‘బయల్దేరుదామా రజతి’ అంటుంది 34 ఏళ్ల సుకన్య డ్యూటీ ఎక్కబోతూ...

21 May, 2022 08:18 IST|Sakshi
సుకన్య, జాస్మిన్‌ మాళవిక; మెరీనా బీచ్‌

మెరీనా ధీరలు

అలుపెరగని కెరటాలు. ఆహ్లాదానికి వచ్చే జనాలు. ఉత్సాహం శృతి మించితే ప్రాణానికే ప్రమాదం. అదుపు చేయాలి పిల్లల్ని పెద్దల్ని. చెన్నై మెరీనా బీచ్‌ ప్రతి ఉదయం సాయంత్రం జన సముద్రం. వారు ప్రమాదాల బారిన పడకుండా అశ్వదళం నిత్యం గస్తీ కాస్తుంటుంది. వారిలో ఐదుగురు మహిళా పోలీసులు ఉన్నారు. అశ్వాన్ని అధిరోహించి ఈ చివర నుంచి ఆ చివరకు కెరటాల మీద రేఖ గీస్తుంటారు. మగ పోలీసుల మాట కంటే ఈ మహిళా పోలీసుల మాటే జనం ఎక్కువగా వింటారు. జీను మీద కూచుని వీరు సాగించే సవారీ కష్టమైనది. స్ఫూర్తిదాయకమైనది. వారి పరిచయం.

‘బయల్దేరుదామా రజతి’ అంటుంది 34 ఏళ్ల సుకన్య డ్యూటీ ఎక్కబోతూ. 12 ఏళ్లుగా అశ్వదళంలో పని చేస్తున్న సుకన్యకు ప్రియమైన అశ్వం రజతి. డ్యూటీ వాళ్లిద్దరూ కలిసి చేయాలి. ఒకరు లేకుండా మరొకరికి డ్యూటీ అసంపూర్ణం. ‘గ్రేటర్‌ చెన్నై మౌంటెడ్‌ బ్రాంచ్‌’ (అశ్వదళం)లో ఇప్పుడు 26 అశ్వాలు ఉన్నాయి. వాటితో డ్యూటీ చేస్తున్న సిబ్బంది సంఖ్య 30. వారిలో ఐదుగురు మహిళా పోలీసులు. వీరి శాఖ పుదుపేటలో ఉంటుంది. వీరి ప్రధాన డ్యూటీ మెరీనా బీచ్‌ను కాపు కాయడమే.

పోకిరీల నుంచి కాపాడాలి
బంగాళాఖాతంలో అలల తాకిడి ఎక్కువ. విహారానికి వచ్చినవారు అత్యుత్సాహంతో లోపలికి వెళితే ప్రాణాలకు ప్రమాదం. అందుకని సుకన్య, ఇతర గస్తీ సిబ్బంది అలల్లో తడుస్తూనే తిరుగుతూ సందర్శకులను తీరం వైపు తరుముతుంటారు. ‘అది ఒక్కటే కాదు... అమ్మాయిలను వేధించే పోకిరీల నుంచి, చైన్‌ స్నాచర్ల నుంచి, పార్కింగ్‌ దగ్గర వాహనాలు ఎత్తుకెళ్లే దొంగల నుంచి కూడా జనాన్ని కాపాడాలి. అలాగే తప్పిపోయిన పిల్లలను వెతికి పెట్టాలి. ఒక్కోసారి జనం తాకిడి ఎక్కువైతే చాలామంది పిల్లలు తప్పిపోతూ ఉంటారు’ అంటుంది సుకన్య. ‘నేను మామూలు లాఠీ పట్టుకుని నేల మీద యూనిఫామ్‌తో నడుస్తూ వస్తే ఏ పోకిరీ మాట వినడు. అదే గుర్రం మీద వస్తే ఆ కథే వేరు. పరిగెడతారు’ అంటుంది నవ్వుతూ.

ప్రమాదాలు ఉంటాయి
అయితే ఈ ఉద్యోగం అంత సామాన్యం కాదు. మన మూడ్‌ బాగలేకపోతే గుర్రం గ్రహిస్తుంది. అలాగే గుర్రం మూడ్‌ పాడైతే మనం గ్రహించాలి. ఈ రెంటి మధ్య సమన్వయం లేకపోతే ప్రమాదం. ‘ఒకసారి న్యూ ఇయర్‌ నైట్‌ జనం విపరీతంగా వచ్చారు బీచ్‌కి. గుర్రం బెదిరి భయంకరంగా పరిగెత్తింది. దాని మీద ఉన్న నా గుండెలు అవిసిపోయాయి. అది ఎక్కడ ఆగుతుందో చెప్పలేము. అది ఆగాక ఒక్కసారిగా గెంతి, దాని మెడ నిమిరి అదుపులోకి తెచ్చాను’ అంటుంది సుకన్య. ఆమెతో పని చేసే జాస్మిన్‌ అనే కానిస్టేబుల్‌ను అయితే గుర్రం అలల్లోకి విసిరికొట్టింది. మణికట్టు విరిగితే ఆరునెలలక్కానీ మళ్లీ కళ్లేలు పట్టుకోవడం వీలు కాలేదు.

మొత్తం ఐదుమంది
ఇప్పుడు అశ్వదళంలో సుకన్య, జాస్మిన్, మాళవిక, పునీత, మహలక్ష్మి పని చేస్తున్నారు. సుకన్య, జాస్మిన్‌ సీనియర్లు అయితే మిగిలిన ముగ్గురూ జూనియర్లు. వీరంతా తమ తమ గుర్రాల మంచి చెడ్డలను కూడా చూసుకోవాల్సి ఉంటుంది. వీటికి ప్రతి రోజూ ఆహారం అందించాలి. అందుకు ఒక్కో గుర్రానికి 600 రూపాయలు ఖర్చుపెడుతోంది పోలీస్‌ శాఖ. గుర్రాలకు స్నానం చేయించడం, మసాజ్, గారం చేయడం ఇవన్నీ చేస్తేనే అవి స్నేహాన్ని పాటిస్తాయి. ‘మేమందరం డ్యూటీ దిగాక గుర్రాలను కాసేపు బుజ్జగించి ఇళ్లకు వెళతాం’ అంటుంది సుకన్య. ఈ గుర్రాలను ఉత్తర ప్రదేశ్‌ సహరన్‌పూర్‌ నుంచి, తమిళనాడు చెట్టినాడ్‌ నుంచి కొని తెస్తూ ఉంటారు. వీటి కోసంగా ఊటీ నుంచి రోజూ ప్రత్యేకం క్యారట్, గడ్డీ వస్తుంటుంది. పశువైద్యులు చెకప్‌లు నిర్వహిస్తారు.

‘నగరంలో కాసింత ఊపిరి పీల్చుకోవడానికి స్త్రీలు చాలామంది బీచ్‌కు వస్తారు. వాళ్లకు మమ్మల్ని చూస్తే ధైర్యం. డ్యూటీ తృప్తిగా చేయడానికి ఇంతకు మించి కారణం ఏముంది’ అంటారు మెరీనా ధీరలు. ఈసారి చెన్నై వెళితే వారిని చూడండి.
 
సూపర్‌ సుకన్య
కోయంబత్తూరుకు చెందిన సుకన్య అంతవరకూ మగవాళ్లు మాత్రమే పని చేసే అశ్వదళంలో మొదటిసారిగా చేరింది. ‘నేను సినిమాల్లోనే గుర్రాలు చూశాను అప్పటి వరకూ’ అంటుంది సుకన్య. కాని రెండు మూడు నెలల్లోనే ట్రైనింగ్‌లో సుకన్య గుర్రాన్ని ఎలా అదుపులోకి తెచ్చుకోవాలో నేర్చుకుంది. మూడేళ్ల క్రితం వరకూ కూడా మొత్తం అశ్వదళంలో ఆమె ఒక్కర్తే మహిళా పోలీస్‌. ‘మా ఇంట్లో వాళ్లు మొదట్లో ఈ ఉద్యోగానికి ఒప్పుకోలేదు. ఆడపిల్ల గుర్రం ఎక్కి గస్తీ కాయడం ఏంటి అని ఇప్పటికీ మా అమ్మానాన్నలు అనుకుంటారు. కాని నాకు ఈ ఉద్యోగమే ఇష్టం’ అంటుంది సుకన్య. ఉదయం నాలుగున్నరకు డ్యూటీ మొదలవుతుంది ఆమెది.

గుర్రం ఎక్కి మెరీనా బీచ్‌లో వాకింగ్‌కి, విహారానికి, స్నానానికి వచ్చేవారిని అదుపు చేయాలి. వారిని కాపాడాలి. మెరీనా బీచ్‌ సుదీర్ఘమైన బీచ్‌. అందుకని గుర్రాలు గస్తీకి బాగా ఉపయోగపడతాయి. అశ్వదళం బ్రిటిష్‌ హయాం నుంచి ఉన్నా 1926 నుంచి మెరీనా బీచ్‌ గస్తీకి ఉపయోగిస్తున్నారు. కాని 2011 వరకూ మహిళలు ఎవరూ అందులో చేరలేదు. సుకన్యదే ఆ రికార్డు. ఉదయం 8 వరకూ డ్యూటీ ముగించుకుని మళ్లీ సాయంత్రం 4 గంటలకు గుర్రం ఎక్కుతుంది సుకన్య. 7 గంటల వరకూ డ్యూటీ చేస్తుంది. మొత్తం మీద గుర్రంతో ఆమె రోజూ ఆరు నుంచి ఏడు గంటల పాటు తీరంలో తిరుగుతుంది.

మరిన్ని వార్తలు