ఎవరింట్లోనైనా నాన్న అలాగే ఉంటాడు!

4 Dec, 2020 08:36 IST|Sakshi

నాన్న ఏ కూతురికైనా ఎన్నాళ్లు గడిచినా మనసులో నిలిచి ఉంటాడు. మరి రోజూ ఎక్కడో ఒకచోట ఏదో ఒక సందర్భంలో తన పాటతో వినిపించే ఘంటసాల వంటి తండ్రికి పుట్టిన కూతురు ఆ నాన్నను ఎలా మరచిపోగలదు? ఘంటసాల పెద్ద కుమార్తె శ్యామల నేడు ఆయన జయంతి సందర్భంగా సాక్షితో పంచుకుంటున్న జ్ఞాపకాలివి ఆమె మాటల్లోనే... 

‘మీ నాన్నగారు అంత గొప్ప గాయకులు, సంగీత దర్శకులు కదా! మరి ఇంట్లో మీ అందరితో ఎలా ఉండేవారు? మామూలుగా మాట్లాడేవారా?’ – ఇవి మేము కొన్ని వందలసార్లు అడిగించుకున్నాం. ఇవేం ప్రశ్నలు? ఎవరింట్లోనైనా నాన్న అనే వ్యక్తి అందరితో మామూలుగా మాట్లాడక మరొకలా ఎలా ఉంటారబ్బా? మనమూ అందరిలాంటి వాళ్లమే కదా? మరెందుకు అంత కుతూహలంగా అడుగుతున్నారు? అని ఆశ్చర్యంగాను, తికమకగాను ఉండేది. అప్పట్లో బాగా చిన్న వాళ్లం అవడం వల్ల నాన్నగారి ప్రత్యేకత తెలిసేది కాదు’’ 

సాదాసీదాగా
నాన్నగారు సినిమా పరిశ్రమకి చెందినవారైనా మా ఇంట్లో ఆ ప్రభావం ఏమాత్రం ఉండేది కాదు. అందరం నేల మీద చిరుచాపలు పరచుకుని కూర్చునే భోజనం చేసేవాళ్లం. హాల్లో కింద కూర్చుని ఎవరి స్కూలు పెట్టి వాళ్లు ఒళ్లో పెట్టుకుని హోమ్‌వర్కు రాసుకునేవాళ్లం. రాత్రివేళ వరుసగా నవారు మంచాలు వేసుకుని పడుకునేవాళ్లం. వేసవి కాలమైతే డాబా మీద చాపలు వేసుకుని నక్షత్రాలను చూస్తూ కబుర్లు చెప్పుకుంటూ, నిద్రలోకి జారుకునేవాళ్లం. ఏ రోజైనా ఉదయం ఆరు గంటలకి పక్కలు తీసి సర్దిపెట్టాలిసిందే. పెద్దవాళ్లకి మాత్రం కాఫీ, టిఫిను. పిల్లలకి ఊరగాయ, పెరుగు కలిపి చద్దన్నమే. ఎనిమిదిన్నరకల్లా పిల్లల సెక్షన్‌ పని పూర్తి. వేసవి సెలవులకి పిన్నిగారి పిల్లలు, మావయ్యగారి పిల్లలు వచ్చేవారు. సంగీతరావుగారి పిల్లలు, మేము అందరం కలిపి దాదాపు పదిహేనుమంది ఉండేవాళ్లం.


పెద్ద ఆవరణలో ఇంటి చుట్టూ పరుగెత్తడానికి కావలసినంత చోటుండేది. దొంగ పోలీసు, దాగుడు మూతలు, ఏడు రాళ్లు, చెడుగుడు, ప్లేబాల్, బొంగరాలు, గోళీలు, స్కిప్పింగ్, రింగ్, షటిల్‌కాక్‌... అబ్బ! ఎన్ని ఆటలు ఆడేవాళ్లమో.. అప్పుడప్పుడు నాన్నగారు విశ్రాంతిగా ఇంట్లో పడుకున్నప్పుడు దాక్కోవటానికి ఆయన మంచం కింద దూరేవాళ్లం. అమ్మ వచ్చి, ‘బయటికిపోయి ఆడుకోండి’ అని కసిరేది. నాన్నగారు మాత్రం నిద్రపోతున్నట్లు నటించేవారు. కానీ ఆయనలో తన్నుకు వస్తున్న నవ్వు మెలకువగా ఉన్నట్లు పట్టించేసేది. అంతమంది కలిసి బిగ్గరగా అరుచుకుంటూ, పరిగెత్తుతూ, కొట్టుకుంటూ, అలుగుతూ, గోలగోల చేస్తుంటే నాన్న ఎంత సంబరంగా చూసేవారో!! 

అన్నీ ఇంట్లోనే..
నాన్నగారికి విడిగా ఆఫీసు లేదు. ఎవరినైనా ఇంటికే రమ్మనేవారు. అందువల్ల ఇంటికి ఎప్పుడూ ఎవరో ఒకరు వస్తుండేవారు. సముద్రాల, కృష్ణశాస్త్రి, యామిజాల పద్మనాభస్వామి, కొసరాజు, కోట సత్య రంగయ్య శాస్త్రి వంటి సాహిత్య మూర్తులతో పాటు, ఆర్కెస్ట్రా వాళ్లు, సంగీత దర్శకులు, గాయకులు.. అందరితో ఇల్లు కళకళలాడుతూ ఉండేది. అందరం పాటల పోటీలు, నాటకాలు – చాలా బిజీగా ఉండేవాళ్లం. ప్రైజు సాధించుకుని వచ్చేవాళ్లం. మొదటిసారి నా పన్నెండవ ఏట రేడియో నాటకానికి చెక్కు ఇచ్చారు. ఆ తరువాత చిన్నన్నయ్యకి చెక్కు వచ్చింది. ఆ రోజు నాన్నగారి సంతోషానికి పట్టపగ్గాలు లేవు. ‘నా పిల్లలు కేవలం గుర్తింపు తెచ్చుకోవడమే కాదు, అప్పుడే సంపాదనపరులు కూడా అయ్యారు’ అంటూ పొంగిపోయేవారు. అప్పటికప్పుడు స్వీట్లు తెప్పించేవారు. 


పండుగలకు పాటలు..
వినాయకచవితి నాడు పూజ పూర్తయ్యాక అందరం కలిసి పాటలు పాడడం, దసరాకి బొమ్మల కొలువులు, పేరంటాలు, దీపావళికి ఇంట్లో చిచ్చుబుడ్లు, మతాబులు చుట్టించడం, సంక్రాంతికి ముందు నెలరోజులు ముగ్గులు పెట్టి గొబ్బెమ్మలని తీర్చడం, భోగిమంటలు – ఇవి మాత్రమే పండుగలు కావు – నాన్నగారితో గడిపిన ప్రతీ క్షణం ఒక పండగలాగే గడిచిపోయింది. చుప్పనాతి దేవుడు నాన్నగారిని మాకు కనిపించకుండా లాక్కుపోయాడు గానీ, ఆయన జ్ఞాపకాలని, ఆయన ఉనికిని, మాటని ఆలోచనలని మాత్రం ఈ నాటికీ అంగుళమైనా కదిలించలేకపోయాడు. 
– సంభాషణ: డా. వైజయంతి పురాణపండ

నాన్న మంచి నేర్పారు..
‘చిన్న పెద్ద అని వయోభేదం గానీ, స్థాయీ భేదం గానీ చూడకుండా ఎవరికి యివ్వవలసిన ప్రాధాన్యాన్ని వారికి ఇవ్వాలి, మన అభిప్రాయాలు మనకి ఉన్నట్లే అందరికీ ఉంటాయి, వాటిని గౌరవించాలి, ఎక్కడ ఎలా ఉన్నా లోపాలు ఎన్నక అందరినీ కలుపుకుని పోవాలి, ఏది కావాలన్నా దానికి కృషి చేయడమే మన వంతు. ఫలితం అనుకూలంగా వస్తే మరొక లక్ష్యం వైపు దృష్టి పెట్టు, ప్రతికూలిస్తే మళ్లీ ప్రయత్నించు. ఎలాగో అలా మరమనిషిలా బ్రతికేయడం కాదు, బుద్ధితో మనసుని అనుసంధానం చేసి జీవించు, అలా చేయగలిగినప్పుడే ఆనందం, తృప్తి నిన్ను అంటిపెట్టుకుని ఉంటాయి’ అని నాన్న నిరంతరం చెబుతుండేవారు. కానీ ఈ రోజుల్లో కాలం విలువ నేర్పే పెద్దలకి తీరిక లేదు. పిల్లలకి సమయమూ లేదు. – ఘంటసాల శ్యామల (ఘంటసాల పెద్ద కుమార్తె)
                                                                   

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు