ఒక ఊరికథ..మంచిపని ఊరకే పోలేదు...ఎన్నో ఊళ్లకు స్ఫూర్తి ఇచ్చింది

29 Jan, 2022 04:12 IST|Sakshi
తియ్యటి ఉపాధి

బాలాసోర్‌ జిల్లా(ఒడిశా) బస్తా బ్లాక్‌లోని అంబక్‌చౌ అనే గ్రామం అది. ఊరు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండదు. కరువు కావచ్చు కరోనా కావచ్చు మరేదైనా కష్టం కావచ్చు. ఉపాధి కష్టమయ్యేది. ఊళ్లోని మగవాళ్లు పనుల కోసం పట్టణాలు వెదుక్కుంటూ వెళ్లేవాళ్లు. అలా పట్టణాలకు వెళ్లి కొత్త అలవాట్లు నేర్చుకొని కష్టపడిన సొమ్మును మద్యానికి తగలేసిన వారు కూడా ఉన్నారు.

ఇక ఆ ఊళ్లో మహిళల విషయానికి వస్తే ఊరు దాటిన సందర్భాలు వేళ్ల మీద లెక్కపెట్టుకోవచ్చు. ఇంటిపనులు పూర్తయిన తరువాత, ఆరుబయట కూర్చొని మాట్లాడుకుంటున్న సందర్భంలో ‘మనం ఎందుకు వ్యాపారం మొదలుపెట్టకూడదు!’ అన్నారు ఒకరు. కొందరు నవ్వారు. కొందరు ఆలోచించారు. ఆ మాట ఈ మాట పూర్తయిన తరువాత అందరూ ఒక ఆలోచనకు వచ్చారు. ఆవులను కొనాలని. తాము కూడబెట్టుకున్న డబ్బు, అప్పు చేసిన సొమ్ముతో 13 మంది మహిళలు కలిసి 10 ఆవులను కొనుగోలు చేశారు. ‘శివశంకర్‌’ పేరుతో స్వయంసహాయక బృందంగా ఏర్పడ్డారు. ‘వాటిని మేపడానికే మీ జీవితం సరిపోతుంది’ అని వెక్కిరించిన వాళ్లు ఉన్నారు. బృందంలోని సభ్యులలో చాలామంది భర్తల మూలంగా ఇబ్బంది పడ్డారు.

భర్తలు భరించలేదు!
‘వాళ్ల మాటలు విని డబ్బు తగలేస్తావా?’ అంటాడు ఒక భర్త.
‘ఇంత డబ్బు నీ దగ్గర ఉందని ఎప్పుడూ చెప్పలేదేం’ అని ఈసడిస్తాడు ఒక భర్త. అయితే వారు వేటికీ చలించలేదు.
మొదట పాలవ్యాపారం. ఆ తరువాత పెరుగు, నెయ్యి, వెన్న... మొదలైనవి అమ్మడం మొదలుపెట్టారు. ఆ ఊళ్లోనే కాదు... చుట్టు పక్కల ఊళ్లో నుంచి కూడా పాల ఉత్పత్తులు కొనడానికి వచ్చేవాళ్లు.

 ఆ తరువాత...రసగుల్లతో పాటు ఆ ప్రాంతంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ‘చెన’లాంటి స్వీట్ల తయారీ మొదలుపెట్టారు. సమీప పట్టణమైన బాలాసోర్‌లో ఈ స్వీట్లను అమ్మే ప్రయత్నం మొదలుపెట్టినప్పుడు ‘పట్టణాల్లో మీ పల్లె మిఠాయిలు ఎవరు కొంటారు? అక్కడ పెద్ద పెద్ద స్వీట్‌షాప్‌లు ఉంటాయి’ అని వెనక్కిలాగే ప్రయత్నం చేశారు కొందరు. అయితే వారు వెనక్కి తగ్గలేదు.

స్వీట్‌ హిట్‌æ
‘శివశంకర్‌ స్వీట్‌’ సూపర్‌ హిట్‌ అయింది! బాలాసోర్‌లోనే కాదు బధ్రక్, మహారాజ్‌గంజ్‌... మొదలైన పట్టణాలతో పాటు పశ్చిమబెంగాల్‌కు కూడా విస్తరించింది స్వీట్ల వ్యాపారం.
‘మొదట్లో భయమేసి వెనక్కి తగ్గుదాం అనుకున్నాను. కాని ఆతరువాత నాకు నేనే ధైర్యం చెప్పుకున్నాను. కొనసాగాను. శివశంకర్‌ బృందంలో నేను కూడా భాగం అయినందుకు గర్విస్తున్నాను’ అంటుంది మాలతి.

‘వారి మాటల్లోని నిజాయితీ, వారి ఉత్పత్తుల్లో కూడా కనిపిస్తుంది. ఎక్కడా కల్తీ ఉండదు. నాణ్యంగా ఉంటాయి’ అంటున్నాడు బాలాసోర్‌కు చెందిన వైద్యుడు చందన్‌. ఇది అతడి మాట మాత్రమే కాదు ఎంతోమంది మాట. అందుకే ‘శివశంకర్‌’ పాల ఉత్పత్తులకు మంచి పేరు వచ్చింది. అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ కూడా ఉపయోగించడం ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నారు.
ఒక మంచిపని ఊరకే పోదు! ఎన్నో ఊళ్లకు స్ఫూర్తిని ఇస్తుందని గెలుపుజెండా ఎగరేసి నిరూపించారు పదమూడు మంది మహిళలు.

మరిన్ని వార్తలు