రాణిగారి ‘తీపి’ బహుమతికి 121 ఏళ్లు..

3 Apr, 2021 06:46 IST|Sakshi

ఎప్పుడో ఒకసారి మనకు బుద్ధి పుట్టినప్పుడు అటకెక్కి చూస్తే అబ్బురపరిచే అలనాటి వస్తువులు గత జ్ఞాపకాలెన్నింటినో తట్టి లేపుతాయి. తాజాగా బ్రిటన్‌లో 121 ఏళ్ల నాటి చాక్లెట్‌ బార్‌ ఒకటి దొరికింది. వందేళ్ల తరువాత దొరికిన ఈ చాక్లెట్‌ చెక్కుచెదరకుండా ఉండడం విశేషం. తూర్పు ఇంగ్లాండ్‌లోని  నార్ఫోక్‌లో ఓ ఇంట్లో అటకపై ఉన్న హెల్మెట్లో చాక్లెట్‌బార్‌ కనిపించింది. ఈ చాక్లెట్‌ ‘సర్‌ హెన్రీ ఎడ్వర్డ్‌ పాస్టన్‌ బేడింగ్‌ ఫీల్డ్‌’ అనే సైనికుడిదని యునైటెడ్‌ కింగ్‌డమ్‌ ద నేషనల్‌ ట్రస్టు ధ్రువీకరించింది. 1899, 1902 లలో రెండో బోయర్‌ యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో పోరాడుతున్న బ్రిటిష్‌ దళాలను ప్రోత్సహించేందుకు.

క్వీన్‌ విక్టోరియా ఒక చిన్న బాక్స్‌లో చాక్లెట్‌ పెట్టి..‘సౌత్‌ ఆఫ్రికా 1900! ఐ విష్‌ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్‌’ అని విక్టోరియా స్వదస్తూరిని రేపర్‌ మీద ముద్రించి బ్రిటిష్‌ దళాలకు పంపింది. ఈ చాక్లెట్‌ బరువు 226 గ్రాములు. అయితే గతేడాది సర్‌ హెన్రీ (100) మరణించడంతో ఆయన కుమార్తె హెన్రీకి సంబంధించిన వస్తువులను పరిశీలించగా ఈ చాక్లెట్‌ బయటపడింది. ఇప్పుడు ఈ చాక్లెట్‌ను ఇంగ్లాండ్‌ వారసత్వ సంపదగా భద్రపరుస్తున్నట్లు నేషనల్‌ ట్రస్టు ప్రకటించింది.

బ్రిటిష్‌ సైనికులకు చాక్లెట్‌లు సరఫరా చేసేందుకు క్వీన్‌ విక్టోరియా మూడు చాక్లెట్‌ కంపెనీలను సంప్రదించారు. దీనికి ఆ కంపెనీలు  ఎటువంటి రుసుమును తీసుకోకుండా చాక్లెట్‌ను తయారు చేసి ఇస్తామని చెప్పి అలానే ఇచ్చాయి. అంతేగాకుండా తమ కంపెనీ బ్రాండ్‌ నేమ్‌ను ఎక్కడా కనిపించనియ్యలేదు. పేరులేని బాక్సుల్లో చాక్లెట్‌ను పెట్టి సైనికులకు ఇచ్చారు. అయితే దక్షిణాఫ్రికాపై నియంత్రణ సాధించడానికి గ్రేట్‌ బ్రిటన్‌.. రెండు స్వతంత్ర బోయర్‌ రాష్ట్రాలపై యుద్ధాలు చేసింది. రెండవ బోయర్‌ యుద్ధం 1899–1902 మధ్య కాలంలో జరిగింది. 1902 మేనెలలో బోయర్‌ పక్షం బ్రిటిష్‌ నిబంధనలను అంగీకరించి, వెరెనిగింగ్‌ ఒప్పందంపై సంతకం చేయడంతో యుద్ధం ముగిసింది. 

మరిన్ని వార్తలు