మంచి మాట: దాటవలసిన మనోభావాలు

27 Mar, 2023 06:09 IST|Sakshi

సత్యాలు వేరు; మనోభావాలు వేరు. ఎవరి మనోభావాలు వాళ్లవి. మనోభావాలు వ్యక్తులకు సంబంధించినవి; మనోభావాలు లేకుండా ఎవరూ ఉండరు. మనిషి అన్నాక మనోభావాలు తప్పకుండా ఉంటాయి. మనోభావాలు అనేవి వ్యక్తిగతమైనవి మాత్రమే. సత్యాలు సార్వజనీనమైనవి. మనోభావాల మత్తులో సత్యాల్ని కాదనుకోవడం, అందుకోలేకపోవడం, వదిలేసుకోవడం అనర్థదాయకం, అపాయకరం. మనోభావాలు కాదు సత్యాలు మాత్రమే అవసరమైనవి ఆపై ప్రయోజనకరమైనవి.

మనోభావాలు దెబ్బతింటాయి లేదా దెబ్బతింటున్నాయి అనే మాటను మనం వింటూ ఉంటాం. మనోభావాలు దెబ్బతినడం అంటూ ఉండదు. వ్యక్తులలో ఉండే మనోభావాలు ఉన్నంత కాలం ఉంటాయి. కాలక్రమంలో పోతూ ఉంటాయి. మనోభావాలు అనేవి ప్రతి వ్యక్తికి వయసుతోపాటు మారిపోతూ ఉంటాయి. ఏ వ్యక్తికైనా ఐదేళ్లప్పుడు ఉన్న మనోభావాలు పదేళ్లప్పుడు ఉండవు. పదేళ్లప్పటివి ఇరవై యేళ్లప్పుడు ఉండవు. వ్యక్తుల మానసిక స్థితిని బట్టి, తెలివిని బట్టి, తెలివిడిని బట్టి మనోభావాలు అన్నవి వేరువేరుగా ఉంటాయి.

విద్య, సామాజిక, రాజకీయ, వైజ్ఞానిక, శాస్త్రీయ విషయాల్లోనూ, కళల్లోనూ, సార్వత్రికమైన విషయాల్లోనూ మనోభావాలు అనేవి అవసరం అయినవి కావు. సంఘ, ప్రపంచ ప్రయోజనాలపరంగా మనోభావాలు అనేవి ఎంత మాత్రమూ పనికిరావు. మానవ ప్రయోజనాలపరంగా సత్యాలను మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. మనోభావాలు చర్చనీయమూ, పరిగణనీయమూ అవవు. ఒక వ్యక్తి మనోభావాలు మరో వ్యక్తికి, సమాజానికి అక్కర్లేనివి. మనోభావాలు, మనోభావాలు అని అంటూ ఉండడమూ, తమ మనోభావాలు ముఖ్యమైనవి లేదా విలువైనవి అని అనుకుంటూ ఉండడం మధ్యతరగతి జాడ్యం.

మనోభావాలు ప్రాతిపదికగా వ్యవహారాలు, సంఘం, ప్రపంచం నడవవు. ఈ విజ్ఞత ప్రతివ్యక్తికి తప్పనిసరిగా ఉండాలి. మనం మన మనోభావాలవల్ల  మనకు, సంఘానికి సమస్యలం కాకూడదు. మన మనోభావాలు మనల్నే అడ్డగించే గోడలుకాకూడదు. మన మనోభావాలకు మనమే గుద్దుకోకూడదు. మనోభావాలు మనుగడ మునుసాగడాన్ని ఆపెయ్యకూడదు.

మనిషి జీవితంలో ఒక మేరకు వరకే మనోభావాలకు స్థానాన్ని, ప్రాముఖ్యతను ఇవ్వాలి. మనోభావాలకు అతీతంగా మనుగడను ముందుకు తీసుకువెళ్లడం మనిషి నేర్చుకోవాలి. మనోభావాలకు కట్టుబడి ఉండడం ఒక మనిషి జీవనంలో జరుగుతున్న తప్పుల్లో ప్రధానమైంది. స్వేచ్ఛగా సత్యాల్లోకి వెళ్లడం, వాటివల్ల స్వేచ్ఛను పొందడం ప్రతిమనిషికి ఎంతో ముఖ్యం. సత్యాలవల్ల వచ్చే స్వేచ్ఛ దాన్ని అనుభవిస్తున్నప్పుడు మాత్రమే తెలుస్తుంది.

తమ మనోభావాల్ని అధిగమించినవాళ్లే సత్యాలలోకి వెళ్లగలరు. సత్యాలను ఆకళింపు చేసుకోగలిగితే మనోభావాలు, మనోభావాలవల్ల కలిగే కష్ట, నష్టాలు చెరిగిపోతాయి. మతం, కులం, ప్రాంతీయత, ఉగ్రవాదం వంటివాటివల్ల జరుగుతున్న హానికి, అల్లకల్లోలానికి మనోభావాలే కారణం. మనిషికి సత్యాలపై తెలివిడి వచ్చేస్తే ఈ తరహా దుస్థితి, దుర్గతి ఉండవు. హిట్లర్‌ మనోభావాల కారణంగా ప్రపంచయుద్ధమే వచ్చి ప్రపంచానికి పెనుచేటు జరిగింది.

మనోభావాలకు అతీతంగా సత్యాలపై ఆలోచన, అవగాహన హిట్లర్‌కు, మరికొంతమందికి ఉండి ఉంటే రెండో ప్రపంచయుద్ధం జరిగేదే కాదు. మనోభావాలవల్ల కుటుంబాల్లోనూ, సమాజంలోనూ, దేశంలోనూ, ప్రపంచంలోనూ ఎన్నో దారుణాలు, ఘోరాలు, నేరాలు జరిగాయి, జరుగుతున్నాయి. చరిత్రను, సమాజాన్ని, మనపక్కన ఉన్న కుటుంబాల్ని పరిశీలిస్తే ఈ సంగతి తెలియవస్తుంది.

మన మనోభావాలను మనవరకే మనం పరిమితం చేసుకోవాలి. మన మనోభావాలకు తగ్గట్టు విషయాల్ని, ఇతరుల్ని, సమాజాన్ని, ప్రపంచాన్ని పరిగణనలోకి తీసుకోకూడదు. మన మనోభావాల ప్రాధాన్యతకు ఉన్న హద్దుల్ని మనం సరిగ్గా తెలుసుకోవాలి.
మనోభావాలను దాటి సత్యాల ఆవశ్యకతను తెలుసుకుందాం; సత్యాలను ఆకళింపు చేసుకుందాం; సత్యాలవల్ల సత్ఫలితాలను పొందుదాం. సత్యాల సత్వంతో సరైన, సఫలమైన జీవనం చేస్తూ ఉందాం.

– రోచిష్మాన్‌ 

>
మరిన్ని వార్తలు