Health Tips: విపరీతంగా వైట్‌ డిశ్చార్జ్‌.. మందులు వాడినా ప్రయోజనం లేదు.. పరిష్కారం ఏమిటి?

17 May, 2022 12:24 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

నాకు 25 ఏళ్లు. విపరీతంగా వైట్‌ డిశ్చార్జ్‌ అవుతోంది. దురద, మంట కూడా ఉన్నాయి. ఎన్ని మందులు వాడినా గుణం కనిపించట్లేదు. నా సమస్యకు పరిష్కారం చెప్పండి?
– ఈ మెయిల్‌ ద్వారా అందిన ప్రశ్న. 

వైట్‌ డిశ్చార్జ్‌ అనేది చాలా సాధారణంగా కనిపించే సమస్య. దీనివల్ల ఓ పది శాతం మంది ఎలాంటి ఇబ్బంది లేకుండానే ఉంటారు. కొంతమందికి మాత్రం విపరీతమైన దురద, మంట, మూత్రనాళంలో మంట, తెల్లగా పెరుగులా వైట్‌ డిశ్చార్జ్‌ అవడం  వంటి సమస్యలు ఉంటాయి. ఈ పరిస్థితిని కాండిడియాసిస్‌ (ఫంగల్‌ వెజైనల్‌ ఇన్‌ఫెక్షన్‌) అంటారు. దీనికి చికిత్స చేసినా అయిదు శాతం మందిలో మాత్రం ఈ సమస్య మళ్లీ వస్తుంది.

కొంతమందిలో అల్సర్స్‌లా కూడా మారుతుంది. మధుమేహం, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవాళ్లలో , యాంటీబయాటిక్స్‌ ఎక్కువగా వాడే వాళ్లలో, గర్భనిరోధక మాత్రలు తీసుకుంటున్న వాళ్లలో ఈ సమస్య ఎక్కువ. డాక్టర్‌ను సంప్రదిస్తే వెజైనల్‌ పరీక్ష చేసి వైట్‌ డిశ్చార్జ్‌ (హై వెజైనల్‌ స్వాబ్‌)ను ల్యాబ్‌కు పంపిస్తారు. ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌ను నిర్ధారణ చేయడానికి.

అసలు ఈ ఇన్‌ఫెక్షన్‌ రాకుండా.. వెజైనా దగ్గర ఎప్పుడూ పొడిగా ఉంచుకోవడం, శుభ్రమైన కాటన్‌ ఇన్నర్‌ వేర్‌నే వాడడం, అనవసరంగా యాంటీబయాటిక్స్‌ జోలికి వెళ్లకపోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. సమస్యను సరిగ్గా నిర్ధారించి.. దానికి తగిన చికిత్సను అందిస్తే ఈ సమస్య తొంభై శాతం నయమవుతుంది. ఇన్‌ఫెక్షన్‌ మరీ తీవ్రంగా ఉంటే fluconazole మాత్రలను వారానికి ఒకటి చొప్పున రెండు– మూడు వారాలు వాడాలి.

కొంతమందికి ప్రెగ్నెన్సీలో కూడా ఈ ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌ తలెత్తుతుంది. డాక్టర్‌ను సంప్రదించి జాగ్రత్తగా ట్రీట్‌మెంట్‌ తీసుకోవాలి. ట్రీట్‌మెంట్‌ తీసుకున్నా మళ్లీ ఈ ఇన్‌ఫెక్షన్‌ రావడాన్ని రికరెంట్‌ కాండిడియాసిస్‌ అంటారు. అలాంటప్పుడు ట్రీట్‌మెంట్‌ను ఎక్కువ వారాలు కొనసాగించాల్సి ఉంటుంది.

మేడమ్‌.. నాకు పందొమ్మిదేళ్లు. పీరియడ్స్‌ టైమ్‌లో బ్రెస్ట్‌ చాలా నొప్పిగా ఉంటోంది. ఇదేమైనా క్యాన్సర్‌గా మారుతుందా? నాకు చాలా భయంగా ఉంది. దయచేసి ఆన్సర్‌ ఇవ్వగలరు. 
– ఇ. నైమిష, బెంగళూరు

 పీరియడ్స్‌ సమయంలో బ్రెస్ట్‌ నొప్పిగా ఉండడం అనేది సర్వసాధారణమైన సమస్య. ఇది చాలా వరకు పాతికేళ్లలోపు వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. రెండు వైపులా లేదా ఒక బ్రెస్ట్‌లో మాత్రమే నొప్పి రావచ్చు. కొంతమందికి ప్రతి నెలా వస్తుంది. కొందరికి ఎప్పుడో ఒకసారి ఉంటుంది. 

ఇది చాలా వరకు పీరియడ్స్‌ సమయంలో జరిగే హార్మోన్స్‌ చేంజ్‌ వల్ల వస్తుంది. బహిష్టు సమయంలో చాలా మందికి వాటర్‌ రిటెన్షన్‌  (నీరు పట్టడం) జరుగుతుంది. దానివల్ల బ్రెస్ట్‌ పరిమాణం పెరిగి నొప్పి కలగొచ్చు. లేదంటే బ్రెస్ట్‌లో ఏదైనా ఇన్‌ఫెక్షన్‌ ఉన్నా నొప్పి రావచ్చు. మీ వయసులో క్యాన్సర్‌ వచ్చే చాన్సెన్స్‌ చాలా అరుదు. అయినా ఒకసారి డాక్టర్‌ను సంప్రదించండి. పరీక్ష చేస్తారు.

బ్రెస్ట్‌ పరిమాణం, గడ్డలు ఏమైనా ఉన్నాయా? నిపుల్‌ నుంచి పస్‌ గానీ, బ్లీడింగ్‌ గానీ, గ్రీన్‌ డిశ్చార్జ్‌ కానీ ఉందా? అని చెక్‌ చేస్తారు.  35 ఏళ్లలోపు వారికి  బ్రెస్ట్‌ పెయిన్‌కి  కొన్ని సార్లు ఏ పరీక్షలూ అవసరం ఉండవు. మీకు బ్రెస్ట్‌లో ఏదైనా గడ్డలాంటిది ఉన్నా.. నొప్పి మరీ ఎక్కువగా ఉన్నా.. బ్రెస్ట్‌ అల్ట్రాసౌండ్‌ లేదా బయాప్సీ సూచిస్తారు. బహిష్టు సమయంలోనే వచ్చే బ్రెస్ట్‌ నొప్పికి చాలా వరకు బ్రెస్ట్‌ సపోర్ట్‌ బ్రా, వదులుగా ఉండే లోదుస్తులు వేసుకోవాలి.

కొన్నిసార్లు  పారాసిటమాల్‌ వంటి సింపుల్‌ పెయిన్‌ కిల్లర్స్‌ను వాడొచ్చు. కాఫీ, టీల జోలికి వెళ్లొద్దు. విటమిన్‌ ఇ మాత్రలు వాడొచ్చు. నొప్పి నివారణలో ఇవీ సహాయపడనప్పుడు డాక్టర్‌ను సంప్రదించి.. వైద్యులు సూచించిన మాత్రలు తీసుకోవడం మంచిది. 

నాకిప్పుడు ఎనిమిదో నెల. బేబీ ఎదుగుదల సరిగాలేదని చెప్పారు డాక్టర్‌. దీనికి ఏదైనా ట్రీట్‌మెంట్‌ ఉందా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
– పరిమళ, ఖనాపూర్, తెలంగాణ
కొంతమంది గర్భిణీలకు ప్రెగ్నెన్సీ చివరి మూడు నెలల్లో కొంతమందికి స్కానింగ్‌లో బిడ్డ ఎదుగుదల సరిగ్గాలేనట్టు తెలుస్తుంది. దీనిని స్మాల్‌ ఆఫ్‌ జెస్టేషనల్‌ ఏజ్‌ అంటారు. ఇది అంత ప్రమాదకరం కాదు. దీనికి చాలా కారణాలు ఉండవచ్చు.

మీరు, మీ భర్త ఇద్దరూ అంతగా హైట్‌ లేకపోవడం, బరువు కూడా తక్కువగా ఉండడం, కొన్ని ప్లెసెంటా సరిగ్గా పనిచెయ్యక బిడ్డ ఎదుగుదల తక్కువగా ఉండడం, మీకు హై బీపీ ఉండడం, కొన్ని మందులు, రక్తహీనత, కొన్ని జన్యుపరమైన సమస్యలు, ప్రెగ్నెన్సీలో తలెత్తే ఇన్‌ఫెక్షన్స్‌ వంటివి ఆ కారణాల్లో ఉండొచ్చు.

ఇలా సమస్యలకు మూలం తెలిసినప్పుడు దానికి తగిన చికిత్సను అందజేస్తారు వైద్యులు. ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవాలి. పోషకాహారం.. ముఖ్యంగా మాంసకృత్తులు ఎక్కువగా (హై ప్రొటీన్‌ డైట్‌) ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. బిడ్డ ఎదుగుదలను రెండు లేదా మూడు వారాలకు ఒకసారి చెక్‌ చేస్తారు డాక్టర్‌. బిడ్డకు రక్తప్రసరణ ఎలా ఉందనేదీ వారానికి ఒకసారి చెక్‌ చేస్తారు.

రక్తప్రసరణ, ఉమ్మనీరు సరిగ్గా ఉంటే, తొమ్మిదవ నెల నిండిన తర్వాత ప్రసవానికి ప్లాన్‌ చేస్తారు. సాధారణ కాన్పుకి ప్రయత్నించవచ్చు. బిడ్డకు రక్తప్రసరణ సరిగా లేకపోతే కొన్నిసార్లు ముందస్తు ప్రసవానికి వెళ్లాల్సి వస్తుంది. అప్పుడు బిడ్డకు శ్వాస సమస్యలు తలెత్తకుండా ఒక కోర్స్‌ కార్టికోస్టెరాయిడ్స్‌ ఇవ్వాల్సి ఉంటుంది. సాధారణ కాన్పు కాకుండా సిజేరియన్‌ చేయాల్సి వస్తుంది. బిడ్డకు ప్రత్యేకమైన కేర్‌ అవసరం ఉండొచ్చు.

ప్రతిరోజూ మూడు నుంచి నాలుగు లీటర్ల నీళ్లు, పోషకాహారం తీసుకోవాలి. తగినంత వ్యామాయం అవసరం. నిరంతరం పొట్టలో బిడ్డ కదలికలను కనిపెట్టుకుంటుండడం, ఏదైనా ఇబ్బంది అనిపించిన వెంటనే ఆసుపత్రికి వెళ్లడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. 

డా. భావన కాసు
గైనకాలజిస్ట్‌ – ఆబ్‌స్టెట్రీషియన్‌
హైదరాబాద్‌ 

మరిన్ని వార్తలు