Gita Gopinath: ఆర్థికశాస్త్ర దిగ్గజాల సరసన భారతీయురాలు.. తొలి మహిళగా రికార్డు 

12 Jul, 2022 08:35 IST|Sakshi

‘అర్థం కావాలేగానీ ఆర్థికశాస్త్ర విషయాలు చందమామ కథల కంటే ఎక్కువగా ఆకర్షిస్తాయి’ అంటారు. అది ఎంత వరకు నిజమో తెలియదుగానీ, గీతా గోపీనాథ్‌కు ఆర్థికశాస్త్రం అనేది శ్వాస! సివిల్‌ సర్వీసులలో చేరాలనేది తన మొదటి కల. అయితే ఆర్థికశాస్త్రంపై ఆసక్తి ఆమెను వేరే దారిలోకి తీసుకెళ్లింది. ప్రపంచ ఆర్థికశాస్త్ర దిగ్గజాల సరసన చేర్చింది... ఐఎంఎఫ్‌ (అంతర్జాతీయ ద్రవ్యనిధి) గోడ (వాల్‌ ఆఫ్‌ ఫార్మర్‌ చీఫ్‌ ఎకనామిస్ట్స్‌)పై ఆ సంస్థ తరపున పనిచేసిన ప్రముఖ ఆర్థికవేత్తల ఫోటోలు వరుసగా కనిపిస్తాయి. ఒక్కో ఫొటో చూస్తూ వెళుతుంటే ఆర్థికరంగంలో వారి మేధోకృషి గుర్తుకు వస్తుంటుంది. అపురూపమైన చిత్రాలు అవి. ఇప్పుడు ఆ ఫొటోల వరుసలో ఆర్థికవేత్త గీతా గోపీనాథ్‌ ఫోటో చేరింది.

ఐఎంఎఫ్‌ వాల్‌ ఫొటోల వరుసలో కనిపించిన తొలి మహిళా ఆర్థికవేత్తగా గీతా గోపీనాథ్‌ తనప్రత్యేకతను చాటుకుంది. ట్రెండ్‌ను బ్రేక్‌ చేస్తూ ప్రఖ్యాత ఆర్థికవేత్తల ఫొటోల వరుసలో తన ఫోటో ఏర్పాటు చేసినందుకు ట్విట్టర్‌ ద్వారా సంతోషం వ్యక్తం చేసింది గీత. ఇండియన్‌–అమెరికన్‌ ఆర్థికవేత్తగా పేరు తెచ్చుకున్న గీతా గోపినాథ్‌ కోల్‌కతాలో జన్మించింది. మైసూర్‌లోని నిర్మల కాన్వెంట్‌ స్కూల్‌లో చదువుకుంది. దిల్లీలో లేడి శ్రీరామ్‌ కాలేజ్‌ ఫర్‌ ఉమెన్‌లో బీఏ, యూనివర్శిటీ ఆఫ్‌ వాషింగ్టన్‌లో ఎం.ఏ. చేసింది. ప్రిన్స్‌టన్‌ యూనివర్శిటీ నుంచి పీహెచ్‌డి పట్టా అందుకుంది.

చదువు పూర్తయిన తరువాత హార్వర్డ్‌ యూనివర్శిటీ ఇంటర్నేషనల్‌ స్టడీస్‌ అండ్‌ ఎకనామిక్స్‌ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేసింది. ఏడవ తరగతి వరకు గీతకు 45 శాతం లోపు మార్కులు వచ్చేవి. తల్లిదండ్రులెప్పుడూ మార్కుల విషయంలో ఒత్తిడి తెచ్చేవారు కాదు. అయితే ఏడవ తరగతి తరువాత మాత్రం గీత చదువులో దూసుకుపోయింది. మార్కులే మార్కులు! అంతమాత్రాన చదువే లోకం అనుకోలేదు. హాయిగా ఆటలు ఆడేది. పాటలు పాడేది. గిటార్‌ వాయించేది. ఫ్యాషన్‌ షోలలో పాల్గొనేది. గణితం నుంచి సైన్స్‌ వరకు ఎంత జటిలమైన విషయాన్ని అయిన నాన్న గోపీనాథ్‌ ఇంట్లో ఉన్న వస్తువులను ఉదహరిస్తూ సులభంగా అర్థమయ్యేలా చెప్పేవాడు. బహుశా గీతకు ఆ లక్షణమే వచ్చి ఉంటుంది.

జటిలమైన ఆర్థిక విషయాలను వేగంగా అర్థం చేసుకోవడంలోనే కాదు, వాటిని సులభంగా బోధించడంలో పట్టు సాధించింది. గీత పరిశోధన పత్రాలు టాప్‌ ఎకనామిక్స్‌ జర్నల్స్‌లో ప్రచురితమయ్యాయి. వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ ‘యంగ్‌ గ్లోబల్‌ లీడర్‌’ (2011) పురస్కారాన్ని అందుకుంది. 2014లో ‘టాప్‌ 25 ఎకనామిస్ట్స్‌ అండర్‌ 45’ జాబితాలో చోటు సంపాదించింది. భారత ప్రభుత్వ అత్యున్నత పురస్కారం ప్రవాసీ భారతీయ సమ్మాన్‌ అందుకుంది. ఐఎంఎఫ్‌లో చీఫ్‌ ఎకనామిస్ట్‌గా పనిచేసిన గీత ప్రస్తుతం ఐఎంఎఫ్‌–డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ పదవిలో ఉంది. 

మరిన్ని వార్తలు