గురుపూజోత్సవం: గురువంటే... వెలిగే దీపం

5 Sep, 2022 00:19 IST|Sakshi

భారతీయ సంస్కృతిలో గురువు స్థానం ఎంతో విశిష్టమైనది. సమున్నతమైనది, గౌరవప్రదమైనది. తల్లిదండ్రుల తరువాతి స్థానం గురువుది. ఒక వ్యక్తి, సమాజ, జాతి నడకకు, నడతకు, పురోగతికి, శ్రేయస్సుకు గురువు మార్గదర్శనం తప్పనిసరి. వ్యక్తి వికాసానికైనా, దేశ వికాసానికైనా ఉత్తమ గురువు ప్రోత్సాహం, అనుగ్రహం, ఆశీర్వాదం అనివార్యం.

ఉత్తమ గ్రంథాలన్నీ ఆచార్యుని ప్రాధాన్యతను ప్రస్తుతించాయి. ఒక జాతి ఉత్తమజాతిగా   రూపొందటంలో ప్రజల గుణగణాలు ఎంతో కీలకపాత్ర వహిస్తాయి. ప్రజలు శీలవంతులుగా ఉండాలంటే ప్రప్రథమంగా వారు చక్కని సంస్కార వంతులు కావాలి. ఈ గొప్ప సంస్కారం మన మనస్సుల్లో ఉద్దీపింప చేసే మహోన్నతుడే గురువు. మనకు విద్యను బోధిస్తూనే మన హృదయ సంస్కారాన్ని పెంచే యత్నం చేస్తాడు. ఆ క్రమంలో ఒకసారి మృదువుగా, మరొకసారి కఠినంగా వ్యహరిస్తుంటాడు. ఆపై తల్లిగా లాలిస్తాడు. ప్రేమను కురిపిస్తాడు. అక్కున చేర్చుకుంటాడు. అందుకే తల్లి ప్రేమ, ఆత్మీయత; అవసరమైన వేళలో తండ్రిలా దండన, సంరక్షణల మేళవింపే గురువు.

ఉత్తమగురువు తన విద్యార్థులతో ఒక స్నేహితుడిగా, వేదాంతిగా, మార్గదర్శకుడిగా ఉంటూ వారి వ్యక్తిత్వ వికాసానికి, ఎదుగుదలకు ఎంతో సహాయం చేస్తాడు. చదువు ద్వారా జ్ఞానాన్ని పెంచుతూనే  హృదయ సంస్కారాన్ని పెంచుతాడు. విద్యను చెప్పేవాడికే బుద్ధులు చెప్పే విశేష అధికారం, అవకాశం ఉంటాయి. ఉత్తమ గురువెన్నడూ తన ఈ గురుతర బాధ్యతను విస్మరించడు. తన ఆధిక్యతను ఎక్కడా ప్రదర్శించడు. చక్కని విద్యతోపాటు హృదయ సంస్కారం అలవడి వృద్ధి చెందే గొప్ప వాతావరణం, జ్ఞానం గురువు నుండి శిష్యుడికి, శిష్యుడి నుంచి గురువుకు ప్రసరిస్తుంది. గ్రీకు తత్త్వవేత్త, వేదాంతి, విద్యావేత్త ప్లేటో ఏథెన్స్‌ నగరంలో బోధనా పద్ధతిలో ఒక గొప్ప పద్ధతిని ప్రవేశపెట్టాడు.

ఆయన కూడ తన విధానంలో విద్యార్థులకు పెద్ద పీట వేసాడు. అక్కడ ప్రతి లౌకిక, అలౌకిక విషయాలను, జ్ఞానం, దాని లోతుపాతులు, అది లభ్యమయ్యే మార్గాలు.. ఇలా ఎన్నో విషయాలను గురుశిష్యులు చర్చించేవారు. ఎవరి భావాలు ఉన్నతంగా ఉంటే వాటినే తీసుకునే వారు. ఇక్కడ విద్యంటే ఆలోచనల మార్పిడి. అలాగే ఈ గురుకులంలో ఎవరు ఎవరికీ బోధిస్తున్నారో చెప్పటం కష్టం. ఎవరిది గొప్ప ఆలోచనైతే దాన్నే మిగిలినవారు స్వీకరించే వారు. ఈ దేశాలలో కూడ ఒకరు ఎక్కువ, రెండవవారు తక్కువన్న ప్రసక్తే లేదు. ఎంత ఉన్నతమైన భావనో గమనించండి. ప్రాచ్య దేశాలైనా, పాశ్చాత్య దేశాలైనా గురువు విలువను, ఆయన ఆవశ్యకతను గుర్తెరిగి వర్తిస్తాయని ఆయనకు ఉన్నత స్థానాన్నిస్తాయని చెప్పటానికే ఈ ఉదాహరణ.

గురువులో రవ్వంత గర్వమైనా ఉండకూడదు. అసలు పొడచూపకూడదు. మనస్సు నిర్మలమైన తటాకం కావాలి. ఇలా కావటానికి అతడు పక్షపాత రహితుడు కావాలి. అపుడే తన జ్ఞానాన్ని శిష్యులకు అందచేస్తాడు. ఆ జ్ఞానాన్ని పొందిన శిష్యుడు దాన్ని జీర్ణించుకుని తన మేధతో మరింతగా ప్రకాశింపచేసి తరువాత తరాలవారికి అందచేస్తాడు. అలా తన శిష్యులు తన జ్ఞానవాహికలు కావటం ఏ గురువుకైనా ఎంతో ఆనందాన్నిస్తుంది. ఎంతో ఉప్పొంగిపోతాడు. జ్ఞానపరంపరకు వారధి కనుక అతనంటే అవ్యాజమైన ప్రేమ. ఎంతో గౌరవం. జ్ఞానమనే అనంత ప్రవాహంలో గురుశిష్యులు జ్ఞానపాయలు.

ఉత్తమ గురువు కోసం శిష్యుడు ఎలా తపిస్తూ, అన్వేషిస్తాడో, గురువు కూడ అంతే. గురువు క్షేత్రమైతే శిష్యుడు విత్తు లాంటివాడు. రెండిటి మేలు కలయిక వల్లే జ్ఞానమనే బంగరు పంట పండుతుంది. గురువు ఎవరినైనా శిష్యుడి తీసుకునే ముందు అతడి జ్ఞానంతో పాటు, అతడి జ్ఞానతృష్ణనూ పరీక్షిస్తాడు. అవి తృప్తికరంగా ఉన్నప్పుడే అతనికి విద్య గరిపేవాడు. గురువు జ్ఞానధారను ఒడిసిపట్టుకున్న శిష్యుడు తన ప్రతిభతో, అనుభవంతో దానిని మరింతగా విస్తరించి భావితరాలకు అందిస్తాడు.

నేటి విద్యావ్యవస్థలో ఆనాటి ప్రమాణాలు, అంతటి ఉత్తమ గురుశిష్యులు, విలువలు లేవని కొందరి గట్టి నమ్మకం. ఆరోపణ. కొంత వాస్తవం లేకపోలేదు. నేటి కాలంలోనూ బోధనావృత్తిని ఎంతో పవిత్రంగా భావించి దానిని చేపట్టి ఎంతో సమర్థంగా నిర్వహించేవారు ఉన్నారు. దానికి మరిన్ని సొబగులద్ది, మరింత గౌరవాన్ని, హుందాతనాన్ని పెంచిన వారు, పెంచుతున్న వారు ఉన్నారు. పొందవలసిన గౌరవాన్ని పొందుతూనే ఉన్నారు.

సాంకేతికాభివృద్ధి విశేషంగా పెరిగి మనకు ఎంతగానో చేరువైంది. నేటి గురువులు ఈ సాంకేతికతని అందిపుచ్చుకుని మరీ పాఠాలు చెప్పేటందుకు సంసిద్ధులవుతున్నారు. వీరి లాగానే, ఉత్తమ శిష్యులు కూడ గురువుల మాదిరిగానే తయారవుతున్నారు. కనుక నేటి అధ్యాపకులకు చాలా అప్రమత్తత ఉండాలి. తమ జ్ఞానాన్ని, బోధనానైపుణ్యాన్ని ఎప్పటికప్పుడు మెరుగు పరుచుకోవాలి. అప్రమత్తులుగా ఉంటేనే కదా ఈ పోటీ ప్రపంచంలో నిలదొక్కుకుని, నాలుగు కాలాలపాటు నిలువగలిగేది.

ఉత్తమ గురువు మన ఆలోచనలకు నడకలు నేర్పుతాడు. మన ఊహలకు రెక్కలనిచ్చి మనం అద్భుత ప్రపంచాలలో విహరించే శక్తినిస్తాడు. ఉత్తమ గురువు మనలోని సృజనాత్మకతను మనం గుర్తించేటట్టు చేస్తాడు. ఉత్తమ గురువు చేసే, చేయగలిగే మహాత్తర కార్యమిదే. దీనివల్ల మనకు ప్రశ్నించే అలవాటు, శోధించే తత్వం అలవడుతుంది. అందుకే ఈ గురుశిష్యుల పాత్రను జాతిని సముద్ధరింపచేసే అత్యంత కీలకమైన అంశాలలో ఒకటిగా భావిస్తారు. వారి పాత్ర ఎంతో అమూల్యమైనది. అపురూపమైనది.

► మనకు తెలుసు అని అనుకున్నప్పుడు మనం నేర్చుకోవటం మానేస్తాం.
► విద్య అంతిమ లక్ష్యం ఒక స్వేచ్ఛా సృజనశీలిగా రూపొందటం. అపుడే చారిత్రక పరిస్థితులు, ప్రకృతి విపత్తులతో పోరాడగలడు.
► దేశంలో అందరికన్నా ఉపాధ్యాయుల మనస్సులు ఉత్తమమైనవిగా ఉండాలి. మన స్వీయ ఆలోచనాశక్తిని పెంపొందించటానికి సహాయపడే వాడే ఉపాధ్యాయుడు.
► విద్యావ్యవస్థకు ఉపాధ్యాయుడు వెన్నెముక.
– డా. సర్వేపల్లి రాధాకృష్ణన్‌
► ఏది చూడాలో చెప్పక ఎక్కడా చూడాలో మాత్రమే చెప్పేవాడు అధ్యాపకుడు.
– అలెగ్జాండర్‌ ట్రెన్ఫర్‌
► అగ్ర సింహాసనం మీదఎవరినైనా కూర్చోపెట్టదలచుకుంటే అతడు అధ్యాపకుడే.
– గై కవాసాకి
► వెయ్యి రోజులు పరిశ్రమించి నేర్చుకున్న విద్యకన్నా ఒక గొప్ప అధ్యాపకుడితో ఒకరోజు గడపటం విలువైనది.– జపాన్‌ సామెత బోధించటమంటే మరోసారి నేర్చుకోవటం.
– జోసెఫ్‌ జాబర్ట్‌
► నేను అధ్యాపకుణ్ణి కాదు. కాని వైతాళికుణ్ణి
– రాబర్ట్‌ ఫ్రాస్ట్‌


  – బొడ్డపాటి చంద్రశేఖర్, ఆంగ్లోపన్యాసకులు

మరిన్ని వార్తలు