చుండ్రు సమస్య, నోటి దుర్వాసనకు చెక్‌ పెట్టండిలా!

16 Jan, 2021 15:18 IST|Sakshi

చలికాలం మాడుపై చర్మం కూడా పొడిబారుతుంటుంది. ఇప్పటికే తలలో చుండ్రు ఉన్నవారిలో ఈ కాలంలో సమస్య మరింత పెరుగుతుంది. దీనికి విరుగుడుగా ఇంట్లోనే కొన్ని సంరక్షణ చర్యలు తీసుకోవచ్చు. 

బ్యూటిప్స్‌..

  • చిన్న అల్లం ముక్కను తీసుకొని శుభ్రంగా కడిగి సన్నగా తరగాలి. ఈ ముక్కలను నువ్వుల నూనెలో వేసి మరిగించాలి. గోరువెచ్చగా అయ్యాక కుదుళ్లకు పట్టించి, మృదువుగా వేళ్లతో మర్దనా చేయాలి. గంట తర్వాత తలస్నానం చేయాలి. వారానికి ఒకసారి ఈ విధంగా చేస్తుంటే చుండ్రు తగ్గిపోతుంది.
  • వేప నూనె, ఆలివ్‌ ఆయిల్‌ సమపాళ్లలో కలిపి వేడి చేయాలి. గోరువెచ్చని నూనె తలకు పట్టించి మృదువుగా మర్దనా చేయాలి. 15 నిమిషాల తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి.
  • ఆరెంజ్‌ తొక్కను ముద్దగా నూరి తలకు పట్టించాలి. అరగంట తర్వాత వెచ్చని నీళ్లతో కడిగేయాలి.
  • రెండు టేబుల్‌ స్పూన్ల యాపిల్‌ జ్యూస్‌... అంతే పరిమాణంలో నీళ్లు తీసుకొని తలకు పట్టించాలి. ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవాలి. 
  • ఆపిల్‌ సైడర్‌ వెనిగర్‌లో అరటిపండు గుజ్జును బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మాడుకు పట్టించి వెచ్చని నీళ్లతో శుభ్రపరుచుకోవాలి. 
  • కలబంద గుజ్జును మాడుకు పట్టించి 15 నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి. కలబంద చుండ్రును నివారించడమే కాకుండా మాడుపై ఉన్న చర్మ సమస్యలనూ నివారిస్తుంది. వెంట్రుకలకు మృదుత్వాన్ని ఇస్తుంది.
  • బేబీ ఆయిల్‌ను తలకు పట్టించి, మర్దనా చేసి వెచ్చని నీళ్లలో ముంచి తీసిన టర్కీటవల్‌ని చుట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత యాంటీ–డాండ్రఫ్‌ షాంపూతో తలంటుకోవాలి.

హెల్త్‌టిప్స్‌..

  •  ప్రతిరోజూ ఉదయాన్నే పరగడుపున ఐదు తులసి ఆకులను తింటుంటే హెపటైటిస్, టైఫాయిడ్‌ వంటి వ్యాధులను నివారించవచ్చు.
  • ఒక టీ స్పూను శొంఠిపొడిలో పావు టీస్పూను జీలకర్ర, పావు టీ స్పూను చక్కెర లేదా చిన్న బెల్లం ముక్క కలిపి తింటే దగ్గు తగ్గుతుంది.
  • ఆవాలను మెత్తగా గ్రైండ్‌ చేసి తేనె కలిపి తింటే దగ్గు తగ్గుతుంది.
  • దగ్గు విడవకుండా ఉంటే తులసి ఆకుల పేస్టు, తేనె సమపాళ్లలో కలిపి ఆ మిశ్రమాన్ని ఉదయాన్నే పరగడుపున తినాలి.
  • యూరినరీ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతుంటే రోజూ ఉదయాన్నే ఒక గ్లాసు నీటిలో చిటికెడు యాలకుల పొడి కలిపి తాగాలి.
  • కడుపు నొప్పితో బాధపడుతుంటే జీలకర్ర పొడిలో చక్కెర కలిపి  బాగా నమిలితినాలి. ఈ కాలంలో చక్కెర సరిపడనివాళ్లు దానికి బదులుగా బెల్లం వాడుకోవాలి.
  • జలుబుతో బాధపడుతుంటే ఒక గ్లాసునీటిలో ఒక స్పూను తేనె కలిపి ఉదయాన్నే తాగాలి.
  • నోరు చెడువాసన వస్తుంటే రోజూ ఉదయాన్నే ఐదు గ్లాసుల నీటిని తాగాలి. ఇలాచేయడం వల్ల జీర్ణవ్యవస్థ శుభ్రపడి దుర్వాసన పోతుంది.

ఇంటిప్స్‌
►వార్డ్‌రోబ్‌లో దుస్తులను ఎక్కువ రోజులు కదపకుండా ఉంటే సన్నని పురుగులు (సిల్వర్‌ఫిష్‌) పడుతుంటాయి. పలుచని క్లాత్‌లో కొన్ని లవంగాలను కాని లవంగాల పొడిని కాని కట్టి దుస్తుల మధ్యలో పెడితే ఏరకమైన కీటకాలు చేరవు. వెండి వస్తువులు తెల్లగా మెరవాలంటే కడిగేముందు అరగంట సేపు చింతపండు నీటిలో నానబెట్టాలి.
►దుస్తులకు పట్టేసిన మట్టి మరకలు పోవాలంటే బంగాళాదుంపను ఉడికించిన నీటిలో నానబెట్టి తరవాత మామూలుగా ఉతకాలి.

మరిన్ని వార్తలు