నెలకు 3 లక్షల రూపాయల జీతం వదిలేసి..

7 Sep, 2022 19:50 IST|Sakshi
దేశవాళీ వరి పొలంలో ఘనజీవామృతం చల్లుతున్న రైతు ఘట్‌రాజు వెంకటేశ్వరరావు

ప్రకృతి సేద్యం చేస్తున్న ఘట్‌రాజు వెంకటేశ్వరరావు

ఆయన ఓ విశ్రాంత ఉద్యోగి. నెలకు రూ.3 లక్షలు జీతం. ప్రైవేటు కంపెనీలో డిజిఎంగా పనిచేసి వీఆర్‌ఎస్‌ తీసుకున్నారు ఘట్‌రాజు వెంకటేశ్వరరావు. వ్యవసాయంపై ఉన్న ఆసక్తితో అమ్మమ్మ గారి ఊరు కృష్ణా జిల్లా కంకిపాడు మండలం కోలవెన్ను గ్రామానికి వచ్చి తమ 4.5 ఎకరాల పొలంలో ప్రకృతి వ్యవసాయ విధానంలో దేశీ వరి రకాల సాగు చేపట్టారు. సుమారు రెండేళ్లు నిల్వ చేసిన ధాన్యాన్ని ఆరోగ్యదాయకమైన దేశీ బియ్యం విక్రయిస్తూ లాభాలతో ఆత్మసంతృప్తిని ఆర్జిస్తున్నారు. ఆయన అనుభవాల సారం ఆయన మాటల్లోనే..

‘‘ప్రముఖ కంపెనీలో ముంబైలో ఉద్యోగం చేశాను. డీజీఎంగా బాధ్యతలు నిర్వహణ. ఐదేళ్ల క్రితం వీఆర్‌ఎస్‌ తీసుకుని హైదరాబాద్‌కు వచ్చేశాను. అప్పటికే ప్రకృతి సేద్యంపై ప్రచారం విస్తృతంగా సాగుతోంది. ప్రకతి వ్యవసాయ నిపుణులు సుభాష్‌ పాలేకర్‌ శిక్షణా తరగతుల్లో పాలొని మెళకువలు నేర్చుకున్నా. ఆచరణలో పెట్టేందుకు అమ్మమ్మ వాళ్ల ఊరైన కోలవెన్ను వచ్చి స్థిరపడ్డా. 4.5 ఎకరాల్లో తులసీబాణం, నారాయణ కామిని, నవారా, కాలాభట్, మార్టూరు సన్నాలు, రత్నచోడి, బహురూపి వంటి దేశీ వరి రకాలు సాగు చేస్తున్నా. రెండు ఆవులను తెచ్చుకున్నా.


ఏటా సాగు ఆరంభంలో 40 ట్రక్కుల ఘన జీవామృతాన్ని పొలంలో చల్లుతున్నా. పంటకు అన్ని పోషకాలు సమృద్ధిగా లభిస్తున్నాయి. వర్రలతో బావిని కట్టించి 1200 లీటర్ల జీవామృతం తయారుచేసి 15 రోజులకోసారి చల్లుతున్నా. పంట ఆరోగ్యంగా ఎదుగుతున్నది. తెగుళ్ల బెడద లేదు. ఆవ పిండి చెక్క కూడా జీవామృతంలో కలిపి వాడుతున్నా. ఎకరాకు రూ. 25–30 వేల వరకూ పెట్టుబడి అవుతుంది. 25–28 బస్తాల వరకూ ధాన్యం దిగుబడి వస్తున్నది. పంటను ఆశించే పురుగు నివారణకు వేపపిండి చల్లుతాను. పోషకాలు జీవామతం ద్వారా అందుతాయి. మరీ అవసరం అయితే, అగ్ని అస్త్రం చల్లుతాను. ఎలాంటి పురుగైనా నాశనం అవుతుంది.  

దేశవాళీ విత్తన పంట నిల్వ, మార్కెటింగ్‌ విషయాలు చాలా ప్రధానమైనవి. పంట చేతికి వచ్చాక కనీసం 10 నెలల నుంచి రెండేళ్ల వరకూ పంటను మాగబెట్టిన ధాన్యాన్ని మిల్లులో ఆడించి నాణ్యమైన బియ్యాన్ని బెంగుళూరు, హైదరాబాద్, కొచ్చిన్, చెన్నై ప్రాంతాల్లో ఉన్న నేరుగా విక్రయిస్తున్నా. నవారా, కాలాభట్‌ స్థానికంగా కిలో రూ. 90కి, బయట ప్రాంతాలకు రూ. 120కే అందిస్తున్నా, రవాణా ఖర్చు కూడా కలిపి. ఇతర రకాల బియ్యం కిలో రూ.75కే ఇస్తున్నా. 

ప్రతి రైతూ ప్రకృతి విధానం వైపు అడుగులు వేస్తే దిగుబడులు, ఆరోగ్యం, ఆదాయం, భూసారం పెంపుదల సాధ్యమే. ప్రభుత్వం రైతు భరోసా, ఇతర సబ్సిడీలు అందిస్తున్నది. వీటితో పాటు ప్రకృతి విధానంలో పండించిన పంటకు అంతర్జాతీయంగా ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని మార్కెటింగ్‌ సదుపాయాలు విస్తరించి, అదనపు వసతులు కల్పిస్తే కొత్త రైతులు కూడా ఈ విధానంలోకి వచ్చేస్తారు.’’ 
– ఈ.శివప్రసాద్, సాక్షి, కంకిపాడు, కృష్ణా జిల్లా


వడ్లు ఎంత మాగితే అన్నం అంత ఒదుగుతుంది. ధాన్యం నిల్వ చేయకుండా తినటం వల్ల కడుపు నొప్పి, అజీర్ణ సమస్యలు ఏర్పడతాయి. పంట నాణ్యంగా ఉంటే ఆరోగ్యం వృద్ధి చెందుతుంది. అలాగే ప్రకృతి విధానం వల్ల భూసారం పెంపొందుతుందని గుర్తించాను. (క్లిక్‌: కొబ్బరి పొట్టుతో సేంద్రియ ఎరువు! ఎలా తయారు చేసుకోవాలంటే!)
– ఘట్‌రాజు వెంకటేశ్వరరావు (92255 25562), కోలవెన్ను 

మరిన్ని వార్తలు