అనుకున్నామనీ జరగవు అన్నీ...కన్నీళ్లు పెట్టించే లవ్‌ స్టోరీ!

30 Jan, 2024 10:59 IST|Sakshi

కొన్ని ప్రేమ కథలు హృద్యంగా ఉంటాయి. మరికొన్ని ప్రేమ కథలు కన్నీరు పెట్టిస్తాయి. అలాంటి వాటిల్లో ఒక జంట ప్రేమ కథ ప్రస్తుతం  సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.  అందరి ప్రేమికుల్లాగానే ఎన్నో కబుర్లు చెప్పుకుంది ఈ జంట.  అందమైన జీవితాన్ని కలగంది.  నిశ్చితార్థాన్ని కూడా చేసుకున్నారు.  అన్నీ అనుకున్నట్టు జరిగితే బావుండేది... కానీ విధి మరోలా ఉంది. మాయదారి మహమ్మారి  వారి ప్రేమ కథను  విషాదాంతం చేసింది. 

హీథర్, డేవిడ్ మోషెర్ 2015లో స్వింగ్ డ్యాన్స్ క్లాస్‌లో కలుసుకున్నారు. తొలుత చూపులు,  ఆ తర్వాత మాటలు కలిసాయి. కొన్ని నెలల  డేటింగ్  తరువాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించారు.  బంధువులు, సన్నిహితుల మధ్య నిశ్చితార్థ వేడుకను నిర్వహించుకున్నారు. 2017, డిసెంబర్ 30 తమ పెళ్లి ముహూర్తంగా ఖాయం  చేసుకున్నారు. అయితే ఇక్కడే వారి జీవితాల్లో పెద్ద అలజడి రేగింది. హీథర్‌కు చాలా ప్రమాదకరమైన ట్రిపుల్-నెగటివ్ రొమ్ము కేన్సర్ నిర్ధారణ అయింది. అంతే..అంతా తారుమారు. టెస్ట్‌లు,  కీమోథెరపీలతో ఆసుపత్రులు చుట్టూ తిరగడమే సరిపోయింది.

కనెక్టికట్‌లోని హార్ట్‌ఫోర్డ్‌లోని సెయింట్ ఫ్రాన్సిస్ హాస్పిటల్‌లో తన ప్రియురాలు ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య పోరాడుతోంది. మరోవైపు ఉబికి వస్తున్న కన్నీళ్లను అదుముకుంటూ ఆసుపత్రి బెడ్ పైనే ఆమెను వివాహం చేసుకున్నాడు.  ఆమె కోరిక మేరకు  ఆసుపత్రి  బెడ్ పెళ్లి వేదికగా మారింది. ఆసుపత్రి సిబ్బంది, కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్న సరిగ్గా ఏడాదికి ప్రియురాలిని వివాహం చేసుకున్నాడు. పంటి బిగువున శారీరక బాధను భరిస్తూ భర్తగా మారిన ప్రియుడిని ప్రేమతో ఆలింగనం చేసుకున్న ఆ చేతులు 18 గంటల తరువాత అచేతనంగా మిగిలి పోయాయి. భర్తను చూస్తూ శాశ్వత నిద్రలోకి జారిపోయింది హీథర్‌.  

మరో విషాదం ఏమిటంటే పెళ్లి చేసుకోవాలనుకున్న డిసెంబరు 30నే  ప్లాంట్స్‌విల్లే కాంగ్రెగేషనల్ చర్చిలో హీథర్ మోషర్ అంత్యక్రియలు ముగిసాయి.  2018లో అమెరికాలోని కనెక్టికట్ రాష్ట్రంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. నాన్‌ ఈస్తటిక్‌ థింక్స్‌ అనే ట్విటర్‌ హ్యాండిల్‌ ఈ స్టోరీని ట్విటర్‌లో మళ్లీ షేర్‌ చేసింది. కేవలం 14 గంటల్లోనే 17 మిలియన్ల వ్యూస్‌ను దక్కించుకుంది. 

whatsapp channel

మరిన్ని వార్తలు