అద్దంలోని ముడుపులు

10 Aug, 2020 08:02 IST|Sakshi
నవల: ద గ్లాస్‌ హోటల్‌ , రచన: ఎమిలీ సెయింట్‌ జాన్‌ మెండేల్‌ ప్రచురణ: నాప్ఫ్‌; 2020 

కొత్త బంగారం

2008 ప్రాంతంలో అమెరికాలో పాంజీ స్కీం రూపంలో అతిపెద్ద ఆర్థికనేరం బయటపడి పెనుసంచలనం సృష్టించింది. ప్రజల నుంచి పెట్టుబడులు ఆహ్వానించి, ఆ సొమ్మును వివిధ రంగాలలో పెట్టుబడులుగా పెట్టి అధిక లాభాలను ఆర్జించి, తిరిగి చెల్లింపుల రూపంలో వారికే అందిస్తామని ప్రలోభపెట్టి, చివరికి ఒకరిచ్చిన సొమ్మునే మరొకరికి లాభాల పేరుతో ముట్టచెప్పే మోసపూరితమైన వ్యాపారమే పాంజీ స్కీం. కొన్ని వేలకోట్ల డాలర్లతో నడిచిన ఈ పాంజీ స్కీం బయటపడ్డాక దీనికి రూపకర్త అయిన బెర్నీ మెడాఫ్‌కి అమెరికా న్యాయస్థానం 150 యేళ్ల జైలుశిక్ష విధించింది. వైట్‌కాలర్‌ నేరం ఇతివృత్తంగా రాసిన ‘ద గ్లాస్‌ హోటల్‌’ నవలని ఈ కథతో ముడిపెట్టి రాశారు కెనడియన్‌ రచయిత్రి ఎమిలీ సెయింట్‌ జాన్‌ మెండేల్‌. దయ్యాల కథలన్నా తనకు చాలా ఇష్టమనే ఈ రచయిత్రి, దయ్యాలంటూ వేరే ఉండవనీ తాము జీవించలేకపోయిన జీవితం, తీసుకోలేకపోయిన నిర్ణయాలూ, ఓడిపోయిన పరిస్థితులే మనిషిని ఆ రూపంలో వెంటాడుతుంటాయని అంటారు. 

పట్టణపు వాసనలు లేని కయేట్‌ అనే ఊహాజనిత ప్రదేశంలో కథ మొదలవుతుంది. ఒకవైపు సముద్రమూ, మరోవైపు అడవీ, ఇరవై గడపలూ ఉన్న ఆ చిన్న ఊళ్లో అత్యంత ఆధునికమైన హంగులతో, చుట్టూ ఉన్న అడవి కనిపించేలా నిలువెత్తు గాజు పలకలతో ‘కయేట్‌ హోటల్‌’ నిర్మిస్తాడు వ్యాపారవేత్త జానథన్‌. అదే ఊరికి చెందిన విన్సెంట్‌ అనే మహిళ తన సోదరుడు పాల్‌తో కలిసి ఆ హోటల్‌లో పనిచేస్తూ ఉంటుంది. భార్య మరణించడంతో ఒంటరిగా ఉన్న జానథన్, సహజీవనం చేసే ఒప్పందం మీద విన్సెంట్‌ని తనతోపాటు కనెక్టికట్‌కి తీసుకెళ్లిపోతాడు. అతిసామాన్యమైన జీవితంలో నుంచి ఐశ్వర్యంలోకి అడుగుపెట్టిన విన్సెంట్‌ సకల సౌకర్యాలను అనుభవిస్తున్నా, జరిగిన ప్రతి సంఘటనా వేరేలా జరిగుంటే జీవితం మరోలా ఉండేదని అనుకుంటుంది. జానథన్‌తో చేసుకున్న ఒప్పందం సరైనది కాదని అనిపించినా, తాననుభవిస్తున్న జీవితానికి ఆమాత్రం మూల్యం చెల్లించుకోవడం సబబే అని నచ్చజెప్పుకుంటూ ఉంటుంది. ఇంతలో జానథన్‌ చేసే పెట్టుబడుల వ్యాపారం మోసమనీ, పాంజీ స్కీం అనీ బయటపడి, ప్రభుత్వం అతన్ని జైల్లో పెడుతుంది. రెట్టింపు లాభాలకు ఆశపడి అతని దగ్గర పెట్టుబడి పెట్టిన కొన్ని వందలమంది జీవితాలు అస్తవ్యస్తమవుతాయి. 

జైల్లో జానథన్‌ ఉన్నగది గోడలమీద ‘ఏ నక్షత్రమూ శాశ్వతంగా వెలుగులు చిమ్మదు,’ అని రాసివున్న వాక్యం అతని అప్పటి స్థితికి సూచిక. చేసిన తప్పుని సమర్థించుకోడానికి ఎన్ని కారణాలు చెప్పుకున్నా కుదుటబడని అతని మనసు, అపరాధ భావనకి లోనై తనవల్ల మోసపోయినవారూ, తన గజిబిజి ఆలోచనలూ దయ్యాలై చుట్టుముడుతున్న విభ్రాంతికి లోనవుతుంది. జానథన్‌తో పనిచేసిన కొందరు తప్పొప్పుకొని జైలుపాలైతే, మరికొందరి వైవాహిక జీవితాలు విచ్ఛిన్నమవుతాయి. శిక్ష తప్పించుకోటానికి దేశమే వదిలి పారిపోయిన ఒక ఉద్యోగి ఏదోనాడు పోలీసులు తనని అరెస్ట్‌ చేస్తారన్న ఆందోళనతో మనశ్శాంతిని కోల్పోతాడు. పరిస్థితులని ఎదుర్కొని నిలదొక్కుకున్న విన్సెంట్‌ పేరూ, రూపం మార్చుకుని ఒక ఓడలో వంటమనిషిగా కుదురుకుని, అనూహ్యంగా సముద్రంలో పడి చనిపోతుంది. ఉద్యోగ విరమణ తరవాత వచ్చిన డబ్బంతా జానథన్‌ వల్ల కోల్పోయి రోడ్డున పడ్డ లియాన్‌ అనే వ్యక్తి భార్యతో కలిసి జీవితాన్ని పునర్నిర్మించుకునే ప్రయత్నాలు చేస్తుంటాడు. ‘‘మంచీ చెడూ అని ద్వంద్వాలు నిర్దిష్టంగా ఉంటాయా? రెండు ఛాయలూ ఏకకాలంలో ఉండవచ్చు కదా?’’ అని ప్రశ్నించే పాల్‌ వీటన్నిటికీ దూరంగా సంగీతకారుడిగా ఎదుగుతున్నప్పటికీ మాదకద్రవ్యాలకు బానిసై జీవితంలో ఎత్తుపల్లాలను చూస్తూనే ఉంటాడు.
దయ్యాల, ఆత్మల ప్రమేయాన్ని కొద్దిగా ప్రవేశపెట్టి, భిన్నమైన వ్యక్తిత్వాలని ఛిన్నాభిన్నమైన పరిస్థితుల నేపథ్యంలో, నాన్‌లీనియర్‌ పద్ధతిలో, సర్వసాక్షి కథనం ద్వారా పరిచయం చేస్తుంది రచయిత్రి. కథనం చురుగ్గా సాగడానికి సూటిగా సులువుగా ఉన్న భాష ప్రధాన కారణం అయింది. మార్చి నెలలో నాప్ఫ్‌ ప్రచురణ సంస్థ ద్వారా విడుదలయిన ఈ నవలకి పాఠకులు, విశ్లేషకుల స్పందన విశేషంగా ఉంది.
-పద్మప్రియ

మరిన్ని వార్తలు