శతక నీతి – సుమతి..: వారి వెంట ఉంటే చాలు!

14 Mar, 2022 00:47 IST|Sakshi

సత్పురుషులు అంటే కచ్చితంగా ఇలానే ఉంటారు అని చెప్పలేం. మంచి గుణాలతో మాత్రం ఉంటారు. రామ్‌ చరిత్‌ మానస్‌ లో తులసీదాస్‌ గారు సత్పురుషులను మూడు వర్గాలుగా విభజించారు. గులాబీ చెట్టు మంచి పూలు పూస్తుంది. చూడ్డానికి ఎంతో అందంగా ఉంటాయి.

మంచి వాసనలు ఉంటాయి. కానీ ఆ చెట్టుకు కాయలుండవు. పండ్లుండవు. ఒకరకం సత్పురుషులు ఈ గులాబీ చెట్టులాంటివారు. మంచి మాటలు చెబుతూ సమాజాన్ని నడిపిస్తుంటారు. వారు ఎవరికీ అపకారం చేయరు. ఎవరినీ పాడు చేయరు. కానీ వాళ్ళు మంచి పనులు అదే పనిగా చేస్తున్నారా అంటే చెప్పడం కొద్దిగా కష్టమే.

మామిడి చెట్టు ఉంటుంది. పూత పూస్తుంది, కాయా కాస్తుంది. పండ్లూ వస్తాయి. రెండో రకం సత్పురుషులు ఇలాటి వారు. మంచి మాటలు చెబుతారు. మంచి పనులూ చేస్తుంటారు. రెండూ ఉంటాయి తప్ప మంచి మాటలు చెప్పి పనులు చెయ్యకుండా కూర్చునే రకం కాదు. తమతో ఉన్న వాళ్ళను తమ వెంట తిప్పుకుంటూ అందరితో మంచి పనులు చేయిస్తుంటారు.

పనస చెట్టు ఉంది. మామిడి కాయ లేదా పండయితే ఒకరికే సరిపోతుంది. పనసపండును పదిమందికి పంచవచ్చు. ఈ రకం వారు మంచి మాటలు అదే పనిగా చెప్పరు. కానీ మంచి పనులు మాత్రం ఆపకుండా చేసుకుంటూ పోతుంటారు. ఇదీ తులసీదాసుగారి వర్గీకరణ. ఇటువంటి సత్పురుషులతో కలిసి మెలిసి తిరుగుతుంటే మనం కూడా పూజార్హత పొందుతాం.

వారితో ఉన్నప్పుడు మనకు తెలియకుండానే మంచిపనులు చేస్తూ పోతుంటాం. వారి త్యాగశీలత, నిస్వార్థంగా పనిచేసే తత్త్వం, అంకిత భావం, సమాజం పట్ల ప్రేమానురాగాలవంటి గుణాలను వారు చెబుతూ ఆచరించి చూపుతుంటే ... వాటి ప్రభావం మన మీద కూడా గాఢంగా పడుతుంది. క్రమేణా జీవితం దానికి అలవాటు పడి మనలో ఉన్న దుర్గుణాలు వాటతంట అవే మాయమయిపోతుంటాయి.

సత్పురుషులతో సహవాస గొప్పదనాన్ని చెప్పడానికి రామకృష్ణ పరమ హంస ఒక ఉదాహరణ చూపుతుంటారు. ఒక ఏనుగు దారివెంట నడిచి వెడుతుంటూంది. కొబ్బరి చెట్టు కనపడితే కొబ్బరి కాయలను తొండంతో తుంపి నోట్లో వేసుకుంటుంది. అరటి చెట్టు కనబడితే ఆకులను పట్టి లాగేస్తుంది, చింపేస్తుంది. అంతవరకు దాని మీద కూర్చున్న మావటి పట్టించుకోడు. అక్కడ అరటి గెలలను తొండంతో పట్టుకుని లాగేయపోతుండగా... అంకుశం గుచ్చే ప్రయత్నం చేస్తాడు.. వెంటనే అది తొండాన్ని వెనక్కి తీసేసుకుంటుంది. సత్పురుషులు మావటిలాంటి వారు.

మనం పనికిమాలిన పనులు చేస్తున్నా, అనవసర మాటలు మాట్లాడుతున్నా... మృదువుగానే మనల్ని మందలిస్తారు. మనల్ని చక్కదిద్దుతారు. నిజానికి వారు  ప్రత్యేకించి మనల్ని పట్టించుకోనక్కరలేదు. వాళ్ళ సాహచర్యంలో అటువంటి పనులు చేయడానికి, అధిక ప్రసంగాలకు ఆస్కారముండదు. ధూళికణమయినా గాలితో కలిస్తే పైకెగిరినట్టు సత్పురుషుల సాంగత్యం మనల్ని ఉన్నతంగా నిలుపుతుంది. వారి సాంగత్యం లేకపోయినా నష్టమేదీ నేరుగా అనుభవంలోకి రాదు కానీ దుర్జనులతో కలిస్తే మాత్రం హాని జరిగితీరుతుందని చెప్పడానికే బద్దెనగారు –‘‘కొంచెపు నరు సంగతిచే /నంచితముగ గీడు వచ్చు నది యెట్లన్నన్‌ /గించిత్తు నల్లి కుట్టిన/ మంచమునకు జేటు వచ్చు మహిలో సుమతీ’’ హెచ్చరిస్తున్నారు.  

బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు

మరిన్ని వార్తలు