యూత్‌ హాస్టల్స్‌: ఆమెను నమ్ముకొని దేశం తిరగొచ్చు

19 Apr, 2022 00:32 IST|Sakshi

‘మనకో ఫ్లాట్‌ ఉండాలి’  అనుకోకుండా ‘తిరిగేవాళ్లకు ఒక స్పాట్‌ ఉండాలి’ అనుకుందామె. యూరప్‌కు వెళ్లినప్పుడు చూసింది– అక్కడి యూత్‌ హాస్టల్స్‌ను. అంత క్రియేటివ్‌గా, కాలక్షేపంగా, చీప్‌గా ఉండే యూత్‌ హాస్టల్స్‌ను 2014 నుంచి మొదలెట్టింది. సోలో ట్రావెలర్లు, దిమ్మరి పర్యాటకులు, విద్యార్థులు తక్కువ ఖర్చులో ఆగి ముందుకు సాగేలా ‘గోస్టాప్స్‌’ పేరుతో యూత్‌ హాస్టల్‌చైన్‌ను విస్తరించింది. వారణాసితో మొదలుపెట్టి ఉదయ్‌పూర్‌ వరకు ఇప్పటికి 33 హాస్టల్స్‌ ఉన్నాయి. రాబోయే ఐదేళ్లలో 1500 హాస్టళ్లు అందుబాటులో తేవాలంటున్న పల్లవి అగర్వాల్‌ పరిచయం.

పూర్వం ‘అతిథి దేవోభవ’ అని దారిన పోయేవాళ్లు ఎవరొచ్చినా ఇంట్లో ఆతిథ్యం ఇచ్చేవారు. యాత్రికులకు, పర్యాటకులకు ఇల్లే విడిది. ఆ తర్వాత పూటకూళ్లమ్మ ఇళ్లు చాలా కాలం ఏలాయి. ఆ తర్వాత సత్రాలు వచ్చాయి. మార్గమధ్యంలో సత్రంలో ఆగి సేదతీరి వెళ్లేవారు. మరి ఇప్పుడు? హోటల్సు ఖరీదు. గెస్ట్‌హౌస్‌లు దొరకవు. మరి మార్గం? 1946లో దేశంలో ‘యూత్‌ హాస్టల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా’ ఆధ్వర్యంలో యూత్‌ హాస్టల్స్‌ ఏర్పాడ్డాయి.

కాని వాటి నిర్వహణ సంప్రదాయపద్ధతిలో ఉంటుంది. అందుకే యువతను ఆకర్షించేలా ప్రయివేటు యూత్‌ హాస్టల్స్‌ వచ్చాయి. జోస్టల్, ది మాడ్‌ప్యాకర్స్, బంక్‌యార్డ్స్‌లాంటి ప్రయివేటు హాస్టల్స్‌తో పాటు అన్ని విధాలుగా ఆకర్షణీయంగా ఉండే ‘గోస్టాప్స్‌’ హాస్టల్స్‌ కూడా అందుబాటులోకి వచ్చాయి. ఒక రాత్రికి 400 రూపాయల నుంచి 800 ఖర్చుతో ఉండేలా వీటిని తీర్చిదిద్దింది పల్లవి అగర్వాల్‌.

యూరప్‌ పర్యటన స్ఫూర్తి
పల్లవి అగర్వాల్‌ది ఢిల్లీ. టాటా కాపిటల్‌లో ఉద్యోగం.  భర్త పంకజ్‌ పర్వాండా ఇంజనీరింగ్‌ చదివాడు. ఇద్దరూ 2013లో బ్యాక్‌ప్యాకర్స్‌గా యూరప్‌ యాత్రకు వెళ్లారు. అంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ దేశాలు తిరగడానికి ప్లాన్‌ చేసుకున్నారు. తక్కువ ఖర్చుతో తిరగాలంటే అక్కడి యూత్‌ హాస్టల్స్‌లో దిగక తప్పదు. యూరప్‌లోని యూత్‌ హాస్టల్స్‌ పల్లవికి చాలా నచ్చాయి.

వాటి మెయింటెనెన్స్‌ బాగుంది. ఎవరూ లేని చోట ఏకాంతంగా ఉండే ప్రాంతాలలో కూడా యూత్‌ హాస్టల్స్‌ అక్కడ అందుబాటులో ఉన్నాయి. ‘మన దేశంలో యూత్‌ హాస్టల్స్‌ కొరత ఉంది. సరిగ్గా నడిపితే మనం హిట్‌ కొడతాము’ అంది పల్లవి. పంకజ్‌ అందుకు అంగీకరించాడు. ఇండియా తిరిగి వచ్చాక స్టార్టప్‌గా ‘గోస్టాప్స్‌’ హాస్టల్స్‌ మొదలుపెట్టింది పల్లవి.

విదేశీయులే టార్గెట్‌
యూత్‌ హాస్టల్స్‌ను ప్రారంభించే ముందు పల్లవి తన టార్గెట్‌గా విదేశీయులను పెట్టుకుంది. విదేశీయులకు ఆకర్షణీయంగా ఉండేలా, వారు ఎక్కువ రోజులు స్టే చేసేలా మొదట వారణాసిలో గోస్టాప్స్‌ హాస్టల్‌ మొదలు పెట్టింది. ఎందుకంటే యూరప్‌ నుంచి, సౌత్‌ ఏసియా నుంచి వచ్చే పర్యాటకులకు యూత్‌ హాస్టల్స్‌ కాన్సెప్ట్‌ తెలుసు. వారు వాటినే ఇష్టపడతారు. కాని మార్కెట్‌లో ఉన్న పోటీదారులు చాలా సౌకర్యాలు ఏర్పాటు చేసి 3 స్టార్‌ హోటల్స్‌లాగా వాటిని సిద్ధం చేశారు.

పన్నెండు మందితో రూమ్‌ షేరు చేసుకుంటే వారి దగ్గర స్టే తక్కువ పడుతుంది. కాని పల్లవి ఈ అదనపు సౌకర్యాలను తగ్గించి, నివసించే చోటును ఆకర్షణీయం చేసింది. బెడ్స్, డైనింగ్‌ హాల్, లాంజ్‌... యాత్రికులు ఆడొచ్చు పాడొచ్చు... ఎక్కడైనా కూచోవచ్చు... ఎన్నిరోజులైనా ఉండొచ్చు.  దాంతో విదేశీయులతో పాటు భారతీయులు కూడా వీటి పట్ల ఆకర్షితులవుతున్నారు. ‘కరోనాకు ముందు మేము 13 హాస్టల్స్‌ రన్‌ చేశాం. ఇపుడు 33 అయ్యాయి’ అంటుంది పల్లవి.

కొత్తపద్ధతిలో
పల్లవి స్టార్టప్‌ ఇన్వెస్టర్లను ఆకర్షించి వారి సపోర్ట్‌ అందింది. అయితే హాస్టల్స్‌కు సొంత భవనాలు ఉండాలనే నియమం పల్లవి పెట్టుకోలేదు. వివిధ నగరాల్లో సరైన చోట భవనం దొరికితే లీజ్‌కు తీసుకునో, ఫ్రాంచైజ్‌ ఇచ్చో, కొనుగోలు చేసో తమ పద్ధతిలో ఆధునికమైన హాస్టల్స్‌ గా తయారు చేసి అందుబాటులోకి తెస్తుంది. కాని హాస్టల్‌ ఉండటం ముఖ్యం అని భావిస్తుంది. ‘గత సంవత్సరం వరకు మన దేశంలో 1000 యూత్‌ హాస్టల్స్‌ ఉండేవి. ఇప్పుడు ఎన్ని నడుస్తున్నాయో కరోనా వల్ల ఎన్ని మూత పడ్డాయో తెలియదు. కాని దేశంలో కోటిన్నర మంది యాత్రికులు, పర్యాటకులు, ప్రయాణాలు చేసే విద్యార్థులు యూత్‌ హాస్టల్స్‌ అవసరంలో ఉన్నారు. వారి కోసమని రాబోయే ఐదేళ్లలో 1500 హాస్టల్స్‌ స్థాపించడమే మా లక్ష్యం’ అంటుంది పల్లవి.
ఆ విధంగా ఆధునిక పూటకూళ్లమ్మ పల్లవి.

మరిన్ని వార్తలు