గోకృప అమృతంతో ఎరువు చేసేదెలా?

15 Feb, 2021 09:49 IST|Sakshi

పంచగవ్య, జీవామృతం, వేస్ట్‌ డీ కంపోజర్‌.. వంటి ద్రావణాలు లేనిదే ప్రకృతి/సేంద్రియ వ్యవసాయం అడుగు ముందుకు పడదు. ఈ జాబితాలో ఇప్పుడు కొత్తగా ‘గోకృప అమృతం’ ద్రావణం వచ్చి చేరింది. భూసారం పెంపుదలకు, చీడపీడల నివారణకూ ఇది ఉపయోగపడుతుందని.. ఇదొక్కటి ఉంటే చాలు యూరియా, డీఏపీ, విష రసాయనాల అవసరమే ఉండదని ‘గోకృప అమృతం’ ఆవిష్కర్త గోపాల్‌ భాయ్‌ సుతారియా చెబుతున్నారు.

ఎకరానికి ప్రతి ఏటా దేశీ ఆవు పేడతో తయారు చేసిన ఎరువు 4 వేల కిలోలు వేసి, ఎకరానికి నెలకు ఒకసారి 1,500 లీటర్ల గోకృప అమృతం ద్రావణం ఇస్తూ ఉంటే.. చక్కని దిగుబడులు వస్తాయని ఆయన అంటున్నారు. ఇప్పటికే 65 రకాల స్వల్పకాలిక పంటలు, పండ్ల తోటలపై అనేక రాష్ట్రాల్లో వాడిన రైతులు చక్కని ఫలితాలు పొందుతున్నారన్నారు. గోపాల్‌ భాయ్‌ చెబుతున్న పద్ధతిలో ప్రకృతి వ్యవసాయం చేయడానికి ‘ప్రతి ఎకరానికి ఒక దేశీ ఆవు’ అవసరమవుతుంది.. 

గోకృప అమృతం!
గోకృప అమృతం.. తెలుగు రాష్ట్రాల్లో ప్రకృతి వ్యవసాయ వర్గాల్లో ఇప్పుడు వినిపిస్తున్న కొత్త మాట ఇది. పద్మశ్రీ అవార్డు గ్రహీత డా. సుభాష్‌ పాలేకర్‌ ‘జీవామృతం’ను ప్రాచుర్యంలోకి తెచ్చిన కనీసం పదేళ్ల తర్వాత.. వేస్ట్‌ డీ కంపోజర్‌  నాలుగేళ్ల క్రితం తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించి.. దేశవిదేశాల్లో అతి తక్కువ కాలంలోనే విస్తృతంగా వ్యాప్తిలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ‘గోకృప అమృతం’ (ప్రోబయోటిక్‌ బాక్టీరియల్‌ కల్చర్‌) కొద్ది నెలల క్రితం రైతుల ముందుకు వచ్చింది. అహ్మదాబాద్‌ (గుజరాత్‌) లోని బన్సీ గిర్‌ గోశాల వ్యవస్థాపకులు గోపాల్‌ భాయ్‌ సుతారియా దీన్ని రూపొందించి, ఉచితంగా రైతులకు అందిస్తున్నారు.

తాము శాస్త్రవేత్తలు, ఆయుర్వేద నిపుణులు, రైతుల తోడ్పాటుతో చాలా సంవత్సరాల పాటు పరిశోధనలు చేసి గోకృప అమృతంను రూపొందించాం అని ఆయన అంటున్నారు. దేశీ ఆవు పేడ, మూత్రం, పాలు, పెరుగు, నెయ్యిలలోని మేలుచేసే 70 రకాల సూక్ష్మజీవరాశికి మరో 21 రకాల ఓషధులను సమన్వయపరచి గోకృప అమృతాన్ని రూపొందించామన్నారు. ఇది భూమికి, పంటలకే కాకుండా మనుషులు ఇతర జీవరాశికి కూడా మేలు చేస్తుందని చెబుతున్నారు. 

‘గోకృప అమృతం’ తయారీ పద్ధతి దాదాపుగా వేస్ట్‌డీకంపోజర్‌ ద్రావణం మాదిరిగానే ఉంటుంది. గోకృప అమృతం మదర్‌ కల్చర్‌ (తోడుగా వేసే మూల ద్రావణం) ఒక లీటరును 200 లీటర్ల నీటిలో పోసి, రెండు కిలోల బెల్లం, 2 లీటర్ల దేశీ ఆవు తాజా మజ్జిగ కలపాలి. రోజూ కలియదిప్పాలి. ఐదారు రోజుల్లో ‘గోకృప అమృతం’ వాడకానికి తయారవుతుంది. 
‘పంచగవ్యాలలోని సూక్ష్మజీవులు, ఔషధ మొక్కల రసాలతో కూడినది కావటం వల్ల మళ్లీ ఆవు పేడ, మూత్రం జోడించాల్సిన అవసరం లేదు. గుజరాత్‌తోపాటు మరికొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో దీన్ని కొద్ది నెలలుగా చాలా మంది రైతులు వాడి సత్ఫలితాలు పొందారు సుమారు 65 పంటలపై ప్రయోగాలు జరిగాయని, రైతులతోపాటు శాస్త్రవేత్తలు సైతం దీనిపై ఆసక్తి చూపిస్తున్నార’ని గోపాల్‌ భాయ్‌ అంటున్నారు. 

తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిగా సిద్ధిపేట జిల్లా మర్రిముచ్చలలో ఇటీవల గ్రామభారతి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ‘గోకృప అమృతం’ పరిచయ సభ జరిగింది. సభకు హాజరైన వందలాది మందికి ఒక్కో లీటరు చొప్పున గోకృప అమృతం ద్రావణాన్ని ఉచితంగా పంచి పెట్టారు. సమస్త వ్యవసాయ రసాయనాల బెడద నుంచి గోకృప అమృతం రైతులకు, భూమాతకు సంపూర్ణంగా విముక్తి కలిగించగలదని గోపాల్‌ భాయ్‌ ఆశిస్తున్నారు. తన మాటలను రైతులు గుడ్డిగా నమ్మవద్దని అంటూ.. జీవామృతం, వేస్ట్‌డీకంపోజర్, గోకృప అమృతాలను పక్కపక్కనే మడుల్లో వేర్వేరుగా వాడి, స్వయంగా తమ పొలంలో ఫలితాలను కళ్లారా చూసి, సంతృప్తి చెందిన తర్వాతే పంట పొలాల్లో వాడుకోవాలని గోపాల్‌ భాయ్‌ సూచిస్తున్నారు.  రైతులు ఎలా స్పందిస్తారో చూడాలి.
– పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్‌


గోకృప అమృతం ఎక్కడ దొరుకుతుంది?
గోకృప అమృతం ద్రావణం (ప్రోబయోటిక్‌ బాక్టీరియా కల్చర్‌)ను ఒకసారి ఇతరుల నుంచి తీసుకున్న రైతులు దాన్ని నీరు, బెల్లం, మజ్జిగలను తగిన మోతాదులో కలిపి మళ్లీ మళ్లీ తయారు చేసుకోవచ్చు. ఇతర వివరాలకు.. అహ్మదాబాద్‌ (గుజరాత్‌)లోని బన్సీ గిర్‌ గోశాల వెబ్‌సైట్‌ను చూడొచ్చు.. www.bansigir.in  

తెలుగు రాష్ట్రాల్లో గోకృప అమృతం ద్రావణం మదర్‌ కల్చర్‌ను పొందాలనుకునే రైతులు, ఇంటిపంటలు / మిద్దె తోటల సాగుదారులు ‘గ్రామభారతి’కి ఈ నంబర్లకు ఫోన్‌ చేయొచ్చు: 97057 34202, 62817 77517.

చీడపీడల నియంత్రణ ఎలా?
స్వల్పకాలిక పంటలు, పండ్ల తోటలపై పురుగులు, తెగుళ్ల నియంత్రణకు వారానికి ఒకసారి గోకృప అమృతం 13 లీటర్లకు 2 లీటర్ల నీటిని కలిపి పిచికారీ చేయాలి. పంట ఏ దశలో ఉన్నా వారానికోసారి ఇదే మోతాదులో పిచికారీ చేయవచ్చు. పంటలపై పురుగులు, తెగుళ్ల తీవ్రత ఎక్కువగా ఉంటే వారానికి రెండు లేదా మూడు సార్లు కూడా ఇదే మోతాదులో పిచికారీ చేయవచ్చు. 

‘గోకృప అమృతం’లో ఏమి ఉన్నాయి?
గోకృప అమృతం తయారీకి కావాల్సిన సామగ్రి: గోకృప అమృతం ద్రావణం ఒక లీటరు, 2 కిలోల బెల్లం (ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పండించినది), 2 లీటర్ల దేశీ ఆవు తాజా మజ్జిగ 200 లీటర్ల బ్యారెల్‌ నిండా నీరు.

గోకృప అమృతం తయారీ విధానం
రసాయనాలు, ఆయిల్‌ లేని శుభ్రమైన బ్యారెల్‌ను తీసుకొని 200 లీటర్ల నీటిని నింపండి. అందులో 1 లీటరు గోకృప అమృతం ద్రావణం, 2 లీటర్ల తాజా దేశీ ఆవు మజ్జిగ కలపండి. 2 కేజీల ప్రకృతి వ్యవసాయంలో పండించిన బెల్లంను (ద్రవరూపంలోకి మార్చి) కలపండి. బ్యారెల్‌ను నీడలో ఉంచి, పైన గుడ్డ కప్పి ఉంచాలి. రోజుకు 2 సార్లు కర్రతో సవ్య దిశలో 2 నిమిషాలు తిప్పండి. 5 నుంచి 7వ రోజు నుంచి గోకృప అమృతం వ్యవసాయానికి వాడకానికి సిద్ధమవుతుంది. అర్జెంటుగా కావాలంటే చిన్నపాటి ఎయిరేటర్‌ను అమర్చుకుంటే ఒకటి లేదా రెండు రోజుల్లోనే ఈ ద్రావణం వాడకానికి సిద్ధమవుతుంది. 

గోకృప అమృతంతో ఎరువు చేసేదెలా?
దేశీ ఆవు పేడతో గోకృప అమృతం ద్రావణాన్ని కలిపి ఎరువు తయారు చేసుకోవచ్చు. నీడలో 2 అడుగుల ఎత్తు, 2 అడుగుల వెడల్పున మడిలాగా పేడను వేసి.. అందులో అక్కడక్కడా కన్నాలు పెట్టి 20 లీ. గోకృప అమృతం పోయాలి. 15 రోజులకు ఒకసారి గడ్డపారతో మిశ్రమాన్ని కలిసేలా తిప్పాలి. రోజూ లేదా రెండు రోజులకు ఒకసారి క్రమం తప్పకుండా మిశ్రమంలో తేమ తగ్గకుండా నీటిని చల్లాలి. 40 నుంచి 45 రోజుల్లో గోకృప అమృతంతో ఎరువు తయారవుతుంది. పంట ఏదైనప్పటికీ ప్రతి ఎకరానికీ ప్రతి ఏటా 4 టన్నుల ఈ ఎరువు వేయాలి. పెద్ద ఆవు ఏటా 4 టన్నుల పేడ, 8 వేల లీటర్ల మూత్రం ఇస్తుందని ఓ అంచనా.

గోకృప అమృతాన్ని భూమికి ఇచ్చేదెలా?
గోకృప అమృతం ద్రావణాన్ని ఏ పంటకైనా తొలిసారి ‘ఎకరాని’కి వెయ్యి (1,000) లీటర్లు భూమికి ఇవ్వాలి. ఆ తర్వాత ప్రతి నెలా ఎకరానికి 1,500 లీటర్ల గోకృప అమృత ద్రావణం పారించాలి. దీన్ని ఒకేసారి 1500 లీటర్లు ఇవ్వొచ్చు లేదా 15 రోజులకోసారి 750 లీటర్లు అయినా పారించవచ్చు. ఆ విధంగా ఆ పంట ఎంత కాలం ఉంటే అంతకాలం నెలకు ఎకరానికి 1,500 లీటర్ల చొప్పున  గోకృప అమృతం ద్రావణం ఇస్తూనే ఉండాలి. డ్రిప్‌ పద్ధతిలో గోకృప అమృతం భూమికి ఇవ్వటం సులభం. ఇందులో పేడ కలపటం లేదు కాబట్టి వడకట్టాల్సిన అవసరం ఉండదు. డ్రిప్‌ లేటరల్స్‌లో ఇరుక్కుపోవటం వంటి సమస్య ఉండదు. కాలువ ద్వారా సాగు నీటిని పొలంలో పారిస్తున్నప్పుడు దానితోపాటుగా గోకృప అమృతాన్ని కలిపి సులభంగా ఇవ్వవచ్చు. పంటలపై నీటిని వెదజల్లే స్ప్రింక్లర్ల ద్వారా కూడా నీటితోపాటు గోకృప అమృతాన్ని కలిపి ఇవ్వొచ్చు.
 
అత్యవసర కీటక నియంత్రణ ఎలా?
పంటపై పురుగుల తీవ్రత మరీ ఎక్కువగా ఉంటే ఆవు మూత్రం, పులిసిన మజ్జిగ కూడా కలిపి పిచికారీ చేయాలి. 2 లీటర్ల ‘తాజా’ దేశీ ఆవు మూత్రం, 2 లీటర్ల బాగా పులిసిన దేశీ ఆవు మజ్జిగ (రాగి రేకు వేసి ఉంచిన 45 రోజుల తర్వాత తీసిన దేశీ ఆవు మజ్జిగ), 2 లీటర్ల గోకృప అమృతం కలపాలి. ఈ 6 లీటర్లకు నీటిని 9 లీటర్లు కలిపి పంటకు పిచికారీ చేయండి. మొదటగా 10 లేదా 25 మొక్కలపై ఈ అత్యవసర పురుగుల మందును ప్రయోగించి ఫలితాన్ని చూసి, ఆ తర్వాతే మిగిలిన పంట మీద ప్రయోగించండి.   
ముఖ్య సూచన: ఈ అత్యవసర క్రిమిసంహారక ద్రావణం అత్యవసరమైన పరిస్థితుల్లో మాత్రమే వాడాలి.

21న పుట్టగొడుగుల పెంపకంపై శిక్షణ
పుట్టగొడుగుల పెంపకంపై హైదరాబాద్‌ ఖైరతాబాద్‌లోని దక్షిణ భారత హిందీ ప్రచార సభ కాంప్లెక్స్‌లో రైతునేస్తం ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఈ నెల 21 (ఆదివారం) ఉ. 10 గం. నుంచి  సా. 4 గం. వరకు శిక్షణా కార్యక్రమం జరగనుంది. ప్రొఫెసర్‌ బి. రాజేశ్వరి, పుట్టగొడుగుల రైతు శ్రీమతి కొప్పుల శ్రీలక్ష్మి (రాజమండ్రి) అవగాహన కల్పిస్తారు. పేరు రిజిస్ట్రేషన్‌ కోసం 70939 73999, 96767 97777 నంబర్లలో సంప్రదింవచచ్చు.

మరిన్ని వార్తలు