గుణిషా అగర్వాల్‌ ‘డిజిటల్’‌ సాయం

20 Oct, 2020 10:20 IST|Sakshi

నిరుపేద విద్యార్థుల ఇబ్బందులు గమనించింది ఓ టీనేజ్‌ అమ్మాయి. ఐటీ కంపెనీలను సంప్రదించింది. వారి సాయంతో విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ ఫోన్లను పంపిణీ చేస్తోంది. 

చెన్నై పోలీస్‌ కమిషనర్‌ మహేష్‌ కుమార్‌ అగర్వాల్‌ కుమార్తె పేరు గుణిషా అగర్వాల్‌. 12వ తరగతి చదువుతోంది. 17 ఏళ్ల గుణీషా తన తల్లి ఆన్‌లైన్‌ క్లాస్‌లో పాల్గొనడానికి ఇంట్లో పనిచేసే అతడి కుమార్తెకు ల్యాప్‌టాప్‌ ఇవ్వడం చూసింది. కరోనా మహమ్మారి కారణంగా విద్యార్థులు ఆన్‌లైన్‌లోనే చదువులు కొనసాగిస్తున్నారు. కానీ, వీరిలో చాలామంది పేద విద్యార్థులు ఉన్నారు. వీరు ఆన్‌లైన్‌లో చదువుకోవాలంటే ఇంటర్నెట్‌ కనెక్షన్‌ సమస్య ఒకటే కాదు ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్లు వంటి పరికరాలు కావాలి. ఇదంతా గమనించిన గుణిషా అవసరమైన విద్యార్థులకు సహాయం చేయాలని సంకల్పించింది. 

కంపెనీల చొరవ
చెన్నైలో చుట్టుపక్కల ప్రాంతాల నుండి చాలా మంది విద్యార్థులకు సహాయం చేయాలనే లక్ష్యంతో ల్యాప్‌టాప్‌లను గుణిషాకు విరాళంగా ఇస్తున్నారు. అలాగే, ఓ ఐటి కంపెనీ, థింక్‌ఫినిటీ అండ్‌ కన్సల్టింగ్‌ కూడా గుణిషాకు సహాయం చేయడానికి చొరవ తీసుకున్నాయి. ఈ సంస్థ 50,000 రూపాయలతో గుణిషా కోసం ఉచితంగా వెబ్‌సైట్‌ను తయారు చేసింది. అదే సంస్థకు చెందిన సాంకేతిక నిపుణులు విద్యార్థులకు ఇచ్చిన పాత పరికరాలను ఆన్‌లైన్‌ తరగతుల ప్రకారం ఫార్మాట్‌ చేస్తారు. సలహాదారు బాలసుబ్రమణియన్‌ మాట్లాడుతూ, ‘ఐటి విభాగంలో పనిచేసిన తరువాత కూడా, విద్యార్థులకు సహాయం చేయాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. గుణిషా కారణంగా, మేం కూడా ఈ గొప్ప పనిలో పాల్గొనే అవకాశం లభించింది’ అని ఆనందంగా తెలిపారు. వారు ఇప్పటివరకు 25 పరికరాలను విద్యార్థులకోసం కేటాయించారు. ఈ వారం, మరో 15 మంది విద్యార్థులకు కంప్యూటర్‌ పరికరాలను ఇవ్వబోతున్నారు.

‘కరోనా కాలం కారణంగా కొంతమంది సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు నిరుద్యోగులుగా మారారు. ఇటువంటి పరిస్థితిలో, చాలా పరికరాలు నిరుపయోగంగా ఉన్నాయి. వాటిని అవసరమైన వారికి అందిస్తే విద్యార్థులకు చాలా ఉపయోగంగా ఉంటాయి అనుకున్నాను. వాటిని అవసరమైన వారికి అందించడమే ఇప్పుడు నా బాధ్యత. తద్వారా వారి ఆన్‌లైన్‌ చదువులు నిరాఘాటంగా కొనసాగుతాయి’ అంటోంది గుణిషా.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు