ఎనిమిదోసారి మిస్‌.. లైట్‌ తీస్కో భయ్యా..!

28 Apr, 2021 00:16 IST|Sakshi
 చెదరని చిరునవ్వు :  ఎనిమిదిసార్లు ఆస్కార్‌కి నామినేట్‌ అయి కూడా ఒక్కసారీ అవార్డు పొందలేకపోయిన అమెరికన్‌ నటి గ్లెన్‌ క్లోజ్‌ 

తొలిసారి ఓటమి నిరాశ. రెండోసారి నిరుత్సాహం. మూడోసారి నిస్పృహ. నాలుగోసారి నిర్లిప్తత. గ్లెన్‌ క్లోజ్‌ వరుసగా ఏడుసార్లు ఓడిపోయారు!! 74 ఏళ్ల అమెరికన్‌ నటి గ్లెన్‌. తన 36 ఏళ్ల వయసు నుంచి ఆస్కార్‌ కి నామినేట్‌ అవుతూ వస్తున్నారు. మొన్నటి ఆస్కార్‌ లో ఎనిమిదో ఓటమి! మనసుకు ఎలా ఉంటుంది? గ్లెన్‌ కు ఎలానూ లేదు. పైగా డాన్స్‌ చేశారు! ‘నేమ్‌ దట్‌ సాంగ్‌’ అనే ఆస్కార్‌ సరదా రౌండ్‌ కార్యక్రమంలో ‘ద బట్‌’ అనే ముప్పై ఏళ్ల క్రితం నాటి పాపులర్‌ సినిమా పాటకు స్టెప్‌ లు వేసి మరీ రైట్‌ ఆన్సర్‌ ఇచ్చారు. అలాగే ఒక అంతర్లీన సందేశం కూడా. ‘లైట్‌ తీస్కో భయ్యా లైట్‌ తీస్కో’ లాంటి సందేశం! ఈ పరంపర పరాజిత అసలైన ఆస్కార్‌ విజేత అని ట్విట్టర్‌ నిన్నటి నుంచీ గ్లెన్స్‌ కి క్లాప్స్‌ కొడుతూనే ఉంది. 

గ్లెన్‌ క్లోజ్‌కు ఈసారి కూడా ఆస్కార్‌ చేజారింది! ఆ తర్వాతి కేటగిరీలోని అవార్డులు ప్రకటిస్తున్నప్పుడు డాల్బీ థియేటర్‌లో ఆమె ఓ వైపున మౌనంగా కూర్చొని ఉన్నారు. అప్పటికి ఆమె తన ఎనిమిదో గెలుపును కూడా కోల్పోయి కొన్ని నిమిషాలైనా కాలేదు కనుక ఆ మాత్రం మౌనంగా ఉండటం సహజమే. ముప్పై ఎనిమిదేళ్లుగా గ్లెన్‌ ఆస్కార్‌కి నామినేట్‌ అవుతున్నారు, విజేత కాలేకపోతున్నారు. ఈ ఏడాది ‘హిల్‌బిల్లీ ఎలిజీ’ చిత్రానికి ‘ఉత్తమ సహాయ నటి కేటగిరీ’లో నామినేట్‌ అయ్యారు. ఆమెకు కాకుండా అవార్డు మరొకరికి వచ్చింది. బహుశా ఆ క్షణంలో.. ‘అండ్‌ ది అవార్డ్‌ గోస్‌ టు’ అనే మాట ఆమె అభిమానులకు ‘అండ్‌ ది అవార్డ్‌ నాట్‌ గోస్‌ టు..’ అని వినిపించి ఉండాలి. అయితే గ్లెన్‌ మౌనంగా ఉన్నారు తప్పితే బాధగా లేరు! ఆ విషయం కొద్దిసేపటికే ఆమె తన కుర్చీ లోంచి లేచి, ఎంతో ఎనర్జిటిక్‌గా వేసిన స్టెప్పులను చూశాక ప్రపంచానికి తెలిసింది. ‘స్కూల్‌ డేజ్‌’ (1988) అనే హాలీవుడ్‌ చిత్రంలోని ‘ద బట్‌’ అనే పాటకు గ్లెన్‌ చేసిన డ్యాన్స్‌ అది. ఫంక్‌ గోగో సాంగ్‌. యంగ్‌స్టర్స్‌ మాత్రమే వేయగలరు. అలాంటిది.. డెబ్బై అయిదేళ్ల దరిదాపుల్లో ఉన్న గ్లెన్‌ కూడా వేశారు! ఆస్కార్‌ థియేటర్‌ దద్దరిల్లింది. ట్విట్టర్‌ బ్లాస్ట్‌ అయింది. సోషల్‌ మీడియా ‘ఓయమ్మో’ అని క్లాప్స్‌ కొట్టింది. ఇంకెక్కడి అపజయం. గ్లెన్‌ని వదిలిపెట్టి పారిపోయింది. 

లాస్‌ ఏంజెలిస్‌లోని డోల్బీ థియేటర్‌లో సోమవారం జరిగిన ఆస్కార్‌ వేడుకల సరదా సమయంలో ‘ద బట్‌’ పాటకు డాన్స్‌ చేస్తున్న పరాజిత గ్లెన్‌ క్లోజ్‌.

ఆస్కార్‌ వేడుక పూర్తిగా విజేతలదే అన్నట్లు ఉండదు. మధ్యలో కొన్ని సరదా రౌండ్‌లు కూడా ఉంటాయి. గెలుపు ఓటములకు నిమిత్తం లేకుండా.. నామినేట్‌ అయిన వారందరినీ ఉత్సాహపరిచే క్విజ్‌ల వంటివి అవి. సోమవారం విజేతల ప్రకటన అయ్యాక అమెరికన్‌ నటుడు లిల్‌ రెల్‌ హౌరీ చిన్న పోటీ పెట్టాడు. ‘ఆ పాటేమిటో చెప్పుకోండి’ అని. డీజే ఆ పాటను స్కీన్‌పై ప్లే చేశాడు. అప్పటి వరకు మౌనంగా ఉన్న గ్లెజ్‌ క్లోజ్‌ ఉత్సాహం గా పైకి లేచి.. ‘యా, దటీజ్‌.. ద బట్‌’ అని చెబుతూ.. అక్కడిక్కడే ‘ద బట్‌’ డ్యాన్స్‌ని వేసి చూపించారు. థియేటర్‌లో ఒక్కసారిగా ఆస్కార్‌ విజేతలు, పరాజితులు కలిపిపోయి ఆమె డాన్స్‌కు ఊగిపోయారు. ఎప్పటి పాట! ఇప్పటికీ అదే ఎనర్జీ! గ్లెన్‌ కూడా ఎప్పటి నటి! ఇప్పటికీ అదే స్పిరిట్‌. ‘ద బట్‌’ పాట ఉన్న ‘స్కూల్‌ డేజ్‌’ విడుదల అవడానికి ఐదేళ్ల ముందే 1983లో గ్లెన్‌ తొలిసారి ఆస్కార్‌కు నామినేట్‌ అయ్యారు. అప్పటికి ఆమె వయసు 36 ఏళ్లు. ఇప్పటికి ఎనిమిదిసార్లు నామినేట్‌ అయ్యారు. ఏనాడూ విజేత కాలేదు. ఈ ఏడాది ఆమె అపజయం ఆస్కార్‌ చరిత్రలో ఇప్పటివరకు ఉన్న ఒక పరాజితుని రికార్డుని సమం చేసింది. ఆ పరాజితుడు పీటర్‌ ఓటూల్‌. ఆయనా అంతే. తన జీవితకాలంలో ఎనిమిదిసార్లు ఆస్కార్‌కి నామినేట్‌ అయినా ఒక్కసారి అవార్డు పొందలేకపోయారు. 

‘స్కూల్‌ డేజ్‌’ చిత్రంలోని ‘ద బట్‌’ సాంగ్‌

విజయానికి మెట్లెప్పుడూ పైకే ఉంటాయనేం లేదు. ఓటమి సంభవించినప్పుడు ఒక్క మెట్టయినా మానసికంగా కిందికి దిగకపోవడం కూడా విజయమే. ఎనిమిదోసారి కూడా ఆస్కార్‌ను పొందలేకపోయినప్పటికీ గ్లెన్‌ ఏ మాత్రం నిరుత్సాపడకపోగా, చేజారిన గెలుపును మనుసులోకి చేరనివ్వలేదు. ఆస్కార్‌ వేడుకలకు ఒక అతిథిగా మాత్రమే వచ్చి కూర్చున్నంత నిలకడగా ఉన్నారు. అవార్డు రాలేదని తెలిశాక కూడా కొంచెమైనా డౌన్‌ అయిపోలేదు. అందుకే నెట్‌ యూజర్‌లు ఆమెను ‘అసలైన ఆస్కార్‌ విజేత’గా అభినందిస్తున్నారు. నాలుగుసార్లు ఉత్తమ నటిగా, నాలుగుసార్లు ఉత్తమ సహాయనటిగా ఆస్కార్‌కు నామినేట్‌ అయ్యారు గ్లెన్‌. ది వరల్డ్‌ ఎకార్డింగ్‌ టు గార్ప్‌ (1983), ది బిగ్‌ చిల్‌ (1984), ది నేచురల్‌ (1985), ఫ్యాటల్‌ అట్రాక్షన్‌ (1988) డేంజరస్‌ లయజన్స్‌ (1989), ఆల్బర్ట్‌ నాబ్స్‌ (2012), ది వైఫ్‌ (2019), ఈ ఏడాది (2021) హిల్‌బిల్లి ఎలిజీ చిత్రాలకు గ్లెన్‌ నామినేషన్‌ సాధించారు. ఫ్యాటల్‌ అట్రాక్షన్, డేంజరస్‌ లయజెన్స్, ఆల్బర్ట్‌ నాబ్స్, ది వైఫ్‌ చిత్రాలకు ఉత్తమ నటిగా, మిగతా నాలుగు చిత్రాలకు ఉత్తమ సహాయక నటిగా నామినేట్‌ అయ్యారు. ఈసారీ తనకు అవార్డు రాకపోవడంపై గ్లెన్‌ ప్రత్యేకంగా ఏమీ వ్యాఖ్యానించలేదు. అయితే గ్లెన్‌.. ‘ద బట్‌’ పాటకు డ్యాన్స్‌ చేయడం ఈ ఏడాది అస్కార్‌ టాప్‌ మూమెంట్స్‌లో ఒకటిగా నిలిచిపోయింది. 

మరిన్ని వార్తలు