Himadri Patel: అమ్మ లిప్‌స్టిక్‌, అమ్మమ్మ చీరలతో యంగ్‌ ఎంట్రప్రెన్యూర్‌గా..

20 Sep, 2023 10:56 IST|Sakshi

జీవితంలో ఇది అవ్వాలి! అది అవ్వాలి! అని కలలు కంటుంటాము. కొంతమంది కలలు మాత్రమే నిజం అవుతాయి. కొంతమంది పరిస్థితులకు తలొగ్గి ఇష్టం లేకపోయినా సర్దుకుపోయి బతికేస్తుంటారు.

హిమాద్రి పటేల్‌ మాత్రం ఈ కోవకు చెందిన అమ్మాయి కాదు. ఇక ఇంతేలే అని సరిపెట్టుకోకుండా తను అనుకున్నది సాధించేందుకు అందర్ని ఒప్పించి, కష్టపడి.. ఫ్యాషన్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా కంటెంట్‌ క్రియేటర్, ఎంట్రప్రెన్యూర్‌గా రాణిస్తోంది.


డెహ్రాడూన్‌కు చెందిన 26 ఏళ్ల హిమాద్రి పటేల్‌ చిన్నప్పటి నుంచి చాలా చురుకుగా ఉండేది. మేకప్‌ అంటే ఎంతో ఆసక్తి. అమ్మ వాడే లిప్‌స్టిక్‌ రాసుకుని తనని తాను అద్దంలో చూసుకుని తెగ మురిసిపోతుండేది. ఎప్పుడూ నలుగురిలో ప్రత్యేకంగా ఉండేందుకు తాపత్రయ పడేది. ఇంటర్మీడియట్‌లో ఉండగానే జాతీయ, అంతర్జాతీయ మేకప్‌ ట్యుటోరియల్స్‌ చూసి మెకప్‌ మెళుకువలు నేర్చుకుంటుండేది.

ఇలా నేర్చుకుంటూ తను కూడా సొంతంగా యూట్యూబ్‌ ఛానల్‌ పెట్టాలనుకుంది. కానీ దానికి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. ఈలోపు ఇంటర్మీడియట్‌ పూర్తయింది. తరువాత ఫ్యాషన్‌ను కెరీర్‌గా మలచుకోవాలనుకుంది. తల్లిదండ్రులు ఇంజినీరింగ్‌ చేయమని చె΄్పారు. ఇష్టం లేకపోయినా తల్లిదండ్రులను నొప్పించలేక కంప్యూటర్‌ సైన్స్‌లో చేరింది. బీటెక్‌ చదువుతున్నప్పటికీ మేకప్‌ మెళకువలు నేర్చుకుంటూనే ఉంది.

ఇన్ఫోసిస్‌ను వదిలి ఇన్‌ఫ్లుయెన్సర్‌గా...
బీటెక్‌ చదువుతున్నప్పటికీ మనసు యూట్యూబ్‌పైనే ఉండడంతో మరోసారి తల్లిదండ్రులను యూట్యూబ్‌ ఛానల్‌ పెడతానని అడిగింది. అయినా ఒప్పుకోలేదు. అప్పుడు హిమాద్రి అక్క... ‘‘ఛానల్‌ను పెట్టనివ్వండి. ఆమెకు మూడు నెలలు సమయం ఇద్దాం. ఆలోపు తనని తాను నిరూపించుకుంటే ఒకే. లేదంటే మనం చెప్పినట్టు చేస్తుంది’’ అని తల్లిదండ్రులను ఒప్పించింది. దీంతో హిమాద్రి పటేల్‌ పేరుతోనే యూట్యూబ్‌ ఛానల్‌ను ప్రారంభించింది. ఒక లిప్‌స్టిక్, ఐలైనర్‌తో ఛానల్లో వీడియోలు పోస్టుచేయడం ప్రారంభించింది.

అందంగా కనిపించేందుకు ఎటువంటి హానీ లేని మేకప్‌ను ఎలా వేసుకోవాలో చెబుతూ వీడియోలు పోస్టుచేసేది. ఎక్కువగా నిజజీవితంలో ఎదురయ్యే సమస్యలను ప్రస్తావిస్తూ వాటి పరిష్కారాలు చెబుతుండడంతో తన ఛానల్‌కు మంచి ఆదరణ లభించింది. మరోపక్క బీటెక్‌ ఫైనల్‌ ఇయర్‌లోకి వచ్చింది. క్యాంపస్‌ సెలక్షన్స్‌లోనూ మంచి ప్రతిభచూపి ఇన్ఫోసిస్, క్యాప్‌జెమినీలలో ఉద్యోగం సంపాదించింది. అయినా హిమాద్రికి పెద్ద సంతోషంగా అనిపించలేదు.

ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదింటివరకు చేసే సాంప్రదాయ ఉద్యోగం చేయడం తనకి నచ్చలేదు. తల్లిదండ్రులు ఇన్ఫోసిస్‌లో చేరమని చెప్పారు. కానీ తను యూట్యూబ్‌ ఛానల్‌ను నడుపుతానని చెప్పింది. అప్పటికే హిమాద్రి మీద నమ్మకం ఉన్న తల్లిదండ్రులు యూట్యూబర్‌గా కొనసాగడానికి ఒప్పుకున్నారు. అప్పటి నుంచి యూట్యూబ్‌ ఛానల్‌ వివిధ రకాల సరికొత్త కంటెంట్‌ను అప్‌లోడ్‌ చేస్తూ సంపాదిస్తూ, ఎక్కువమంది ఫాలోవర్స్‌తో.. బ్యూటీ, ఫ్యాషన్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా పాపులర్‌ అయ్యింది.

అమ్మమ్మ చీరలుచూసి...
హిమాద్రి చిన్నప్పటి నుంచి అమ్మమ్మ కట్టుకునే చీరలను జాగ్రత్తగా గమనించేది. నిమిషంలో కుచ్చిళ్లు పెట్టుకుని అందంగా చీరకట్టుకుని సైకిల్‌ తొక్కేది అమ్మమ్మ. అంతేగాక చీరలకు తనే స్వయంగా డిజైన్లు కుట్టుకోవడం, ఇంట్లో అందరికి స్టోల్స్‌ అల్లడాన్ని చూసి పెరిగిన హిమాద్రి అలాంటి బట్టలనే మార్కెట్లో విక్రయించాలనుకుని..‘డ్రై బై హిమాద్రి’ పేరిట క్లాత్‌ బ్రాండ్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఈ బ్రాండ్‌ ద్వారా అత్యంత నాణ్యమైన, సాంప్రదాయ దుస్తులను విక్రయిస్తోంది. అలనాటి డిజైన్‌ చీరలు, డ్రెస్‌లను భవిష్యత్‌ తరాలకు అందించడమే లక్ష్యంగా హిమాద్రి దూసుకుపోతోంది.

గౌరవంగా...
డ్రై (ఈఖఐ) అంటే సంస్కృతంలో గౌరవం అని అర్థం. అమ్మాయిలు, మహిళలు ధరించే చీరలు, డ్రెస్‌లు ఏవైనా గౌరవించేలా వారి కట్టుబొట్టు ఉండాలి. అందుకు తగ్గట్టుగా సాంప్రదాయ వస్త్రాలను తయారు చేసి విక్రయిస్తోంది హిమాద్రి. వ్యాపార రంగంలో ఎటువంటి అనుభవమూ లేదు. కుటుంబం నుంచి వచ్చిన తొలివ్యాపారి కావడంతో హిమాద్రి అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. వివిధ రకాల చిక్కులను తన అక్క సాయంతో ఎదుర్కొంటూ.. చిన్నచిన్న వేడుకల నుంచి వెడ్డింగ్‌ డ్రెస్‌ల వరకు అన్ని వస్త్రాలను రూపొందించి డ్రైబ్రాండ్‌కు గుర్తింపు తెచ్చుకుని యంగ్‌ ఎంట్రప్రెన్యూర్‌లకు ప్రేరణగా నిలుస్తోంది.           

      


ఐదు గంటలకు పడుకునేవాళ్లం
అక్కా నేను రాత్రంతా మేలుకుని చేయాల్సిన పనిగురించి పరిశోధించి, వివరంగా తెలుసుకుని పేపర్‌ వర్క్‌ పూర్తిచేసేవాళ్లం. లీగల్‌ విషయాలపై క్షుణ్ణంగా అధ్యయనం చేసి తెల్లవారుజామున ఐదు గంటలకు పడుకునేవాళ్లం. అలా అన్నివిధాలా సన్నద్దమయ్యాక అంటే రెండేళ్ల తరువాత డ్రై బ్రాండ్‌ను గతేడాది అక్టోబర్‌లో తీసుకొచ్చాం.

ఆర్థికంగా ఎవరూ సాయం చేయలేదు. యూట్యూబ్, కంటెంట్‌ బిజినెస్‌ ద్వారా వచ్చిన ఆదాయంతో దాచుకున్న డబ్బులనే డ్రై బ్రాండ్‌కు పెట్టుబడిగా పెట్టుకున్నాను. ప్రారంభంలో పెద్దగా ఆర్డర్లు ఏమీ రాలేదు. నెల తరువాత ఆర్డర్లు రావడం మొదలయ్యాయి. అలా వచ్చిన ఆర్డర్లతో పెట్టుబడికి కొంత, మిగతాది వర్కర్లకు జీతాలకు ఇచ్చేదాన్ని. అలా చేస్తూ ఇప్పుడు కాస్త లాభాలు ఆర్జిస్తున్నాను.
– హిమాద్రి పటేల్‌

మరిన్ని వార్తలు