65 ఏళ్ల ఎదురుచూపు.. మరణం వరకు.. అద్భుత ప్రేమ గాథ!

25 Oct, 2021 17:16 IST|Sakshi

ప్రేమకు చావు లేదు. అది అజరామరం అంటారు. ప్రేమలో ప్రేమతప్ప ధ్వేషభేషజాలు అస్సలుండవు. దీనిని రుజువుచేసే ఎందరో వీర ప్రేమికులను చరిత్రలో చూశాం కూడా. అవన్నీ పిచ్చి ప్రేమలని కొట్టి పారేయలేం కూడా. ఎందుకంటే ఆయా గాథల్లో రాతిని కూడా చలింపచేయగల శక్తి ఉంటుంది. ఇప్పుడు మీరు తెలుసుకోబోయే ప్రేమికుల ప్రేమ కథ కూడా అటువంటిదే! ఈనాటి ప్రేమ కూడా కాదండోయ్‌! 1911 నాటి ప్రణయగాథ.. మొదలెడదామా..

పెర్లె స్క్వార్జ్‌, మాక్స్‌ వెల్‌ అనుకోకుండా ఒక కంట్రీ క్లబ్‌లో కలిశారు. లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌ అంటారే.. వీళ్లది కూడా అటువంటి ప్రేమే. తొలిచూపులోనే ఒకరినొకరు ఇష్టపడ్డారు. వాళ్లకే తెలీకుండా పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు. ఇరు కుటుంబాల్లో విషయం చెప్పారు. ఇరువురి మతాలు వారి పెళ్లికి అడ్డుపడ్డాయి. తల్లిదండ్రులు ససేమిరా అన్నారు. కుటుంబ పరువు కోసం ఆజన్మాంతం ప్రేమికులుగానే మిగిలిపోయారు. 

చదవండి: 150 ఏళ్లు పట్టేదట! కానీ.. కేవలం 18 ఏళ్లలోనే.. !!

తర్వాత మ్యాక్స్‌వెల్‌ నావీలో జాయిన్‌ అయ్యాడు. ఎమ్‌ఏ, ఎమ్‌బీఏలు పూర్తి చేసి, కొలంబియా విశ్వవిద్యాలయం నుండి పీహెచ్‌డీ సంపాదించాడు. అదే యూనివర్సిటీలో చరిత్ర బోధించాడు. తర్వాత వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలో అమెరికన్ వలసరాజ్య చరిత్ర ప్రొఫెసర్‌గా పనిచేశాడు. అనేక పరిశోధన పత్రాలను ప్రచురించాడు. కొన్ని పుస్తకాలు కూడా రాశాడు. 83 సంవత్సరాల వయస్సులో 1979 లో మరణించాడు.

పెర్లె మాత్రం చనిపోయేవరకు ప్రియుడికోసం ఎదురుచూస్తూనే ఉంది. పేరెంట్స్‌ ఆమెను అతని దగ్గరికి పోనివ్వలేదు. 65 యేళ్ల వరకు పెర్లీ నిశ్శబ్ద జీవితాన్ని గడిపింది. మ్యాక్స్‌ మరణం గురించి విన్న 3 నెలల తర్వాత ఆమె 1980లో కన్నుమూసింది. 

చదవండి: Unknown Facts About China: చైనా గుట్టు రట్టు చేసే.. 20 షాకింగ్‌ నిజాలు!

ఆనాటి ప్రేమతాలూకు ఆనవాళ్లు తాజాగా ఒక ఇంట్లో ఉత్తరాల రూపంలో బయటపడ్డాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వందల కొద్దీ ఉత్తరాలు. పెర్లె నివసించిన ఆ ఇంట్లో అటకపై ఒక పెట్టెలో మాక్స్ అనే వ్యక్తి నుంచి వచ్చిన ప్రేమలేఖలు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. చూస్తే అందులోని విషయాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. దాదాపు 1913-1978 వరకు మాక్స్,పెర్లేకి రాసిన ఉ‍త్తరాలవి. అతని లేఖలన్నీ “మై స్వీట్ పెర్ల్” తో ప్రారంభమై.. “ఫరెవర్ యువర్స్.. మాక్స్” తో ముగిశాయి. 

విధి వాళ్లని కలపనప్పటికీ.. వారు మాత్రం తమ జీవితాంతం ఒకరికొకరు ఉత్తరాలు రాయడం కొనసాగించినట్లు ఆ లేఖలను బట్టి తెలుస్తోంది. ఐతే మాక్స్ నుండి వచ్చిన ఉత్తరాలు మాత్రమే దొరికాయి. పెర్లె రాసిన ఉత్తరాలు దొరకలేదు. ఆఫ్రికా, స్పెయిన్, చిలీ, కెనడా, వాషింగ్టన్, రోడ్ ఐలాండ్, ఫ్రాన్స్‌ల నుండి పెర్లెకి ఉత్తరాలు వచ్చాయి. అతను ఎక్కడికి వెళ్లినా, ఎక్కడున్నా ... ఉత్తరాలు మాత్రం రాస్తూనే ఉండేవాడు. ఇవి ప్రత్యుత్తరాలు అని లేఖల కంటెంట్ తెల్పుతుంది. ఈ విధంగా వాళ్లిరువురు 65 సంవత్సరాలకు పైగా ఉత్తర ప్రత్యుత్తరాలను కొనసాగించినట్లు తెలుస్తోంది. చివరికి మాక్స్‌ వివాహం చేసుకున్నడని, అతనికి మిచెల్ అనే ఒక కూతురు కూడా ఉన్నట్లు ఆ లేఖలను బట్టి తెలుస్తోంది. ఐతే ఉ‍త్తరాల్లో దాని గురించి ఎక్కువ సమాచారం లేదు.

చదవండి: రెస్టారెంట్‌ విచిత్ర షరతు.. ఫైర్‌ అవుతున్న నెటిజన్లు!

1980లో పెర్లే మరణించినప్పుడు ఆమె దాచుకున్న మాక్స్‌ ఉత్తరాల్లో కొన్ని కాలిపోయాయట. ఆమె కుటుంబం ఆ ఉత్తరాలన్నింటినీ అటకపై ఒక బాక్స్‌లో భద్రపరిచింది. గొప్ప ప్రేమ కథలలో ఒకటి ఉత్తరాల రూపంలో తాజాగా బయటపడింది.

‘ఐ లవ్‌యూ.. ఇంకేం చెప్పలేను- మాక్స్’ (మతం మారితేనే పెళ్లి చేసుకోవచ్చని పెర్లే చెప్పిన తర్వాత మాక్స్‌ ఆమెకు రాసిన మొదటి ఉత్తరం ఇది). తదుపరి అక్షరాలు పోస్ట్‌మార్క్ చేసిన ఎన్వలప్‌లలో ఉన్నాయి.

‘సోమవారం సాయంత్రం నాకు అర్థమైంది. నేను మొదటి నుండి అర్థం చేసుకున్నాను. నువ్వేం అనుకుంటున్నావనేదే అర్థం కావడంలేదు. ఇకపై క్లబ్‌కి రాలేను. నిన్ను ప్రేమిస్తున్నందుకు నాకు అర్థం అయ్యే హింసను నేను అనుభవించలేను. నీ దగ్గర ఉండడం, నిన్ను చూడడం, నువ్వు అని అనిపించడం నేను తట్టుకోలేకపోయాను... (మిగిలిన ఉత్తరం చిరిగిపోయింది) ఇది పెర్లె, మాక్స్‌కు రాసిన ఉ‍త్తరం.

‘మనం కలిసి ఉండలేమని చెప్పిన తర్వాత నాకు వచ్చిన మొదటి లేఖ’ అని కవరుపై రాసివుంది (పెర్లే రాసిన లేఖ గురించి మాక్స్‌ రాసుకున్న అక్షరాలవి)

ఎంత అందమైన ప్రేమ కథ ఇది. 

చదవండి: Mystery Case: ఐదేళ్ల క్రితం హత్యచేశారు.. కానీ..

మరిన్ని వార్తలు