బాధపడుతున్నాడు. అస్సలు నిద్రపోవడంలేదు. అల్సర్‌ వచ్చింది. డైజెస్టివ్‌ ప్రాబ్లమ్స్‌ కూడా మొదలయ్యాయి. గుండె దడగా ఉంటోందంటున్నాడు. వర్క్‌ విషయంలోనూ ఆఫీసు నుంచి కంప్లయింట్స్‌ వస్తున్నాయి. అలాగే వదిలేస్తే ఏమై పోతాడోననే భయంతో కుమార్‌ బలవంతంగా ఆనంద్‌ను కౌన్సెలింగ్‌కి తీసుకువచ్చాడు.

కౌన్సెలింగ్‌లో భాగంగా ఆనంద్‌ కుటుంబం, గతం గురించి తెలుసుకున్నాను. అతనికి ముగ్గురు అక్కలు. లేకలేక పుట్టిన మగబిడ్డ కావడంతో పేరెంట్స్‌ చాలా గారాబం చేసేవారు. ఆనంద్‌ 12 ఏళ్ల వయసులో తండ్రి చనిపోవడంతో కుటుంబం అతలాకుతలమైంది. తల్లి, అక్కలు ఏదో ఒక జాబ్‌ చేస్తే తప్ప గడవని పరిస్థితి. ఆనంద్‌కు ఉద్యోగం వచ్చాకే  కుటుంబం ఊపిరి పీల్చుకుంది.

కానీ అక్కలకు ఇంకా పెళ్లి కాకపోవడం ఆనంద్‌పై తెలియని ఒత్తిడిని పెంచింది. అక్కలకు పెళ్లి కాదేమో, వాళ్లకు పెళ్లి చేయకుండా తాను పెళ్లి చేసుకోలేడు కాబట్టి, తనకు జీవితంలో పెళ్లి కాదేమోననే ఆందోళన మొదలైంది. అది అతని ఆలోచనలన్నింటినీ ఆక్రమించేసింది. దీన్నే జనరలైజ్డ్‌ యాంగ్జయిటీ డిజార్డర్‌ లేదా GAD అంటారు. ఆనంద్‌ ఆలోచనల్లో, ప్రవర్తనలో మార్పులన్నీ ఈ డిజార్డర్‌ వల్ల వచ్చినవే.

ఆరుగురిలో ఒకరు.. 
ఇది ఆనువంశికంగా వచ్చి ఉండవచ్చు. లేదా జీవితంలో ఎదురైన అనుభవాలు, వ్యక్తిత్వ లక్షణాల వల్లా కావచ్చు. ఆనంద్‌ తల్లి కూడా ఇలాగే ప్రతి చిన్న విషయానికీ ఆందోళన చెందుతుంటుందని అతని మాటల్లో తెలిసింది. దానికితోడు చిన్నప్పుడే తండ్రిని కోల్పోవడం, కుటుంబ కష్టాలు, అక్కల పెళ్లిళ్లు.. అవన్నీ అతన్ని ఆందోళనలోకి నెట్టేశాయి.

ఎలాంటి సపోర్ట్‌ సిస్టమ్‌ లేకపోవటం, ఆందోళనను తగ్గించుకునే ప్రయత్నాలు చేయకపోవడంతో అది డిజార్డర్‌గా మారింది. వందమంది భారతీయుల్లో ఆరుగురు ఈ డిజార్డర్‌తో బాధపడుతున్నారని అధ్యయనాలు చెప్తున్నాయి.

మానసిక సమస్యలకు చికిత్స లేదా కౌన్సెలింగ్‌ తీసుకుంటే ‘పిచ్చి’ అనే ముద్ర వేస్తారనే భయం వల్లే చాలామంది చికిత్సకు వెనుకడుగు వేస్తుంటారు. ఫలితంగా అది మరిన్ని మానసిక, శారీరక సమస్యలకు కారణమవుతుంది. అందుకే మానసికంగా ఏ మాత్రం తేడాగా అనిపించినా వెంటనే చర్యలు తీసుకోవడం అవసరం.

జనరలైజ్డ్‌ యాంగ్జయిటీ డిజార్డర్‌ లక్షణాలున్నవారు దాన్నుంచి బయటపడేందుకు చేయాల్సిన పనులు..
►ఆందోళన కలిగించే ఆలోచనలను ఒక జర్నల్‌లో రాసుకోవాలి. వాటిని గమనిస్తే.. మీకు వస్తున్న చాలా ఆలోచనలు నిజం కావడంలేదని అర్థమవుతుంది. అది మీకు ధైర్యాన్నిస్తుంది, ఆందోళనను తగ్గిస్తుంది. 

►క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. దానివల్ల మెదడులో విడుదలయ్యే సెరటోనిన్‌ మూడ్‌ను మెరుగుపరుస్తుంది. కనీసం వారానికి ఐదురోజులు, రోజుకు అరగంట వ్యాయామం చేయాలి. 

►ఆందోళనకూ శ్వాసకూ సంబంధం ఉంది. ఆందోళనలో ఉన్నప్పుడు శ్వాస వేగమవ్వడం గమనించవచ్చు. అందువల్ల బ్రీతింగ్‌ ఎక్సర్‌సైజ్‌ను రోజూ ప్రాక్టీస్‌ చేయాలి. మెడిటేషన్‌ కూడా ఉపయోగ పడుతుంది. ఇవన్నీ చేసినా ఆందోళన తగ్గకపోతే ఏమాత్రం బెరుకులేకుండా సైకాలజిస్టును సంప్రదించండి.

►మనదేశంలో వందలో ఏడుగురు ఏదో ఒక మానసిక సమస్యతో బాధపడుతున్నారు. వారిలో 80శాతం మంది ఎలాంటి చికిత్స తీసుకోవడంలేదు. మానసిక సమస్యల పట్ల అవగాహన లేకపోవడం, సమస్యను బయటకు చెప్పుకుంటే  ‘పిచ్చి’ అనే ముద్ర వేస్తారనే భయమే ఇందుకు కారణం. ఎలాంటి భయం లేకుండా మీ సమస్యను కింద ఇచ్చిన ఐడీకి మెయిల్‌ చేయవచ్చు. పరిష్కారమార్గం చూపిస్తాం.  
-సైకాలజిస్ట్‌ విశేష్‌(psy.vishesh@gmail.com) 

చదవండి: Jeelakarra Health Benefits: జీలకర్ర వేసి కాచిన గోరువెచ్చని నీటిని రోజూ పరగడుపున తాగితే జరిగేది ఇదే! ఈ విషయాలు తెలిస్తే..
Health Tips: క్యాన్సర్‌కూ, గుండెజబ్బులకూ ఒకేలాంటి రిస్క్‌ ఫ్యాక్టర్లు... మామోగ్రామ్‌తో..

మరిన్ని వార్తలు