అన్నపూర్ణ అనుగ్రహం ఉంటే ఆకలి ఎందుకు ఉంటుంది ?

22 Feb, 2021 06:21 IST|Sakshi

కైలాసంలో పరమశివుడు ప్రగాఢ ధ్యానంలో లయించి ఉన్నాడు. ఆ సమయంలో అక్కడకు వచ్చిన పార్వతీదేవి ఏదో ఆటగా శివుని కళ్ళు మూసి ఆనందపడింది. పరమేశ్వరుని కుడి కన్ను సూర్యుడు, ఎడమ కన్ను చంద్రుడు. అందువలన తక్షణమే అంధకారం సమస్త లోకాలను అలముకుంది. జనులు తల్లడిల్లి పోయారు. అది చూసి పరమశివుడు " దేవీ! ఏం పని చేశావు నువ్వు? అదిగో! లోకులం దరూ అంధకారంలో కొట్టుమిట్లాడుతున్నారు,
గమనించావా?" అన్నాడు. అంతా చీకటి మయం కావడంతో నానా ఇబ్బందులు పడడం పార్వతీదేవి కళ్ళారా చూసింది.ఆమె బాధ పడింది.

" నాథా! తెలియక చేసిన నా అపరాధాన్ని క్షమించండి. ఈ అంధకారం పోయి వెలుతురు వచ్చే మార్గం చూడండి " అంది పార్వతిదేవి. వెంటనే శివుడు తన పాలనేత్రం తెరిచాడు. జగమంతా వెలుతురుతో నిండి పోయింది. భూలోకంలో ప్రజలు తమ దిన చర్యలో పడ్డారు. పార్వతీదేవి తను తప్పు పని చేసినందుకు ప్రాయశ్చిత్తం చేసుకోనెంచి తను కొంతకాలం తపస్సు చేస్తానంటు భర్త అనుమతి కోరింది. అప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవితో నీవు లోకమాతవు నీకు పాపం అంటదు. తపస్సుకి వెళ్ళనవసరం నీకు లేదు అని అన్నాడు. ఆమె భర్తతో ఏకీభవించలేదు. దేవతలైనా మనుషులైనా తప్పుకు ప్రాయశ్చిత్తం అవసరమే.

ఆ ధర్మమాన్ని మనమే అతిక్రమిస్తే లోకులు మనలనే అనుసరిస్తారు, పాపం పెరిగి పోతుంది అంది హిమరాజతనయ. పార్వతీదేవి భర్త అనుమతి తీసుకుని ఆకాశ మార్గానికి దక్షిణ దిశకు బయలు దేరింది. కాశినగరం మీదుగా వెళ్తూ ఉంటే భూలోకవాసులు ఆకలితో అలమ టించడం ఆమె కంట పడింది. రెండు సంవత్సరాలుగా వర్షాలు లేని కారణంగా క్షామం నెలకొని ఉంది. వారి ఆకలి బాధ చూడలేక అక్కడ దిగి ఒక భవనాన్ని నిర్మించుకొని అన్నపూర్ణ అన్న పేరుతో వంటలు వండి వారికి కడుపు నిండుగా భోజనాలు పెట్టసాగింది. కాశిరాజుకి ఈ విషయం తెలిసి ఎవరీ అన్నదాత అని ఆశ్చర్యపోయాడు. అతని కోశాగారంలో బంగారం, వెండి అమూల్య రత్నాలు నాణేలు ఉన్నాయి.

కొందామన్నా ఆహార దినుసులు అంగళ్ళలో లేవు. కాశిరాజు ఆ మాతృమూర్తిని చూడాలని వెళ్ళాడు. కోరినంత ధనం ఇస్తాను, ధాన్యాదులు ఇవ్వమంటాడు. ఆమే నేను అమ్మడానికి రాలేదు.మీరందరు నా సంతానం. మీ ఆకలి బాధ తీర్చడానికి వచ్చాను. నువ్వూ పంక్తిలో కూర్చుని తిను అంది ఆమె. " అమ్మా ! మీరు సామాన్య మానవమాత్రులు కారు. చెప్పండి మీరే దేవతో " అన్నాడు రాజు. ఆమె నిజ అవతారం దాల్చి నేను అన్నపూర్ణను అంది. "అమ్మా! అన్నపూర్ణేశ్వరీ! మీరు స్థిరంగా కాశినగరంలో ఉండిపోవాలని నా ప్రార్ధన" అన్నాడు. అది సాధ్యం కాదు నేను తపస్సు  కని కైలాసం నుంచి వస్తున్నాను. కొంత కాలం తరువాత పరమేశ్వరునితో పాటు వచ్చి వుంటాను. ఇక మీదట కాశి నగరంలో కరువుకాటకాలు ఉండవు అంటూ అన్నపూర్ణ అంతర్ధానమైంది. అప్పుడే అక్కడ వర్షం మొదలైంది. అన్నపూర్ణ అనుగ్రహం ఉంటే ఆకలి ఎందుకు ఉంటుంది? 
-గుమ్మా ప్రసాద రావు
చదవండి: అంపశయ్యపై ఉన్న భీష్ముడు ఉత్తరాయణంలో 
ఈ వృధా ప్రయత్నాలు ఇకనెందుకు?

మరిన్ని వార్తలు