Gopika Govind: బొగ్గు అమ్మే అమ్మాయి ఎయిర్‌ హోస్టెస్‌

2 Sep, 2022 02:03 IST|Sakshi
గోపికా గోవింద్‌

కేరళలో కేవలం పదిహేను వేల మంది ఉండే గిరిజనులు ‘కరింపలనులు’. పోడు వ్యవసాయం, కట్టెబొగ్గు చేసి అమ్మడం వీరి వృత్తి. అలాంటి సమూహం నుంచి ఒకమ్మాయి ‘ఎయిర్‌హోస్టెస్‌’ కావాలనే కల కంది. కేరళలో అప్పటి వరకూ గిరిజనులు ఎవరూ ఇలాంటి కలను కనలేదు. 12 ఏళ్ల వయసులో కలకంటే 24 ఏళ్ల వయసులో నిజమైంది. పరిచయం చేసుకోండి కేరళ తొలి గిరిజన ఎయిర్‌హోస్టెస్‌ని.

కేరళలోని కన్నూరు, కోజికోడ్‌ జిల్లాల్లో కనిపించే అతి చిన్న గిరిజన తెగ‘కరింపలనులు’. వీళ్లు మలయాళంలో తుళు పదాలు కలిపి ఒక మిశ్రమ భాషను మాట్లాడతారు. అటవీ భూమిని లీజుకు తీసుకుని వ్యవసాయం చేస్తారు. లేదంటే అడవిలోని పుల్లల్ని కాల్చి బొగ్గు చేసి అమ్ముతారు. గోపికా గోవింద్‌ ఇలాంటి సమూహంలో పుట్టింది. అయితే ఈ గిరిజనులకు ఇప్పుడు వ్యవసాయం కోసం అటవీభూమి దొరకడం లేదు. కట్టెలు కాల్చడాన్ని ఫారెస్టు వాళ్లు అడ్డుకుంటూ ఉండటంతో బొగ్గు అమ్మకం కూడా పోయింది. చిన్నప్పుడు అమ్మా నాన్న చేసే ఈ పని చూస్తూ పెరిగిన గోపికా ఇక్కడతో ఆగడమా... అంబరాన్ని తాకడమా అంటే అంబరాన్ని తాకడమే తన లక్ష్యం అని అనుకుంది.

డిగ్రీ తర్వాత
బిఎస్సీ చదివిన గోపిక ఇప్పుడు ఎయిర్‌ హోస్టెస్‌ కావాలంటే అవసరమైన కోర్సు గురించి వాకబు చేసింది. ప్రయివేటు కాలేజీలలో దాని విలువ లక్షల్లో ఉంది. కూలి పని చేసే తల్లిదండ్రులు ఆ డబ్బు కట్టలేరు. అందుకని ఎం.ఎస్సీ కెమిస్ట్రీ చేరింది. చదువుతున్నదన్న మాటేకాని ఎయిర్‌ హోస్టెస్‌ కావడం ఎలా... అని ఆలోచిస్తూనే ఉంది. సరిగ్గా అప్పుడే ఐ.ఏ.టి.ఏ (ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అసోసియేషన్‌) వాళ్ల కస్టమర్‌ సర్వీస్‌ కోర్సును గవర్నమెంట్‌ స్కాలర్‌షిప్‌ ద్వారా చదవొచ్చని తెలుసుకుంది. ఎస్‌.టి విద్యార్థులకు ఆ స్కాలర్‌షిప్‌ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తోంది. అప్లై చేసింది. స్కాలర్‌షిప్‌ మంజూరు అయ్యింది. గోపిక రెక్కలు ఇక ముడుచుకు ఉండిపోలేదు.

లక్ష రూపాయల కోర్సు
వాయనాడ్‌లోని డ్రీమ్‌ స్కై ఏవియేషన్‌ అనే సంస్థలో ఎయిర్‌ హోస్టెస్‌ కోర్సును స్కాలర్‌షిప్‌ ద్వారా చేరింది గోపిక. చదువు, బస, భోజనం మొత్తం కలిపి లక్ష రూపాయలను ప్రభుత్వమే కట్టింది. మలయాళ మీడియం లో చదువుకున్న గోపిక ఎయిర్‌ హోస్టెస్‌కు అవసరమైన హిందీ, ఇంగ్లిష్‌లలో కూడా తర్ఫీదు అయ్యింది. కోర్సు పూర్తి చేసింది. ఒకసారి ఇంటర్వ్యూకు వెళితే సెలెక్ట్‌ కాలేదు. రెండోసారి ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ సంస్థలో ఎయిర్‌ హోస్టెస్‌గా ఎంపికయ్యింది. విమానం ఎప్పుడూ ఎక్కని గోపిక విమానంలోనే ఇక పై రోజూ చేసే ఉద్యోగం కోసం తిరువనంతపురం నుంచి ముంబైకి ట్రైనింగ్‌ కోసం వెళ్లింది. అక్టోబర్‌లో ఆమె కూడా యూనిఫామ్‌ వేసుకుని విమానంలో మనకు తారస పడొచ్చు. ఆమె కలను ఆమె నెరవేర్చుకుంది. ఇక మీ వంతు.

8వ క్లాసు కల
గిరిజనులు విమానాన్ని గాల్లో ఎగురుతుంటే చూస్తారు తప్ప ఎక్కలేరు. గోపికా గోవింద్‌ కూడా చిన్నప్పుడు ఆకాశంలో ఎగిరే విమానాన్ని ఉత్సాహంగా, వింతగా చూసేది. అందులో ఎక్కడం గురించి ఆలోచించేది. 8వ క్లాసుకు వచ్చినప్పుడు ఒక పేపర్‌లో ఎర్రటి స్కర్టు, తెల్లటి షర్టు వేసుకున్న ఒక చక్కటి అమ్మాయి గోపికా కంట పడింది. ఎవరా అమ్మాయి అని చూస్తే ‘ఎయిర్‌ హోస్టస్‌’ అని తెలిసింది. విమానంలో ఎగురుతూ విధి నిర్వహణ. ఇదేకదా తనకు కావాల్సింది అనుకుంది. కాని ఎవరికైనా చెప్తే నవ్వుతారు. బొగ్గులమ్ముకునే వాళ్ల అమ్మాయికి ఎంత పెద్ద కల అనుకుంటారు. అందుకని సిగ్గుపడింది. తల్లిదండ్రులకు కూడా చెప్పలేదు. కాని కల నెరవేర్చుకోవాలన్న కలను మాత్రం రోజురోజుకు ఆశ పోసి పెంచి పెద్ద చేసుకుంది.

మరిన్ని వార్తలు