వధువు పాదాలను మొక్కిన వరుడు..

22 Dec, 2020 10:27 IST|Sakshi

వివాహబంధం నూరేళ్లు అన్యోన్యంగా కొనసాగాలంటే కావల్సింది ఆస్తులు, అంతస్తులు కాదు. పరస్పర ప్రేమతో పాటు గౌరవం కూడా దంపతుల మధ్య ఉండాలి. ‘నా జీవితంలో జరిగే మంచి చెడుల్లో నీకూ సమానత్వం ఉంది’ అని స్త్రీకి పురుషుడు, పురుషుడు స్త్రీకి చేసుకోవాల్సిన వాగ్దానం. కానీ, మన సమాజం వివాహజీవితం మొదలునుంచే పురుషుడికి లోబడి నడుచుకోవాలని సూచిస్తుంది. నిజానికి, సాంప్రదాయ వివాహాలలో జరిగే అనేక పద్ధతులు పితృస్వామ్యమైనవే. ఉదాహరణకు.. ఒక స్త్రీ పెళ్లికాగానే తన భర్త ఇంటికి వెళ్ళటానికి తన సొంత ఇంటిని విడిచిపెట్టాలనేది ఎలాగూ ఉన్నదే. అలాగే, పెళ్లి పందిట్లో వధువు తన భర్త పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకోమని చెబుతుంటారు. చెప్పిన వాటికి తలవంచుతూ, గౌరవిస్తూ సర్దుకుపోయే గుణాన్ని స్త్రీ మాత్రమే అలవర్చుకోవాలనే సూచలను అధికంగా చేరవేస్తుంటారు. అప్పుడే అత్తింట్లో ‘ఆమె‘ మనుగడ సాధ్యమవుతుందనే విషయాన్ని పెళ్లి స్పష్టం చేస్తుంటారు. అయితే, కొన్ని జంటలు మాత్రం ఈ సంప్రదాయాలలో ‘సమానత్వం’ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. 

వధువు ఆశీర్వాదం... ఇటీవల ఒక బెంగాలీ వివాహంలో వధువు వరుడి ఆశీర్వాదం తీసుకున్న తరువాత, వరుడు కూడా వధువు ఆశీర్వాదానికి మోకాళ్లపై వంగి కూర్చుని ఆమెకు నమస్కరించాడు. వధువు ఆశీర్వాదం తర్వాత వరుడు నిలుచున్నాడు. స్త్రీ–పురుష సమానత్వం, గౌరవం అనేవి మాటల్లో చెప్పడం కాదు చేతల్లో చూపడం అని నిరూపించిన ఈ పెళ్లి వీడియో ఇటీవల బాగా వైరల్‌ అయ్యింది. దంపతులిద్దరూ పరస్పరం గౌరవం ఇచ్చిపుచ్చుకోవడం, ప్రేమను పంచుకునే విధానాన్ని ఈ పద్ధతి సూచిస్తుందని నెటిజన్లు సైతం ప్రశంసిస్తున్నారు. వధువు వరుడు పాదాలకు నమస్కారం చేయగానే, వరుడు వధువుకు చేతులు జోడించి ప్రతిగా నమస్కారం చేశాడు. ‘ఇక ముందూ నేనూ నీ పట్ల గౌరవంగా నడుచుకుంటాను’ అని చేసిన ఈ ప్రతి నమస్కారం యువతరపు ఆలోచనలకు ప్రతీకగా నిలుస్తోంది.

మరిన్ని వార్తలు