నివాస ప్రాంతాల్లో ఖాళీ స్థలాలు, ప్రభుత్వ స్థలాల్లో కూరగాయల సాగు.. నగరంలో కిచెన్‌ గార్డెనింగ్‌ ప్రయోజనాలివే!

20 Feb, 2023 12:07 IST|Sakshi

బెర్లిన్‌.. జర్మనీ రాజధాని నగరం. యూరోపియన్‌ యూనియన్‌లోకెల్లా జనసమ్మర్దం ఎక్కువగా ఉండే నగరం. ఏప్రిల్‌ నుంచి నవంబర్‌ వరకు పంటలు సాగు చేసుకోవడానికి అనువైన కాలం. మిగతా నెలల్లో మంచుకురుస్తూంటుంది. అర్బన్‌ అగ్రికల్చర్‌ కార్యకలాపాల సంప్రదాయం బెర్లిన్‌ నగరానికి కొత్తేమీ కాదు. కమ్యూనిటీ గార్డెన్లు, కిచెన్‌ గార్డెన్లలో కూరగాయలు, పండ్ల సాగు సుదీర్ఘకాలంగా జరుగుతున్నదే.

అయితే, నగరవాసులకు అవసరమైన కూరగాయలు మాత్రం ఎక్కడి నుంచో నగరానికి తరలించక తప్పటం లేదు. ఈ పరిస్థితిని మార్చలేమా? వ్యాపకంగా సాగుతున్న అర్బన్‌ అగ్రికల్చర్‌ను మరింత సీరియస్‌గా తీసుకొని ఖాళీ జాగాల్లో పండిస్తే నగర కూరగాయల అవసరాలు ఎంత మేరకు తీరుతాయి?

ఈ ప్రశ్నలకు సమాధానం వెతికే ప్రయత్నంలో భాగంగా మొట్ట మొదటిసారిగా ఇటీవల సమగ్ర అధ్యయనం జరిగింది. బెర్లిన్‌ కూరగాయల వినియోగంలో 82 శాతం వరకు నగరంలోనే పండించుకోవచ్చని ఈ అధ్యయనంలో తేలింది! 

200 కమ్యూనిటీ గార్డెన్లు..
పోట్స్‌డ్యామ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ క్లైమేట్‌ ఇంపాక్ట్‌ రీసెర్చ్‌లో పరిశోధకుడిగా ఉన్న డియెగో రిబ్‌స్కీ బృందం ఈ అధ్యయనం చేసింది. నివాస ప్రాంతాల్లో ఖాళీ స్థలాలు, ప్రభుత్వ స్థలాల్లో కూరగాయల సాగుకు పేదలకు కేటాయించిన తోటలు, భవనాలపై బల్లపరుపుగా ఉన్న పై కప్పులు, సూపర్‌ మార్కెట్‌ పార్కింగ్‌ స్థలాలతో పాటు మూసివేసిన శ్మశానవాటిక స్థలాల్లో ఎంత మేరకు కూరగాయలు సాగు చేయొచ్చో అధ్యయనం చేశారు.

బెర్లిన్‌లో ఇప్పటికే 200 కంటే ఎక్కువ కమ్యూనిటీ గార్డెన్లు ఉన్నాయి. పేదలు కూరగాయలు పండించుకోవడానికి ప్రభుత్వ స్థలాల్లో కేటాయించిన చిన్న ప్లాట్లు 73,000 కంటే ఎక్కువగానే ఉన్నాయి.

వీటికి తోడుగా, భవనాల పైకప్పులు, నివాస ప్రాంతాల్లో ఖాళీ స్థలాలు, పెద్ద గృహ సముదాయాల మధ్య పచ్చటి ప్రదేశాలలో కూడా కూరగాయలు, పండ్ల తోటలు సాగు చేసే గొప్ప అవకాశం ఉందని ఈ అధ్యయనం ద్వారా గుర్తించారు. కార్ల సంఖ్యను తగ్గించే ప్రణాళికలు రచిస్తున్నందున పార్కింగ్‌ స్థలాలను కూడా కూరగాయలు పండించడానికి ఉపయోగించుకోవచ్చని రిబ్‌స్కీ అన్నారు.

తక్కువ స్థలంలో ఎక్కువ కూరగాయలు..
బెర్లిన్‌లోని మొత్తం 4,154 హెక్టార్లలో కూరగాయలు పండించవచ్చని అధ్యయనంలో తేలింది. నగర వైశాల్యంలో ఇది దాదాపు 5 శాతం. ఈ భూమి మొత్తంలో కూరగాయలు పండిస్తే బెర్లిన్‌ కూరగాయల డిమాండ్‌లో 82 శాతం స్థానికంగా తీరిపోతుందని రబ్‌స్కీ పేర్కొన్నారు.

అయితే, ఈ కల సాకారమవ్వాలంటే నీరు, మానవ వనరులను సమకూర్చుకోవాల్సి ఉంటుంది. 75.3 కోట్ల యూరోల పెట్టుబడి అవసరం. వినటానికి అంతా డబ్బా అనిపిస్తుంది గానీ.. 2020వ సంవత్సరంలో బెర్లిన్‌ స్థూల దేశీయోత్పత్తిలో ఇది దాదాపు 0.5 శాతం మాత్రమే. 

సవాళ్లు అనేకం..
నగరంలో తోట పనిని ప్రోత్సహించి ఈ కలను సాకారం చేయాలంటే అధిగమించాల్సిన సవాళ్లు తక్కువేమీ కాదు. ‘స్థలం ఉంది, కానీ ఇంకా అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఉదాహరణకు, తోట పనిని ఎవరు చేయబోతున్నారు? ప్రైవేట్‌ తోటమాలులను నియమించి సాగు చేయిస్తామా? లేదా వ్యాపార నమూనా అవసరమా? పేదలకు కేటాయించిన తోటల్లో ఉత్పత్తిని పెంచగలమా?

నగరంలో వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి ఎటువంటి పరిస్థితులను సృష్టించగలం? వంటి ప్రశ్నలకు సమాధానాలు వెతకాల్సి ఉంటుందని అధ్యయనకారులు అంటున్నారు. ‘స్థానికంగా కూరగాయల సాగు బహుశా చాలా ఖరీదైన పని కావచ్చు.

అయితే, సేంద్రియంగా పండిస్తాం. కాబట్టి, కొత్త బ్రాండ్‌ను సృష్టించుకోవచ్చు. అందుకని సూత్రప్రాయంగా ఇది సానుకూల పరిణామమని నేను నమ్ముతున్నాను’ అన్నారు పోట్స్‌డ్యామ్‌ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన మారియన్‌ డి సిమోన్‌.   

నగరంలో కిచెన్‌ గార్డెనింగ్‌ ప్రయోజనాలు.. 
సేంద్రియ కూరగాయల లభ్యత పెరగడంతో పాటు ఇంకా చాలా ఉన్నాయి. ఎవరికి వారుగా ఉండిపోయిన నగర ప్రజలను కమ్యూనిటీ గార్డెన్లు ఒకచోటకు చేర్చుతాయి. పచ్చని ప్రదేశాలు ప్రజల ఆరోగ్యానికి, పర్యావరణం, జీవవైవిధ్యానికి మేలు చేస్తాయి.

స్థానిక ఆహార ఉత్పత్తితో దూరం నుంచి కూరగాయల రవాణా వల్ల వెలువడే కర్బన ఉద్గారాలు కూడా తగ్గుతాయి. ఇన్ని ప్రయోజనాలున్న అర్బన్‌ గార్డెనింగ్‌పై సీరియస్‌గా దృష్టి పెట్టడం బెర్లిన్‌కే కాదు, మన నగరాలకూ ఎంతో అవసరం. కానీ, మన పాలకులు గుర్తించేదెన్నడో కదా?!
-పంతంగి రాంబాబు

చదవండి: ఫంగల్‌ వ్యాధుల్ని నివారించే తెల్లముల్లంగి!

మరిన్ని వార్తలు