అగ్నిదేవుడి అనుగ్రహాన్ని పొందడం ఎలా?

5 Nov, 2020 06:30 IST|Sakshi

అగ్న్యారాధనం

వేదకాలం నుండి సర్వదేవతారాధనలో అగ్నికి అత్యంత ప్రాముఖ్యం ఏర్పడింది. అనాది కాలం నుండి మానవ జీవితంలో కూడా అగ్ని ప్రముఖ స్థానం ఆక్రమించింది. వైదిక ఋషులు అగ్నిని భగవంతుడుగా పూజించారు. అగ్నిదేవుడని పేరు. ఈ అగ్ని దేవుడు అష్టదిక్పాలకులలో ఒకడుగా గుర్తింప బడ్డాడు. అగ్నికి మత పరంగా కూడా శ్రేష్ఠత్వం  ఉంది. అగ్ని మిగిలిన దేవతలందరికి హవ్యాన్ని మోసుకుపోతాడని, దేవతలు అగ్ని ముఖులని వైదిక వాజ్ఞ్మయం చెబుతుంది. ఆద్యంత రహితుడు, అఖండుడు అని పరమాత్ముని సేవించడంలో అగ్నికి మించిన సాధనం వేరొకటి లేదు. అగ్నిమీళే పురోహితమ్మని వేదం. నక్షత్ర గ్రహతారకలు, నదీనదాలు, సాగరాలు, సూర్య చంద్రాది గోళాలు ఒకటేమిటి సృష్టిలోని ప్రత్యణువు అగ్నిచేత వివిధ రూపాలలో చైతన్యం కలిగి ఉన్నాయి. సంస్కృతభాషలో అగ్ని శబ్దానికి ఎన్నో పర్యాయ పదాలున్నాయి. విశ్వానరుడనే ఋషి పుత్రుడైనందున వైశ్వానరుడని, అశ్వమేధ యాగంలో గుర్రాలు హవిస్సుగా కలవాడైనందున వీతిహోత్రుడని, నీటి ఉత్పత్తి స్థానం కావటం వల్ల కృపేట యోని అని, వేదాలు పుట్టుకకు కారణభూతుడైన నందువల్ల జాతవేదుడని, ప్రతి వస్తువును పవిత్రం చేసినందున పావకుడని, శుచిత్వం కలిగివున్నందున శుచి అని అగ్నికి నామాం తరాలనేకం ఉన్నాయి.

"దక్షిణాగ్నిర్గార్హ సత్యాహవనీయౌ త్రయోగ్నయః వేదికి దక్షిణమైన అగ్ని దక్షిణాగ్ని, యజమానుని చేత ఇతరాగ్నుల కంటే పూర్వం సంస్కరించబడిన అగ్ని గార్హపత్యం. క్రియా పరిసమాప్తి పర్యంతం హోమం చేయదగినది. అహవనీయం. ఇలా అగ్ని మూడు విధాలుగా వేదభూమిలో ప్రసిద్ది కెక్కింది. అన్ని శుభాలను అగ్ని ప్రజల్వనంతోనే. నూతన గృహ నిర్మాణ సమయంలో పాత ఇంటిలో ప్రజ్వలింపబడిన అగ్నిలో నుండి కొంత భాగాన్ని తీసుకొచ్చి కొత్త ఇంటిలోనికి ప్రవేశించాలని వేదాల్లో చెప్పబడింది. ఈ ఆచారం కొన్ని చోట్ల నేటికీ కనబడుతోంది. పురాణేతిహాసాలలో అగ్నికి వజ్రాయుధానికి భేదం లేదని చెప్పబడింది. అగ్ని ఇంద్రుడు ఒక్కరేనని పురాణాలలో ఉటంకించ బడింది. జలాంతర్హితమైన అగ్నిని బడబాగ్ని అంటారు. పరమోత్క్రుష్ట దశలో వెలిగే అగ్నిని బ్రహ్మాగ్ని అని చెప్పారు. సృష్టి సంబంధమైన పంచాగ్ని విద్యను గురించి ముండకోపనిషత్తు వివరించింది. హిందూ సమాజంలో జన్మించింది మొదలు మృత్యువు పర్యంతం అగ్ని యొక్క అవసరం ఉంది. పురిటిలో దీపం వెలిగించి నట్లే మృతదేహం దగ్గర కూడా ఆత్మజ్యోతిగా దీపం వెలిగిస్తారు. దీపారాధనతో ప్రారంభం కాని శుభాశుభ కర్మ అంటూ ఏది లేదు. మనిషి మనుగడకు అత్యంతోపకారి. తానే అగ్నిహోత్రుడై జఠరాగ్నిని దీపింపజేస్తున్నానని, అహం వైశ్వానరో భుత్వా ప్రాణీనాం దేహం మాశ్రితః ప్రాణాపానసమాయుక్తః పచామ్యన్నం చతుర్విధమ్"

నేను జఠరాగ్ని రూపంన ప్రాణాల దేహము నందుండి ప్రాణాపాన వాయువులతో కూడిన వాడనై భక్ష్య, భోజ్య, లేహ్య, చోష్యములను నాలుగు విధముల పదార్ధములను జీర్ణము చేయుచున్నాను" అని శ్రీ కృష్ణ పరమాత్మ గీతలో అంటాడు. అగ్ని, జ్యోతి, పగలు,శుక్ల పక్షము, ఆరు నెలలు గల ఉత్తరాయణము అను అభిమాన దేవతలుగల దేవయాన మార్గమైన ప్రయాణమే చేసిన సగుణ బ్రహ్మో పాసకులు బ్రహ్మమును పొందుతున్నారు అని గీతలో చెప్పబడింది. మృత్యువు అనంతరం స్వర్గాది శుభలోకాలకు వెళ్ళేందుకు అగ్ని దోహదం చేస్తుంది. అగ్నిహోత్రం గృహక్షేత్రే గర్భిణీం వృద్ధ బాలకా। రిక్తహస్తే. నా నోపయాత్ రాజానం గురుమ్ ॥ అగ్నిహోత్రమునకు ఆహుతులిచ్చునప్పుడు, గృహము, పుణ్యక్షేత్రము, గర్భిణీస్త్రీలు, వృద్ధులు,బాలురు, రాజు, దేవుడు, గురువు వీరి వద్దకు వట్టి చేతులతో వెళ్ళకూడదు అనగా ఫలపుష్పాదులు తీసుకు వెళ్ళాలి. ఇక్కడ కూడా అగ్నికి ప్రాధాన్యతనిచ్చారు. మన  పూర్వీకులు. ఆదిమానవుని జీవితంలోనూ జంతువుల జీవితంలోను సృష్టి ప్రారంభంలో ఎలాంటి వ్యత్యాసం ఉండేది కాదు. సర్వజీవుల్లా మానవుడు దిగంబరంగా సంచరించే వాడు, జంతువులను చంపి పచ్చి మాసం తినేవాడు. నీరు,నిప్పు అతని దిశను దశను మార్చివేసాయి. అరణ్యాలలో గాలికి చెట్టు కొమ్మల రాపిడితో అగ్ని పుట్టడం గమనించాడు. "కాష్ఠాదగ్నిర్జాయతే ", రెండు కట్టెలు రాపిడి చేస్తే అగ్ని జనిస్తుంది అని తెలుసుకున్నాడు.

అగ్నిదేవుడు సంతసిస్తే మానవాళికి ఉపకారం చేస్తాడు, కోపగించుకుంటే అపకారమూ చేస్తాడు. అతణ్ణి పూజించినంత కాలం మన అభీష్టాలను నెరవేరుస్తాడు. కాని అతనికి ద్రోహం తలపెడితే సహించడు. త్రినేత్రుడు మూడో కన్ను తెరిచినట్లు తన నాలుకను సాగదీస్తాడు. ఒక గ్రామంలో శుద్ధ శోత్రియ బ్రాహ్మణుడు సకల జనాల క్షేమం కాక్షించి యజ్ఞం చేసాడు. యజ్ఞం పూర్తి అయినా యజ్ఞకుండం ఇంకా రాజుకునే ఉంది.ఒక బుద్ధిలేని మహిళ ఉచ్ఛీష్టం తెచ్చి యజ్ఞకుండంలో వేయడమే కాక పరిసరాలన్ని శుభ్రంగా ఉండడం చూసి ఎక్కడ ఉమ్మి వేయాలో తోచక యజ్ఞకుండంలో ఉమ్మి వేసింది. అయితే ఆమె ఉమ్మిన చోట ఆమే కొక బంగారు వరహా కనిపించింది. సంతోషంగా ఆ వరహాను తీసుకుని కొంగు కట్టుకొని ఇంటికి వెళ్ళింది. ఆడవారి నోట్లో నువ్వుగింజ నానదంటారు. దావాగ్నిలా ఆ మాట ఊరంతా పాకిరింది. మంట చల్లారకూడదని ప్రతి ఒక్కరు ఒక కర్ర వేస్తూ కుండంలో ఎంగిలి అన్నం, ఉమ్మి వేస్తు ఒకొక్క నాణెము తీసుకుంటున్నారు.

ఈ విషయం తెలిసిన బ్రహ్మణుడు బాధ పడి ఇలా చేయడం అపచారం అని బోధ పరిచినా బంగారం మీద ఆశతో ఎవరు అతని మాటను లెక్క చేయ లేదు. ఇంత అనాచారము, అపరాధము జరుగుతున్న ఊరిలో ఉండనిష్ట పడక మూటాముల్లె సర్దుకుని భార్యాబిడ్డలతో ఊరు విడిచి పెట్టాడు. అతనావూరి పొలిమేర దాటగానే ఆ ఊరు మొత్తం అగ్నికి ఆహుతై, భస్మమైంది. ఆ బ్రాహ్మణుడు ఉన్నంత వరకు అగ్నిదేవుడు శాంతం వహించేడు. మనం మన ఇళ్ళల్లో ఈ నాడు మృష్ఠాన్న భోజనాలు వండుకుని తింటున్నామంటే అందుకు అగ్ని దేవుడి దయయే. ఒక కథ పెద్దలు చెప్తారు. పరమశివుడు అగ్నికి ఆజ్ఞాపించాడట. ప్రతి ఇంటిలో నువ్వు ఉండాలి. పొయ్యిలో నిత్యాగ్నిహోత్రం వెలుగుతూఉండాలని. శివుడాజ్ఞను అగ్ని దేవుడు ధిక్కరించివుంటే మనం ఆది మానవుల్లా ఉడకని పదార్ధాలు తినేవారం. అగ్ని దేవుడు ఆగ్రహయిస్తే ప్రతి అడవికి, ఊరుకు ఖాండవవనం గతే పడుతుంది. మనం మన నిత్య ధర్మమాలను పాఠిస్తూ అగ్నిదేవత అనుగ్రహాన్ని పొందుదాం.
- గుమ్మా ప్రసాదరావు

మరిన్ని వార్తలు