ఆ రుతువు వచ్చేవరకూ ఆగాలి... తప్పదు

13 Feb, 2023 01:12 IST|Sakshi

మామిడి కాయలంటే ఇష్టం. మొక్క తెచ్చావు. నీళ్ళుపోసావు... ఇంకా కాయలు రాలేదని రోజూ బిందెలకు బిందెలు నీళ్ళుపోస్తే కాయలు రావు. మొక్క చెట్టు కావాలి... అయినా వసంత రుతువుకూడా రావాలి.. అప్పుడే పూత పూస్తుంది, అది పిందెగా మారుతుంది. ఆ పిదప కొంత కాలానికి కాయ... ఆ తరువాతే పండు... అప్పటిదాకా ఓర్పు ఉండాలి. వేచి చూడాలి. ఎప్పుడో కాయ కాస్తుందని ఇప్పటినుంచే నీళ్ళెందుకు పోయడం.. అని మానేస్తే మొక్క బతకదు... అంటే ఓర్పుతోపాటు నీ ప్రయత్నం కూడా పూర్తిగా ఉండాలి.

ప్రతి దానికీ ఒక నియమం, ఒక సమయం ఉంటాయి. అప్పటిదాకా వేచి చూడగల ఓర్పు ఉండడంతో పాటూ ప్రయత్నం కూడా పూర్తిగా ఉండాలి.  వెనకటికి ఓ రాజుపై శత్రువులు విరుచుకు పడ్డారు. రాజు ఓడిపోయాడు. నిరాశతో రాజు అన్నీ వదిలేసుకొని ఒంటరిగా వెళ్ళిపోతుంటే... సైనికులు, ఆంతరంగికులు అందరూ నచ్చచెప్పారు. మనం కొంతకాలం ఆగుదాం.. మళ్ళీ శత్రువుపై యుద్ధం ప్రకటిద్దాం.. అని చెప్పినా వినకుండా అడవుల్లోకి వెళ్ళిపోయాడు.

ఓరోజున రాజు ఒక చెట్టుకింద కూర్చుని... దగ్గర్లోనే ఒక సాలెపురుగు గూడు అల్లడానికి నానా తంటాలు పడడాన్ని ఆసక్తిగా గమనించాడు.. అది గూడు అల్లే క్రమంలో చాలాసార్లు పోగు తెగి కిందపడిపోతున్నది... పలుమార్లు అలా చేసిన తరువాత చివరికి అది గూడు పూర్తిగా అల్లి మధ్యలో సౌకర్యవంతంగా కూర్చుని గూడుకు చిక్కుకున్న పురుగులను హాయిగా తింటున్నది. ఇది చూసిన రాజుకు జ్ఞానోదయమయింది. వెంటనే వెళ్ళి తన పరివారాన్ని చేరదీసి సర్వసన్నద్ధం అయ్యేవరకు ఆగి... ఓ రోజున యుద్ధం ప్రకటించాడు. శత్రురాజును సునాయాసంగా ఓడించి తిరిగి తన రాజ్యాన్ని పొందాడు. ప్రతిదానికీ ఒక నియమం ఉంటుంది. ఆ నియమాన్ని అర్థం చేసుకుని ప్రయత్నం ఎక్కడా ఆపకుండా పూర్తిచేయాలి, ఫలితం వచ్చేవరకూ ఓర్పుగా వేచి చూడాలి. 

తొలితరానికి చెందిన ప్రఖ్యాత భారతీయ శాస్త్రవేత్తల్లో ఒకరైన సర్‌ జగదీశ్‌ చంద్రబోస్‌ ఆంగ్లేయ ప్రొఫెసర్లతో సమానమైన అర్హతలు, ప్రతిభాపాటవాలు కలిగినా, వారితో సమానంగా తనకు వేతనం ఇవ్వనందుకు నిరసనగా జీతం ముట్టుకోకుండా తన వృత్తిని మూడేళ్ళపాటు ఆర్థికంగా ఇబ్బందులు పడుతూనే అదే అంకితభావంతో కొనసాగిస్తే... చివరకు అప్పటి బ్రిటీష్‌ ప్రభుత్వం దిగొచ్చి ఆయన్ని సన్మానించి పెంచిన జీతం పాత బకాయిలతో సహా చెల్లించింది.  కార్యసాధనలో ఓర్పు ఎంత ముఖ్యమో... ప్రయత్నాలను చివరిదాకా కొనసాగించడం కూడా అంతే ముఖ్యం.

- బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు 

మరిన్ని వార్తలు