చౌరీచౌరా ఘటన..19 మందికి ఉరిశిక్ష.. 110 మందికి యావజ్జీవ కారాగారం

21 Jun, 2022 18:46 IST|Sakshi

‘స్వరాజ్య’ నినాదం, ఏడాదిలో స్వాతంత్య్రమే లక్ష్యం. 1920–22 మధ్య జరిగిన సహాయ నిరాకరణోద్యమ వ్యూహం ఇదే. భారత స్వాతంత్య్ర సంగ్రామంలో గాంధీజీ మొదలు పెట్టిన తొలి విస్తృత సత్యాగ్రహమిది. రౌలట్‌ చట్టం (ఎలాంటి విచారణ లేకుండా భారతీయులను శిక్షించే, ప్రవాసానికి పంపే చట్టం), జలియన్‌వాలా బాగ్‌ దురంతం, దానికి కారకులైన వారిని శిక్షించకుండా వదిలిపెట్టడం వంటి పరిణామాలు తమకు కావలసింది స్వరాజ్యమేనన్న భావనను భారతీయులలో బలపరచాయి.

తమ దేశంలో తాము నిస్సందేహంగా ద్వితీయ శ్రేణి పౌరులుగానే బతుకుతున్నామన్న వాస్తవం మరింతగా అనుభవానికి వచ్చింది. అదే గాంధీ ఉద్యమానికి ఊతమిచ్చింది. 1920 నాటి కలకత్తా కాంగ్రెస్‌లో గాంధీ ప్రతిపాదనకు ఆమోదం లభించింది. దీనిలో ముస్లింలను మమేకం చేసేందుకు ఖిలాఫత్‌ ఉద్యమాన్ని గాంధీజీ జత చేశారు. 

బెంగాల్‌ విభజన వ్యతిరేక ఉద్యమ ఛాయలు 1920 నాటి సహాయ నిరాకరణోద్యమంలోనూ కనిపిస్తాయి. సహాయ నిరాకరణ అంటే బ్రిటిష్‌ ప్రభుత్వం ఇచ్చిన బిరుదులను త్యజించాలి. ప్రభుత్వ విద్యా సంస్థలను, కోర్టులను, ఎన్నికలను బహిష్కరించాలి. ఉద్యోగాలు వదిలిపెట్టాలి. పన్నులు చెల్లించరాదు. అలాగే స్వదేశీ. ఇవే ఈ ఉద్యమంలో అనుసరించాల్సిన పద్ధతులు. వీటి ప్రచారానికి గాంధీజీ దేశంలో పర్యటించారు.

సహాయ నిరాకరణోద్యమ ప్రభావం భారతదేశమంతటా కనిపించింది. మధ్య పరగణాలలోని అయోధ్యలో ఈ ఉద్యమం పేరుతో రైతాంగ పోరాటం బలపడింది. సహాయ నిరాకరణ సమావేశం, రైతు ఉద్యమ సభ ఒకటే అనిపించాయి. రాజస్థాన్‌ ప్రాంతంలో రైతులు, గిరిజనులు తమ జీవితాలు బాగు చేసుకున్నారు. అవినీతిపరులైన పూజారుల నుంచి గురుద్వారాలను విముక్తం చేయడానికి పంజాబ్‌లో అకాలీ ఉద్యమం దీనిని ఉపయోగించుకుంది.

జాతీయ విద్య, జాతీయ పరిశ్రమలు కొత్త అడుగులు నేర్చాయి. ఇందులో అన్నిటి కంటే విజయవంతమైనది విదేశీ వస్త్ర బహిష్కరణ. 1920–21 ఆర్థిక సంవత్సరంలో రూ.102 కోట్లు ఉన్న విదేశీ వస్త్రాల దిగుమతులు 1921–22 ఆర్థిక సంవత్సరానికి రూ.57 కోట్లకు పడిపోయాయి. నిజంగానే ఒక్క ఏడాదిలో బ్రిటిష్‌ పాలన నుంచి భారత్‌ విముక్తమవుతుందన్న ఆశ అక్షరాలా వెల్లువెత్తింది. కానీ మోతీలాల్‌ నెహ్రూ, చిత్తరంజన్‌దాస్‌ వంటి పెద్దలు వారిస్తున్నా వినకుండా, పెల్లుబికిన జాతీయతా భావాన్ని గుర్తించకుండా గాంధీజీ ఈ ఉద్యమాన్ని హఠాత్తుగా రద్దు చేశారు. కారణం చౌరీచౌరా దురంతం.       

మధ్య పరగణాలలోని గోరఖ్‌పూర్‌ జిల్లాలో ఉంది చౌరీచౌరా గ్రామం. బ్రిటిష్‌ ఇండియా సైన్యంలో పదవీ విరమణ చేసిన భగవాన్‌ అహిర్‌ ఆ ప్రాంతంలో సహాయ నిరాకరణోద్యమానికి నాయకత్వం వహించారు. గాంధీ పిలుపు మేరకు ఉద్యమంలో పాల్గొని బ్రిటిష్‌ ప్రభుత్వానికి, పెద్ద రైతులకు వ్యతిరేకంగా ఎన్నో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. నాజర్‌ అలీ, లాల్‌ మహమ్మద్, అబ్దుల్లా, కాళీచరణ్, లౌతీ కుమార్, మహాదేవ్‌సింగ్, మెఘు అలీ, రావ్‌ు లఖన్, సీతారాం, మోహన్, శ్యామ్‌సుందర్‌ వంటి వారు ఆయన సహచరులు. సహాయ నిరాకరణోద్యమ ఆశయాల మేరకు అహిర్‌ నాయకత్వంలో నిత్యావసరాల ధరల పెరుగుదలకు, మద్యం అమ్మకాలకు వ్యతిరేకంగా ప్రజలు గౌరీ బజార్‌ అనే చోట 1922 ఫిబ్రవరి 2న నిరసన ప్రదర్శన చేశారు.

చౌరీచౌరా పోలీసులు చెదరగొట్టే పేరుతో వారిని చావగొట్టారు. కొందరు నాయకులను అరెస్టు చేసి అదే స్టేషన్‌లో బంధించారు. ఇందుకు నిరసనగానే ఫిబ్రవరి 4న చౌరీచౌరాతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి దాదాపు రెండున్నరవేల మంది పోగై ఆందోళనకు దిగారు. ‘గాంధీ వర్ధిల్లాలి’ అంటూ నినదిస్తూ, అరెస్టు చేసినవారిని విడుదల చేయాలని కోరారు. ఈ క్రమంలోనే ఒక మద్యం దుకాణం ముందు పికెటింగ్‌ చేశారు. పోలీసులు మళ్లీ జులుం ప్రదర్శించడంతో ప్రదర్శనకారులు  విశ్వరూపం చూపారు. పరిస్థితిని అదుపు చేయడానికి సబ్‌ఇన్‌స్పెక్టర్‌ గుప్తేశ్వర్‌సింగ్‌ కాల్పులకు ఆదేశించాడు. ఆ కాల్పులలో ముగ్గురు మరణించారు. కొంతమంది గాయపడ్డారు. కోపోద్రిక్తులైన ప్రజలు తరమడంతో పోలీసులు స్టేషన్‌ భవనంలోకి పారిపోయారు. ప్రజలు దానికి నిప్పు పెట్టారు. 23 మంది పోలీసులు సజీవ దహనమయ్యారు. ప్రభుత్వం వెంటనే చౌరీచౌరాలో, చుట్టుపక్కల సైనిక శాసనం విధించింది.  

చౌరీచౌరా ఘటనకు బాధ్యత వహిస్తున్నానంటూ, పరిహారమంటూ, మృతుల ఆత్మకు శాంతి కలగాలంటూ గాంధీజీ ఐదు రోజుల నిరశన వ్రతం చేశారు. ఆ దుర్ఘటన ద్వారా భగవంతుడే తన కళ్లు తెరిపించాడనీ, అహింస అనే గొప్ప తాత్త్వికతతో ఉద్యమించే స్థాయి తన సోదర భారతీయులకు రాలేదన్న సంగతి తాను గుర్తించలేకపోయానని ఆయన ప్రకటించారు. ఫిబ్రవరి 12న ఉద్యమాన్ని నిలిపివేస్తున్నట్టు కాంగ్రెస్‌ ప్రకటించింది. ప్రభుత్వం గాంధీని అరెస్టు చేసి, ఆరేళ్లు శిక్ష విధించింది. అయితే ఆయనను 1924లోనే అనారోగ్యం వల్ల విడుదల చేశారు. ఇక్కడితో సహాయ నిరాకరణోద్యమం ఆగిపోయింది. కానీ చౌరీచౌరాలో కొత్త అధ్యాయం మొదలైంది. బ్రిటిష్‌ ఇండియాలో న్యాయ శాసనాలు ఎంత వివక్షతో కూడి ఉన్నాయో తరువాతి పరిణామాలు రుజువు చేశాయి. 

సజీవ దహనమైన పోలీసులు 23 మంది (కొందరు 21 మంది అని, ఇంకొందరు 22 మంది అని కూడా నమోదు చేశారు). మొత్తం 228 మంది మీద కేసులు నమోదు చేశారు. ఎనిమిది మాసాలు విచారణ జరిగింది. అరెస్టయిన వారిలో ఆరుగురు పోలీసు నిర్బంధంలోనే చనిపోయారు. కేసు విచారించిన గోరఖ్‌పూర్‌ సెషన్స్‌ న్యాయస్థానం 172 మందికి ఉరిశిక్ష విధించింది. ఇంతమందికి న్యాయస్థానం మరణదండన విధించిన ఘటన ప్రపంచంలో ఉన్నదా అనేది అనుమానమే.  దీని మీద దేశంలో ఆందోళన మొదలయింది.

‘బిహార్‌ బంధు’ పత్రిక నిర్బంధం మధ్యనే ఈ విచారణ గురించి, ఆ ఘోరమైన శిక్ష గురించి వ్యాసాలు ప్రచురించింది. కవితాత్మకంగా రాసిన ఒక వ్యాసంలో ‘ఉరికంబం ఎక్కబోతున్న ఆ 170 మందిని పరామర్శించగలవా భారతీయుడా’ అంటూ ఆవేదనతో ప్రశ్నించింది. అలహాబాద్‌ నుంచి వెలువడే ‘అభ్యుదయ’ పత్రిక చౌరీచౌరాయే ఘోరమైన ఘటన అనుకుంటే, ఆ కేసులో తీర్పు మరింత ఘోరమైనదని వ్యాఖ్యానించింది. ఇది న్యాయం చేయడం కాదు, న్యాయాన్ని హత్య చేయడమేనని కాన్పూర్‌ నుంచి వెలువడే ‘ప్రతాప్‌’ పత్రిక వ్యాఖ్యానించింది. ఆ తీర్పును ఎంఎన్‌ రాయ్‌ చట్టబద్ధ హత్యగా వర్ణించారు. తీర్పును వ్యతిరేకిస్తూ సమ్మెకు దిగాలని కార్మికులకు పిలుపునిచ్చారు.

ఈ కేసును అలహాబాద్‌ హైకోర్టులో అప్పీలు చేశారు. 1923 ఏప్రిల్‌ 20న హైకోర్టు కేసును పునఃపరిశీలించింది. అక్కడ మదన్‌మోహన్‌ మాలవీయ కేసు వాదించారు. చివరికి కోర్టు 19 మందికి మరణ దండన ఖరారు చేసింది. 110 మందికి యావజ్జీవ కారాగారం విధించింది. మిగిలిన వారికి కూడా కొద్దిపాటి శిక్షలు వేశారు. అలా మాలవీయ ప్రమేయంతో 151 మంది మరణదండన నుంచి బయటపడ్డారు. ఇందులో చాలామంది స్వాతంత్య్రం వచ్చాకే విడుదలయ్యారు. సహాయ నిరాకరణోద్యమాన్ని నిలిపివేస్తూ తీసుకున్న నిర్ణయం స్వరాజ్యోద్యమంలో కొత్త గొంతులకు ఆస్కారమిచ్చింది. అందుకు ఉదాహరణ అల్లూరి శ్రీరామరాజు, చంద్రశేఖర్‌ ఆజాద్‌. 
-డా. గోపరాజు నారాయణరావు

మరిన్ని వార్తలు