C- Section Wound Infection: సిజేరియన్‌.. కుట్ల నుంచి చీము.. ఏమైనా ప్రమాదమా?

14 Jul, 2022 16:52 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

డాక్టర్‌ సలహా

నాకు సిజేరియన్‌ అయ్యి మూడు నెలలవుతోంది. మా ఊళ్లో చేశారు. కుట్ల దగ్గర చాలా నొప్పి వస్తోంది. యాంటీబయాటిక్స్‌ వాడినా ఫలితం లేదు. ఈ మధ్య అంటే ఓ పదిరోజులగా కుట్ల నుంచి పస్‌ కూడా వస్తోంది. నేను సిటీకి వెళ్లి చూపించుకోవాలా? ఏమైనా ప్రమాదమా?టి. హర్షిత, దేశాయిపేట, తెలంగాణ

సిజేరియన్‌ ఆపరేషన్‌ తర్వాత కుట్ల దగ్గర ఇన్‌ఫెక్షన్‌ రావటం సాధారణమే.పేషంట్‌ బరువును బట్టి, వాడిన యాంటీబయాటిక్స్, సర్జరీ టైమ్‌ను బట్టి రిస్క్‌ పెరుగుతుంది. కానీ ఇది చాలాసార్లు ఆపరేషన్‌ మొదటి, రెండు వారాల్లో బయటపడుతుంది. మీకు మూడు నెలల తర్వాత రావడం.. అంత మంచిది కాదు. దీనిని ఇన్వెస్టిగేట్‌ చేయాలి.

ఇప్పుడు చీము వస్తోంది అన్నారు. కాబట్టి వెంటనే సీనియర్‌ డాక్టర్‌ను కలవండి. చీము వస్తున్న చోటు నుంచి దూదితో వూండ్‌ స్వాబ్‌ తీస్తారు. దానిని బట్టి అందులో ఏ బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్‌ ఉంది, ఎలాంటి యాంటీబయాటిక్స్‌ ఇవ్వాలి అనేది తెలుస్తుంది. కొన్ని కేసెస్‌లో యాంటీబయాటిక్స్‌ వాడినా పస్‌ తగ్గదు.

అప్పుడు అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌లో పస్‌ లోపలి కుట్ల దగ్గర నుంచి వస్తోందా? ఏదయినా sinus tractలాగా ఫామ్‌ అయిందా అని చూస్తారు. ఎమ్‌ఆర్‌ఐ స్కాన్‌ కూడా చేయాల్సిరావచ్చు. జనరల్‌ సర్జన్‌ అభిప్రాయం కూడా తీసుకోవాలి. మళ్లీ చిన్న ఆపరేషన్‌ చేసి ఆ చీమునంతా తీసేసి క్లీన్‌ చేసి ఏ ట్రాక్ట్‌ ఫామ్‌ అయిందో దానిని మూసేసి.. యాంటీబయాటిక్స్‌ ఇవ్వాలి.

ఈ ట్రాక్ట్‌ నుంచి తీసినదంతా మళ్లీ టెస్ట్‌కు పంపాలి. కొంతమందిలో టీబీ వల్ల కూడా ఇలా సిజేరియన్‌ అయిన చాలా నెలల తర్వాత ఇన్‌ఫెక్షన్స్‌ వస్తాయి. యాంటీ–టీబీ ట్రీట్‌మెంట్‌ ద్వారానే ఇవి పూర్తిగా నయమవుతాయి. ఇలాంటి కేసెస్‌ను క్లోజ్‌గా ఫాలో అప్‌ చేయాలి. కుట్లకు వాడే కొన్ని రకాల మెటీరియల్స్‌ వల్ల కూడా ఇలాంటి ఇన్‌ఫెక్షన్స్‌ రావచ్చు.  
-డా. భావన కాసు, గైనకాలజిస్ట్‌ – ఆబ్‌స్టెట్రీషియన్‌, హైదరాబాద్‌ 

చదవండి: Vasectomy Operations: వెసక్టమీ చేయించుకుంటే పురుషులు శక్తిహీనులవుతారా?
Lump In Breast During Pregnancy: ఐదో నెలలో రొమ్ములో గడ్డలు తగలడం నార్మల్‌ కాదు! వెంటనే..

మరిన్ని వార్తలు