ఇండోనేసియాలో ఇంటిపంటలకు కోవిడ్‌ కిక్కు!

9 Oct, 2022 12:27 IST|Sakshi

17 వేల ద్వీపాల సమాహారమైన ఇండోనేసియా నగరాలు, పట్టణ ప్రాంతాల ప్రజల ఆహారపు అవసరాలు తీర్చడంలో, పర్యావరణ సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో అర్బన్‌ ఫార్మింగ్‌ ఇప్పుడు కీలకపాత్ర పోషిస్తోంది. కరోనా అనంతర కాలంలో వైవిధ్య భరితమైన, రసాయనిక అవశేషాల్లేని ఆహారం కోసం అర్బన్‌ ఫార్మింగ్‌ చేపట్టే వారి సంఖ్య పెరుగుతోంది. 

సకియా నసుషన్‌ తన రెండంతస్తుల మేడపైన ఏడాది క్రితం నుంచి సేంద్రియ పంటలు పండిస్తున్నారు. సుమత్రా దీవిలో అతిపెద్ద నగరం మెడాన్‌ నివాసి ఆమె. ముగ్గురు బిడ్డల తల్లి అయిన సకియా స్థానిక విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు వ్యవసాయ శాస్త్రం బోధిస్తున్నారు. సాగు మెలకువలు తెలిసినప్పటికీ కోవిడ్‌ మహమ్మారి తాకిడి తర్వాతనే ఆమె ఇంటిపైన పంటలు సాగు చేయటం ప్రారంభించారు. 

‘ఇప్పుడు మా ఇంటిల్లిపాదికీ అవసరమైన కూరగాయలన్నీ పండించుకుంటున్నాం. ఆకుకూరలైతే అసలు బయట కొనాల్సిన అవసరమే రావటం లేదు’ అంటారామె. కాలీఫ్లవర్స్, పాలకూర, టొమాటోలు, లెట్యూస్, జపనీస్‌ మస్టర్డ్‌ గ్రీన్స్, కీరదోస, పసుపు, అల్లం వంటి అనేక పంటలను టెర్రస్‌ గార్డెన్‌లో ఆర్గానిక్‌ పద్ధతుల్లో పండిస్తున్నారు సకియా. ఆమెను చూసి పరిసరాల్లోని అనేక ఇళ్లపైన కూడా కిచెన్‌ గార్డెన్లు పుట్టుకొచ్చాయి. 

ఉక్రెయిన్‌–రష్యా యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇండోనేసియాలో ఆహారోత్పత్తుల ధరలు అమాంతంగా 30–40% పెరగటం కూడా ప్రజలను సేంద్రియ ఇంటిపంటల దిశగా నడిపిస్తున్నాయి. స్థానికంగా ఉన్న ఖాళీ స్థలాల్లో కూరగాయలు, పండ్లు సాధ్యమైనంత వరకైనా పండించుకోవాలన్న స్పృహ నగరవాసుల్లో విస్తరిస్తోంది.

‘ఇంటిపంటల సాగు దిశగా ప్రజలు కదలటం ఆహారోత్పత్తిలో విప్లవాత్మక మార్పులకు దోహదం చేస్తుంద’ని వెస్ట్‌ జావా రాష్ట్రంలో గరుట్‌ జిల్లాకు చెందిన నిస్సా వర్గడిపుర అనే సామాజిక కార్యకర్త అంటున్నారు. నిస్సా అనేక ఏళ్ల క్రితమే అత్‌–తారిఖ్‌ సేంద్రియ ఇస్లామిక్‌ బోర్డింగ్‌ స్కూల్‌ను నెలకొల్పి రసాయనాలు వాడకుండా పంటలు పండించడంలో యువతీ యువకులకు శిక్షణ ఇస్తున్నారు. ఈ కృషికి గాను నాలుగేళ్ల క్రితం ఓ పురస్కారాన్నీ అందుకున్నారు నిస్సా. 

ఇండోనేసియాలో ఆహార భద్రతకు చిన్న, సన్నకారు రైతుల కుటుంబ సేద్యం మూల స్తంభం వంటిది. అనేక రకాల కూరగాయ పంటలు పండించి స్థానికంగా ప్రజలకు అందుబాటులోకి తేవడానికి అర్బన్‌ ఫార్మింగ్‌ దోహదం చేస్తోంది అంటున్నారు నిస్సా. స్కూల్‌కు అనుబంధంగా ఉన్న రెండున్నర ఎకరాల క్షేత్రంలో 450 రకాల బహువార్షిక, ఏకవార్షిక, సీజనల్‌ పంటలను నిస్సా సాగు చేస్తుండటం విశేషం. 

సెంట్రల్‌ జావా రాష్ట్రంలోని సురకర్త (దీన్ని ‘సోలో’ అని కూడా పిలుస్తారు) నగరం అర్బన్‌ ఫార్మింగ్‌కు పెద్ద పీట వేస్తోంది. నగరంలో ఇళ్లపైన, ప్రభుత్వ/ప్రైవేటు ఖాళీ స్థలాల్లో ఎత్తు మడులపై, కుండీల్లో సేంద్రియ ఇంటిపంటలను విస్తారంగా సాగు చేస్తున్నారు. మరోవైపు, హైడ్రోపోనిక్స్‌ పద్ధతిలో ఆకుకూరలు, టొమాటోలు పండించడం అర్బన్‌ యూత్‌లో సరికొత్త ట్రెండ్‌గా మారింది. ప్రత్యేక శిక్షణ సంస్థలు కూడా పుట్టుకొస్తున్నాయి. 

సోలో నగర పొలిమేర ప్రాంతాల్లో హెక్టారు కన్నా తక్కువ క్షేత్రాల్లో అర్బన్‌ ఫార్మర్స్‌ వాణిజ్య స్థాయిలో పంటలు పండిస్తున్నారు. పెరటి కోళ్ల పెంపకం, ఇళ్ల దగ్గరే చిన్న సిమెంటు ట్యాంకుల్లో క్యాట్‌ఫిష్‌ సాగు కనిపిస్తోంది. కూరగాయలు, పండ్లతో పాటు తేనెకు మంచి గిరాకీ ఉందని సోలో సిటీ ఫార్మర్స్‌ చెబుతున్నారు. ఇండోనేసియా ప్రభుత్వం నగరప్రాంత ప్రజల ఆహార భద్రతకు ప్రత్యేక చట్టాలు చేసి అర్బన్‌ అగ్రికల్చర్‌ను ప్రోత్సహిస్తోంది. ఫుడ్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ అర్బన్‌ అగ్రికల్చర్‌ పథకానికి ప్రత్యేక బడ్జెట్‌ కేటాయింపు చేసింది. దీని అమలు తీరును సోలో నగర మేయర్‌ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. మహిళా అర్బన్‌ రైతులను బృందాలుగా ఏర్పాటు చేసి ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇస్తుండటం విశేషం. 
పంతంగి రాంబాబు

కోవిడ్‌ నేర్పిన గుణపాఠం వల్ల రోగాలను పారదోలే కార్యకలాపాలకు ఇల్లే కేంద్రంగా మారింది. అందుకే ఇప్పుడు అర్బన్‌ ఫార్మింగ్‌ ఊపందుకుంది. మాకు అవసరమైన ఆకుకూరలు, కూరగాయలను ఇంటిపైనే పండించుకుంటున్నాం. 
– సకియా, 
అర్బన్‌ ఫార్మర్, అగ్రికల్చర్‌ లెక్చరర్, మెడాన్, ఇండోనేసియా 

మరిన్ని వార్తలు