మంచి మాట: మీ చిత్తం ఎలాంటిది?

7 Mar, 2022 00:29 IST|Sakshi

కొంతమంది ఒకటి అనుకుంటే ఇంకొకటి జరుగుతుంది, కాని కొందరు ఏది అనుకొంటే అదే జరుగుతుంది. దీనికి మూలకారణం ఆలోచనలే. అవే సానుకూల ఆలోచనలు, ప్రతికూల ఆలోచనలు. ఈ రెండింటికి మూలం చిత్తం. జ్ఞానాన్ని భద్రపరిచే స్థానాన్నే చిత్తం అంటారు. చిత్తంలో ఉన్న చెడు ఆలోచనలు మంచి ఆలోచనలుగా మారాలి. అప్పుడే మనం అనుకున్నవి అనుకున్నట్లుగా జరుగుతాయి.

కర్మ చే యించేది మనస్సు, మనస్సుని నియంత్రించేది బుద్ధి. అహంకారం అంటే ప్రకృతి సిద్ధమైన... తన చుట్టూ వున్న పరిస్థితులను తనకు అనుకూలంగా సృష్టించుకోవాలనుకోవటమే. దీనినే మన పెద్దలు ఏమైంది ఇతనికి నిన్నటివరకు బాగానే ఉన్నాడు కదా, ఉన్నట్టుండి ఎందుకు ఇలా మారాడు అనీ లేదా ఇంతలోనే ఇతనిలో ఇంత మంచి మార్పు ఎలా వచ్చింది అనే వారు. దీనికి కారణం చిత్తం నుండి కర్మ ఆ సమయానికి ఆలా పనిచేయడమే.

జీవికి వచ్చిపోయే జబ్బులు కూడా కొన్ని చిత్తానికి సంబంధించినవే, మనసు అనియంత్రిత అవయవాలను నియంత్రిస్తుంది. ఇది కలుషితమైతే దీనికి సంబంధించిన గుండె, మూత్రపిండాలు, కాలేయం, పేగులు మొదలైన అవయవాల పై ప్రభావం ఉంటుంది. నియంత్రించే వ్యవస్థ మొత్తం మెదడులో ఉంటుంది. మెదడులో ఏ అవయవానికి సంబంధించిన వ్యవస్థ చెడితే ఆ అవయవం పనిచేయదు.

మెదడులో వున్న ఈ వ్యవస్థ సరికావాలంటే మనస్సులో ప్రక్షాళన జరగాలి. అందుకే ఈ మధ్యన వైద్యులు ప్రతి జబ్బుకు మనసు ప్రశాంతంగా ఉంచుకోండి లేదా ధ్యానం చెయ్యండి అని విరివిగా చెబుతున్నారు.
మరి అవయవాలకు వచ్చే జబ్బుకు మనస్సుకు సంబంధించిన ధ్యానాలు ఎందుకు అంటే అన్నిటికి మూలం మనసే కనుక. మనసనేది ఆలోచనల ప్రవాహం. కోరికలు, వాంఛలూ ఆలోచనలతో సంక్రమించేవే.
అంత వరకూ అనుభవంలోకి రాని దాన్ని అనుభవించాలనుకోవడం కోరిక. అదే అనుభవాన్ని మళ్ళీ మళ్ళీ పొందాలనుకోవడం వాంఛ.

మనసు అల్లకల్లోలమైనప్పుడు మనం ఊపిరి వేగంగా తీసుకుంటాం. శ్వాసప్రక్రియలోక్రమబద్ధత ఉండదు. మనసును శాంత పరచడానికి శ్వాసను క్రమబద్ధం చేయడం ఒక పద్ధతి. నిండుగా గాలిని పీల్చి వదలడాన్ని క్రమం తప్పకుండా అభ్యసిస్తే నిశ్చలమైన మానసిక స్థితిని పొందవచ్చు. ప్రాణశక్తి మీద పట్టు సాధించడం కోసం ఊపిరిని నియంత్రించడమే ప్రాణాయామం.
కోరికలు, వాంఛల నుంచి మనసును అధిగమించి స్వతంత్రంగా, వ్యక్తిగా ఉండగలిగే వారే యోగి.
మనసును అధిగమించడమంటే దాన్ని నొక్కిపెట్టి ఉంచడం, నియంత్రించడం కాదు. మన ప్రవర్తనలో మార్పు చేసుకోవాలి. ఎదుటి వారి విజయానికి అసూయ చెందకుండా, అపజయాన్ని హేళన చేయకుండా ఉండాలి.

విజయం, అపజయం, ఒకటి ఒకరు పొందితే. ఇంకొకరు కోల్పోతున్నారు, ఇంకొకరు కోల్పోతే, అది ఇంకెవరికో దక్కుతుంది. సుఖం, దుఃఖం. డబ్బు, ఆస్తి, అంతస్తులు అన్నీ నేడు నాది నాది అనుకున్నవి నిన్న వేరొకరివి, రేపు ఇంకెవరివో. అంటే ఏది ఎవరికి శాశ్వతం కాదు. నాది, నాకు అనే సుడిగుండాలలో ఇరుక్కొని మనసు పాడుచేసుకోవడమే సకల జబ్బులకు మూలం. ఈ సూత్రం అర్థం చేసుకొంటేనే ప్రశాంతత.

ఏ ఇద్దరి మనస్సు, జీవన విధానం ఒకలాగే ఉండదు. కాని అందుకు విరుద్ధంగా తనకు అనుకూలంగా ఉండాలనుకోవడమే అహంకారం. ఈ అహంకారాన్ని మార్చుకొంటే చిత్తంలో వున్న చెడు కర్మలు అన్నీ మంచి కర్మలుగా మారి మనిషి జీవన విధానం మొత్తం మారిపోతుంది. అందుకే వెయ్యిమందిని వెయ్యిసార్లు యుద్ధంలో ఓడించిన వాడికన్నా తన మనసును జయించిన వాడే పరాక్రమవంతుడు’ అంటాడు గౌతమ బుద్ధుడు.

మనస్సు అంటే సంకల్ప, వికల్పాల కలయిక
నీరు నిర్మలంగా ఉన్నప్పుడు అందులో మన ప్రతిబింబం కనిపిస్తుంది. అందులో వేరే ఏమి కలిపినా నీరు కలుషితం అవుతుంది. ప్రతిబింబం అగోచరమౌతుంది. అలానే మనస్సులో మొదట చెడు ఆలోచనలు తరిమేయడానికి మంచి ఆలోచనలు చేయాలి. క్రమంగా మంచి ఆలోచనలూ తగ్గించాలి. అలా తగ్గించగా మనసు నిర్మలం అవుతుంది.
 
–భువనగిరి కిషన్‌ యోగి

మరిన్ని వార్తలు