Good Friday Special Story: వెలుగు పూలు పూయించిన కలువరి సిలువ

15 Apr, 2022 11:56 IST|Sakshi

మానవాళి రక్షణ కోసం మహోన్నతుని సిలువ యాగం మరణ భయాన్ని పటాపంచలు చేసింది. సాతాను కోరలు చీల్చి వేసింది. అంధకార బంధురమైన జీవితాల్లో వెలుగు పూలు పూయించింది. నిరీక్షణ లేని జీవితాల్లో వెలుతురు కిరణాలు ఉదయింపజేసింది. కరుణామయుని శిలువ యాగం గెత్సెమనే తోట నుంచే ప్రారంభమయింది. శుక్రవారం సిలువకు అప్పగించకముందే గెత్సెమనే తోటలో తన రక్తం స్వేదబిందువులుగా మారే వరకూ ప్రార్థనలో గడిపాడు.

లోక పాపాన్నంతా తన వీపుపైన మోసేందుకు సిద్ధమయ్యాడు. ఓ తరుణంలో తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్రను నానుండి తొలగించమని ప్రార్థించినా తండ్రి చిత్తాన్ని నెరవేర్చేందుకే సిద్ధమయ్యాడు. ఈ లోకాన్ని ఎంతో ప్రేమించిన దేవుడు తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందుటకే ఏర్పాటు చేసిన మార్గం సిలువ మార్గం.

ఒకవైపు గెత్సెమనే తోటలో రాత్రంతా ప్రార్థిస్తూ మానవ సాయం కోసం తన శిష్యుల వైపు చూశాడు. శోధనలో పడకుండా మెళకువగా వుండి ప్రార్థించండి అని చెప్పినా వారు నిద్రమత్తులై ఉన్నారు. అప్పుడే తాను ప్రేమించిన శిష్యుల్లో ఒకడైన ఇస్కరియోతు యూదా క్రీస్తు సిలువలో ప్రధాన పాత్రధారిగా మారి 30 వెండి నాణెములకు క్రీస్తును అప్పగించేందుకు మత పెద్దలతో ఒప్పందం కుదుర్చుకొని గెత్సెమనేలో ముద్దుపెట్టుకొని మరీ యేసును అప్పగించాడు. యేసును ఒక బందిపోటు దొంగమీదికి వచ్చినట్లు కత్తులతో వచ్చిన వారిని చూసి కనికరపడ్డాడు తప్ప ఒక్క మాటయినను పలుకలేదు. 

తన శిష్యులు తనను వదిలి పారిపోగా ఒంటరియైన యేసు ప్రధాన యాజకుడైన కయప వద్దకు తీసుకువచ్చి వారు ఆయన ముఖం మీద ఉమ్మివేసి, ఇష్టము వచ్చినట్టు గుద్దారు. మరికొంతమంది అర చేతులతో కొట్టి, నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపుమని హేళన చేశారు. ‘తన ప్రియ కుమారుని నలుగగొట్టడానికి ఆ దేవాది దేవునికి ఇష్టమాయెను’ అన్న లేఖనాలు ఈ విధంగా నెరవేరాయి. 

ఉదయం యేసును బంధించి అధిపతియైన పొంతి పిలాతుకు క్రీస్తును అప్పచెప్పారు. చివరకు అన్యాయపు తీర్పే గెలిచింది. యూదా మత పెద్దలకు భయపడి పొంతి పిలాతు యేసును సిలువకు అప్పగించాడు. వారు యేసును గొల్గొతా కొండకు తీసుకు వచ్చి చేతులు, కాళ్ళలో శీలలు కొట్టి సిలువకు వేలాడదీశారు. ఇరు పక్కల ఇద్దరు బందిపోటు దొంగలను సిలువ వేశారు.

‘‘దేవాలయమును పడగొట్టి మూడు దినములలో కడతానన్నావుగా చేతనైతే నిన్ను నీవు రక్షించుకో, నీవు దేవుని కుమారుడివైతే సిలువ మీద నుండి దిగిరా’’ అంటూ దూషిస్తూ ‘‘వీడు ఇతరులను రక్షించెను గానీ తన్ను తాను రక్షించుకోలేడంటూ’’  అపహాస్యం ఒకపక్క, రోమా సైనికుల కాఠిన్యం మరోపక్క యేసును బాధపెట్టినా తన తండ్రి మానవుల రక్షణ కొరకు తలపెట్టిన బలియాగంలో తాను సమి«ధగా మిగిలి పోవడానికే సిద్ధపడ్డాడు. 

ఉదయం 9 గంటలకు ప్రారంభమైన సిలువ మధ్యాహ్నం 3 గంటల వరకూ సాగింది. మిట్ట మధ్యాహ్నం ఆ ఎండ వేడికి తాళలేక యేసు మూర్ఛబోయాడు. దాహం అని అడుగగా చేదు చిరకను అందించారు. కొరడాలతో, మేకులతో ఒళ్ళంతా రక్తం ధారలుగా కారుతుండగా చనిపోయాడో లేదోనని పక్కలో బల్లెంతో పొడిచారు.

ఆ సమయంలో యేసు మాటలాడిన ఏడు మాటలు ఎంతో శ్రేష్టమైనవి. తనను హింసిస్తున్న వారిని చూసి యేసు ప్రభువు ‘తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు’మంటూ చేసిన ప్రార్థన నభూతో న భవిష్యతిగా చెప్పుకుంటారు. మనలను హింసించే వారి కోసం ప్రార్థించాలి అన్న యేసు సిలువలో తనను చంపుతున్న వారి కోసం చేసిన ప్రార్థన అది సాధ్యమే అని నిరూపించాడు.

తనతోపాటు సిలువ వేయబడిన కుడివైపు దొంగ, ‘ప్రభువా నీ రాజ్యంలో నన్ను గుర్తు చేసుకోవాలి’ అంటే ఆ క్షణంలో రక్షణను అనుగ్రహించి నీవు నేడు నాతో కూడా పరదైసులో ఉందువు అని అభయమొసంగిన జాలిగల ప్రభువు. విశ్వాసంతో ప్రార్థిస్తే ఎటువంటి వారికైనా రక్షణ భాగ్యం దొరుకుతుందన్న ఆశావాదాన్ని కలిగించాడు. 

క్రీస్తు సిలువ మార్గం, ముక్తి మార్గం పాపంలో నశించిపోతున్న మానవాళి ముక్తి కొరకు ఒక మంచి గొర్రెల కాపరిగా తాను ప్రేమించి గొర్రెల కోసం తన ప్రాణాన్ని కలువరిపై ధారపోసి మరణ భయంతో ఉన్నవారికి నిత్యజీవం అనే వెలుగును ప్రసాదించాడు క్రీస్తు.. రెండు వేల సంవత్సరాలైనా ఆ వెలుగు పూలు అందరి మదిలో వెలుగుతూనే ఉన్నాయి.
– బ్రదర్‌ బందెల స్టెర్జిరాజన్‌  

మరిన్ని వార్తలు