ప్రశాంతమైన నిద్రకు ఈ ఐదు తినండి!

5 Mar, 2021 08:22 IST|Sakshi

మసాలా ఫుడ్‌ తింటే నిద్రలేమి! 

పరిశోధన: నగరాల్లోకి వచ్చేస్తున్న దోమలు

మీరు తీసుకున్న ఆహారంలో మసాలాలు ఎక్కువగా ఉన్నా, అది హైప్రోటీన్‌ డైట్‌ అయినా అది నిద్రలేమికి దారితీస్తుందని చెబుతున్నారు నిద్రానిపుణులు. రాత్రి ఆహారానికి, నిద్రకు దగ్గరి సంబంధం ఉంటుందంటున్నారు శామీ మార్గో అనే ప్రముఖ స్లీప్‌ ఎక్స్‌పర్ట్‌. ఆమె  ఇటీవలే ‘ద గుడ్‌ స్లీప్‌ గైడ్‌’ అనే పుస్తకం రాశారు. రాత్రివేళల్లో మసాలాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల అది నిద్రపై దుష్ప్రభావం చూపుతుందని పేర్కొంటున్నారు శామీ మార్గో. మసాలాలు ఎక్కువగా ఉండే ఆహారం, ఆల్కహాల్, కాఫీ, కొవ్వులు ఎక్కువగా ఉండే పదార్థాలు, చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాలు... ఈ ఐదూ నిద్రను దూరం చేస్తాయనీ, అయితే... అరటిపండ్లు, బాదం (ఆల్మండ్స్‌), తేనె, ఓట్స్, గోరువెచ్చని పాలు... ఈ ఐదూ ప్రశాంతంగా నిద్రపట్టేలా చేసే మంచి  ఆహారాలని పేర్కొన్నారు శామీ.

తగ్గుతున్న అడవులూ... పెరుగుతున్న దోమలూ, వ్యాధులు! 
ప్రపంచవ్యాప్తంగా అడవులు తగ్గుతున్న కొద్దీ... అక్కడి వనాల్లో పెరగాల్సిన దోమలూ నగరాల్లోకి వచ్చేస్తున్నాయట. ఇటీవల అమెరికాలో జికా, డెంగ్యూ, ఎల్లో ఫీవర్, చికన్‌ గున్యా వ్యాధులు పెరుగుతున్న నేపథ్యంలో దోమలు అకస్మాత్తుగా, విపరీతంగా పెరగడానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు అక్కడి పరిశోధకులు. దాంతో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. కొన్ని దోమ జాతులు నీళ్లలో పెరిగినట్లుగానే మరికొన్ని దోమలు అడవుల్లోని ఆకుపచ్చ వనాల్లో మాత్రమే తమ జీవనచక్రాన్ని కొనసాగించాలి.

కానీ అవి అడవుల నరికివేత విపరీతంగా సాగుతున్న నేపథ్యంలో ఆ అడవి దోమలు నగరాలకు వలస వస్తున్నాయని చెబుతున్నారు యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియాకు చెందిన పరిశోధకులు. ఈ పరిశోధక బృందానికి నేతృత్వం వహించిన మార్మ్‌ కిల్‌పాట్రిక్స్‌ తమ పరిశోధన వివరాలను వెల్లడిస్తూ గత ఐదు దశాబ్దాల్లో దోమల సంఖ్య పెరగాల్సిన దానికంటే పది రెట్లు అధికంగా పెరిగాయని పేర్కొంటున్నారు. ఫలితంగా  జికా, డెంగ్యూ, ఎల్లో ఫీవర్, చికన్‌ గున్యా వంటి దోమ ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులూ, వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతోందని బెంబేలెత్తుతున్నారు. ఇది డిసీజ్‌ బర్డెన్‌ పెంచడంతో పాటు పర్యావరణాన్నీ మరింతగా దెబ్బతీసి మరిన్ని ఉత్పాతాలకు కారణమవుతుందని పరిశోధకులు ఆందోళన చెందుతున్నారు.  

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు