ఆరోగ్యం మన మిద్దె తోటలోనే ఉంది! క్యాన్సర్‌ను జయించి..

7 Mar, 2023 10:38 IST|Sakshi

రైతమ్మలకు జేజేలు!

గుంటూరులో విస్తరిస్తున్న మిద్దె తోటల సంస్కృతి

కృష్ణకుమారి నేతృత్వంలో మిద్దెతోట పెంపకందారుల సంఘం రిజిస్ట్రేషన్‌

వాట్సాప్‌ గ్రూప్‌లు, యూట్యూబ్‌ ఛానల్‌ ద్వారా సేవలు

అధిక దిగుబడినిచ్చే అంటు మొక్కలు చౌకగానే అందుబాటులోకి...

ఆరోగ్యం ఆసుపత్రిలో లేదు. మన మిద్దె తోటలోనే ఉంది. మన  తినే కూరగాయలు, ఆకుకూరలు, పండ్లను రసాయనాల్లేకుండా మనమే ఇంటిపైన పండించుకుందాం. నలుగురం చేయీ చేయీ కలిపి మిద్దె తోటలు సాగు చేసుకుంటూ ఆరోగ్యంగా జీవిద్దాం.. అని చెప్పటమే కాదు.. మనసా వాచా కర్మణా ఆచరిస్తున్నారు కొల్లి కృష్ణకుమారి.

గుంటూరు ఎన్‌జీవో కాలనీకి చెందిన బీఎస్‌ఎన్‌ఎల్‌ విశ్రాంత ఉద్యోగిని అయిన ఆమె 2020 జనవరి నుంచి 1400 చ.అ.ల మిద్దె తోట సాగు చేస్తున్నారు. ఉల్లి, వెల్లుల్లి, క్యారెట్‌ తప్ప మిగతావన్నీ దాదాపు రోజూ తమ ఇంటిపైన పండించుకున్నవే తింటున్నారు. క్యాన్సర్‌ను జయించిన ఆమె ఉద్యోగవిరమణ తర్వాత ఉద్యమ స్ఫూర్తితో సేంద్రియ మిద్దెతోటలను విస్తరింపజేస్తున్నారు.  

సంఘ బలం.. ఉత్సాహం..
రిటైరైన ఉద్యోగులు, పెద్దవాళ్లు (సెకండ్‌ యూత్‌) కూరగాయలు, పండ్ల మొక్కలను పెంచడం హాబీగా మార్చుకుంటున్నారు. సేంద్రియ ఇంటిపంటలు/ మిద్దె తోటల సంస్కృతిని వ్యాప్తిలోకి తెచ్చే లక్ష్యంతో సంఘాలు కూడా ఏర్పాటవుతున్నాయి.

మిద్దెతోటల నిపుణులు తుమ్మేటి రఘోత్తమరెడ్డి ఆధ్వర్యంలో గుంటూరు సహా రెండు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లోనూ మిద్దెతోటల పెంపకందారుల సంఘాలు ఏర్పాటయ్యాయి. ‘గుంటూరు మిద్దెతోటలు’ పేరుతో ఏర్పాటు చేసిన రెండు వాట్సప్‌ గ్రూప్‌లలో 659 మందికి పైగా ఉన్నారు.

2021 నుంచి గుంటూరులో మిద్దె తోటల కార్యకలాపాలను కృష్ణకుమారి నేతృత్వంలో వలంటీర్ల బృందం అత్యంత క్రియాశీలంగా నిర్వహిస్తుండటం విశేషం. ఉద్యానవన శాఖ అధికారుల సహకారంతో ప్రతి నెలా అవగాహన కల్పిస్తున్నారు. గుంటూరు మిద్దెతోటలు పేరిట యూట్యూబ్‌ ఛానల్‌ను ఏర్పాటు చేశారు.

‘గుంటూరు మిద్దె తోటల పెంపకందారుల సంక్షేమ సంఘం(జి.ఎం.ఎస్‌.ఎస్‌.)’ లాభాపేక్షలేని సంస్థగా రిజిస్టర్‌ అయ్యింది. కృష్ణకుమారి ఆమె అధ్యక్షురాలిగా, మరికొందరు ఉత్సాహవంతులైన విశ్రాంత బ్యాంకు అధికారులు, వైద్యులతో కూడిన కార్యవర్గం ఏర్పాటైంది.

సంఘ వార్షిక సభ్యత్వ రుసుము రూ. 500. నెలవారీగా సమావేశమవుతూ వారికి కావాల్సిన మొక్కలను కడియం, కుప్పం నర్సరీల నుంచి తెప్పించి సభ్యులకు అందిస్తున్నారు. సంఘం జమాఖర్చులపై ఆడిటింగ్‌ నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తుండటం ప్రశంసనీయం.  

ఉత్సాహంగా వాలంటీర్ల సేవలు
సాధారణ మొక్కలతో పోల్చితే ఎన్నో రెట్లు ఎక్కువ దిగుబడినిచ్చే గ్రాఫ్టెడ్‌ మొక్కల అవసరం మేడపైన కుండీలు, మడుల్లో తక్కువ స్థలాల్లో కూరగాయలు పెంచుకునే వారికి ఎంతో ఉందంటారు కృష్ణకుమారి.

అడవి వంగతో అంటుకట్టిన(గ్రాఫ్ట్‌ చేసిన) వంగ, టమాటో, మిరప, సొర మొక్కలతో పాటు పర్పుల్‌ క్యాబేజి, ఎర్రబెండ, ఎల్లో/పర్పుల్‌ కాలిఫ్లవర్‌ వంటి అరుదైన, నాణ్యమైన మొక్కలను నర్సరీల నుంచి తెప్పించి మిద్దెతోట పెంపకందారులకు మూడింట ఒక వంతు ధరకే అందిస్తున్నారు. కృష్ణకుమారి, వలంటీర్ల బృందం సఫలీకృతమయ్యారు.

గూగుల్‌ ఫామ్స్, ఎక్సెల్‌ షీట్‌ ద్వారా సభ్యులకు కావాల్సిన మొక్కల ఆర్డర్‌ తీసుకొని మొక్కలను తెప్పిస్తున్నారు. సభ్యులందరికీ ముద్రిత ఫొటో గుర్తింపు కార్డులు ఇచ్చారు. 50 మంది వాలంటీర్లు ఉత్సాహంగా సేవలందిస్తుండటం వల్ల సంఘాన్ని చురుగ్గా నిర్వహించ గలుగుతూ ఉన్నామని కృష్ణకుమారి చెప్పారు.

గత రెండేళ్లలో మిరప రైతులు పురుగుమందులను చాలా ఎక్కువగా వాడాల్సి వస్తోందని అంటూ.. రైతులను తప్పుపట్టలేమని, వినియోగదారులుగా మన జాగ్రత్తలో మనం ఉండాలని, వీలైనన్ని కూరగాయలను మనమే పండించుకోవాలని కృష్ణకుమారి(94906 02366) అంటున్నారు. 
– దాళా రమేష్‌బాబు, సాక్షి ప్రతినిధి, గుంటూరు
ఫోటోలు: గజ్జల రామగోపాలరెడ్డి
 
నిర్వహణ: పంతంగి రాంబాబు

చదవండి: ఎకరం భూమి ఉందా? మేకలు, కోళ్లు, ముత్యాలు, పుట్టగొడుగులు.. ఇలా చేస్తే రోజుకు రూ. 1500 ఆదాయం.. ఇంకా..
పెసర, మినుములేనా? బ్రహ్మీ, వస సాగు.. భలే బాగు! ఏడాదికి నికరాదాయం ఎంతంటే..

మరిన్ని వార్తలు