మంచి ఆలోచనలతో మెరుగైన ఆరోగ్యం

1 Jan, 2022 09:16 IST|Sakshi

మన ఆలోచనలే మనం అని చెప్పుకోవడం వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన విశ్లేషణలా అనిపించవచ్చు కానీ అది నిజం. మన ఆలోచనలు బాగుంటే మానసికంగా బాగుంటాం. మానసిక ఆరోగ్యం సవ్యంగా ఉన్నప్పుడే శారీరక ఆరోగ్యం కూడా బాగుంటుంది. నేడు మనం నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టాం. గత సంవత్సరపు చేదు జ్ఞాపకాలను, అవి కలిగించిన ప్రతికూల భావనలను వదిలేసి ఒత్తిడి, ఆందోళనలను తగ్గించుకుని, ప్రశాంతమైన జీవనం సాగించేందుకు కొత్త సంవత్సరం లో నిర్ణయం తీసుకుందాం... మానసిక ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకోవడానికి ఏం చేయాలో తెలుసుకుందాం.

ఆలోచనలు మనిషి వైఖరి, ప్రవర్తనలపై ఎంతో ప్రభావాన్ని కలిగిస్తాయని శాస్త్రవేత్తలు చెప్పారు. దీనిని ఆధారంగా చేసుకుని వైద్య శాస్త్రంలోని వివిధ విభాగాలకు చెందిన పరిశోధకులు సైకో న్యూరో ఇమ్యునాలజీ అనే సరికొత్త విభాగాన్ని కూడా ఏర్పాటు చేశారు. మనిషి చేసే సానుకూల ఆలోచనల ఫలితమే వారి ఆరోగ్యమని, ప్రతికూల ఆలోచనలే వారి అనారోగ్యమని ఈ విభాగం తెలియజేస్తోంది. మరి సానుకూల ఆలోచనలు ఎలా పెంపొందించుకోవాలో...అందుకు ఎలాంటి అలవాట్లు కలిగి ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.
చురుకైన మెదడు
మెదడును ఉత్తేజంగా ఉండేలా చూసుకోవాలి. మెదడు చురుగ్గా ఉంటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఫలితంగా మానసిక సమస్యల నుంచి కూడా బయటపడొచ్చు. అందుకోసం రోజూ కంటినిండా నిద్రపోవాలి. దాంతో మెదడుకు విశ్రాంతి లభిస్తుంది. ఫలితంగా మానసిక సమస్యలు పోయి మెదడు చురుగ్గా మారుతుంది.మనం నిత్యం తీసుకునే ఆహారం కూడా మెదడు పనితీరుపై ప్రభావం చూపుతుంది. కనుక రోజూ తగిన పోషకాలు ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి. అటువంటి వాటిలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉండే ఆహారం ముఖ్యమైనది. వీటిని నిత్యం తీసుకుంటే మెదడు చురుగ్గా పనిచేస్తుంది. వ్యాయామం చేయడం వల్ల మానసిక సమస్యలు పోతాయి.శారీరక వ్యాయామంతోపాటు రోజూ కొత్త విషయాలను నేర్చుకోవడం, పద వినోదం, పజిల్స్‌ నింపడం, సుడోకు ఆడడం వంటి మెదడుకు మేత పెట్టే పనులు చేస్తే మంచిది.

పాజిటివ్‌ ఆలోచనలు ఆరోగ్యానికి అండ 
సాటివారిపట్ల ప్రేమ, అనురాగం, అభిమానం, ఆప్యాయత వంటి గుణాలు కలిగున్న మనిషి ఆరోగ్యంగా ఉంటాడని మనస్తత్వ శాస్త్రవేత్తలతోపాటు వైద్యులు కూడా చెబుతున్నారు. అలాగే .... సానుకూలమైన అనుభూతులతో ఉన్న మనిషిలో తెల్ల రక్తకణాలు వృద్ధి చెంది, వ్యాధికారక క్రిములను పెరగకుండా నిరోధిస్తాయి. తద్వారా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. కోపం, ద్వేషం, దుఃఖం, విచారం, అసూయ వంటి ప్రతికూల భావోద్వేగాలు మనిషిని మానసికంగా ఒత్తిళ్లు, ఆందోళనలకు గురిచేసి తెల్ల రక్తకణాలను తగ్గిస్తాయి. ఫలితంగా మనిషి అనారోగ్యానికి గురవుతాడు. అందుకే మంచి ఆలోచనలు ఉంటే ఆనందంగా, ఆరోగ్యంగా ఉండేందుకు దోహదం చేస్తాయి. 

ఒంటరితనం వద్దు
ఒంటరిగా ఉన్న మనిషిలో ప్రతికూల ఆలోచనలు ఎక్కువ. ఫలితంగా మనిషిలో తెల్ల రక్త కణాలు తక్కువవుతుంటాయి. ఎన్నో శారీరక సమస్యలు మొదలవుతాయి. ఆహార విహారాలపై అవగాహన లోపిస్తుంది. శ్వాసకోశ వ్యాధులు, గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉండవచ్చు. మనసు ఆలోచనా విధానంలో మార్పు వస్తుంది. ఆ కారణంగా జ్ఞాపకశక్తి తగ్గుతూ అల్జీమర్స్‌ వంటి ఆరోగ్య సమస్యలు చోటు చేసుకునే ప్రమాదం ఉంది. ఒంటరిగా ఉన్నవారు ఏదో ఒక పనిలో నిమగ్నమైనప్పుడు మెదడు నిర్మాణాత్మకంగా పనిచేస్తూ, సానుకూల ఆలోచనలకు తెరలేపుతుందన్నది చికాగోలోని రష్‌ యూనివర్శిటీ మెడికల్‌ సెంటర్‌ శాస్త్రజ్ఞుల సూచన.సానుకూల ఆలోచనల కోసం మెదడుకు తగు తర్ఫీదు ఇవ్వాలి.  

ఇతరులతో మాట్లాడేటప్పుడు సానుకూల శబ్దాలు మాత్రమే ఉపయోగించే అలవాటు చేసుకోవాలి..
ఎవరికి వారు సానుకూల స్వయం సలహాలు ఇచ్చుకుంటుండాలి.
ఆత్మవిశ్వాసంతో కూడిన మాటలు, చేతలకు మాత్రమే ప్రాధాన్యతనివ్వాలి.
ఇతరుల పట్ల కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండాలి.
తప్పులు జరిగినప్పుడు ఆత్మవిమర్శ చేసుకోవాలి.
వైఫల్యాలు ఎదురైనప్పుడు కృంగిపోకుండా గతంలో సాధించిన విజయాలను గుర్తుచేసుకుని, ప్రస్తుతం జరిగిన వాటిని విశ్లేషించుకోవాలి.
విజయాల బాటలో నడిచిన వారిని చూసి అసూయ చెందకుండా వారి నుంచి ప్రేరణ పొందడం అలవాటు చేసుకోవాలి.
ప్రతికూల ఆలోచనలు వచ్చినప్పుడు... వాటిని సానుకూలం గా మార్చుకునే ప్రయత్నం చేయాలి.
పెదవుల మీద చిరునవ్వు చెదరనీయకూడదు. ∙మంచి జరగబోతోందని ఊహించుకోవాలి.
​​​​​​​►ఉట్టిపుణ్యానికి బద్ధకంతో పనులు వాయిదా వేసే అలవాటు మానుకోవాలి. 
​​​​​​​►సెల్ఫ్‌ రిలాక్సేషన్‌ పద్ధతి నేర్చుకునే ప్రయత్నం చేయాలి. ​​​​​​​
ఇతరులతో ప్రేమగా వ్యవహరించడం.... నవ్వుతూ... నవ్విస్తూ ఉండడం వల్ల ఎంత పెద్ద జబ్బునైనా నయంచేసుకోవచ్చన్న నిపుణుల సలహాను పరిగణనలోకి తీసుకోవాలి. తీసుకునే ఆహారంతోనే ఆలోచనా విధానం ముడిపడి ఉందని అంటున్నారు నిపుణులు. తాజా పండ్లను, కూరగాయలను తినడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. కాబట్టి మంచి ఆహారాన్ని తీసుకోవడం అన్ని విధాలా మంచిది. 
ప్రతికూల ఆలోచనలు వద్దు
నెగెటివ్‌ ఆలోచనల వల్ల ఆత్మవిశ్వాసం కోల్పోతారు. ఎదుటివాళ్లకి మనమీద నమ్మకం లేకుండా చేస్తాయి. ఇలాంటి ప్రతికూల ఆలోచనల నుంచి బయటపడటానికి కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుందని చెబుతున్నారు మానసిక నిపుణులు.ప్రతికూల ఆలోచనలు వచ్చినప్పుడు వాటిని ఓ పుస్తకంలో రాసుకోవాలి. అవి  మనం తీసుకొనే నిర్ణయాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో తెలుసుకోవాలి. అసలు ఇలాంటి ఆలోచనలు ఎందుకు కలుగుతున్నాయో కనుక్కోవాలి. వాటినుంచి బయట పడాలనే బలమైన తపన ఉండాలి. భవిష్యత్తు గురించి అతిగా ఆలోచించడం వల్ల ఫలితం ఉండదు.

భవిష్యత్తు గురించి అసలు ఆలోచన చేయకుండా ఉండటం ఎంత తప్పో, భవిష్యత్తులో అలా జరుగుతుందేమో... ఇలా జరుగుతుందేమో అని అతిగా ఆలోచించడ కూడా అంతే తప్పు. దానివల్ల ఆరోగ్యం పాడవుతుంది. అందువల్ల అంతా మంచే జరుగుతుందనే ఆలోచన మంచిది.ఎప్పుడైతే మనమీద మనకు నమ్మకం లేదో అప్పుడు ప్రతికూల ఆలోచనలు చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి అయేలా చేస్తాయి. అందువల్ల మనమీద మనకు ఇష్టం, గౌరవం, నమ్మకం ఉండేలా చూసుకోవడం అత్యవసరం. గతంలో సంభవించిన అపజయాలు, ఎదురైన చేదు అనుభవాల వల్ల ప్రతికూల ఆలోచనలు రావడం సహజం. అలాంటప్పుడు గతాన్ని మర్చిపోవాలి. గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా జాగ్రత్తపడాలి. మనల్ని మనం ప్రేమించుకోవాలి. సంతోషంగా ఉండడానికి ప్రయత్నించాలి. అప్పుడే మనం ఏడాదంతా కాదు.. ఎప్పటికీ ఆరోగ్యం గా ఆనందంగా ఉండగలుగుతాం.       
 ∙ 

మరిన్ని వార్తలు