‘ద గర్ల్‌ ఆన్‌ ద ట్రైన్‌’‌ సినిమా రివ్యూ

2 Mar, 2021 00:00 IST|Sakshi

వెబ్‌ఫ్లిక్స్‌

‘ది ఇన్‌ విజబుల్‌ గెస్ట్‌’ (స్పానిష్‌) సినిమా ఆధారంగా హిందీలో వచ్చిన బద్‌లా (తెలుగులో కూడా వచ్చింది ‘ఎవరు?’) తర్వాత బాలీవుడ్‌లో ఈ తరహా సినిమాల జోరు పెరిగింది. ఓటీటీల్లో అయితే ఈ సస్పెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్స్‌కి కొదవే లేదు. సెన్సార్‌షిప్‌ లేకపోవడంతో నేరాలు, హింస, లైంగిక హింసే ప్రధానాంశాలుగా ఈ సినిమాలు వస్తున్నాయి. అలాంటి జాబితాలోకే చేర్చవచ్చు నెట్‌ఫ్లిక్స్‌ ఒరిజినల్‌ హిందీ చిత్రం ‘ద గర్ల్‌ ఆన్‌ ద ట్రైన్‌’. సైకాలజికల్‌ థ్రిల్లర్‌గా ఫిబ్రవరి 26వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్‌ అవుతోంది. ‘ద గర్ల్‌ ఆన్‌ ద ట్రైన్‌’ పేరుతోనే పౌలా హాకిన్స్‌ రాసిన నవలే దీనికి ఆధారం. అయితే  2016లోనే ఈ ఇంగ్లిష్‌ నవల అదే పేరుతో హాలీవుడ్‌ తెరకూ పరిచయం అయింది. లేటెస్ట్‌ ‘ద గర్ల్‌ ఆఫ్‌ ద ట్రైన్‌’ గురించే నేటి వెబ్‌ఫ్లిక్స్‌.

కథ..
మీరా (పరిణీతి చోప్రా).. లండన్‌లో సక్సెస్‌ఫుల్‌ లాయర్‌. ఆమెను ఇష్టపడి పెళ్లి చేసుకుంటాడు శేఖర్‌ కపూర్‌ (అవినాశ్‌ తివారీ) అనే కార్డియాలజిస్ట్‌. ఒక హత్య కేసులో జిమ్మి బగ్గా (క్రిషన్‌ టండన్‌) అనే డ్రగ్‌ డీలర్‌కు వ్యతిరేకంగా వాదిస్తుంది మీరా. ఆ కేస్‌ నుంచి తప్పుకోమని జిమ్మీ బగ్గా ఆమెను బెదిరిస్తాడు. లెక్క చేయదు. శిక్షపడేలా చేస్తుంది. ఆ డీలర్‌ జైల్లోని తన సెల్‌లో ఆత్మహత్య చేసుకుని చనిపోతాడు. ఈ విషయం మీరాకు తెలియదు. ఒకరోజు భర్తతో కలిసి బయటకు వెళ్లినప్పుడు కారు ప్రమాదానికి గురవుతుంది. అప్పటికి మీరా గర్భవతి. భార్యాభర్తలిద్దరికీ గాయాలవుతాయి. మీరాకు అబార్షన్‌ అవుతుంది.

ప్రమాదం తర్వాత..
మీరా జీవితమే మారిపోతుంది. మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. ఒకరకమైన అమ్నేసియా బారిన పడుతుంది. తాగుడికి బానిసవుతుంది. లాయర్‌ వృత్తిని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుంది. భార్యాభర్తల మధ్యా సఖ్యత లోపిస్తుంది. విడాకులు తీసుకుని ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు శేఖర్‌. ఇది మీరాను మరింత కుంగదీస్తుంది. కష్టకాలంలో తోడుండాల్సిన భర్త తన నుంచి విడిపోవడాన్ని తట్టుకోలేకపోతుంది. ఇంటికి వెళ్లి తనతో కలిసుండమని పోరుతుంటూంది. శేఖర్, అతడి భార్య.. మీరాను విసుక్కుంటూంటారు. ఒకానొక దశలో శేఖర్‌ ఆమెను బెదిరిస్తాడు కూడా. అయినా భర్తను మరచిపోలేకపోతుంది.

రెడ్‌ బ్రిడ్జ్‌ టు గ్రీన్‌విచ్‌
ప్రతి రోజూ రైల్లో రెడ్‌ బ్రిడ్జ్‌ నుంచి గ్రీన్‌విచ్‌కు ప్రయాణం చేస్తుంటుంది. శేఖర్, తను కలిసి ఉన్న ఇంటిని చూసుకోవడం కోసం. రైల్లో వెళ్తున్నప్పుడు ఆ ఇల్లు కనిపిస్తుంది. కాని ఆ ఇంట్లోకి ఓ కొత్త జంట దిగి ఉంటారు. ఆ అమ్మాయి పేరు నుస్‌రత్‌ జాన్‌ (అదితీరావ్‌ హైదరీ). ఆమే డాక్టరే. భర్త ఆనంద్‌ (షమాన్‌ అహ్మద్‌)తో కలిసి ఆ లోగిలిలో ఆమె సంతోషంగా కనపడ్డం, హాయిగా ఉండడం.. చూసి ఎంత పర్‌ఫెక్ట్‌ లైఫ్‌ అని అబ్బురపడుతుంది. నుస్రత్‌లో ఒకప్పటి తనను చూసుకొని ఇప్పుడా జీవితం లేనందుకు ఒకరకంగా అసూయ చెందుతుంది. ఆ ఇంటిని.. ఆమెను చూడ్డం ఆమె దినచర్యలో భాగం అవుతుంది. తను కోల్పోయిన జీవితాన్ని తలచుకొని తలచుకొని కుంగిపోతూంటుంది.

ఈ క్రమంలోనే ఒకసారి ఆ ఇంట్లో నుస్రత్‌ పక్కన ఆమె భర్త కాకుండా ఇంకో వ్యక్తి కనిపిస్తాడు. తన భర్త తనను మోసం చేసినట్టు.. నుస్రత్‌ ఆమె భర్తను మోసం చేస్తోందని అభిప్రాయపడుతుంది. తన భర్త మీదున్న కోపమంతా నుస్రత్‌ మీదికి బదిలీ చేసుకొని తగిన బుద్ధి చెప్పాలనుకుంటుంది. ఆ ఆగ్రహావేశాలతోనే నుస్రత్‌ వాళ్లింటికి వెళ్తుంది. ఆ సమయంలో నుస్రత్‌ ఉండదు. తమ ఇంటి వెనక ఉన్న అడవిలోకి వెళ్తూ కనిపిస్తుంది మీరాకు. వెంటనే ఆమెను అనుసరిస్తుంది మీరా. ఒకదశలో నుస్రత్‌ను సమీపించి కొడుతుంది కూడా. అలా హఠాత్తుగా వెనక నుంచి తన మీద దాడి చేసేసరికి ఆత్మరక్షణలో భాగంగా అసంకల్పితంగా ప్రతి దాడి చేస్తుంది నుస్రత్‌.

మిస్సింగ్‌.. 
డాక్టర్‌ నుస్రత్‌ మిస్సింగ్‌ అని ఆమె ఆసుపత్రి సహోద్యోగులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తారు. ఆ ఫిర్యాదును అందుకున్న ఇన్‌స్పెక్టర్‌ దల్బీర్‌ కౌర్‌ (కృతి కల్హారి) ముందుగా నుస్రత్‌ భర్తను అనుమానిస్తుంది. రెండురోజులుగా భార్య కనిపించకపోయినా అతను ఫిర్యాదు చేయలేదు ఎందుకు అని? స్టేషన్‌కు పిలిపించి, ఆరా తీసి అతని మీద నిఘా పెడుతుంది. చివరిసారిగా నుస్రత్‌ ఎక్కెడెక్క కనిపించిందో ఆయా ప్రదేశాల్లోని అందరినీ విచారించే భాగంలో నుస్రత్‌ మాజీ బాయ్‌ ఫ్రెండ్‌ మీదా అనుమానం వస్తుంది. నిఘా పెట్టినా విషయం తేలదు. ఈ క్రమంలోనే ఆమె దృష్టి మీరా మీదా పడుతుంది. ఆ రోజు నుస్రత్‌ ఇంటిముందున్న సీసీ కెమెరాలో మీరా వచ్చినట్టు రికార్డ్‌ అవుతుంది. ఈలోపు గ్రీన్‌విచ్‌ ఫారెస్ట్‌లో నుస్రత్‌ శవమై కనిపిస్తుంది. నుస్రత్‌ ఇంటిముందు సీసీ కెమెరా ఫుటేజ్‌తోపాటు అడవిలో దొరికిన ఆధారాలు, రైల్వేస్టేషన్‌ సీసీ కెమెరా ఫుటేజ్‌ అన్నిటితో ఆ హత్య చేసింది మీరా అనే నిర్ధారణకు వస్తుంది దల్బీర్‌. ఆమెను స్టేషన్‌కు పిలిపిస్తుంది కూడా. ఆ ఫుటేజ్‌ చూపిస్తూ ఇంటరాగేషన్‌ చేసే ప్రయత్నం చేస్తుంది ఇన్‌స్పెక్టర్‌. కాని అవేవీ మీరాకు గుర్తుండవు. తనకున్న జబ్బు గురించి చెప్పి.. తన నిస్సహాయతను వెల్లడిస్తుంది మీరా. ఆమె మీదా నిఘా పెట్టి మీరాకు వైద్యం అందిస్తున్న డాక్టర్‌ను కలిసి ఆమె చెప్పింది నిజమో కాదో నిర్ధారణకు వస్తుంది దల్బీర్‌. 

బ్లాక్‌మెయిల్‌..
ఈ లోపు మీరాకు ఫోన్‌లో ఆ అడవిలో నుస్రత్‌ను కలిసిన ఫోటోలతో బ్లాక్‌మెయిల్‌ మెసేజ్‌లు వస్తూంటాయి. ఏదో మతలబు ఉంది అనే అనుమానం కలుగుతుంది ఆమెకు. పోస్ట్‌మార్టమ్‌ రిపోర్ట్‌లో నుస్రత్‌ ప్రెగ్నెంట్‌ అని తేలుతుంది. అయితే ఆ హత్య చేసింది ఆ రోజు నుస్రత్‌ వాళ్లింట్లో చూసిన వ్యక్తే అని, తనకు బ్లాక్‌మెయిల్‌ మెసేజ్‌లు పంపుతుందీ అతనే అనుకొని అతని గురించి ఎంక్వయిరీ చేస్తుంది. అతను సైకియాట్రిస్ట్‌ డాక్టర్‌ హమీద్‌ అని, డిప్రెషన్‌లో ఉన్న నుస్రత్‌ను ట్రీట్‌ చేస్తున్నట్టు తెలుస్తుంది. వెళ్లి కలుస్తుంది. కాని ఆ హత్యతో తనకేమీ సంబంధం లేదంటాడు. ఇంకోవైపు మీరా ఆచూకీ కోసం పోలీసులు వెదుకుతుంటారు. చివరకు తనకు బ్లాక్‌మెయిల్‌ మెసేజ్‌లు పంపుతున్న వ్యక్తి ఎవరో తెలుస్తుంది. కలవడానికి వెళ్లేసరికీ అతనూ హత్యకు గురవుతాడు. గందరగోళంగా అనిపిస్తుంది మీరాకు. ఎలాగోలా ఆ బ్లాక్‌మెయిలర్‌ అడ్రస్‌ పట్టుకొని అతని ఇంటికి వెళ్లిన మీరా షాక్‌ అవుతుంది. ఆ ఇంట్లో నుస్రత్, మీరా భర్త కలిసున్న ఫోటోలు కనపడ్తాయి. అంటే ఆ బ్లాక్‌మెయిలర్‌ ఆ రోజు ఫారెస్ట్‌లోకి నుస్రత్‌ను ఫాలో అవుతూ వచ్చాడన్నమాట. తను కనపడేసరికి తననూ బ్లాక్‌మెయిల్‌ చేశాడని అర్థమవుతుంది మీరాకు. ఇంతకీ తన భర్తతో నుస్రత్‌కేం పని? అనే ఆలోచనల్లో పడుతుంది. వాళ్లిద్దరూ చాలా సన్నిహితంగా ఉన్న ఫోటోలవి. ఎక్కడో చిక్కుముడి వీడుతున్న భావన మీరాలో.

ఆ దిశగా పరిశోధన చేస్తుంది మీరా. విలన్‌ తన మాజీ భర్త డాక్టర్‌ శేఖరే అని తేలుతుంది. శేఖర్, నుస్రత్‌ ఇద్దరూ ఒకే ఆసుపత్రిలో డాక్టర్లు. ఆమెతో వివాహేతర సంబంధంలో ఉంటాడు శేఖర్‌. అతని వల్లే గర్భవతి అవుతుంది నుస్రత్‌. ఆ విషయం చెప్పడానికే ఆ రోజు తమ ఇంటి వెనక ఉన్న అడవిలోకి శేఖర్‌ను రమ్మంటుంది నుస్రత్‌. అప్పుడే మీరా ఆమెను వెంబడించడాన్ని శేఖర్‌కు చెప్తుంది. అతను మీరాను చూస్తాడు. ఇక్కడా తనను వదిలేట్టు లేదు కదా.. అని కోపం తో మీరాను కొడ్తాడు శేఖర్‌. స్పృహ తప్పి పడిపోతుంది మీరా. మళ్లీ నుస్రత్‌ దగ్గరకు చేరేసరికి ఆమె తాను తల్లిని కాబోతున్నాన్న మాట చెప్తుంది. అతని మొహం వివర్ణమవుతుంది. తనకు పిల్లలంటే ఇష్టం లేదు అని చెప్తాడు. విస్తుపోతుంది నుస్రత్‌. ఈ విషయం మీద ఇద్దరికీ వాగ్వాదం జరుగుతుంది. కోపంతో నుస్రత్‌ గొంతు నొక్కేస్తాడు శేఖర్‌. కుప్పకూలిపోతుంది నుస్రత్‌. చనిపోయిందనుకొని చేతులు దులిపేసుకొని అక్కడి నుంచి జారుకుంటాడు. ఇదంతా ఫోటోలుగా తీస్తాడు ఆ బ్లాక్‌ మెయిలర్‌. శేఖర్‌ విలన్‌ అని తేలుతుంది కాని హంతకుడా అతను కాదనే నిజమూ బయటపడుతుంది ఆ బ్లాక్‌మెయిలర్‌ కెమెరాలోని ఫోటోలోతోనే.

మరి మర్డరర్‌ ఎవరు?
ఇన్‌స్పెక్టర్‌ దల్బీర్‌ కౌర్‌ బగ్గా. ఎస్‌.. డ్రగ్‌ డీలర్‌ కూతురు. తన తండ్రి చావుకి కారణమైందన్న కోపంతో మీరా మీద ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుంది. ఆమె కారుకి యాక్సిడెంట్‌ చేయించిందీ దల్బీరే. నుస్రత్‌ను చంపి.. ఆ హత్యానేరం మీరా మీదకు తోసి జైలు పాల్జేయాలనీ పథకం వేస్తుంది. కానీ మీరా ఇన్వెస్టిగేషన్‌తో చివరకు తానే హంతకురాలని నిర్ధారణ అవుతుంది. 

ముగింపు..
సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా కాకుండా.. క్లూలు మిస్‌ అయిన పజిల్‌లా అనిపిస్తుందీ సినిమా. తర్వాత జరగబోయే సీన్‌ ఏంటో తెలిసిపోతూ ఉంటుంది. ఇంటిల్లిపాదీ కలిసి చూడదగ్గ సినిమా కాదు.

మరిన్ని వార్తలు